'రోబో' తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్ద సినిమా 'మహేశ్ ఖలేజా'. ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. 'పులి'ని నిర్మించిన కనకరత్నా మూవీస్ సంస్థే ఈ సినిమానీ నిర్మించింది. 'పులి' డిజాస్టర్ కావడంతో 'ఖలేజా' మీదే నిర్మాతల ఆశలన్నీ వున్నాయి. తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు మహేశ్ నుంచి మూడేళ్ల విరామంతో వస్తుండటంతో ఆయన అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులూ ఎంతో ఆసక్తితో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగులో 'పులి' మాదిరిగానే అత్యంత భారీ వ్యయంతో 'ఖలేజా' తయారయ్యింది.
అనధికార సమాచారం ప్రకారం ఆ బడ్జెట్ సుమారు 40 కోట్ల రూపాయలు. నేటి అగ్ర దర్శకుల్లో ఒకడిగా గుర్తింపు పొందిన త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకుడు. 'అతడు' వంటి స్టైలిష్ మూవీ తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషనులో వస్తున్న ఈ సినిమాలో అగ్రనటి అనుష్క నాయిక. ఒక సినిమాకి అమితమైన క్రేజ్ రావడానికి ఇంతకు మించిన కాంబినేషన్ ఇంకేం కావాలి! 2007 సెప్టెంబరులో 'అతిథి' వచ్చిన తర్వాత మహేశ్ ఏడాది పైగా సినిమా షూటింగులకు దూరంగా ఉండి, కమర్షియల్ యాడ్స్ చేస్తూ రావడం విమర్శలకు తావిచ్చింది.
'అతిథి'కి ముందు ఆయన వరుసగా సినిమాలు చేయబోతున్నారంటూ ఆరు సినిమాలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. కానీ 'అతిథి' తర్వాత వాటిలో ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ఏడాదిన్నర తర్వాతనే త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వచ్చింది. బాక్సాఫీసుని ప్రభావితం చేసే ఒక టాప్ హీరో ఇంతకాలం సినిమా షూటింగులకు దూరం కావడం విచారకరం. ఇప్పటికైనా 'మహేశ్ ఖలేజా'తో ఆయన తమ ముందుకు వస్తున్నందుకు అభిమానులు కొండంత సంబరంతో ఉన్నారు.
ఈ సినిమాలో మహేశ్ ఓ టాక్సీ డ్రైవర్ పాత్రలో తొలిసారి కనిపించనున్నాడు. విగ్రహాల దొంగతనం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందనేది తెలిసిన సమాచారం. మహేశ్ సినిమా అంటే గుర్తుకు వచ్చే సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకీ సంగీతాన్ని అందించాడు. ఆరు పాటల్లో కనీసం మూడు పాటలు బ్రహ్మాండంగా పాపులరయ్యాయి. ముఖ్యంగా 'సదాశివా', 'పిలిచే పెదవులపైన' పాటలు హైలైట్ అంటున్నారు. ఇక మహేశ్ సినిమాల్లో యాక్షన్ కి ఉండే ప్రాధాన్యత తెలిసిందే. రామ్-లక్ష్మణ్ సమకూర్చిన ఫైట్లు ఈ సినిమాకి మరో ఎస్సెట్. ఇప్పటికే సూపర్ హిట్ అంటున్న 'రోబో'నీ, 14న రాబోతున్న ఎన్టీఆర్ 'బృందావనం'నీ 'ఖలేజా' ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం.
No comments:
Post a Comment