"ఏం సారూ! మీరీడికొచ్చి శానా కాలమైనట్టుందే?" అడిగాడు రిక్షావాలా.
"అవును. పదహారేళ్లయింది. నా ఫ్రెండుని చూడటం కోసం వచ్చా ఇప్పుడు" చెప్పాడు.
"నాయినపల్లిలో ఎ స్నేయితుడు? నేనుండేది కూడా అక్కణ్ణే. అంతా నాకు తెల్సినోళ్లే. నా పేరు కోటయ్య" అన్నాడు రిక్షావాలా.
"అవునా కోటయ్యా! వాడి పేరు సుదర్శన్".
టక్కున బ్రేక్ వేశాడు కోటయ్య. చైను కిర్రుమని చప్పుడు చేస్తుండగా ఆగింది రిక్షా. అది ఊహించని పద్మాకర్ కంట్రోల్ చేసుకోలేక కాస్త ముందుకు తూలాడు. చివరి నిమిషంలో చేత్తో రిక్షాని గట్టిగా పట్టుకున్నాడు. లేదంటే పడిపోయేవాడే.
"ఏంటి కోటయ్యా! ఎందుకు సడన్‌గా రిక్షా ఆపావ్?" కాస్త అసహనంగా అడిగాడు పద్మాకర్.
"శమించండి బాబూ. మీరు సుదర్శన్ బాబనేసరికి ఏదో అయినట్టయ్యింది బాబూ. అయితే ఆఖరి చూపుకు వొత్తున్నారన్న మాట!" అన్నాడు కోటయ్య.
'ఆఖరి చూపుకు..' అన్న మాట వినగానే ఉలిక్కిపడ్డాడు పద్మాకర్.
"ఏంటి కోటయ్యా నువ్వంటున్నది? ఆఖరి చూపేమిటి?" అడిగాడు.
కోటయ్య కాస్త ఆశ్చర్యంగా చూశాడు పద్మాకర్ వైపు. రిక్షా ఇంకా ఆగే ఉంది రోడ్డుకి ఓ పక్కగా.
"ఏంటి బాబుగోరూ మీరొత్తుంది సుదర్శన్‌బాబు అంతిక్రియలకే కదా!" అన్నాడు.
షాక్ కొట్టినట్లు కాసేపు కోటయ్య వంక చూసి "నువ్వు చెబుతోంది లీడర్ సుదర్శన్ గురించి కాదనుకుంటా, వేరే అతను అయివుంటాడు" అన్నాడు పద్మాకర్ తనని తాను సంభాళించుకుంటూ.
"నాకు తెల్సిన సుదర్శన్‌బాబు వొక్కరేనయ్యా. ఆ మాటకొత్తే నాయినపల్లిలోనే కాదు, యేటపాలెం మొత్తమ్మీద సుదర్శన్‌బాబంటే అందరికీ తెల్సింది ఆ బాబొక్కడే" గట్టిగా చెప్పాడు కోటయ్య.
తన మిత్రుడికేమీ కాదని ఎక్కడనో మిణుకు మిణుకుమంటున్న ఆశ, ధైర్యం చల్లారిపోయాయి పద్మాకర్‌లో. గుండె ఒక్కసారిగా బరువెక్కింది. గొంతు పూడుకుపోయింది.
కళ్లు తడవుతున్నాయి.
"ఎలా.. ఎలా జరిగింది? ఇంత హఠాత్తుగా ఎలా పోయాడు? వారం రోజులు కాలేదే నేను వాడితో మాట్లాడి" అన్నాడు బలహీనమైన గొంతుతో.
తిరిగి రిక్షా తొక్కుతూ చెప్పడం మొదలుపెట్టాడు కోటయ్య.
"నాల్రోజుల కింద నెక్లెసు నూక్కెళ్లాడనిజెప్పి ఓ కుర్రాణ్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మేశారు బాబూ. కానీ ఆ నెక్లెసు ఆ కుర్రాడు పనిచేసే ఆసామి ఇంట్లోనే దొరికింది. ఆ ఆసామి పెళ్లాం ఏదో పేరంటామికెళ్తా ఆ నెక్లెస్‌ని యాడో పెట్టి మర్సిపోయింది. ఆ కుర్రాణ్ని దొంగన్నారు. పోలీసులు ఆడొళ్లు ఊనంసేసి పారేశారు.
ఎస్సయ్యి బూటుకాలితో కొట్టిన దెబ్బకి ఆడి కాలొకటి ఇరిగిపోయింది. ఈ సంగతి బయట చెబ్తే పేణాలు తీత్తామని బెదరగొట్టి ఆడ్ని వొదిలేశారు. కానీ అట్లాంటి సంగతులు దాగుతయ్యా? సుదర్శన్‌బాబుకి తెల్సిపోయింది. కొంతమంది కుర్రోళ్లని ఎంటేసుకొని పోలీసోళ్ల మీద ఉద్దెమం లేవదీశాడు.
కొత్త కాల్వ బ్రిడ్జికాడ నాలుగ్గంటల్సేపు రాస్తారోకో సేసారు. అప్పుడు సూడాలి బాబూ.. అటు ఒంగోల్నించి వొత్తున్న బళ్లు, ఇటు సీరాల్నించి ఎళ్తున్న బళ్లు ఎంత దూరం ఆగిపోయినాయో! యేటపాలెం సెరిత్రలోనే అట్టాంటి ఉద్దెమం నేను సూళ్లేదు బాబూ. అప్పుడు సీరాల్నించి సీఐ వొచ్చి బెదిరిచ్చాడు. ఎవురూ లెక్కసెయ్యలా. ఆ తర్వాత డీఎస్పీ బాబే వొచ్చాడు. గదిమాడు. అరెస్టు జేత్తానని బెదిరిచ్చాడు. సుదర్శన్‌బాబోళ్లు అదర్లా, బెదర్లా. "సేతనైతే సేస్కోండి" అన్నాడు.
రోసమొచ్చి డీఎస్పీ అరెస్టు చెయ్యబోయాడు. ఉన్నపళాన జనం తిరగబడ్డారు. ఆళ్లలో నేనూ ఉన్నందుకు చాలా గర్వమనిపిత్తుంది బాబూ ఇయాల. జనాన్ని చూసి డీఎస్పీ పళ్లు పటపటమంటా కొరికి పోలీసుల్తోటి 'శార్జ'నో ఏందో అన్నాడు బాబూ. ముందు ఆయనే లాఠీ తీసుకుని కుర్రాళ్ల మీద పడ్డాడు. ఆయన్ని చూసి అక్కడున్న పోలీసులంతా లాఠీల్తోటి ఇరగతన్నారు బాబూ జనాన్ని.
సుదర్శన్‌బాబు ఇది సూళ్లేక డీఎస్పీకి అడ్డం పడ్డాడు. అంతలోకే ఆయన తలమీన లాఠీ దెబ్బ పడిందయ్యా. ఆ డీఎస్పీనే కొట్టాడో, ఇంకెవరు కొట్టారో అట్టానే కుప్పకూలిపోయాడు. దాంతోటి జనం ఇంకా రెచ్చిపొయ్యారు.
ఎవుర్ని ఎవురు కొడ్తన్నారో తెలీలా. ఎవురు ఎవుర్ని తొక్కేత్తన్నారో తెలీలా. గొడవ సల్లార్నాక జూత్తే ఏముందయ్యా.. నెత్తుటి మడుగులో ఉన్నాడు సుదర్శన్‌బాబు.
ఆస్పెత్రికి తీస్కపోదామంటే ట్రాఫిక్‌జామయ్యే. రెండు గంటలు పైనే పట్టింది ఆస్పెత్రికి ఎళ్ళేతలికి. అప్పటికే ఆ బాబు కోమాలోకి ఎల్లిపోయాడు. కొనూపిర్తో వున్నాడు.
రెండ్రోజులు సావుతో యుద్ధం జేశాడు. మా కోసం సేసిన యుద్ధాలు ఇంక సాలనుకున్నాడో ఏందో నిన్ననే ఊపిరి వొదిలేశాడు బాబూ".
కోటయ్య గొంతు పూడుకుపోయింది బాధతో. అప్పటికే పద్మాకర్ గుండె బరువెక్కింది. పదహారేళ్లుగా దూరమైపోయి, తిరిగి కలవాలని ఎంతో ఆశతో వస్తుంటే.. సెలవంటూ వెళ్లిపోయావా నేస్తం? ఈ మిత్రుడి మొహం చూడకూడదనుకున్నావా? టపటపమంటూ రెండు నీటి చుక్కలు కళ్లనుండి జారి తొడల మీద పడ్డాయి.
