కత్తి కాంతారావు, అహ నా పెళ్లంట, సీమటపాకాయ్... ఇవి అల్లరి నరేశ్ హ్యాట్రిక్ హిట్లు. ప్రస్తుతం చిన్న సినిమాల కొంగు బంగారంగా మారిన హీరో ఎవరయ్యా అంటే అందరి నోళ్లూ నరేశ్ పేరే చెబుతున్నాయి. మినిమం గ్యారంటీ కామెడీ హీరోగా టాలీవుడ్‌లో నిలదొక్కుకున్న నరేశ్ త్వరలో 'మడత కాజా'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతని సరసన బాలీవుడ్ క్యూట్ గర్ల్ స్నేహా ఉల్లాల్ నాయికగా నటించిన ఈ సినిమా ద్వారా సీతారామరాజు దంతులూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. 'అలా మొదలైంది' నిర్మాత దామోదర్ ప్రసాద్ సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా సినిమాని విడుదల చేయాలని నిర్మాత వేదంరాజు టింబర్ భావిస్తున్నారు.
"ఇది పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్. మాటల్తో గారడీ చేసే పాత్రని నరేశ్ చాలా బాగా చేశారు. 'మడత కాజా' అనే టైటిల్ ఆయన పాత్ర తీరుని తెలియజేస్తుంది. హీరో హీరోయిన్లకి సంబంధించిన లవ్‌స్టోరీ కూడా చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది" అని దర్శకుడు చెప్పాడు. టాలీవుడ్‌లోని అనేకమంది కమెడియన్లు నటించిన ఈ సినిమాకి ఇప్పటికే డైరెక్టర్‌గా మారి నరేశ్‌తోటే 'దొంగలబండి'ని తీసిన వేగేశ్న సతీశ్ సంభాషణలు రాశాడు.
తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ హఠాన్మరణంతో మంచి గైడ్‌ని కోల్పోయిన నరేశ్ ఇప్పుడు తన కెరీర్‌ని ఎలా మలచుకుంటాడనేది చాలామందికి ఆసక్తికరంగా మారింది. 'అహ నా పెళ్లంట', 'సీమటపాకాయ్' సినిమాలు ఆయన ఉండగానే ఒప్పుకుని చేసిన సినిమాలు. ఆయన మరణానంతరం నరేశ్ చేసిన తొలి సినిమా 'మడత కాజా'. అతని జడ్జిమెంట్ ఎలా ఉండబోతుందో ఓ నెల రోజుల్లోపల తేలిపోనున్నది.
No comments:
Post a Comment