Saturday, January 8, 2011

హిట్.. హిట్.. హుర్రే...! (కొత్త శీర్షిక ప్రారంభం)

ఓ దశాబ్దపు సూపర్‌హిట్ సినిమాల విశ్లేషణ 
ఏ సినిమా హిట్టవుతుంది? ఏ సినిమా ఫట్టవుతుంది? చిత్రసీమలోని అత్యధిక శాతం మందికి అంతుచిక్కని ప్రశ్న ఇది. 'మినిమం గ్యారంటీ' అనుకున్న సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద కుదేలైన సందర్భాలెన్నో. 'హిట్ సినిమాకి ఇదీ ఫార్ములా' అని చాలామందే చెప్పారు. స్క్రిప్టుని 'యాక్ట్-1', 'యాక్ట్-2', 'యాక్ట్-3' అనే మూడు భాగాలుగా విభజించి, ఏ యాక్ట్‌లో కథ ఏ తరహాలో నడవాలో సూచించారు. కానీ ఎవరైతే ఈ పాఠాలు చెప్పారో, వాళ్ల సినిమాలు సైతం ఫ్లాపయ్యాయి. మరైతే గ్యారంటీగా హిట్ సినిమా తీయడం ఎలా? అనేవి ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక దశాబ్ద కాలంలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న, అలరించిన సినిమాలను ఓసారి పరికించి, పరిశీలిస్తే.. ఆ కిటుకేమన్నా తెలుస్తుందా? ఫలానా సినిమా ఎందుకు హిట్టయ్యిందో, ఆ సినిమాలోని బలాలేమిటో, వాటితో ప్రేక్షకులు ఎందుకు సహానుభూతి చెందారో విశ్లేషిస్తే.. చాలా సంగతులు అర్థమవుతాయి. పైకి అవి చాలామందికి తెలిసినట్లే అనిపిస్తాయి. కానీ సన్నివేశాల కల్పనలో తప్పులు జరిగిపోతూనే ఉంటాయి. సినిమా విజయానికి కథతో పాటు కథనం అనేది అత్యంత కీలకమైన అంశం. బిగువైన కథనం (గ్రిప్పింగ్ నెరేషన్) కావాలంటే బలమైన సన్నివేశాలే ఆధారం. ఆ సన్నివేశాల్ని తెరమీద ప్రతిభావంతంగా ఆవిష్కరించడం అంతకంటే ప్రధానం. ఇందుకు తెరపైన కనిపించే అభినయ సామర్థ్యంతో పాటు తెరవెనుక సాంకేతిక నైపుణ్యమూ కీలకమే. అలా అన్నీ కుదిరి అమోఘమైన విజయాలు చవిచూసిన సినిమాల గురించిన విశ్లేషణే ఈ 'హిట్.. హిట్... హుర్రే..!' శీర్షిక ఉద్దేశం.
2001 నుంచి 2010 వరకు ఓ దశాబ్దకాలంలో వచ్చిన చిత్రాల్లో కొన్నింటిని ఏరి, అవి ఆ స్థాయి విజయాల్ని సాధించడంలో ఏయే అంశాలు దోహదం చేశాయో వివరించే ఈ ప్రయత్నంలో విజయవంతమైన అన్ని చిత్రాల్నీ స్పృశించడం కుదిరేపని కాదు. అది ఉద్దేశపూర్వకంగా చేసేదిగా భావించవద్దని ఆయా సినిమాలకు పనిచేసినవారికి మనవి. ఇందులో విశ్లేషిస్తున్న సినిమాలకు సంబంధించి, వాటికి పనిచేసిన కొంతమంది అనుభవాలు, అభిప్రాయాలు సైతం పొందుపరుస్తున్నాం. దీనివల్ల ఆ విశ్లేషణకు మరింత నిండుతనం చేకూరుతుందని నమ్మకం. 2001లో తొలి బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిచి, వసూళ్లపరంగా అప్పటివరకు ఉన్న బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసిన 'నరసింహనాయుడు' సినిమాతో ఈ విశ్లేషణని ప్రారంభిస్తున్నాం. సినిమాపట్ల ఆసక్తీ, అభిరుచీ వున్న వారందర్నీ ఈ శీర్షిక ఆకట్టుకుంటుందనే నమ్మకంతో..
-నవ్య వీక్లి, జనవరి 5, 2011

No comments: