Saturday, January 22, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: నరసింహనాయుడు (2001)

తారాగణం: బాలకృష్ణ, సిమ్రాన్, ప్రీతి జంగియాని, కె. విశ్వనాథ్, ముఖేష్ రుషి, మోహన్‌రాజ్, ఆశా షైనీ, జయప్రకాశ్‌రెడ్డి, సత్యప్రకాశ్, హేమంత్ రావణ్, రాఖీ, తెలంగాణ శకుంతల, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, చలపతిరావు, తనికెళ్ల భరణి, శివాజీరాజా, ముక్కురాజు, నర్రా వెంకటేశ్వరరావు
కథ, స్క్రీన్-ప్లే: చిన్నికృష్ణ
సంభాషణలు: పరుచూరి బ్రదర్స్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్. స్వామి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: రాజు
ఫైట్స్: విక్రం ధర్మా
డాన్స్: రాఘవేంద్ర లారెన్స్, బృంద, శ్రీను
నిర్మాత: మేడికొండ మురళీకృష్ణ
దర్శకత్వం: బి. గోపాల్
బేనర్: శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్స్
విడుదల తేది: 11 జనవరి, 2001

'కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా'.. సుమారు పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ డైలాగ్‌ని జనం నేటికీ మరచిపోలేదు. ఆ తర్వాత దానికి ఎన్నో పేరడీలు వచ్చాయి. అంతగా జనం నోళ్లలో నానిన, నానుతోన్న డైలాగ్ 'నరసింహనాయుడు' చిత్రంలోనిది. అది చెప్పింది కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. 2001లో అతిపెద్ద విజయాన్ని సాధించిన ఈ సినిమా అంతకు మునుపటి డెబ్భై ఏళ్ల తెలుగు చలనచిత్ర బాక్సాఫీసు కలెక్షన్ల రికార్డుని తిరగరాసింది. అంతేకాదు. నేటివరకు బాలకృష్ణ కెరీర్‌లోనూ అతిపెద్ద హిట్టు 'నరసింహనాయుడు'. ఆ స్థాయిలో ప్రేక్షకులు ఆ సినిమాకి విజయాన్ని చేకూర్చి పెట్టారంటే, అందులో అప్పటివరకు కనిపించని కొత్తదనమేదన్నా వాళ్లకి కనిపించిందా? లేదు. ఈ సినిమాలో అసాధారణ కథ లేదు. ఫార్ములాకి భిన్నమైన కథ కూడా కాదు. పోనీ కథనంలో ఏమన్నా కొత్తదనం వుందా అంటే - అదీ లేదు. మరెందుకు అంత సంచలనాత్మక విజయాన్ని 'నరసింహనాయుడు' సాధించాడు?
సినిమా అనేది సమష్టి కృషి. సినిమా విజయానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. విజయం సాధించే సినిమాకి అన్ని అంశాలూ కలిసొస్తాయి. 'నరసింహనాయుడు' విషయంలో జరిగింది అదే. అయితే ఈ విజయంలో మొదటగా చెప్పుకోవాలసింది నిస్సందేహంగా 'నరసింహనాయుడు' పాత్రనీ, ఆ పాత్రని బాలకృష్ణ పోషించిన తీరునీ. ఆ చిత్ర సంభాషణల రచయితలు పరుచూరి సోదరుల్లో ఒకరైన గోపాలకృష్ణ తమ 'తెలుగు సినిమా సాహిత్యం' పుస్తకంలో 'నరసింహనాయుడు చిత్రం ఏడు దశాబ్దాల చలనచిత్ర రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడానికి కారణం నరసింహనాయుడి పాత్రను తీర్చిదిద్దిన తీరే' అని చెబుతారు. ఆ పాత్రని అలా మలిచిందెవరు? కథా రచయిత చిన్నికృష్ణ. కథతో పాటు సినిమాకి ప్రాణమైన స్క్రీన్‌ప్లేనీ ఆయనే సమకూర్చాడు. తెలుగులో చిన్నికృష్ణకి ఇదే తొలి చిత్రం. అంటే తన మొదటి సినిమాతోటే రికార్డులు సొంతం చేసుకున్నాడు చిన్నికృష్ణ. అదివరకు రజనీకాంత్ సూపర్‌హిట్ తమిళ సినిమా 'పడయప్పా' (తెలుగులో 'నరసింహా') స్క్రిప్టు రచయితల్లో ఒకడిగా ఆయన వెలుగులోకి వచ్చాడు. 'నరసింహనాయుడు' అవకాశాన్ని కల్పించింది అదే. నిజానికి ఆ అవకాశం అనుకోని రీతిలో ఆయనకి వచ్చింది. అప్పటికే పోసాని కృష్ణమురళి కథతో సినిమాని ప్రారంభించారు దర్శకుడు గోపాల్, నిర్మాత మేడికొండ మురళీకృష్ణ. ఆ కథలో బాలకృష్ణ పోలీసాఫీసర్. అదే గెటప్‌తో ఆయన మీద తీసిన తొలి సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్‌నిచ్చారు.
