ఇంటర్వ్యూ: వరుణ్ సందేశ్
నా కెరీర్‌లో నిలిచిపోయే 'బ్రమ్మిగాడి కథ'
"ఇందులో కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకునే యువకుడిగా కనిపిస్తా. ఇది నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అని చెప్పగలను'' అని చెప్పారు వరుణ్ సందేశ్. వి. ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రజత్ పార్థసారథి నిర్మించిన చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా వరుణ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
నా కెరీర్‌లో తొమ్మిదో చిత్రం 'బ్రమ్మిగాడి కథ'. ఇది 36 గంటల్లో జరిగే కథ. పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్. కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. స్క్రీన్‌ప్లే మీద ఆధారపడిన కథ. అది చాలా వైవిధ్యంగా ఉంటుంది.
కమర్షియల్ ఎంటర్‌టైనర్
'మీ శ్రేయోభిలాషి', 'మనోరమ' వంటి సినిమాలు తీసిన ఈశ్వర్‌రెడ్డి తొలిసారి చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. అయినా ఇది మీనింగ్‌ఫుల్ సినిమా. ఓ సందేశం కూడా ఉంటుంది. షూటింగంతా హైదరాబాద్‌లోనే జరిగింది. మమ్మల్ని హైదరాబాదంతా పరుగులు పెట్టించారు డైరెక్టర్.
'యాల యాల' ఐటమ్
కోట చాలా మంచి సంగీతాన్నిచ్చారు. 'యాల యాల' అనే ఐటమ్ సాంగ్ చాలా పెప్పీగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (నేపథ్య సంగీతం)కి 25 రోజులు వెచ్చించి, చాలా బాగా ఇచ్చారు కోటి. ఇందులో నేను ఫైట్స్ చేశా. అన్నీ ఎమోషనల్ ఫైట్సే. ఒకే ఒక్క ఫైట్‌కి రోప్స్ వాడారు. మిగతావాటిని నేచురల్‌గానే చేశాం.
కష్టాల్లో ఆదుకుంటా
ఇందులో నాది పరిణతి చెందిన పాత్ర. కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకునే యువకుడిగా కనిపిస్తా. ఇదివరకు నేను చేసిన జోవియల్ రోల్స్‌కు భిన్నంగా సెటిల్డ్‌గా ఉండే పాత్ర. నా పాత్రని కానీ, మిగతా పాత్రల్ని కానీ చాలా బాగా తీర్చిదిద్దిన డైరెక్టర్ ఈశ్వర్‌రెడ్డికే క్రెడిట్ అంతా దక్కుతుంది. ఇది నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అని చెప్పగలను.
కొత్త సినిమా
దీని తర్వాత యు.కె. అవెన్యూస్ నిర్మిస్తున్న సినిమాలో చేస్తున్నా. ఎం.ఎస్. రాజు బేనర్‌లోనూ, డైరెక్టర్ సుకుమార్ వద్దా పనిచేసిన శ్రవణ్ దీనికి డైరెక్టర్. అమృతారావ్ చెల్లెలు ప్రీతికా రావు హీరోయిన్.
No comments:
Post a Comment