అభినయ వాల్మీకి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాంఘిక చిత్రాల కథానాయకుడిగా అత్యున్నత స్థాయిని అందుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనేది జగద్విదితం. పౌరాణిక చిత్రాల కథానాయకుడిగా ఎన్టీ రామారావు అద్భుతంగా రాణిస్తుండటంతో తనంతట తానుగా వాటినుంచి తప్పుకుని సాంఘిక చిత్రాలతోనే అజరామర కీర్తిని సొంతం చేసుకున్నారు అక్కినేని. తొలినాళ్లలో జానపద హీరోగా రాణించినా 'లైలా మజ్ను', 'దేవదాసు' వంటి విషాదాంత ప్రేమకథలతో ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకుని, ప్రేమకథాచిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ పొందారు.
మలిదశలో ఆయన చేసిన మరో రెండు విషాదాంత ప్రేమకథాచిత్రాలు 'ప్రేమాభిషేకం', 'మేఘసందేశం' ఈ సంగతినే రుజువు చేశాయి. అయితే వీటిలో ఆయన పాత్రలు ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి కావడం గమనించదగ్గ అంశం. సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరో తెలుగు హీరో పోషించలేదనడం నిస్సందేహం. అక్కినేని చేసిన పౌరాణిక చిత్రాలు పదికి మించవు. చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించినా, ఆ తరహా చిత్రాలు ఆయన ఎక్కువ చేయకపోవడం తెలుగు సినిమాకి ఓ లోటుగానే భావించాలి. ప్రస్తుతం ఆయన బాపు రూపొందిస్తున్న 'శ్రీరామరాజ్యం' చిత్రంలో రామాయణ గాథని రచించిన వాల్మీకి పాత్రని పోషిస్తున్నారు. అడవుల పాలైన సీతకు ఆశ్రయమిచ్చి, అక్కడ ఆమె జన్మనిచ్చిన కవల పిల్లలు లవకుశులకు విద్యాబుద్ధులు, విలువిద్య నేర్పిన గురువు వాల్మీకిగా ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ గమనించదగ్గ విశేషమేమంటే కథానాయకుడిగా అక్కినేని తొలి పాత్ర శ్రీరాముడు కావడం. ఆ సినిమా 1944లో వచ్చిన 'సీతారామ జననం'. ఘంటసాల బలరామయ్య రూపొందించిన ఈ చిత్రంలో శ్రీరామునిగా నాగేశ్వరరావు ఎలా నటిస్తాడోనని ఆయన్ని ఎరిగినవారంతా కొంత ఆసక్తిగా, కొంత అపనమ్మకంగా ఎదురుచూశారు. ఎందుకంటే అప్పటివరకు రంగస్థలంపై ఆడ పాత్రలే చేస్తూ వచ్చిన ఆయన ఎకాఎకి శ్రీరామ పాత్ర చేయడమంటే మాటలు కాదు కదా (అంతకుముందు 1941లో ఆయన 'ధర్మపత్ని'లో ఓ చిన్న పాత్ర చేశారు). కానీ ఆ పాత్రలో ఆయన అందరి అంచనాల్ని మించి రాణించారు.
ఆ తర్వాత కాలంలో ఆయన 'మాయాబజార్'లో అభిమన్యుడిగా, 'భూకైలాస్'లో నారదునిగా, 'చెంచులక్ష్మి'లో విష్ణుమూర్తిగా, 'శ్రీ కృష్ణార్జున యుద్ధం'లో అర్జునునిగా నటించి, మెప్పించారు. 'జయభేరి'లో 'రావోయి రాస విహారీ' పాటలో శ్రీకృష్ణుని వేషంలోనూ బాగున్నారనిపించుకున్నారు. నాగయ్య చిత్రం 'భక్త రామదాసు'లో మరోసారి విష్ణుమూర్తిగా అతిథి పాత్రలో కనిపించారు. వీటితో పాటు 'సతీ సావిత్రి'లో సత్యవంతుడిగానూ అక్కినేని మెప్పించారు. ఇలా చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించిన అక్కినేని మరిన్ని పౌరాణిక చిత్రాలు చేసినట్లయితే తెలుగు సినిమాకి మేలు చేకూరి ఉండేది. ఆ మేరకు ఆయన సేవల్ని పౌరాణిక సినిమా కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు 87 సంవత్సరాల వయసులో ఆయన 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తుండటం ముదావహం.
ఈ పాత్రలో ఆయన అద్భుతంగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు. బాపు రూపకల్పనలో శ్రీరామునిగా బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందువల్ల త్వరలోనే అభినవ వాల్మీకిని మనం తిలకించవచ్చు.
(సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు 88 ఏట అడుగు పెడుతున్న సందర్భంగా)
No comments:
Post a Comment