ఈ మధ్య మన సినిమావాళ్లకి - ముఖ్యంగా దర్శకులకీ, కథకులకీ - మాస్‌ని తక్కువ అంచనా వెయ్యడం ఎక్కువయ్యింది. మతిమాలిన హింస అన్నివేళలా వర్కవుట్ కాదని స్పష్టం కావడంతో బూతు హాస్యాలు, జుగుప్సాకర దృశ్యాల్ని ఆశ్రయించడం మొదలుపెట్టారు. మాస్‌కి ఇట్లాంటి సీన్లయితేనే నచ్చుతాయనే భ్రమలు పెరిగాయి. మేధావుల మెప్పుకోసం ఎవరూ కమర్షియల్ సినిమాలు తీయరనే సంగతి అందరూ ఒప్పుకుంటారు. అయినా మనకున్న పారలల్ సినిమాల సంఖ్య ఒక్క శాతం కంటే మించింది ఎప్పుడని? కానీ అధిక శాతం ప్రజల్ని ఆకర్షించడానికి చవకబారు, ముతక హాస్య సన్నివేశాల మీద ఆధారపడ్డం ఏమాత్రం సమర్థనీయం కాదు. పెద్ద దర్శకులమని అనిపించుకుంటున్న వాళ్లు సైతం ఇట్లాంటి దిగజారుడు దృశ్యాల్ని చిత్రీకరించడానికి ఉత్సాహం చూపిస్తూ తమ బాధ్యతని విస్మరిస్తున్నారు.
'పెళ్లిచేసి చూడు', 'మిస్సమ్మ', 'గుండమ్మ కథ', 'ఇల్లరికం', 'అహ నా పెళ్లంట', 'కొబ్బరి బోండాం', 'యమలీల' వంటి అమలిన హాస్య చిత్రాల్ని చూసిన కళ్లతోటే 'అల్లుడా మజాకా', 'అల్లరి మొగుడు', 'చిత్రం', 'టైంపాస్' వంటి అసభ్య, ముతక హాస్య చిత్రాల్ని చూడాల్సి రావడం బాధాకరం. వీటిలో కొన్ని విజయవంతం అయితే అవ్వొచ్చుగాక. మనిషిలో అంతర్గతంగా ఉండే ఇన్‌స్టింక్ట్స్‌ని రేపెట్టి వాటిని కేష్ చేసుకోవడంలో తాత్కాలికంగా సఫలమైనా చరిత్రలో వాటికి దక్కేది అట్టడుగు స్థానమే.
మనది ఎట్లాంటి సమాజం? ఒక భర్తకి ఒక భార్య, ఒక భార్యకి ఒక భర్త అనే సామాజికి సూత్రానికి అత్యంత విలువనిచ్చే సమాజం. ఇందులో మగవాడికి మినహాయింపులు ఇచ్చినట్లు అగుపించినా, భార్యతో కాక మరో స్త్రీతో సంబంధం పెట్టుకునే మగవాణ్ణి ఈ సమాజం గౌరవ దృష్టితో చూడదు. స్త్రీ విషయంలో అయితే ఇది మరీ ఘోరంగా ఉంటుంది. అట్లాంటిది ఒక గుడ్డివాణ్ణి చేసుకుంటే ఎంచక్కా ఇంకో మగాడితో రంకుతనం ఎట్లా సాగించవచ్చో 'టైంపాస్' చిత్రంలో కథకుడు కళ్లకు కట్టినట్లు చూపడం ఎంతైనా గర్హనీయం. కథకుడు ఈ రంకుతనాన్ని హైలైట్‌చేసి రంకుతనానికి వచ్చిన ఆటంకాల్ని సులువుగా తప్పించేస్తుంటాడు. చిత్రం ఆఖర్లో సైతం దానికి అడ్డుకట్ట వెయ్యకపోవడం చూస్తే మాస్‌ని కథకుడు కానీ, దర్శకుడు కానీ ఎంత తక్కువగా అంచనా వేశారో అర్థమవుతుంది. ఈ బాగోతం గురించి పిల్లలు తమ తల్లిదండ్రుల్ని అడిగితే వాళ్లేం సమాధానం చెప్పాలి? పైగా తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం వంటీ పెద్ద హాస్యనటులు ఈ అసభ్య, అశ్లీల హాస్యాన్ని పోషించడం మనసుకి చాలా కష్టంగా తోస్తుంది. 'అల్లుడా మజాకా'లో చిరంజీవి అంతటివాడు చేయగా లేనిది మేం చేస్తే తప్పేంటి అని వాళ్లంటే మనం మాత్రం ఏం చేస్తాం?