అయితే తర్వాత ఎందుకనో గోపాల్‌కి ఆ కథ నచ్చలేదు. కారణం ఆయన అప్పటికే బాలకృష్ణతో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' తీసి ఉన్నాడు. అది పెద్ద హిట్టు కూడా. దానికంటే ఆ కథ గొప్పగా లేదనిపించింది. అప్పుడు 'సమరసింహారెడ్డి' కాలంలోనే తనకి పరిచయమైన చిన్నికృష్ణని పిలిపించాడు గోపాల్. హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో చర్చలు మొదలయ్యాయి. అప్పుడే చిన్నికృష్ణకు ఓ సంగతి తెలిసింది. "అప్పటికే చాంబర్ బిల్డింగ్‌లోని గెస్ట్‌హౌస్‌లో ప్రసిద్ధ రచయితలు విజయేంద్రప్రసాద్, ఆంజనేయ పుష్పానంద్, ఈరోడ్ సుందర్ ('పెదరాయుడు' కథారచయిత), పోసాని కృష్ణమురళి ఒక్కో గదిలో ఉండి కథలు చెబుతున్నారు. అందరికంటే నేనే చిన్నవాణ్ణి. అప్పుడు నా వయసు 32 యేళ్లు. నేను గోపాల్‌గారికి ఒకే స్క్రిప్టు చెప్పా. ఆయన పరుచూరి గోపాలకృష్ణగార్ని పిలిపించారు. కథ విన్న ఆయనకి ఓపెనింగ్ సీన్ బాగా నచ్చింది. హీరో ఓ నాట్యాశ్రమాన్ని నడుపుతూ కొడుకుతో పాటు అజ్ఞాతంలో ఉంటూ ప్రశాంత జీవితం గడపడమనే పాయింట్ కొత్తగా ఉందని చెప్పి, నా కథని ఓకే చేశారు. ఆ తర్వాత బాలకృష్ణగారికీ వినిపిస్తే, ఆయన వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. 'నరసింహనాయుడు'తో నేను తెలుగు పరిశ్రమకి పరిచయమయ్యానంటే సగం ఘనత గోపాల్ గారిదీ, సగం ఘనత గోపాలకృష్ణ గారిదీ" అని చెప్పారు చిన్నికృష్ణ. అలా పోసాని కృష్ణమురళి కథ స్థానంలో చిన్నికృష్ణ కథ వచ్చింది.
