చిత్రం: కొడుకు కోడలు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల
అతడు: చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది
ఆమె: పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది ||చేయీ||
అతడు: నీ వలపే తలుపును తట్టింది - నా
మనసుకు మెలుకువ వచ్చింది - నా
వయసుకు గడియను తీసింది
ఆమె: నీ పిలుపే లోనికి రమ్మంది
నా బిడియం వాకిట ఆపింది
నా సిగ్గే ముగ్గులు వేసిందీ ||చేయీ||
అతడు: సిగ్గుతో నీవు నిలుచుంటే -
నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే
ఊపిరాడక నా మనసు
వుక్కిరి బిక్కిరి అయ్యింది -
ఆమె: వాకిట నేను నిలుచుంటే
ఆకలిగా నువు చూస్తుంటే
ఆశలు రేగి నా మనసు
అటు ఇటు కాక నలిగిందీ - ||చేయీ||
ఆమె: నీ చూపే మెత్తగ పాకింది
నా చుట్టూ మత్తును చల్లింది
నిను చూస్తూ వుంటే చాలంది
అతడు: నీ సొగసే నిలవేసింది
నా మగసిరికీ సరితూగిందీ -
నా సగమును నీకు ఇమ్మందీ - ||చేయీ||
No comments:
Post a Comment