హూవి తల్లి భర్తని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. అందుకని తండ్రి హూవితో "నీ తల్లిని నేను విడిచిపెట్టలేదనియు, అదియే నన్ను విడిచిపోయెననియు నీవెరుగుదువా?" అని అన్నప్పుడు "అట్లామె నిన్ను విడిచినదని విని నేను గర్వపడుచున్నాను. మా యాడువాండ్రు నీవు త్రోలి డబ్బును గడియించు గుర్రమువంటి వారు కాదని నిదర్శనపూర్వకముగా నీకామె చూపినది" అని సమాధానమిస్తుంది హూవి. మరో సందర్భంలో 'కులము వారికి నాయందముతో జోక్యము లేదు. నేనడగుటయే తడవుగ వరులు నాకు లభింతురని నీవనుచుంటివి. కాని వధువులంత చులకనగ లభ్యము కారని నేను జూపింపదలచుకున్నాను" అనేందుకు సాహసిస్తుంది హూవి. ఇప్పటి పరిస్థితుల్లోనూ హూవిలా ధైర్యంగా చెప్పగలిగే యువతులు లేరు. కాని అప్పట్లోనే అలాంటి భావాల్ని పత్రికలో ప్రకటించడం అంటే సామాన్యం కాదు.
పూర్వకాలంలో మనదేశంలో ఉన్న ఘోషాపద్ధతి మూలంగా స్త్రీలు పురుషుల మాదిరిగా బయటకి వచ్చి చదువుకోవడానికి వీల్లేకుండా ఉండేది. అయితే అవకాశమిస్తే మేధాపరంగా వారు పురుషులకేమాత్రం తీసిపోరు అన్న అంశంతో వెంకటరత్నమ్మ ఒక వ్యాసంలో బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా స్త్రీలను మాత్రమే నియమించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థినులు తయారవుతారని ఆమె భావన.
20వ శతాబ్దంలో మొదటి మూడు దశాబ్దాల కాలం వరకూ బాల్యవివాహాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. వితంతువుల కష్టనష్టాలను గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ దురాచారాలపై యుద్ధం ప్రకటిస్తూ గోపిశెట్టి సూర్యనారాయణమ్మ తన 'స్త్రీవిద్య' వ్యాసంలో "ఏమాత్రము వివేకమున్నను స్త్రీలు తమ బిడ్డలకు బాల్యవివాహము చేయనిత్తురా? బిడ్డలకు జేయు పెండ్లిండ్ల వ్యయములో నాల్గవవంతు స్త్రీవిద్యకి వెచ్చించిన, నమూల్యమగు సంతతిని దేశమున నిల్పవచ్చునే" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏమాత్రం విలువలు పాటించని రాజకీయ నాయకులు మైకుముందు ఎలా మాట్లాడతారో, మైకు దాటి బయటకి వచ్చి ఎలా ప్రవర్తిస్తారో మనకి తెలుసు. అట్లాంటి నాయకుల్ని అనాడే వసంతరావు అమ్మన్న ఒక వ్యాసంలో ఎండగట్టారు. అప్పటి వారసత్వం రాజకీయ నాయకుల్లో ఇప్పటికీ కొనసాగుతోంది కదా! (ఇంకావుంది)
No comments:
Post a Comment