కథా సంగ్రహం:
రాయలసీమ కర్నూలు జిల్లాలోని రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒక గ్రామానికి పెద్ద రఘుపతినాయుడు (కె. విశ్వనాథ్) అయితే ఇంకో గ్రామం అప్పల్నాయుడు (మోహన్‌రాజ్), అతని బావమరిది కుప్పుస్వామినాయుడు (ముఖేష్‌రుషి) అజమాయిషీలో ఉంటుంది. వాళ్లనుంచి తమ గ్రామాన్ని కాపాడుకోడానికి ఒక సైన్యాన్ని తయారుచేయడం కోసం ఊళ్లోవాళ్లందర్నీ ఇంటికొక బిడ్డని బలిదానం చేయమంటాడు రఘుపతినాయుడు. తన వంతుగా నలుగురు కొడుకుల్లో చిన్నవాడైన నరసింహనాయుణ్ణి దానం చేస్తాడు.
సంవత్సరాలు గడుస్తాయి. నాట్యాచార్యుని అవతారమెత్తిన నరసింహ (బాలకృష్ణ) ఓ నాట్యాశ్రమాన్ని నడుపుతుంటాడు. అదే ఊళ్లో కుప్పుస్వామినాయుడు కూతురు అంజలి (ప్రీతి జంగియాని) మేనమామ సింహాచలంనాయుడు (జయప్రకాశ్‌రెడ్డి) ఇంట్లో ఉండి చదువుకుంటూ నరసింహని ప్రేమిస్తుంది.
అంజలిని మేనల్లుడైన దివాకర్ (హేమంత్ రావణ్)కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు కుప్పుస్వామి. కట్నంగా నరసింహనాయుడు తల కావాలన్న అక్క నాగమణి (తెలంగాణ శకుంతల)కి అలాగేనని వాగ్ధానం చేస్తాడు. అయితే నరసింహనాయుణ్ణి అంజలి ఇష్టపడ్తున్న సంగతి తెలిసి, ఊరువిడిచి వెళ్లమని నరసింహనాయుణ్ణి హెచ్చరించిన సింహాచలంనాయుడు తమ్ముళ్లు, పసివాడైన అతని కొడుకుని పైకి విసిరేస్తారు. దాంతో కొడుకుని రక్షించుకుని, వాళ్లందర్నీ చితగ్గొడతాడు నరసింహనాయుడు. అక్కణ్ణించి వెళ్లిపోవాలని ఆశ్రమం ఖాళీచేస్తాడు. బావతో పెళ్లి ఇష్టంలేని అంజలి కూడా నరసింహ వెళ్తున్న రైలుబండిలోనే ఎక్కుతుంది. ఇద్దరూ కలిసే వెళ్తున్నారనుకున్న దివాకర్ బృందం రైలుని ఆపేస్తారు. రైలు దిగుతాడు నరసింహనాయుడు. అంతే! అతన్ని చూసీ చూడగానే దివాకర్ బృందం ఆయుధాలు పారేసి, భయంతో పరుగులు తీస్తారు.
అదిచూసి ఆశ్చర్యపోయిన అంజలికి తన గతం చెబుతాడు నరసింహనాయుడు. ఆ గతం.. తండ్రిమీద దౌర్జన్యం చేసిన అప్పల్నాయుణ్ణి హతమారుస్తాడు నరసింహ. అతని కొడుకుల్ని చావగొడతాడు. చేతులూ, కాళ్లూ విరిగిన వాళ్లు తండ్రి చితికి కొరివి పెట్టలేని స్థిలో వుంటే బావమరిది కుప్పుస్వామి వచ్చి కొరివి పెడతాడు. నరసింహ చితి మండేదాకా తాళి, బొట్టు తీయొద్దని అక్క నాగమణితో ఆవేశంతో చెబుతాడు. శ్రావణి (సిమ్రాన్)ని పెళ్లిచేసుకుంటాడు నరసింహ. విదేశాల్లో వున్న అన్నలు పెళ్లికి రాకపోవడంతో వాళ్ల ఫోటోని ఎదురుగా పెట్టుకుని మరీ చేసుకుంటాడు. గుడివద్ద నరసింహ, కుప్పుస్వామి ఒకరికొకరు తారసపడతారు. అంతుచూస్తానన్న కుప్పుస్వామితో "ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే/టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే/ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే/కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా" అంటాడు నరసింహ.
