Friday, October 22, 2010

ఫోకస్: 'నంది' లీలలు! (1వ భాగం)

అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో అవార్డుల్ని ఎంపిక చేయడం అంత సులువైన పని కాదు. అయితే అసలు సిసలు సినిమా ప్రియులు, అవార్డులు గెలుచుకోగల అవకాశం ఎవరికుంటుందో ఊహించగలుగుతారు. ఆ ఊహకు భిన్నంగా ఫలితాలు వచ్చినప్పుడు విస్మయానికి గురవుతారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డుల విషయంలో వాళ్లు విస్మయపడే సందర్భాలే ఎక్కువ. నిరుడు విమర్శకుల్ని సంతృప్తిపరచిన నంది అవార్డుల జ్యూరీ ఈ ఏడాది పాతబాటనే అనుసరిస్తూ విమర్శకులకు ఎక్కువ పని కల్పించింది. 2009 సంవత్సరానికి జ్యూరీ ప్రకటించిన అవార్డుల్ని చూసి, 'ఇవేం అవార్డులు?' అనుకోనివాళ్లు బాగా తక్కువ.
జ్యూరీని మెప్పిస్తే చాలు!
ఉత్తమ చిత్రం అవార్డు విషయంలో ప్రజాదరణ పొందిన సినిమాల్ని లెక్కలోకి తీసుకోకూడదనీ, సమాజానికి ప్రయోజనకరమైన ఇతివృత్తంతో తీసిన సినిమాల్నే లెక్కలోకి తీసుకోవాలనీ జ్యూరీ నిర్ణయించుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఉత్తమ చిత్రంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డుల్ని గెలుచుకున్న సినిమాల్లో ఒక్కటి కూడా ప్రేక్షకుల ఆదరణకు నోచుకున్న సినిమా లేదు. ఉత్తమ ప్రథమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకున్న 'సొంత ఊరు'ని గానీ, ద్వితీయ చిత్రంగా నిలిచిన 'బాణం'ని గానీ, తృతీయ చిత్రం అవార్డుని పొందిన 'కలవరమాయె మదిలో'ని గానీ థియేటర్లలో చూసిన ప్రేక్షకులు బాగా తక్కువ. వీటిలో తొలి రెండు సినిమాలు విషయపరంగా, కథపరంగా విమర్శకుల్ని ఆకట్టుకున్నాయి.
'కలవరమాయె మదిలో' సినిమా ప్రేక్షకుల్నే కాదు, విమర్శకుల్నీ మెప్పించలేకపోయింది. అయితేనేం జ్యూరీని మెప్పించిందన్న మాట. పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన 'సొంత ఊరు' సినిమా సెజ్ ల వల్ల ఎలాంటి విపరిణామాలు జరుగుతాయనే సంగతిని రుద్ర అనే ఓ కాటికాపరి దృష్టికోణం నుంచి తీసిన చక్కని సినిమా అనడంలో సందేహం లేదు. అయితే నెగటివ్ క్లైమాక్స్ ఈ సినిమాలో ప్రధానంగా కనిపించే లోపం. దేవుడు అని అందరూ పిలిపించుకునేవాడు ఊరివాళ్లందర్నీ మభ్యపెట్టి వాళ్ల భూముల్ని అమ్ముకునేట్లు చేసి, ఊరిని ఎడారిలా మార్చేస్తుంటే చూసి సహించలేని రుద్ర ఆఖర్లో అతణ్ణి అంతం చేస్తాడు. ఆ హత్యకు కారణమేమిటనే నిజాన్ని జనం గ్రహించేట్లు చేసి, తమ ఊరిని కాపాడుకోవడానికి వాళ్లు నడుం బిగించినట్లు చూపిస్తే అర్థవంతంగానూ, ఔచిత్యంగానూ ఉండేది. కానీ జనం సత్యాన్ని గ్రహించకుండా దేవుణ్ణి చంపిన రుద్రపై ఆగ్రహించి, అతణ్ణి చంపేస్తారు. అంటే ఈ సినిమా ద్వారా దర్శకుడు సమాజానికి ఏం చెప్పదలచుకున్నాడు? మంచి పనుల్ని జనం అర్థం చేసుకోలేరు, మంచి చేసినవాళ్లనే చంపేస్తారు.. అనే ఒక తప్పుడు అభిప్రాయం ఇచ్చినట్లే కదా. అవార్డుకు ఎంపికయ్యే సినిమా ఈ తరహాలో ఉండకూడదు. ఇదే సినిమాకి మరో మూడు అవార్డులు లభించాయి. ఉత్తమనటి, క్యారెక్టర్ నటుడు, సంభాషణల రచయిత అవార్డులు దీనికి దక్కాయి. వీటిలో ఉత్తమ నటి అవార్డు మరీ విస్మయకరం. మల్లి అనే వేశ్య పాత్రలో నటించిన కొత్తమ్మాయి తీర్థని ఆ అవార్డుకు ఎంపికచేశారు. ఆమె ఎలా నటించిందో సగటు సినిమా ప్రియుడికైతే అసలే తెలీదు. జ్యూరీకి తెలిస్తే చాలుగా! రుద్ర పాత్రని ప్రతిభావంతంగా పోషించిన ఎల్బీ శ్రీరామ్ క్యారెక్టర్ నటునిగా అవార్డుని గెలుచుకోవడమే కాక, సంభాషణల రచయిత గానూ అవార్డుని పొందారు.  (ఇంకావుంది)
                          

No comments: