Monday, June 28, 2010

Good Days for Uday Kiran?


రెండో ఇన్నింగ్స్‌తో ఎలాగైనా మునుపటి ప్రాభవాన్ని పొందాలని తపిస్తున్న యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఇప్పుడు 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' అంటున్నాడు, టీనేజ్ గర్ల్ శ్వేతాబసు ప్రసాద్‌తో. తమిళుడైన సుభా సెల్వం ఈ సినిమాకి డైరెక్టర్. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి వరుస హిట్లతో యువతరం ఆరాధ్య నటుడిగా అవతరించిన ఉదయ్‌కి వాటి తర్వాత ఇప్పటివరకు మరో చెప్పుకోదగ్గ విజయమేదీ దక్కలేదు. ఐదేళ్ల క్రితం తన తొలి, మలి చిత్రాల దర్శకుడు తేజతో చేసిన 'ఔనన్నా కాదన్నా' సినిమా తర్వాత రెండేళ్ల విరామం తీసుకుని 'వియ్యాలవారి కయ్యాలు'తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినా అతడికి నిరాశే ఎదురయ్యింది. ఆ తర్వాత మదన్ దర్శకత్వంలో వచ్చిన 'గుండె ఝల్లుమంది'పై అతడెన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఉందనిపించుకున్నా, కమర్షియల్‌గా ఉపయోగపడలేదు. రెండేళ్ల క్రితం వచ్చిన 'ఏక్‌లవ్యుడు' బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ పరిస్థితుల్లో 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' సినిమాని ఓ తపనతో, ఓ కసితో చేశాడు ఉదయ్. రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని శ్వేతాబసు అభివర్ణించింది. 'కొత్త బంగారు లోకం', 'రైడ్' చిత్రాలతో యువ ప్రేక్షకులకి సన్నిహితమైన శ్వేతబసు హీరోయిన్ కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కొద్దిపాటి ఆసక్తి నెలకొంది. "ఉదయ్, శ్వేతాబసులది చూడ చక్కని జంట. ప్రేక్షకుల్ని ఈ జంట ఆకట్టుకోవడం ఖాయం" అని చెప్పారు డైరెక్టర్ సుభా సెల్వం. ఈ సినిమాకి ప్రధాన బలం కథేననీ, క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందనీ ఆయనన్నాడు. ఈ సినిమాతోనైనా ఉదయ్‌కి మంచి రోజులు వస్తాయేమో చూద్దాం.

3 comments:

Unknown said...

All the best uday, i am al so waiting for movie

Unknown said...

All the best uday, i am al so waiting for movie

Unknown said...

All the best uday im also waiting for movie