'నీ మొగుడు నా మొగుణ్ణి చంపాడు' అని నాగమణి చెప్పడంతో భర్త వాస్తవ జీవితం తెలుస్తుంది శ్రావణికి. విదేశాల నుంచి వచ్చిన నరసింహ అన్నావదినల వల్ల ఎదురైన అవమానాలకు తట్టుకోలేక వారికి ఎదురుతిరిగి మాట్లాడుతుంది శ్రావణి. ఇంటికొచ్చిన నరసింహకి ఆమెమీద పితూరీలు చెబుతారు అన్నావదినలు. దాంతో మనస్తాపం చెందిన నరసింహ వాళ్లకే విలువనిచ్చి శ్రావణిని పుట్టింటికి పంపేస్తాడు. అప్పటికే నిండు చూలాలైన శ్రావణి పుట్టింట్లోనే కొడుకుని కంటుంది. నరసింహ మీద అలిగిన అన్నలు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. కుప్పుస్వామి వల్ల ప్రమాదం వుండటంతో పోలీసుల సాయంతో వెళ్తారు. మరోవైపు మనవణ్ణి చూడాలనుకున్న రఘుపతి తనకు రక్షణగా కొడుకుని రమ్మంటాడు. నరసింహ అన్నలమీద కుప్పుస్వామి మనుషులు దాడిచేస్తారు. విషయం తెలిసి నరసింహ అక్కడికి వచ్చి, తాను గొడ్డలి దెబ్బ తిని కూడా అన్నావదినల్ని కాపాడతాడు. ఈలోగా నరసింహ కొడుకుని చంపాలనుకుని శ్రావణి వద్దకు వెళ్లిన కుప్పుస్వామికి పసివాడు కనిపించడు. కొడుకుని దాచి, తాను కుప్పుస్వామి చేతిలో బలైపోతుంది శ్రావణి. ఆ తర్వాత నరసింహ చేతుల్లో తుదిశ్వాస విడుస్తూ కొడుకుని అతని చేతుల్లో పెట్టి కొట్లాటలకు దూరంగా వుండమని ఒట్టు వేయించుకుంటుంది. తండ్రి కూడా చెప్పడంతో భార్యకిచ్చిన మాటకోసం కొడుకుని తీసుకుని దూరంగా వెళ్లిపోతాడు నరసింహ. ఇదీ గతం.
వర్తమానానికొస్తే విషయం తెలిసి నరసింహని చంపడానికి అతనింటికి వచ్చిన కుప్పుస్వామికి అంజలినిచ్చి పంపిస్తాడు నరసింహ. అంజలిని 'అమ్మా' అని పిలుస్తున్న అతని కొడుకుని చూసి, ఆ పసిబిడ్డకు అమ్మనివ్వమని నరసింహని వేడుకుంటాడు రఘుపతి. సరేనని కుప్పుస్వామి ఇంటికొచ్చి 'రేపు ఉదయం 10 గంటలకి నాకూ, అంజలికీ వివాహం' అని చెబుతాడు. మరుసటి రోజు చెప్పినట్లే అంజలిని తీసుకెళ్లడానికి వస్తాడు. నరసింహకీ, కుప్పుస్వామికీ ముఖాముఖి పోరు జరుగుతుంది. నరసింహ చేతిలో చావుదెబ్బలు తింటాడు కుప్పుస్వామి. అంజలి హాస్పిటల్లో ఉందని తెలిసి అందరూ అక్కడకు వెళతారు. నరసింహ కొడుకు కోసం తనకి పిల్లలు పుట్టకుండా అంజలి ఆపరేషన్ చేయించుకోవడం చూసి కుప్పుస్వామి పశ్చాత్తాపపడతాడు. అందరూ ఒక్కటవుతారు.
(వచ్చేవారం 'నరసింహనాయుడు' విజయానికి దోహదం చేసిన అంశాలు)
-నవ్య వీక్లి, జనవరి 12, 2011 

No comments: