Saturday, August 7, 2010
Movies: Actors And Their Internet Relationships
ఒకరితో ఒకరు అనుసంధానమవడానికీ, అనుబంధాలు నెరపడానికీ అంతర్జాలం (ఇంటర్నెట్)లో వచ్చిన విప్లవాత్మక ధోరణి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. రాజకీయ నాయకుల దగ్గర్నుంచి సినిమా తారల దాకా ఈ వెబ్ సైట్స్ ని ఆశ్రయిస్తుండటంతో వాటి విలువ అతి స్వల్పకాలంలో అనూహ్యంగా పెరిగిపొతూ వస్తోంది. తమ మనసులోని భావాల్ని ప్రతిసారీ మీడియా ముందు వ్యక్తం చేయాలంటే ఆయా సెలబ్రిటీలకు చాలా కష్టం. కానీ తమ భావాలు జనం దృష్టికి చేరటమెలా? వాళ్లకి అలా అందివచ్చినవే ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్.
ప్రపంచవ్యాప్తంగా వున్న తమ అభిమానులకు తమ మనసులోని మాటలు చెప్పడానికీ, వాళ్లతో అనుసంధానమవడానికీ ఈ సైట్స్ కి మించిన మీడియం సెలబ్రిటీలకు మరొకటి లేదు. లక్షల సంఖ్యనుంచి కోట్ల సంఖ్యలో వీక్షకులు ఈ సైట్లని ఆశ్రయిస్తున్నారు. ఆర్కుట్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సైట్లు శరవేగంగా పాపులారిటీ సాధిస్తూ, ఆయా వ్యక్తుల ఇమేజిని మరింత ఇనుమడింప జేస్తున్నాయి. ఈ సైట్లలో సినిమా హీరోల పేరుతో ఎన్నో బ్లాగులు, కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఆదరణ పొందుతున్నాయి. 'ఫేస్ బుక్'ని హీరోల కంటే టెక్నీషియన్లే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కృష్ణవంశీ, గుణశేఖర్, పూరి జగన్నాథ్, ఏవీఎస్, ఆర్పీ పట్నాయక్, రఘు కుంచే వంటి డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఈ వెబ్ సైట్స్ ని ఆశ్రయిస్తూ, అభిమానులతో అనుసంధానమవుతున్నారు. 'కమ్యూనిటీ'లను ఏర్పాటుచేసే సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఆర్కుట్'లో మన హీరోల పేరిట ఒకటికి మించి ఎక్కువగా కమ్యూనిటీలు ఏర్పాటవుతున్నాయి. అంటే ఆయా హీరో పేరిట ఎవరైనా ఒక కమ్యూనిటీని ప్రారంభించవచ్చు. అందులో ఎవరైనా చేరవచ్చు, తమ భావాల్ని వ్యక్తం చేయవచ్చు. ఇలాంటి కమ్యూనిటీల్లో తెలుగు సినిమాకి సంబంధించి, దివంగత ఎన్టీఆర్ పేరిట ఏర్పాటైన 'ఎన్టీఆర్ - లెజెండ్ ఆఫ్ లెజెండ్స్' అనే కమ్యూనిటీ నెంబర్ వన్ స్థానంలో ఉండటం విశేషం. ఒకే కమ్యూనిటీ (సింగిల్ కమ్యూనిటీ)లో ఎక్కువమంది సభ్యులున్న హీరోల జాబితాలో మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, అల్లు అర్జున్ వరుస స్థానాల్లో నిలుస్తున్నారు.
ట్విట్టరే ముద్దు
ఇక లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చిందన్నట్లు 'ట్విట్టర్' అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ వ్యక్తులకు అత్యంత ప్రియమైన వెబ్ సైటుగా మారింది. వీళ్లని అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య వేల నుంచి లక్షలకి పెరుగుతుండటంతో 'ట్విట్టర్' వీక్షకుల సంఖ్య అనూహ్య స్థాయిలో పెరిగిపోతోంది. బాలీవుడ్డులోనే కాదు.. దేశం మొత్తంమీద అత్యధిక 'ఫాలోయర్స్' (అనుసరిస్తున్నవారు) ఉన్న నటునిగా 'కింగ్ ఖాన్' షారుక్ ఖాన్ నిలిచారు. ఇది రాసే సమయానికి ట్విట్టర్లో ఆయన బ్లాగుని అనుసరిస్తున్న వాళ్ల సంఖ్య 5,58,700. ఆయన తర్వాత స్థానంలో 3,38,000 ఫాలోయర్లతో హృతిక్ రోషన్ నిలిచాడు. ఖాన్ త్రయంలో సల్మాన్ ఖాన్ కి 3,05,500 మంది, అమీర్ ఖాన్ కి 1,92,500 మంధి ఫాలోయర్లు ఉన్నారు. అమితాబ్ ని అనుసరిస్తున్నవాళ్లు 3,11,000 మంది అయితే, ఆయన కుమారుడు అభిషేక్ తండ్రిని మించాడు. అతని ఫాలోయర్ల సంఖ్య 3,14,500. దేశంలోనే అత్యంత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫాలోయర్స్ 52,000 మంది మాత్రమే. దక్షిణాదిన హీరోయినుగా మంచి పాపులారిటీ సంపాదించుకుని, ఇటీవల బాలీవుడ్డులోనూ తన ముద్రవేసిన జెనీలియాకి ట్విట్టర్లో మంచి ఆదరణే ఉంది. ఆమెకి 2,17,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
మహేశ్ వర్సెస్ సిద్ధార్థ్