హాస్య సన్నివేశాల్లోనే కాకుండా ఇతరత్రా కూడా కొన్ని పాత్రల చేత అసభ్యకర మాటల్ని పలికించడంలో కూడా మనవాళ్లు అత్యుత్సాహం చూపుతుంటారు. 'వైఫ్' చిత్రంలో కాలేజీ అమ్మాయిల చేత పలికించిన మాటలు వినడానికి సరదాగానూ, చూడ్డానికి వినోదంగానూ ఉంటే ఉండొచ్చుకానీ మాస్‌లో అవి ఎట్లాంటి ప్రభావాన్ని కలిగిస్తాయో యొచించనవసరం లేదా? కడుపుబ్బ నవ్వించే చిత్రమంటూ 'జాక్‌పాట్'కి తెగ పబ్లిసిటీ ఇచ్చారు. ఫక్తు కామెడీ చిత్రమని భావించి వెళ్లిన మహిళా ప్రేక్షకులు ఆ చిత్రంలోని వెకిలి, అశ్లీల హాస్యాన్నీ, సంభాషణల్నీ భరించలేక ఇంటర్వెల్‌లోనే బయటకి వెళ్లడానికి ఇష్టం చూపారు. ఇందులోని సంభాషణలు సెన్సార్ కత్తెరకి చిక్కకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఒక్కో సినిమాలో కొన్ని సన్నివేశాల్నే ఎందుకు కట్‌చేస్తారో తెలీని సెన్సార్ వాళ్లకి 'జాక్‌పాట్'లోని డైలాగులు బాగా వినోదాన్ని అందిచాయేమో వాటికి కట్ చెప్పడం మర్చిపోయారు.
'ఎదురులేని మనిషి'లో కొత్త నటి షెహనాజ్, ఎల్బీ శ్రీరాంల మధ్య నడిచే డైలాగులు ముతక హాస్యానికి అసలు సిసలు నమూనాగా నిలుస్తాయి. పరమ జుగుప్సాకరంగా తోస్తాయి. బహుశా రచయిత తన ఒరిజినల్ మెంటాలిటీని ఆ సంభాషణల ద్వారా వ్యక్తం చేశాడేమో! హిట్ ముద్రని వేసుకున్న 'బ్యాచిలర్స్', '6 టీన్స్' చిత్రాల్లోనూ బూతు జోకులూ, జుగుప్సాకర డైలాగులూ, సన్నివేశాలూ మోతాదు మించాయి. వీటిని చూసి సినిమా హిట్టవడానికి అట్లాంటి డైలాగులూ, దృశ్యాలూ వుండాలనే అపోహలో పడిపోయి వాటినే నమ్ముకుని చిత్రాలు తీస్తూ చాలామంది బోల్తాకొడుతున్నారు.
వాస్తవానికి ఏ చిత్రమూ ముతక హాస్యంవల్ల, అశ్లీల సన్నివేశాలవల్ల విజయం సాధించలేదు. టెక్నిక్, కథనంవల్లనే ఆయా చిత్రాలు హిట్టయ్యాయన్న సంగతి గ్రహించాలి. ఇప్పటి చిత్రాల్లో ఆరోగ్యకరమైన హాస్యం ఉండటంలేదని వ్యక్తిగతంగా ప్రతివొక్కరూ బాధని వ్యక్థం చేస్తుంటారు. పత్రికా ఇంటర్వ్యూలలో, దృశ్యమాధ్యమంలోనూ మంచి హాస్యం రావాలని ఆకాంక్షని ప్రదర్శిస్తుంటారు. అయితే తమ వంతు బాధ్యతగా ఏం చేశారో, ఏం చేస్తున్నారో మాత్రం చెప్పరు. పైగా ఆ తర్వాత కూడా అట్లాంటి డైలాగులు సినిమాల్లో యధేచ్చగా వల్లిస్తూనే ఉంటారు. ఈ 'ద్వంద్వ' రీతిని ముందు ఉద్ధండ హాస్యనటులు వదిలించుకోవాలి. మాస్‌కి వాళ్లు చేయగల మేలు అదే.
అశ్లీల హాస్యం పెచ్చుమీరిపోతున్నదని ఒక పక్క బాధపడుతుంటే ఇప్పుడు ఇంకోరకం బాధ జనాల్ని వేధించడానికి ముందుకొస్తున్నది. ఈ కొత్త హాస్యం జనాల్ని మరీ తక్కువగా అంచనా వేస్తోంది. వాళ్లకి 'చెవిలో పువ్వు' పెట్టడానికి ప్రయత్నిస్తోంది. అందులో 'థాంక్యూ సుబ్బారావ్'లోలా 'మాట్లాడే కుక్క', 'అమ్మో బొమ్మ'లోలా 'దయ్యం బొమ్మ' పాలు పంచుకుంటున్నాయి. ఇలాంటి చిత్రాలు ఇంకా వస్తున్నాయంటే మన మాస్ స్టాండర్డ్‌ని సినిమావాళ్లు ఎంత గొప్పగా భావిస్తున్నారో అన్నదానికి నిదర్శనం. అమలిన చిత్రాల రోజులు రావాలంటే ఈ 'మలిన' చిత్రాల్నీ, హాస్యాల్నీ చీత్కరించి డబ్బాలు వెంటనే వెనక్కి వెళ్లిపోయేలా చేయడమే పరిష్కారం.
-ఆంధ్రభూమి, 19 అక్టోబర్ 2001
No comments:
Post a Comment