మొదట 'చిల్లర దేవుళ్లు'లో దాశరథి రంగాచార్యగారు ఏం రాశారో చూద్దాం. ఆ తర్వాత అందులోని విషయాల్ని చర్చిద్దాం...
సారంగపాణి హైద్రాబాదు స్టేషనులో దిగాడు. ఏదో తురకదేశానికి వచ్చినట్టనిపించిందతనికి. ఎటు చూసినా తెలుగు అక్షరం కనిపించలేదు... తెలుగుదేశానికి తలమానికంలాంటి మహానగరంలో తెలుగువాడు కానీ, తెలుగుదనంగానీ, తెలుగు అక్షరంగానీ కనిపించలేదంటే బాధపడ్డాడు పాణి. తెలుగు తల్లిని సగానికి చీల్చి, బొట్టూ, తాళీ తీసివేసి, ముసుగువేసి, ఉర్దూ మాట్లాడమని హింసిస్తున్నట్లనిపించింది పాణికి. ఈ దౌర్జన్యాన్నీ, ఈ క్రౌర్యాన్నీ, తెలంగాణాలోని కోటి తెలుగువాళ్లు ఎలా సహిస్తున్నారా అనిపించిందతనికి. కొండా వెంకటప్పయ్య పంతులు, ఆంధ్ర మహాసభ గుర్తుకువచ్చాయి. వెంటనే అతడు విన్న తెలంగాణా ఆంధ్రోద్యమ పితామహుడు మాడపాటి హనుమంతరావుగారి పేరు గుర్తుకు వచ్చింది.
హోటల్లో... స్నానాదులు ముగించుకుని సుల్తాన్ బజార్లో ఉన్న మాడపాటి వారింటికి వెళ్లాడు పాణి. ఏవో కాగితాలు చూసుకుంటున్నారు హనుమతరావుగారు. పాణి నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి "రండి. కూర్చోండి" అని కుర్చీ చూపించారు.
కుర్చీలో కూర్చుంటూ "ఇవ్వాళ సుదినమండీ. మీ దర్శనం అయింది. మాది బెజవాడ. నా పేరు సారంగపాణి. నైజాంలోని ఒక పల్లెలో సంగీతం చెప్పుకుంటున్నాను. ఇదే మొదటి తడవ హైద్రాబాదు రావడం. ఇదేదో తురకదేశంలా కనిపిస్తోంది. తెలుగువారుగానీ, తెలుగుదనంగానీ మచ్చుకైనా కనిపించదు. మీ పేరు విన్నాను కాబట్టి దర్శనం చేసుకోవడానికి వచ్చాను" అన్నాడు.
"సారంగపాణిగారూ, తెలుగు మాట్లాడేవారంతా ఒకే సంతతికి చెందినవారు. వారి ఆచార వ్యవహారాలు, నాగరికత, సంస్కృతి, స్వభావం అన్ని ఒకలాంటివే. అయితే రాజకీయ కారణాల వల్ల తెలంగాణాలోని తెలుగువారు చీలిపోయారు. తెలంగాణం అనే ప్రాంతంలో ఉన్న తెలుగువారిని ఆరు వందల సంవత్సరాల నుండి తురుష్కులు అవిచ్ఛిన్నంగా పాలిస్తున్నారనే విషయం తాము గుర్తుంచుకోవాలి. రెండవ ప్రతాపరుద్రుని తరవాత ఈ ప్రాంతాన్ని పాలించిన హిందూరాజు లేడు. ఇంతకాలంగా ఉర్దూయే రాజభాషగా ఉంటూ వచ్చింది. ప్రభుత్వం వారిది కావడం మూలాన వేషభాషల్లో మార్పురావడం సహజం.
కొంత పశ్చిమాన మహారాష్ట్రుల్తోనూ, కొంత పశ్చిమాన కర్ణాటకుల్తోనూ సంపర్కం ఉంది మాకు. వారి ప్రభావం కూడా మా వేషభాషల మీద పడింది. మహారాష్ట్ర ప్రభావంగల నిజామాబాదు భాష ఇలా ఉంటుంది: 'ఇదేమా మాయి. రొండు దివ్యలు ఆయె సాళెకు పోవు. ఏనుగు సొండెము ఏదిరా? కాకకు మౌశీకి భేటీ కాలేదు' - అంటే, 'ఇదేమిరా నాయనా, రెండు దినములాయెను బడికిపోవు.. ఏనుగుతొండము ఏదిరా? చిన్నాయనకు మేనత్త దర్శనము కాలేదు'.
ఇక కర్ణాటక ప్రభావంగల మహబూబు నగరపు భాష, "మాసణ్ణ పిల్లకు పెసర బేడలు పట్టవు. దొడ్డు పిల్ల బేకైనంత తింటది." అంటే "మా చిన్నపిల్లకు పెసరపప్పు ఇష్టంలేదు. పెద్దపిల్ల పొట్టపగల తింటుంది" అని అర్థం.
రాజకీయ ప్రభావం పడిన భాష: "ఈ మొకద్దమాల చలాయించిన కార్రవాయంత జాలీది సాహేబుజిల్లా జాయె మౌఖ్ఖకుపోయి తహకీ కాతుచేసి కైఫియతు రాసినాడు కదాకే పరీఖు దావాబిల్కులు నాజాయజు" అంటే "ఈ వ్యవహారములో నడచిన చర్య అంతా తప్పు సృష్టి. జిల్లా తాలూక్దారుగారు ఆ స్థలమునకు పోయి విచారణ చేసి నివేదిక వ్రాసినది ఏమనగా, 'కక్షిదారు చేసిన వాదము పూర్తిగా అక్రమమైనది' అని అర్థం".
(ఇంకావుంది)
No comments:
Post a Comment