టాలీవుడ్ విషయానికొస్తే ట్విట్టర్లో నెంబర్ వన్ స్థానం మహేశ్ దే. అతని ఫాలోయర్స్ 1,01,000 మంది. అలా తెలుగులో తొలిసారి లక్ష ఫాలోయర్స్ దాటిన హీరోగా మహేశ్ నిలిచాడు. అతని సమీపంలో ఉన్న హీరో సిద్ధార్థ్. అతన్ని అనుసరిస్తున్న వాళ్లు 98,000 మంది. అంటే ఈ ఇద్దరూ ట్విట్టర్లో ఢీ అంటే ఢీ అంటున్నారన్న మాట. ఫాలోయర్లలో యాభై వేలు దాటిన వాళ్లు హీరోలు అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి, హీరోయిన్ త్రిష. నాగార్జునకి 60,500 మంది, రానాకి 53,500 మంది, త్రిషకు 57,600 మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఎన్టీఆర్ కూడా ట్విట్టర్లో ఇప్పుడిప్పుడే పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఆయనను 47,600 మంది అనుసరిస్తున్నారు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలు అడపాడడపా మాత్రమే తమ భావాల్ని వ్యక్తం చేస్తుండటంతో వాళ్ల ఫాలోయర్స్ సంఖ్య ఇంకా వేగాన్ని అందుకోలేదు. వాళ్లని అనుసరిస్తున్నవాళ్లు పది వేల లోపే ఉన్నారు. రామ్, సుమంత్ వంటి హీరోలకు ఫాలోయర్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. 'మర్యాద రామన్న' విడుదలకు ఒక రోజు ముందే ట్విట్టర్లో అడుగుపెట్టిన సునీల్ కి అప్పుడే 10,400 మంది ఫాలోయర్స్ తయారయ్యారు. హీరోలే కాక డైరెక్టర్లు కూడా ట్విట్టర్ని బాగానే ఆశ్రయిస్తున్నారు. తెలుగు దర్శకుల్లో అందరికంటే ఎక్కువగా ఎస్.ఎస్. రాజమౌళిని 34,700 మంది అనుసరిస్తున్నారు. తమ అభిమానులకే తప్ప తమ మధ్య ఎలాంటి అరమరికలూ, వైరమూ ఉండదని వాళ్లు తెలియజెప్పారు. రామ్, సుమంత్, నితిన్ వంటి వాళ్లు కూడా ఇతర హీరోల సినిమాలు బాగా ఆడాలనే ఆకాంక్షని తమ బ్లాగుల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. హీరోలందరూ ఏ రోజు ఎక్కడ షూటింగులో ఉన్నారో, ఆ షూటింగులో జరిగిన ఆసక్తికరమైన అంశాలేమిటో తమ 'ట్వీట్స్' ద్వారా తమ అభిమానులకి వివరిస్తున్నారు. ఇటీవల మనాలిలో 'బృందావనం'షూటింగులో పాల్గొన్న ఎన్టీఆర్ ఆరోగ్యం బాగాలేదనే పుకార్లు వచ్చాయి. వాటిని ట్విట్టర్లో ఖండించిన ఎన్టీఆర్ తను భేషుగ్గా ఉన్నాననీ, మనాలిలో షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నాననీ, ఆగస్టు 5న హైదరాబాదుకి వస్తున్నాననీ, తన ఫాలోయర్లకి తెలిపాడు. ఇలా తమ మీద అనవసరంగా పుట్టే పుకార్లకి వెంటనే వివరణ లేదా జవాబు చెప్పే అవకాశం వాళ్లకి ఈ బ్లాగుల ద్వారా కలుగుతోంది. అలాగే అభిమానులు లేదా ఫాలోయర్స్ వ్యక్తిగతంగా అడిగే ప్రశ్నలకు కూడా - అందరికీ కాకపోయినా కొంతమందికైనా - జవాబిస్తున్నారు ఈ హీరోలు.
రెండో ముఖమూ ఉంది
ఈ సైట్లకు ఇది మొదటి ముఖం. ఇక రెండో ముఖమేమిటి? కత్తికి రెండు వేపులా పదునున్నట్లు, నాణేనికి రెండు ముఖాలున్నట్లు ఈ వెబ్ సైట్ల వల్ల ఎంత ప్రయోజనం వుందో, అంత నష్టమూ ఉన్నదని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్విట్టర్ కారణంగా ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తమ పదవుల్ని కోల్పోవాల్సి వచ్చింది. వారిలో ఒకరు నిన్నటిదాకా ఐపీఎల్ కు ఛైర్మనుగా వ్యవహరించిన లలిత్ మోడీ అయితే, మరొకరు ఏకంగా కేంద్ర మంత్రి పదవిని త్యజించాల్సి వచ్చిన శశిథరూర్. ఇక అనేక సందర్భాల్లో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, రాంగోపాల్ వర్మ లాంటి సినీ దిగ్గజాలు తమ బ్లాగుల్లో రాసిన వ్యాఖ్యలు వివాదాలు సృష్టించిన సంగతి చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే 'రావణ్' సినిమాని మణిరత్నం రూపొందించిన తీరు, ఆ సినిమా ఎడిటింగ్ ఎమాత్రం బాగాలేవని తన బ్లాగులో అమితాబ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానే రేపాయి. ఆయన వ్యాఖ్యలపై 'విలన్' విక్రమ్ నిరసన వ్యక్తం చేశాడు కూడా. మణిరత్నం అయితే తాను అమితాబ్ మెప్పు కోసం సినిమాలు తియ్యడం లేదని ఒకింత ఘాటుగానే స్పందించారు.
ఏదేమైనా ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మన సెలబ్రిటీలకి బాగా ఉపయోగపడ్తున్నాయి. తమ పాపులారిటీని, ఇమేజినీ మరింత పెంచుకోవడానికి దోహదపడ్తున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment