కష్టపడి పనిచేసే తత్వం, సాధారణ జీవితం... రవితేజని స్టార్‌ని చేసిన గుణాలు. తన ప్రయారిటీస్ ఏమిటో అతడికి తెలుసు. అందుకు తగ్గట్లుగా కెరీర్‌ని మలచుకోడానికి అతనెంతో కష్టపడ్డాడు. దానికి దక్కిన ఫలమే ఈనాటి అతడి స్టార్‌డం. ఈమధ్య కొంతమంది 'లేట్ లతీఫ్'లు ఇండస్ట్రీలో తయారయ్యారు. సెట్స్ మీదకి ఎప్పుడో మధ్యాహ్నం 12 గంటలైతేగానీ రారు. కానీ రవితేజ మాత్రం పొద్దునే 7 గంటలకు షూటింగంటే అంతకు 5 నిమిషాల ముందే సెట్స్ మీదుంటాడు. ఈమధ్యే అతను శాకాహారిగా మారాడు. "ఈ అలవాటు మార్పు వల్ల నా ప్రవర్తనలోనూ మార్పు రావడం నాకే తెలుస్తోంది. కోపం, చిరాకు తగ్గిపోయాయి. రకరకాల శాకాహార పదార్థాల్లోని రుచిని అనుభవిస్తున్నా" అని చెప్పాడు.
ఓ ఔత్సాహిక దర్శకుణ్ణీ లేదంటే పేరున్న దర్శకుణ్ణీ మీరే హీరోతో చేయాలనుకుంటున్నారు అనడిగితే రవితేజ పేరే చెబుతారు. 'మిరపకాయ్' రిలీజయ్యాక చాలామంది జనం ఆ సినిమా డైరెక్టర్ హరీశ్ శంకర్‌ని కలిసి రవితేజని పరిచయం చేయాల్సిందిగా పీడించారు. అదీ రవితేజ మాస్ ఇమేజ్. అతని మొత్తం కెరీర్‌ని గమనిస్తే మాస్ జనానికి వినోదాన్నిచ్చే సబ్జెక్టులే ఎంచుకుని, తద్వారా తన మార్కెట్‌ని ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ వచ్చినట్లు అర్థమవుతుంది. పైగా బడ్జెట్ విషయంలోనూ అతడు ఆర్భాటాలకు ఎన్నడూ పోలేదు. తన మార్కెట్‌కు తగ్గ బడ్జెట్‌లోనే సినిమాలు చేస్తూ నిర్మాతల పాలిట కొంగు బంగారంగా మారాడు.
మిగతా మాస్ హీరోల సినిమాలకీ, అతడి సినిమాలకీ కొట్టొచ్చినట్లు కనిపించే తేడా ఒకటుంది. వాళ్లలోలేని కమెడియన్ రవితేజలో ఉన్నాడు. అందుకే అతడు బ్రహ్మాండమైన వినోదాన్ని ప్రేక్షకులకు పంచివ్వగలుగుతున్నాడు. అంతే కాదు, మిగిలినవాళ్లు ఏడాదికో సినిమా మాత్రమే చేస్తుంటే అతను మాత్రం మూడు సినిమాలకి తగ్గకుండా చేసుకుపోతున్నాడు. అందుకే ప్రతి యేటా హిట్లిస్తున్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఏ డైరెక్టరైనా హీరో నుంచి కోరుకునే ఎనర్జీ లెవల్స్ ఉండబట్టే వాళ్లని కూడా ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగిపోతున్నాడు 'మాస్ మహారాజా'.
No comments:
Post a Comment