సినీ మాక్స్‌లో మంగళవారం జరిగిన '180' సక్సెస్‌మీట్‌లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిథుల నుంచి హీరో సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ట్విట్టర్‌లో "టీవీలో ఓ గంట కార్యక్రమం కోసం థర్డ్ గ్రేడ్ న్యూస్ చానల్స్ తమ కుటుంబాల్ని కూడా అమ్ముకుంటాయి'' (థర్డ్ గ్రేడ్ న్యూస్ చానల్స్ విల్ సెల్ దెయిర్ ఫ్యామిలీస్ టు మేక్ అప్ యాన్ అవర్ ఆఫ్ టీవీ) అంటూ సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై తెలుగు న్యూస్ చానల్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జరిగిన '180' సక్సెస్ మీట్‌లో యథాలాపంగా పాల్గొన్న సిద్ధార్థ్‌ని చానల్స్ అన్నీ మూకుమ్మడిగా బాయ్‌కాట్ చేయడం ద్వారా తమ నిరసన తెలిపాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్ మాట్లాడిన తర్వాత మాట్లాడేందుకు మైకుల ముందుకు సిద్ధార్థ్ రావడంతోటే తమ కెమెరాలన్నింటినీ చానల్స్ తీసేశాయి. దీంతో పత్రికల వారివైపు తిరిగి రెండు ముక్కలు మాట్లాడిన సిద్ధార్థ్, పత్రికా ఫొటోగ్రాఫర్లు గ్రూప్ ఫొటో కోసం రావడంతో అక్కడ నిలవకుండా ఆవేశంతో విసవిసా నడచుకుంటూ అక్కణ్ణించి వెళ్లిపోయారు.
దీంతో ఆ సినిమా యూనిట్ సభ్యులంతా అతడి ప్రవర్తన పట్ల విస్మయాన్ని వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని, మీడియాకి క్షమాపణలు చెప్పేంతవరకు సిద్ధార్థ్ విషయంలో తమ నిరసనని ఇలాగే కొనసాగిస్తామని ఫిల్మ్ న్యూస్‌కేస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిథులు తెలిపారు. సిద్ధార్థ్ ప్రవర్తన పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేస్తున్నట్లు వారు చెప్పారు.
No comments:
Post a Comment