మీకు ఇష్టమైన పనేమిటి?
- పాడటం, స్వరాలు సమకూర్చడం... ఇవి రెండూ నాకు రెండుకళ్ళు. స్టేజీ షోలు చేయడానికి కూడా బాగా ఇష్టపడతాను. నేను రీరికార్డింగ్ చేస్తే ప్రత్యేకంగా ఉంటుందని చాలా మంది మెచ్చుకున్న సందర్భాలున్నాయి. శ్రోతలకు నచ్చేవిధంగా బాణీ కట్టడానికి నిత్యం ప్రయత్నిస్తుంటా.
ప్రస్తుతం ఏయే సినిమాలకు పని చేస్తున్నారు?
- తెలుగులో 'బ్లాక్ మనీ', 'ఫైర్', కన్నడలో 'బెంకి బిరుగాళి', తమిళంలో 'పోట్టుతళ్ళు' చిత్రాలకు సంగీతం చేస్తున్నా.
మీ దృష్టిలో ఓ పాట హిట్టవడమంటే?
- నేను పనిచేసే సినిమాల్లో సంగీతం చక్కగా కుదరాలని శాయశక్తులా ప్రయత్నిస్తుంటాను. నేను స్వరపరచిన పాటలను శ్రోతలు తలలూపుతూ ఆలకించాలి. అప్పుడే పాట హిట్ అయినట్టు. మాస్, ఫాస్ట్ బీట్, మెలోడీ అన్న తారతమ్యాల్లేకుండా సన్నివేశాలకు అనుగుణంగా బాణీలను కూర్చడానికి తాపత్రయపడుతుంటాను.
మిగతా భాషల్లోని పాటలకీ, తెలుగు పాటలకీ ప్రధానంగా కనిపించే తేడా ఏమిటి?
- తెలుగు పాటల్లో ఎక్కువ కమర్షియల్ విధానం కనిపిస్తుంది. అదే హిందీ పాటల్లో భావప్రాధాన్యత కీలకం. తమిళ్‌లో నావెల్టీ ఉంటుంది. కథ, నటీనటులు, సినిమాను తెరకెక్కించే విధానం... అన్నింట్లోనూ కొత్తదనం కనిపిస్తుంది. సంగీతంలోనూ చిన్న చిన్న అంశాల్లోనూ నవ్యత మెరిపిస్తుంది. అలాంటి విధానం తెలుగులోనూ వస్తే హర్షించే తొలి వ్యక్తిని నేనే అవుతా. మంచి సినిమాలను మనం తీయాలేగానీ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.
పాటకి బాణీ కట్టడంలో ఎలాంటి ధోరణి అవలంబిస్తారు?
- అందరూ ముందు పల్లవికి బాణీ కడతారు. కానీ నా విషయంలో వేరే జరుగుతుంది. ముందు చరణం అనుకుంటాను. తర్వాత పల్లవి దానంతట అదే వస్తుంది. నాకు స్వతహాగా సోలో వయొలిన్ అంటే మక్కువ. అలాగని అన్ని పాటల్లో వయొలిన్ వాడుతానని కాదు. నా ఇష్టాయిష్టాలను పాటలపై రుద్దను. ఎలాంటి సినిమాలకైనా శ్రీలేఖ సులభంగా రీరికార్డింగ్‌తో ప్రాణం పోయగలదు అని పరిశ్రమలో టాక్ ఉంది. చిన్న సినిమాల దేవతగా నన్ను కీర్తించేవారూ ఉన్నారు.
మీరు తెరమీద కనిపించే అవకాశాలున్నాయా?
- మంచి అవకాశాలొస్తే నటిస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. మనసుకు నచ్చిన కథలొస్తే తప్పకుండా నటిస్తాను. అదీ అతిథి పాత్ర వరకే పరిమితం.
వ్యక్తిగతంగా ఎలాంటి సినిమాలకి సంగీతం ఇవ్వడమంటే ఇష్టం?
- కమర్షియల్ చిత్రాలతో పాటు అప్పుడప్పుడూ ఆఫ్‌బీట్ చిత్రాలకు పనిచేయడమన్నా ఇష్టమే. యూత్, ట్రెండ్ లవ్‌స్టోరీలకు పనిచేయడమంటే చాలా సరదా. రీమిక్స్‌లను నేను పెద్దగా ఇష్టపడను. అయినా 'ఫైర్' చిత్రంలో నమిత కోసం ఓ పాత పాటను రీమిక్స్ చేశాను. అదేంటో ప్రస్తుతానికి సస్పెన్స్.
పరిశ్రమలో ఎక్కువకాలం ఉండాలంటే ఏం కావాలంటారు?
- పరిశ్రమలో పదికాలాల పాటు ఉండాలంటే హిట్టు తప్పనిసరి. హిట్ సినిమాలో మన పేరు కనిపిస్తే తప్పకుండా అందరూ మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అందుకే విజయవంతమైన మంచి సినిమాలో నేనూ ఉండాలన్న కోరికతో ముందుకు సాగుతుంటాను.
No comments:
Post a Comment