రేటింగ్: 3.5/5
తారాగణం: రజనీకాంత్, ఐశ్వర్యారాయ్, డానీ డెంజోప్ప
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
ఎడిటింగ్: ఆంతోనీ
కళ: సాబు సిరిల్
డైలాగ్స్: శ్రీరామకృష్ణ
నిర్మాత: కళానిధి మారన్
సమర్పణ: తోట కన్నారావు
కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: ఎస్. శంకర్
దక్షిణాది అగ్ర నటుడు రజనీకాంత్ కెరీరులో మరో మణిపూస చేరినట్లే. దర్శకుడిగా తననెందుకు అగ్రశ్రేణిలో పరిగణిస్తారో 'రోబో'తో మరోసారి నిరూపించుకున్నాడు శంకర్. సాంకేతికంగా భారతీయ సినిమా ఎంత ఎత్తుకు ఎదిగిందో కూడా చెప్పిన సినిమా 'రోబో'.
కథ: రోబోలను తయారుచేయడంలో నిష్ణాతుడైన శాస్త్రవేత్త డా. వసి (రజనీకాంత్) మనిషిలా కనిపించే చిట్టి (రజనీకాంత్) అనే రోబోని తయారుచేస్తాడు. ఇండియన్ ఆర్మీలో చేర్పించి దాని ద్వారా దేశానికి సేవ చేయాలని వసి భావిస్తాడు. అయితే ఆర్మీలో చేరే విషయంలో చిట్టి విఫలమవుతాడు. దాంతో సందర్భానుసారం స్పందనలు కలిగేలా చిట్టిలో ప్రోగ్రాంని అనుసంధానిస్తాడు. మనిషిలాగే స్పందనలు కలిగే లక్షణాన్ని పొందిన చిట్టి అందాలరాశి సనని ప్రేమిస్తాడు. ఆ సన ఎవరో కాదు, సాక్షాత్తూ డా. వసి పెళ్లిచేసుకోబోయే అమ్మాయి. సన విషయంలో వసికీ, చిట్టికీ మధ్య యుద్ధంలాంటి వాతావరణం ఏర్పడుతుంది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకుని చిట్టి శక్తి సామర్థ్యాల్ని దుర్వినియోగం చేయాలని భావిస్తాడు మరో సైంటిస్ట్ డా. బోరా (డానీ). ఆ తర్వాత ఏం జరుగుతుంది? వసి, చిట్టిలలో ఎవరు గెలుస్తారు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: మామూలుగా అయితే అయితే ఇది అతి పేలవమైన కథే. కానీ రజనీకాంత్ హీరో అవడమే 'రోబో' కథని ఆసక్తికరం చేసింది. నిజానికి ఎప్పటిలా కథ కంటే శంకర్ కథనమే ఈ సినిమాకి ప్రాణవాయువు. రజనీ విన్యాసాలు దానికి పరిపుష్టిని చేకూర్చాయి. ఆ విన్యాసాలు కావలసినన్ని వున్నాయి ఈ సినిమాలో. 'రోబో'గా రజనీ విశ్వరూపాన్నే ప్రదర్శించాడు.
భూమ్యాకర్షణ సిద్ధాంతాన్నే ప్రశ్నించేలా రజనీ చేసే ఫైట్లు, వేలితో తూటాలు పేల్చే తీరు, అతివేగంగా వెళ్తున్న ట్రైన్ పైన కాకుండా దానికి ఒక పక్కనుంచి పరిగెత్తే విధానంతో పాటు, ఆకాశంలోకి ఎగిరే కార్లు, బైకులు, హాస్యాన్ని కురిపించే కట్ డైలాగ్స్ 'రోబో'ని ఆకర్షణీయంగా మలిచాయి. రోబోని అడ్రస్ అడిగితే అతను తన ఐ.పి. అడ్రస్ ఇచ్చే సన్నివేశంలోనూ, పోలీసుల వద్ద గన్స్ పేల్చే ముందు 'హ్యాపీ దీపావళి' అని చెప్పే సన్నివేశంలోనూ నవ్వనివాళ్లు ఉండరు.
సినిమాకి ప్రాణం చివరి 30 నిమిషాలని చెప్పాలి. భారతీయ ప్రధాన స్రవంతి సినిమా ఏ స్థాయికి చేరుకుందో ఈ అరగంట సినిమా మనకి పట్టిస్తుంది. రజనీకాంత్ అభిమానుల్ని క్లైమాక్స్ బాగా అలరిస్తుంది. 'రోబో' ప్రధాన బలాల్లో అత్యున్నత స్థాయి స్పెషల్ ఎఫెక్ట్స్ అతి ముఖ్యమైనవి. 'జురాసిక్ పార్క్', 'అవతార్' సినిమాలకి స్పెషల్ ఎఫెక్ట్స్ సమకూర్చిన స్టాన్ వింస్టన్ స్టూడియో 'రోబో'లో ప్రవేశపెట్టిన సూపర్ మాన్, బ్యాట్ మాన్, సూపర్ హీరో లక్షణాలు, వాటిని తనదైన శైలిలో రజనీ చేసిన విధానం మెచ్చని వాళ్లు ఎవరు!
అలాగే 'కిల్ బిల్', 'మాట్రిక్స్' వంటి టాప్ క్లాస్ సినిమాలకి స్టంట్స్ కూర్చిన యూన్ వూ పింగ్ 'రోబో' కోసం రూపుదిద్దిన ప్రతి ఫైటూ ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం బడ్జెట్ (రూ. 180 కోట్ల రూపాయలు)లో 40 శాతం ఖర్చయ్యింది కేవలం ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కే. సినిమా చూశాక ఆ ఖర్చంతా సద్వినియోగం అయ్యిందనిపిస్తుంది. సినిమాలో అలరించేది ఈ స్పెషల్ ఎఫెక్ట్స్, ఫైట్స్ మాత్రమే కాదు. వసి, చిట్టి, సన మధ్య ముక్కోణ ప్రేమ కూడా. వసి, రోబో పాత్రల్లో రజనీ తనకే సాధ్యమైన మేనరిజమ్స్, స్టైలుతో చెలరేగిపోయాడు. ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆమె గ్లామర్ సినిమాకి అదనపు ఆకర్షణ. చిత్రమేమంటే రజనీకాంత్, ఐశ్వర్య జంట బాగా అలరించగలగడం!
No comments:
Post a Comment