కోటయ్యే మాట్లాడాడు మళ్లీ. "నిన్న సాయంకాలమే పోట్టుమాట్టం సేసి శవాన్ని ఇంటికి పంపిచ్చారు. సుదర్శన్‌బాబు పోయాడని తెలియంగాల్నే ఆస్పెత్రికాడికి వొచ్చారు సూడయ్యా.. ఎంత జనమని! నేం కూడా ఎల్లాలే. పోలీసు నాయాళ్లు కూడా శానా మందున్నారు. ఏదైనా గొడవ జరుగుద్దేమోనని ముందుగాల్నే వంద మందికి తక్కువ కాకుండా ఆళ్లని పెట్టారు. కానీ జనం గొడవ సెయ్యలా! ఎందుకనంటే అప్పటికే ఆ డీఎస్పీని ఆఫీసర్లు సస్పెండు సేసేశారు".
రిక్షా ఆగింది. పద్మాకర్ దిగాడు. వీధి పొడుగూతా జనమే.
"జరగండి.. జరగండి" అని కాస్త గట్టిగా అరుస్తూ ముందుకు పోతున్నాడు కోటయ్య. వెనకే పద్మాకర్.
కాళ్లు వొణుకుతున్నాయి. గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరిగింది. ఎదురుగా నేలమీద పాడె, దాని మీద శవం. పద్మాకర్‌కి మొదటగా కనిపించింది తాడుతో బొటనవేళ్లు కలిపి కట్టిన రెండు పాదాలు. బాధ పొగిలి పొగిలి వచ్చింది గుండెల్లోంచి. దగ్గరగా వెళ్లాడు.
"అమ్మా. బాబు సావాసగాడంట. కలకత్తా నుంచి వొచ్చాడంట" చెప్పాడు కోటయ్య.
సుదర్శన్ భార్య తలెత్తి పద్మాకర్ వైపు చూసి చీరకొంగుని నోట్లో కుక్కుకుంది దుఃఖాన్ని అదిమి పెట్టడానికి.
"అంకుల్! మీరొస్తున్నారని వారం రోజుల కింద నాన్న ఎంత సంబరంగా చెప్పాడో. పదహారేళ్ల తర్వాత ఫ్రెండుని కలవబోతున్నానని ఎంత ఆనందపడ్డాడో. ఇప్పుడిట్టా కలుసుకున్నారు.." అని వెక్కివెక్కి ఏడ్చింది సుదర్శన్ పదకొండేళ్ల కూతురు. ఆ అమ్మాయి తలని గుండెలకి అదుముకుని సుదర్శన్ మొహం వంక చూశాడు పద్మాకర్. అదే స్ఫురద్రూపం. ఏమాత్రం మారలేదు. కాకపోతే ఇప్పుడు కళ్లు మూసుకుని ఉన్నాయి. ముక్కు రంధ్రాల్లో దూది పెట్టి ఉంది.
సుదర్శన్ చెంపని తడిమాడు పద్మాకర్. దుఃఖాన్ని అదిమిపెట్టడం కష్టమైంది.
"ఏరా! ఇలా చూసేందుకా నేను వచ్చింది?" అంతకుమించి గొంతులోంచి మాటలు రాలేదు. కళ్లలోంచి నీళ్లు రాలుతున్నాయి.
తట్టుకోలేక ఇవతలకి వచ్చేశాడు.
సరిగ్గా అప్పుడే అతడి సెల్‌ఫోన్ రింగయ్యింది. కళ్లు తుడుచుకుని చూశాడు.
ఏదో తెలీని నెంబరు. కాల్ రిసీవ్ చేసుకున్నాడు.
"హలో సార్. నేను లక్ష్మణ్‌ని. ఇందాక ట్రైన్‌లో కలిసి జర్నీ చేశాం కదా. సార్ మీ ఫ్రెండుని కలిశారా? ఈ పాటికి కలిసే ఉంటారనిపించి ఆగలేక ఫోన్ చేశా సార్".
కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత ఫోన్‌లో పద్మాకర్ ఏడుపు గట్టిగా వినిపించింది లక్ష్మణ్‌కి.
(అయిపోయింది)
No comments:
Post a Comment