Friday, March 4, 2011

హిట్.. హిట్.. హుర్రే!: నువ్వు నాకు నచ్చావ్-2

ఒకరితో నిశ్చితార్థం జరిగిన అమ్మాయి, తనకు తెలీకుండానే మరొకర్ని ప్రేమిస్తే.. ఆ అమ్మాయి ఎవర్ని పెళ్లి చేసుకోవాలి? ఆమె ప్రేమని పొందిన యువకుడూ ఆమెని అమితంగా ప్రేమించి, పెద్దల్ని కష్టపెట్టకూడదనే ఒకే కారణంతో మౌనంగా ఉండిపోవడం ఎంతవరకు సమంజసం? ఇంతకీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా, మనసుకి నచ్చిన వాళ్లని మనువాడాలా? ఎన్ని ప్రశ్నలు! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం!! మనసులు కలవని అమెరికా సంబంధం కంటే మనసుకి నచ్చిన మనూరబ్బాయే ఎంతో మేలని చెప్పిన ఈ చిత్రాన్ని తిరుగులేని విధంగా దీవించారు ప్రేక్షకులు. చేసిన వ్యాయానికి రెట్టింపు పైగా ఆదాయాన్ని సమకూర్చిపెట్టారు. ఈ సీరియస్ విషయాన్ని సీరియస్‌గా కాక, వినోదాల విందుగా చిత్రించిన దానికి దక్కిన ప్రయోజనం ఇది.
'కథ తక్కువ కథనం ఎక్కువ' తరహాకి చెందిన 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం మూడు గంటలపైగా నిడివి ఉన్నా బోర్ కొట్టకపోవడానికీ, ఆద్యంతం ఆహ్లాదాన్ని పంచడానికీ కారణం చకచకా పరుగులెత్తిన సన్నివేశాలూ, జరజరా ఉరకలెత్తిన సంభాషణలూ. చిత్రంలోని దాదాపు అన్ని సన్నివేశాలూ సహజంగానే తోస్తాయి. ఏ సన్నివేశాన్ని తీసుకున్నా 'అవును. నిజంగా కూడా ఇలాగే కదా జరిగేది' అనిపించడమే ఈ చిత్రం ప్రత్యేకత.
చాలా సినిమాల్లో కనిపించినట్లు ఈ సినిమాలో నందిని, వెంకీలది 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' కాదు. ఏ బాధలూ లేకుండా సరదాగా జీవితాన్ని గడిపే కుర్రాడు వెంకీ అయితే ఇంకో రెండు నెలల్లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లే స్థితిలో ఉన్న చక్కని చుక్క నందిని. ఆమె తన తండ్రి స్నేహితుని కూతురనీ, మరొకరితే నిశ్చితార్థం జరిగిందనీ వెంకీకి తెలుసు. అందుకే ఆమెని మొదట మరోభావంతో అతను చూడలేదు. ఉడుకు వయసు కారణంగా ఇద్దరూ ఒకర్నొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. మొదట అతడంటే చులకన భావం ఉన్న నందు అతడి మనసెంత స్వచ్ఛమైందో గ్రహించాక తనకు తెలీకుండానే క్రమంగా అతడి పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇక్కడ్నించీ ఇద్దరి మనసుల్లోని సంఘర్షణని దర్శకుడు ఎంతో నేర్పుగా సెల్యులాయిడ్ మీద చిత్రించాడు.
భారతీయ సంప్రదాయం ప్రకారం మనసు ఎవరి మీదున్నా మనువాడిన వాడే స్త్రీకి సర్వస్వం. నిశ్చితార్థం అంటే సగం పెళ్లయిపోయినట్లే. కాబోయే వరుడి మీదే అమ్మాయి దృష్టంతా లగ్నం కావాలి. ఆ నిశ్చితార్థం అయ్యాక మరో మగాడు ఆమె జీవితంలో ప్రవేశించడమన్నది మన సెంటిమెంట్‌కి విరుద్ధమైన సంగతి. ఆ యాంటీ సెంటిమెంట్ వ్యవహారాన్ని అందరిచేతా ఔననిపించాలి. ఇక్కడ కథనం ఏమాత్రం బేలెన్స్ తప్పినా అభాసవుతుంది. రచయిత, దర్శకుడి పనితనం ఎలాంటిదో బయటపడేది ఇలాంటి సున్నిత సందర్భాల్లోనే. ఆ విషయంలో విజయభాస్కర్, త్రివిక్రం జంటగా విజయం సాధించారు.
తన మనసు బయటపెట్టినా, ఎంతగా ప్రయత్నిస్తున్నా వెంకీ నుంచి ఆశించిన స్పందన రానందుకు బాధపడుతూ 'ఒక్కసారీ చెప్పలేవా నువ్వు నచ్చావనీ..' అని పాడుతుంది నందు. దానికి సమాధానమిస్తూ పాట చివరలో నందూని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోబోయి తమాయించుకుని వొదిలేస్తాడు వెంకీ.
"ఎందుకిలా చేస్తున్నావ్ నువ్వు? ఒక్క క్షణం చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తావ్. ఒక్క క్షణం అస్సలు పరిచయం లేనట్లు దూరంగా ఉండిపోతావ్. ఒక్కోసారి నీతో ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది. ఒక్కోసారి ఏం మాట్లాడాలన్నా భయమేస్తుంది. ఎందుకు? నువ్వే బాధపడతావ్. నువ్వే ఓదారుస్తావ్. ఒక్కోసారి నవ్విస్తావ్. ఒక్కోసారి ఏడిపిస్తావ్. నన్నెందుకిలా హింసిస్తున్నావ్? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావ్? అసలు నా లైఫ్‌లోకి ఎందుకొచ్చావ్? వై వెంకీ? ఎందుకిలా చేస్తున్నావ్? చెప్పు" అని అతడి గుండెల మీద తలపెట్టి ఏడుస్తుంది నందు.
ఒక అబ్బాయిని పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి అతడు తనకు కాసేపు దగ్గరగా, మరికాసేపు దూరదూరంగా ఉండటాన్ని తట్టుకోలేక వేసిన ఈ ప్రశ్నలు ప్రేక్షకుల గుండెని తడి చేయకుండా ఉంటాయా? జీవితంలో ప్రేమలో పడిన ఎవరైనా ఆ పాత్రలతో, ఆ సన్నివేశాలతో సహానుభూతి చెందకుండా ఉంటారా? అంతదాకా ఆ పాత్రలు తెరనిండా చేసిన అల్లరిలో, చిలిపి చేష్టల్లో తమని తాము చూసుకున్న ప్రేక్షకులు ఈ ఆర్ద్రమైన సన్నివేశాన్ని కూడా సొంతం చేసుకున్నారు. నవ్వుల్లో ముంచెత్తే సన్నివేశాల్నే కాదు, హృదయాన్ని తడిచేసే సన్నివేశాల్నీ కల్పించగలనని త్రివిక్రం నిరూపిస్తే, ఆ సన్నివేశాల్ని అంతే హృద్యంగా తీయగలనని విజయభాస్కర్ నిరూపించాడు.
ఇక ఈ సినిమాలో వినోదాన్ని పంచే సన్నివేశాలకు కొదవ లేదు. వెంకటేశ్, సునీల్ కాంబినేషన్‌లో వచ్చే ప్రతి సన్నివేశమూ నవ్వులు పూయిస్తుంది. అన్నిటికీ మించి ప్రధానమైన హీరో అల్లరివాడైతే ఎంత వినోదం! ఎంత అహ్లాదం!! చక్కని కామెడీ టైమింగ్ ఉన్న హీరోల్లో మొదటి వరుసలో నిలిచే వెంకటేశ్‌కి అల్లరి పాత్ర లభిస్తే చెడుగుడు ఆడకుండా ఉంటాడా? వెంకీ పాత్రలో విపరీతమైన అల్లరి చేశాడు. తెరనిండా నవ్వుల జడివాన కురిపించాడు. నలభయ్యో పడిలో పడినా పదిహేడేళ్ల పరువాల చిన్నది ఆర్తీ సరసన పాతికేళ్ల కుర్రాడిలానే కనిపించి మెప్పించాడు. త్రివిక్రంలోని హాస్యప్రియుడు యమ సీరియస్‌గా ప్రవర్తించే మూర్తి (ప్రకాశ్‌రాజ్) పాత్రతో కూడా ఓ సందర్భంలో ఆపుకోలేని నవ్వుని సృష్టించాడు. హాలీవుడ్ సినిమా 'మీట్ ద పేరెంట్స్' ప్రేరణతో అతను కల్పించిన డైనింగ్ టేబుల్ సీన్ ఇప్పటికీ కళ్లముందు మెదిలి పెదాలపై నవ్వులు మొలిపిస్తుందన్నది నిజం. అమ్మ మీద ప్రేమ ఉన్న మూర్తి ఆమె మీద కవిత చదువుతుంటే వెంకటేశ్ ప్రదర్శించే హావభావాలు చూడాల్సిందే.
