తారాగణం: ఎన్టీ రామారావు, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్వీ రంగారావు, గుమ్మడి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి
రచన: సముద్రాల రాఘవాచార్య, గాలి బాలసుందరరావు
సంగీతం: ఘంటసాల
నిర్మాత: కె. గోపాలరావు
దర్శకుడు: ఎస్. రజనీకాంత్
బేనర్: అశ్వరాజ్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 22 సెప్టెంబర్
కథ: భూదేవీ వరాహ మూర్తులకు జన్మించిన నరకాసురుడు (ఎస్వీ రంగారావు) ఘోర తపస్సు చేసి భూదేవి చేతిలో తప్ప మరెవ్వరిచే హతం కాలేననే వరాన్ని శివుని నుంచి పొందుతాడు. ఇంద్రాది దిక్పాలకుల్ని జయిస్తాడు. కృష్ణ భక్తుడైన నాగదత్తు (గుమ్మడి)ని మోసగించి ఆయన కుమార్తె వసుమతి (ఎస్. వరలక్ష్మి)ని వివాహమాడతాడు. తమకు పుట్టిన బిడ్డను తల్లి ఐన వసుమతి నుంచి వేరు చేస్తాడు. తనపై పగబట్టిన నాగదత్తుని నేత్రాలు తోడుతాడు. కృష్ణుని (ఎన్టీ రామారావు)పై పగబట్టి ద్వారకకు కృష్ణుని వేషంతో వచ్చి యువతుల్ని అపహరించుకు పోతాడు. ద్వారకావాసులు సత్యభామ (సావిత్రి)తో మొరబెట్టుకుంటారు, కృష్ణుని అదుపులో వుంచుకోమని. అంతవరకు సహనం వహించిన కృష్ణుడు లోక రక్షణార్థం నరకాసుర సంహారానికి సత్యభామా సమేతంగా బయలుదేరుతాడు. సత్యభామలో భూదేవి అంశ వున్నదనీ, నరక సంహారం సత్యవల్లనే కావాలనీ కృష్ణుని వల్ల గ్రహించిన రుక్మిణి (కృష్ణకుమారి) ఆ ఇరువురినీ విజయులై రమ్మని వీడ్కోలిస్తుంది. అటు నరకాసురుడూ సమర రంగానికి పయనమవుతాడు.
యుద్ధంలో కృష్ణుడు మూర్ఛపోయినట్లు నటిస్తాడు. నరకాసురుడు సత్యభామను అవమానిస్తాడు. నరకాసురునిపై అస్త్రం ప్రయోగిస్తుంది సత్యభామ. భూదేవియే సత్యభామ అని అవసాన దశలో నరకాసురుడు గ్రహించి క్షమాభిక్ష వేడుతాడు. నరకాసురుని చిరస్మరణీయం చేయాల్సిందిగా భూదేవి అర్థిస్తుంది. నరకాసురుని జ్ఞానజ్యోతికి చిహ్నంగా లోక వాసులంతా ఇంటింటా జ్యోతులు వెలిగించుకుని పండగ చేసుకొంటారనీ, ఆ పర్వదినమే 'దీపావళి'గా పిలువబడుతుందనీ చెప్పిన కృష్ణుడు ప్రాగ్జ్యోతీషపురంలో నరకాసురుని కుమారుని పట్టాభిషిక్తుని చేస్తానని మాట ఇస్తాడు.
No comments:
Post a Comment