హీరో, డైరెక్టర్ ఒకటై నిర్మాతని వేరు చేస్తున్నారు
"ఇదివరకు నిర్మాత, హీరో ఓ జట్టుగా ఉండేవాళ్లు. ఇప్పుడు హీరో, డైరెక్టర్ ఒక జట్టయి, నిర్మాతని వేరు చేస్తున్నారు. నిర్మాతకి హీరోలు, డైరెక్టర్లు కలిసి రావాలి. ఆ ఇద్దరూ తలచుకుంటే కాస్ట్ కంట్రోల్ అవుతుంది'' అని తేల్చిచెప్పారు నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తనముందున్న లక్ష్యాలతో పాటు చిత్ర నిర్మాణ రంగానికి చెందిన పలు అంశాలపై మంగళవారం తమ స్వగృహంలో చిత్రజ్యోతితో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...మేం పనిచేయగలమనే నమ్మకంతోటే మా సోదర నిర్మాతలు మా ప్యానల్‌కు ఘన విజయం చేకూర్చారు. 'వియ్ ఆర్ టుగెదర్' అనే భావాన్ని సభ్యుల్లో తీసుకు రాగలిగాం. మా ప్యానల్‌లో చిన్న, పెద్ద నిర్మాతలున్నారు. నిర్మాతలు ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసికట్టుగా పనిచేయడానికి మా కార్యవర్గం కృషి చేస్తుంది.
నిర్మాత చేతుల్లో లేదు
చిత్రసీమలో సంక్షోభం అనేది నిరంతరంగా కొనసాగుతూ వస్తోంది. నిర్మాణ వ్యయం ఎప్పటికప్పుడు పెరుగుతూ పోవడం దీనికి ప్రధాన కారణం. పేరుకి నిర్మాతే ప్రధానం కానీ 'కెప్టెన్ ఆఫ్ ద షిప్' అని అందరూ అంటుండే డైరెక్టర్ చేతుల్లోనే బడ్జెట్ వ్యయం ఆధారపడి ఉంటోంది. నిర్మాత చేతుల్లో ఏమీ ఉండటం లేదు. ఇవాళ 40 నుంచి 50 శాతం సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అవడానికి ఇదే కారణం.
పరిస్థితులు మారాయి
కాస్ట్ ఫెయిల్యూర్స్ సమస్య ఇప్పుడే ఉందని నేను చెప్పను. మొదట్నించీ ఉంది. అప్పట్లో వాటి సంఖ్యతో పోలిస్తే ఇప్పుటి సంఖ్య విపరీతం. డైనమిక్స్ మారడం వల్లే ఈ స్థితి. ఇదివరకు నిర్మాత, హీరో ఓ జట్టుగా ఉండేవాళ్లు. ఇప్పుడు హీరో, డైరెక్టర్ ఒక జట్టయి, నిర్మాతని వేరు చేస్తున్నారు. చాలామంది హీరోలు, దర్శకులకి నిర్మాణంలో ఏమాత్రం జోక్యం చేసుకోని నిర్మాతలే కావాలి. సినిమా నిర్మాణంలో వాళ్ల జోక్యం 100 శాతం ఉంటే, నిర్మాత జోక్యం 10 శాతం ఉంటోంది.
నిజానికి మిగతా రంగాల్లో పెట్టుబడిదారుడు అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. సినీ రంగంలో అది జరగడం లేదు. ఈ పరిస్థితికి విరుగుడు ఒక్కటే. నిర్మాతకి హీరోలు, డైరెక్టర్లు కలిసి రావాలి. ఆ ఇద్దరూ తలచుకుంటే కాస్ట్ కంట్రోల్ అవుతుంది. ఇది వాస్తవం. ఇండస్ట్రీని కాపాడుకోవాలనే ఆలోచన వాళ్లకి ఉండాలి. నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు కలిసి మాట్లాడుకుని, ఒక మాట మీదుంటేనే ఏవైనా అనుకున్నవి చెయ్యగలం. అలా కాకుండా ఎన్ని ఒన్ సైడెడ్‌గా ఎన్ని రెగ్యులేషన్లు పెట్టుకున్నా ప్రయోజనం లేదు.
ప్రొఫెషనలిజం కావాలి
పబ్లిసిటీ అనేది కేవలం నిర్మాతల చేతుల్లో ఉండటం వల్ల దానిలో మాత్రమే కంట్రోల్ చెయ్యగలుగుతున్నాం. మిగతా వాటిలో మిగతా రంగాల వాళ్ల ఇన్‌వాల్వ్‌మెంట్ ఉండటం వల్లే అవి చెయ్యలేకపోతున్నాం. అందుకే అందరిలో ప్రొఫెషనలిజం రావాలి. వాస్తవికంగా ఆలోచించాలి. మనలో ఆ ప్రొఫెషనలిజం 100 శాతం కొరవడిందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. జనం థియేటర్లకి వెళ్లాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. బాగా ఉందని టాక్ వస్తేనే వెళ్తున్నారు. ఎందుకంటే టీవీతో పాటు అనేక వినోదాత్మక విశేషాలు వాళ్లకి అందుబాటులో ఉన్నాయి. దీన్ని అందరూ గ్రహించి, నాణ్యత విషయంలో రాజీలేకుండా మంచి సినిమాలు తియ్యాలి.
ఖర్చులోనే పోటీ
హిందీ రంగానికి మార్కెట్ విస్తృతి ఎక్కువ కాబట్టి వాళ్లు భారీగా ఖర్చుపెట్టడంలో అర్థం ఉంది. దక్షిణాదిలో తమిళ సినిమాకీ ఓవర్సీస్ మార్కెట్ ఉంది. అందువల్ల వాళ్లూ ఖర్చు పెట్టగలరు. వాళ్లతో పోలిస్తే తెలుగు సినిమా మార్కెట్ విస్తృతి తక్కువ. అయినా వాళ్లతో ఖర్చు పెట్టడంలో పోటీపడుతున్నాం. కానీ వాళ్లలా క్వాలిటీ సినిమా తీయలేకపోతున్నాం.
10 శాతం మాత్రమే
నిర్మాతలు రెండు రకాలు. అంకితభావంతో, అదే లోకంలో ఉంటూ సినిమా తీసే నిర్మాతలు, వేరే వ్యాపారాలు చేస్తూ, సినిమానీ ఓ చూపు చూద్దాం అనుకుంటూ సినిమా తీసే నిర్మాతలు. ఇవాళ ఇండస్ట్రీలో సినిమా వ్యాపారం తప్ప మరో వ్యాపారం తెలీని నిర్మాతలు 10 శాతం మించి లేరు. నిర్మాతల మండలిలో 928 మంది నిర్మాతలుంటే వాళ్లలో ఒకట్రెండు సినిమాలు తీసి ఆగిపోయినవాళ్లే ఎక్కువ. ఐదు అంతకంటే ఎక్కువ సినిమాలు తీసిన వాళ్ల సంఖ్య తక్కువ. అవగాహన లేకుండా సినిమాలు తియ్యడం కూడా నిర్మాణ వ్యయం పెరగడానికీ, సక్సెస్ రేటు తగ్గడానికీ దోహదం చేస్తోంది.
థియేటర్లు తగ్గిపోతున్నాయి
చిత్ర రంగంలోని నాలుగు సెక్టార్లయిన ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లు అందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. లీజుదారుల వల్ల డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ బాగా దెబ్బతింది. ఆ ప్రభావం ఎగ్జిబిటర్ల మీదా పడింది. అందుకే థియేటర్ల సంఖ్య రానూ రానూ తగ్గుతోంది. కాబట్టి ఒకర్నొకరు దోచుకునే స్థితినుంచి బయటపడి, నమ్మకంతో పని చేసుకుపోవాలి. మండలి అధ్యక్షుడిగా అన్ని సెక్టార్లవాళ్లనీ కలిసి ఇండస్ట్రీని రక్షించేందుకు కలిసి రావాలని కోరుతాను.
భేదాలు కరెక్టు కాదు
చిన్నది కానీ, పెద్దది కానీ సినిమా అంటే సినిమానే. ఇందులో చిన్నా, పెద్దా నిర్మాతలంటూ తారతమ్యాలు సృష్టించడం మంచిది కాదు. ఇవాళ పెద్ద సినిమాలు తీస్తున్నవాళ్లంతా ఒకప్పుడు చిన్న సినిమాలు తీసినవాళ్లే. నేను చిన్న సినిమాలతోటే నిర్మాతనయ్యా. ఉండాల్సింది నాణ్యంగా సినిమా ఎలా తియ్యాలనే అవగాహన. నా దృష్టిలో చిన్న, పెద్ద నిర్మాతనే భేదాలు తప్పు.
సమయం, డబ్బు వృథా
అన్ని రంగాల్లో టెక్నాలజీ పెరుగుతుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతూ వస్తోంది. దాంతో పాటు వేస్టేజి, ఉత్పత్తి సమయం తగ్గుతోంది. కానీ సినీ రంగం ఒక్కటే దానికి మినహాయింపు. ఇక్కడ టెక్నాలజీ పెరుగుతుంటే వేస్టేజి పెరుగుతోంది. పని దినాలు పెరుగుతున్నాయి. అనవసరమైన దానికోసం సమయాన్నీ, డబ్బునీ వృథా చేస్తున్నాం. సినిమా సెట్స్ మీదకు వెళ్లేముందు ఎవరూ సరైన రీతిలో హోమ్‌వర్క్ చెయ్యడం లేదు. 15 వేల అడుగుల సినిమాకి మూడు నాలుగు లక్షల నెగటివ్ ఖర్చవుతున్నది దీని మూలంగానే. పక్కా స్క్రిప్టు సిద్ధం చేసుకుని, ఆ స్క్రిప్టు ప్రకారమే తీస్తే ఈ వృథాని అరికట్టవచ్చు.
ఇన్ని పన్నులా?
ప్రతి సమస్యకీ పరిష్కారం కోసం ప్రభుత్వం మీద పడాల్సిన పనిలేదు. అయితే ప్రభుత్వం కూడా ఒకటి కంటే ఎక్కువ పన్నులు వేస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్‌కి తోడు వ్యాట్ వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సేవా పన్ను కూడా కట్టమంటూ నోటీసులు ఇస్తోంది. ఇది బాధాకరం. ఈ బరువంతా ఒక్క నిర్మాతమీదే పడుతోంది.
'డబ్బింగ్' టాక్స్ పెంచాలి
తమిళులకి తమది అనే భావన ఎక్కువ. వాళ్లు తమ భాషనీ, తమ సంస్కృతినీ బాగా అభిమానిస్తారు. సినిమాల్లోనూ ఆ కమిట్‌మెంట్ కనిపిస్తుంది. ఆ విషయంలో మనవాళ్లది వెనకడుగే. మనవాళ్ల డబ్బింగులు తమిళంలో అంతగా ఆడకపోవడానికీ, వాళ్ల డబ్బింగులు ఇక్కడ బాగా ఆడటానికీ అదే కారణమనిస్తుంది. ఎగ్జిబిటర్లను పరిగణనలోకి తీసుకుంటే డబ్బింగ్ సినిమాల్ని పూర్తిగా తీసేయమనడం కరెక్ట్‌కాదు. మన స్టార్ హీరోలు ఏడాదికో, రెండేళ్లకో ఓ సినిమా చేస్తుంటే థియేటర్లకు ఫీడింగ్ ఎలా? ఆ గ్యాప్‌ని డబ్బింగ్ సినిమాలు పూరిస్తున్నాయి. కాకపోతే వాటికి టాక్స్ పెంచడం కరెక్టే. దాని కోసం గట్టిగా ప్రయత్నిస్తాం.
శివ సామర్థ్యం తెలుసు
సెప్టెంబర్ నుంచి రవితేజ హీరోగా నేను నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డైరెక్టర్ శివ మా బేనర్‌లో ఇదివరకు సినిమాటోగ్రాఫర్‌గా చేశాడు. అతని సామర్థ్యం గురించి నాకు బాగా తెలుసు. అందుకే అతని డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్నా. 'శ్రీరామ్' తర్వాత నేను నిర్మిస్తున్న సినిమా ఇదే. ఆ సినిమాకి కూడా శివ పనిచేశాడు. వచ్చే ఏడాది మార్చికి మా కొత్త సినిమా రిలీజవుతుంది.
1 comment:
really
it may true.
Post a Comment