ఈ సినిమా విజయంలో ఆర్తీ అగర్వాల్‌దీ కీలక భాగస్వామ్యమే. నందిని పాత్రలో ముగ్ధమోహనంగా కనిపించడమే కాక, ఆ పాత్రలో మమేకమై నటించి, సగటు ప్రేక్షకుణ్ణి సమ్మోహితుణ్ణి చేసింది. వెంకటేశ్ కంటే వయసులో ఐదేళ్లు చిన్నవాడైన ప్రకాశ్‌రాజ్ హీరోయిన్ తండ్రిగా నడివయసు పాత్రలో బాగా రాణించాడు. ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సుదీప, ఆషా సైనీ, పృథ్వీ తమ పాత్రలకు న్యాయం చేశారు.
రెండు మూడు సన్నివేశాల్లోనే కనిపించినా సుహాసిని పాత్రని ఉపయోగించుకున్న తీరు కూడా ముచ్చట వేస్తుంది. నందు మేనత్త అంటే మూర్తి చెల్లెలి పాత్ర వేసింది సుహాసిని. తన నిశ్చితార్థానికి కాకుండా తర్వాతెప్పుడో వచ్చిన మేనత్తని నందు ప్రశ్నిస్తే "పెళ్లయిన రోజు నుంచి మనం కలలు కనే హక్కుని కోల్పోతాం. కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం. పెళ్లయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది. ఊరు మారుతుంది. ఇంటిపేరు మారుతుంది. కానీ మనసెందుకు మారదు?.. మనం ఆడుకున్న బొమ్మలు, మనం పెంచుకున్న మొక్కలు, మనవాళ్లతో చెప్పుకున్న కబుర్లు, ఆ జ్ఞాపకాలు.. మనల్నెందుకు వెంటాడాలి? మనల్నెందుకు ఏడ్పించాలి? ఈ పెళ్లిళ్లెందుకవ్వాలి? మనం అసలు ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి?" అని ఆవేదన చెందే సుహాసినితో మహిళా ప్రేక్షకులు బాగా సహానుభూతి చెందారు.
ఇక ఈ చిత్రంలోని పాటలు మనసుకి ఎంత ఉల్లాసాన్నిచ్చాయో చాలామందికి తెలిసిన సంగతే. కోటి అందించిన స్వరాలకు సీతారామశాస్త్రి సాహిత్యం తోడై పాటలన్నీ హిట్టయ్యాయి. 'ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి', 'నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది', 'ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా', 'నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు', 'ఒక్కసారీ.. చెప్పలేవా నువ్వు నచ్చావనీ' పాటల్లో ఏది జనం నోళ్లలో నానలేదని చెబుతాం! భువనచంద్ర రాసిన ఒకే పాట 'ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా'ది కూడా అదే బాణీ. చిత్రీకరణ విషయంలోనూ ఈ పాటలది అగ్ర తాంబూలమే. రవీంద్రబాబు కెమెరా కళ్లు పాటలన్నింటినీ అందంగా చిత్రించాయి. ఆయా సన్నివేశాలు బాగా పండటానికి అతను తీసిన క్లోజప్ షాట్స్ దోహదం చేశాయి. కొత్తమ్మాయి ఆర్తీ అభినయ సామర్థ్యాన్ని ఆ క్లోజప్సే పట్టించాయి. ఈ సినిమాకి నేపథ్య సంగీతమూ ఒక ప్లస్సే. మూడు గంటల నాలుగు నిమిషాల ఈ సినిమా ప్రేక్షకులకి విసుగు పుట్టించకుండా నవ్వుల నావలా సాగడంలో తోడ్పడిన మరో అంశం అత్యంత ప్రతిభావంతులైన ఎడిటర్లలో ఒకరైన శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ నేర్పు. సినిమా అంతా 'కలర్‌ఫుల్'గా భాసించడానికి పేకేటి రంగా కళా నైపుణ్యమూ కారణమే. ఇలా అన్ని విభాగాలూ చక్కగా పనిచేసినందునే 113 ప్రింట్లతో విడుదలైన 'నువ్వు నాకు నచ్చావ్' 93 కేంద్రాల్లో యాభై రోజులు, 57 కేంద్రాల్లో వంద రోజులు నడిచింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.

కాలేజీ రోజుల్లో అలాగే ఉండేవాణ్ణి
-వెంకటేశ్
సినిమాలో ఈచ్ అండ్ ఎవ్విరి సీన్ నన్ను బాగా ఆకట్టుకుంది. త్రివిక్రం ఈ కథని రెండున్నర గంటల సేపు చెప్పాడు. ఏ కథకీ వెంటనే ఓకే చెప్పని నేను 'నువ్వు నాకు నచ్చావ్' కథ వినగానే ఇమ్మీడియేట్‌గా చేసేద్దామన్నా. ఈ సినిమాలో నేనెంత అల్లరి చేశానో చూశారు కదా. కాలేజీ రోజుల్లో నేనలాగే ఉండేవాణ్ణి. పరీక్షల్లో కాపీ కొట్టడం, అమ్మాయిల్ని కామెంట్ చేయడం.. ఇప్పుడవన్నీ ఎందుకులెండి. అప్పటికీ, ఇప్పటికీ నాలో మార్పు చూసుకుంటే చాలా ఆశ్చర్యమనిపిస్తుంటుంది.
ఈ సినిమా రిలీజయ్యాక మొదట డివైడ్ టాక్ వచ్చింది. 'ఈ ఒక్క సెంటర్లోనే ఆడుతోంది. మిగిలిన సెంటర్లలో కలెక్షన్లు అస్సలు లేవు' అంటూ మాట్లాడేవాళ్లు ఎప్పుడూ చాలామందే ఉంటారు. హిట్టయిన 90 శాతం సినిమాలకు ఇలాంటి టాకే. తర్వాత 'నువ్వు నాకు నచ్చావ్' ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఇట్స్ ఎ క్లీన్ ఎంటర్‌టైనర్. చూస్తున్నంతసేపూ అందులో ఇన్వాల్వ్ అయిపోయే వాళ్లే ఎక్కువ.
అప్పట్లో చాలామంది హీరోల పరిచయ సన్నివేశాల్ని చూపించాలంటే.. చేతిని కళ్లకు అడ్డంగా పోనిచ్చి ఫేస్ చూపించడం, కట్ చేస్తే నలభైమంది డాన్సర్లతో డాన్స్ చేయించడం.. ఇది ఓ ఫ్యాషన్‌గా ఉండేది. ఈ పద్ధతిని మార్చాలనుకున్నా. అదే విషయాన్ని దర్శకుడు విజయభాస్కర్‌కి చెప్పా. అలా సికిందరాబాద్‌లో దిగాల్సి ఉండగా నాంపల్లి వద్దే ట్రైన్ దిగటాన్ని నా ఓపెనింగ్ సీన్‌గా చిత్రీకరించి, నా పాత్ర స్వభావాన్ని తెలిపేశాడు.
(వచ్చే వారం 'మనసంతా నువ్వే' ముచ్చట్లు) 

1 comment:

Unknown said...

modaga nene heeding chudakunda.. nareshanlokiveellanu.. adi nee story anukunna.. kani cinema kada ani telisi poorthiga chadivanu.
vislashana chaala bagundi... cinema kante.. life lo nuvvu.. prema vishayamlo.. feelayainatlu naku anipinchindi... any how.. very intresting..