అప్పుడప్పుడు రామానయుడు గారితో ఆయన అఫీసులో కలిసి కూర్చొని సినిమా సంగతులు మాట్లాడుతుండటం మాకు అలవాటు. ఈమధ్య అలాగే కూర్చున్నప్పుడు తన తొలినాటి సినిమా సంగతులు చెప్పుకొచ్చారు. వాటిలోని ఒకట్రెండు ఇంటరెస్టింగ్ పాయింట్స్.
*నేను సినిమా తియ్యాలని మద్రాసు వెళ్లినప్పటికీ, ఇప్పటికీ చిత్రసీమలో ఎంతో మార్పు వచ్చింది. మొదటిసారి కొందరు మిత్రులతో కలిసి ఒక సినిమా తీశా. పెట్టుబడి ఎంతో తెలుసా? 20 వేలు. మీకో విషయం తెలుసా? నేను కూడా హీరో అవ్వాలనుకున్నా.
*మద్రాసు వెళ్ళిన కొత్తలో మా బావగారితో కలిసి జగ్గయ్య వద్దకు వెళ్లా. అప్పట్లో ఆయన చాలా పెద్ద హీరో. 'సినిమాల్లో చేరాలని ఉందండి' అని చెప్పా. 'మీరు చూసిన సినిమాలో ఒక సీన్ తీసుకోండి. అద్దం ముందు యాక్ట్ చెయ్యండి. ఇలా చేసి అనుభవం గడించి, ఏడాది తర్వాత రండి' అన్నారాయన. అంతకాలం ఏం ఆగుతాం? ప్రొడక్షన్ వైపు దిగా. అయితే శాంతకుమారి-నాకు తల్లిలాంటిది- 'నువ్వు హీరోలా ఉంటావురా. యాక్ట్ చెయ్యొచ్చు కదరా. హీరోయిన్లు అందరూ నిన్నే చూస్తున్నారు. రామారావు తప్పితే నీకన్నా అందగాడు ఎవరున్నారురా' అనేది. ఆవిడ కోసం ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వేషం వేస్తూ ఉండేవాణ్ణి.
*నాకు శివాజీ గణేశన్, కమల్ హాసన్ బాగా ఇష్టమైన నటులు. శివాజీతో నేను 'వసంతమళై' అనే తమిళ్ సినిమా తీశా. పెద్ద హిట్ అది. ఈ సినిమాతో నాకు ఎంత పేరు వచ్చిందంటే.. మొన్న ఒకసారి మద్రాసు వెళ్లినప్పుడు 'వసంతమళై' తీసిన రామానాయుడేనా అని కొందరు పలకరించారు. నాకు చాలా ఆనందం వేసింది.
No comments:
Post a Comment