కొత్తదనం చూపించాలనే యావలో ప్రేక్షకుణ్ణి పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో ఈ ఏడాది విడుదలైన ముగ్గురు పెద్ద హీరోల చిత్రాలు నిరూపించాయి. ఇక్కడ కొత్తదనం అనే మాట వాడింది గ్రాఫిక్స్ విషయంలోనే తప్ప ట్రీట్‌మెంట్ విషయంలో కాదు. సినిమాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రవేశించాక దర్శకుడి పని సులువైంది. అతడి మనసులోని ఊహకి దృశ్యరూపం ఇవ్వడానికి గ్రాఫిక్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. హాలీవుడ్‌లోని ప్రతి అగ్ర దర్శకుడూ గ్రాఫిక్స్‌నే నమ్ముకుని చిత్రాలు రూపొందిస్తున్నారంటే అందుకు కారణం అక్కడి వాళ్లు భారీతనాన్నీ, కొత్తదనాన్నీ ఇష్టపడతారు కాబట్టి. అయితే మన తెలుగు ప్రేక్షకుల టేస్ట్ అటువంటిది కాదు. ఇక్కడ మానవ సంబంధాలే ముఖ్యం. ఆ మానవ సంబాంధాల మీద అల్లిన కథలో భారీతనం, కొత్తదనం మిళితమై వుంటే వాళ్లు ఆదరించకుండాపోరు. కానీ కథలో మానవ సంబంధాలకి ప్రాధాన్యత తక్కువై భారీతనానికీ, కృత్రిమత్వానికీ పెద్ద పీట వేస్తే మనవాళ్లు ఆదరించరు. ఈ సంగతి చిరంజీవి 'మృగరాజు', వెంకటేశ్ 'దేవీపుత్రుడు', నాగార్జున 'ఆకాశవీధిలో' నిరూపించాయి.
మూస ధోరణిలో తెలుగు సినిమా కథ నడుస్తున్నందువల్ల కంప్యూటర్ గ్రాఫిక్స్‌ని ఉపయోగించుకుంటూ కొత్త కథల్ని సృష్టించి ప్రేక్షకుల్ని రంజింప చేయవచ్చని మొదట్లో అంతా అనుకున్నారు. 'బొబ్బిలి రాజా' సినిమాలో తొలిసారి కంప్యూటర్ గ్రాఫిక్స్‌ని ఉపయోగించినప్పుడు 'ఇదేదో బావుందే' అనుకున్నారు. 'ఆదిత్య 369', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'భైరవ ద్వీపం' వంటి చిత్రాల్లో ఉపయోగించిన గ్రాఫిక్ వర్క్ కథలో మిళితమవడంతో వాటికీ ఆదరణ లభించింది. పైగా వాటి నిడివి కూడా తక్కువ కాబట్టి జనం వాటి గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే ఎప్పుడైతే 'అమ్మోరు' చిత్రం విడుదలై, మంచి విజయం సాధించిందో అప్పట్నించి మనవాళ్లకి ఈ గ్రాఫిక్స్ మీద మోజెక్కువ అయ్యింది. అంతదాకా పాటల వరకే పరిమితమై ఉన్న గ్రాఫిక్స్‌ను 'అమ్మోరు'తో కథని నడిపించడానికి వాడుకొని కొత్త ఒరవడిని మొదలుపెట్టారు నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ. ఈ చిత్ర విజయం తెలుగులో సినిమా నిర్మాణాన్ని బాగా ప్రభావితం చేసిందనే చెప్పాలి. 'అమ్మోరు'తో గ్రాఫిక్స్‌కి బాగా పేరు తెచ్చిపెట్టిన నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి మరోసారి గ్రాఫిక్స్‌నే నమ్ముకొని చిరంజీవితో 'అంజి' సినిమాని ప్లాన్ చేశారు. చాలాకాలం క్రితం ఆర్భాటంగా మొదలుపెట్టిన ఈ చిత్ర నిర్మాణం హఠాత్తుగా ఆగిపోయింది. అప్పుడే దీని నిర్మాణ వ్యయం 25 కోట్ల రూపాయలని వార్తలొచ్చాయి. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోయినా చిరంజీవిదే 'మృగరాజు' విడుదలై చాలా నిరాశపరిచింది. ఇందులో విలన్ అయిన సింహాన్ని కంప్యూటర్ మీద తయారుచేసి కథకి 'అతకడం'తో అది నిజమైన సింహం కాదనీ, 'అతుకు సింహం' అనీ చాలా స్పష్టంగా అర్థమైపోతూ ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది. 'అతుకు సింహం'తో చిరంజీవి ఫైట్లు చేస్తుంటే జనానికి ఏం నచ్చుతుంది? అలా సింహంతో కూడిన గ్రాఫిక్స్ మీద ఎక్కువ శ్రద్ధపెట్టి కథ మీద ఏకాగ్రతని చూపించకపోవడంతో 'మృగరాజు' నీరసించిపోయాడు.
'దేవీపుత్రుడు' నిర్మాణంలో వున్నప్పుడు అందులోని గ్రాఫిక్ వర్క్ గురించి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు నిర్మాతా దర్శకులు. దాంతో ఆ చిత్రంలోని గ్రాఫిక్స్‌పై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. చిత్రం విడుదలయ్యాక చూస్తే వాళ్ల అంచనాలకు తగ్గట్లు అందులో గ్రాఫిక్ వర్క్ లేదు. పైగా కృతకంగా అనిపించింది. తల్లి కడుపులోంచి పాప బయటకువచ్చి ఆ తల్లితో మాట్లాడుతుంటే దాన్ని సహజమని ఎట్లా అనుకుంటారు? ఆ 'మహిమ'ని ఎట్లా జీర్ణం చేసుకుంటారు? గతంలో 'దేవీపుత్రుడు' నిర్మాత ఎమ్మెస్ రాజు 'దేవి' అనే సినిమాని గ్రాఫిక్స్ నేపథ్యంలోనే తీశారు. అయితే ఆ సినిమా స్క్రిప్ట్ కుదురుగా వుండటంతో కథకి గ్రాఫిక్స్ సరిపోయి నటీనటుల బలం లేకుండానే ఆ చిత్రం విజయం సాధించింది. తన చిత్రాల్లో స్క్రిప్టుకే ప్రాధాన్యత అని చెప్పుకునే ఎమ్మెస్ రాజు 'దేవీపుత్రుడు' విషయానికొచ్చేసరికి గ్రాఫిక్స్‌ని హైలైట్ చేశారు. సముద్ర జలాల్లో మునిగిపోయిందని భావించే ద్వారకానగరంలో కథని నడిపించే క్రమంలో ఆ చిత్రంలో గ్రాఫిక్స్‌ని ఉపయోగించారు. కథాకథనాల్ని గ్రాఫిక్స్ డామినేట్ చేయడంతో ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. 17 కోట్ల రూపాయల పెట్టుబడికి వచ్చినదెంతో నిర్మాతకే తెలియాలి. ఈ ఏడాది వెంకటేశ్‌తోటే 'ఆదిశేషు' అనే చిత్రాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో నిర్మిస్తానని ఎమ్మెస్ రాజు పోయిన ఏడే చెప్పారు. దాని ఊసు ఇప్పుడెక్కడా వినిపించడం లేదు.
పోతే 'ఆకాశవీధిలో' కథ లేదనీ, కథనం గాడి తప్పిందనీ చిత్ర విమర్శపై అవగాహన లేని వాళ్లు సైతం చెబుతారు. ఇందులో 'స్పెషల్ ఎఫెక్టు'లే ఎక్కువ. విమానం బదులు విమానం సెట్టునే వేసి క్లైమాక్స్‌ని నడిపించాలనే 'గొప్ప ఆలోచన' ఎవరికి వస్తుంది? ఈ చిత్ర దర్శకుడికి తప్ప. ఆకాశంలో ఎగిరే విమానాన్ని 'మంత్ర'లో తయారుచేసి చూపించేసరికి మన కళ్లకి అది బొమ్మ విమానంగానే కనిపించడం, 'గ్రాఫిక్స్ అంటే ఇంతేనా' అనే తేలిక భావన ఏర్పరచుకోవడం మన తప్పేమీ కాదు. ఎలుగుబంటిని తప్పించుకునే క్రమంలో హీరో హీరోయిన్లు కొండమీదకి దూకి పారాషూట్ సాయంతో ఆకాశంలోనే కావలించుకోవడం - గ్రాఫిక్ వర్క్‌కి మచ్చుతునక అని ఎవరూ అనకపోవడం చూసి దర్శక నిర్మాతలు బాధపడే వుండాలి. హైజాక్‌కి గురైన విమానం కిందికి హీరో ఎయిర్‌క్రాఫ్ట్ వేసుకు వెళ్లే సీనుని 'క్యా సీన్ హై' అని ఈలలు వేయకపోవడం మన తప్పేనని వారు అనగలరు కూడా.
వీటిని బట్టి ఒక సంగతి మన అర్థం చేసుకోవచ్చు. చిత్ర నిర్మాణం కోసం నిర్మాత ఎంత ఖర్చుపెట్టాడు, దర్శకుడు ఎంతగా గ్రాఫిక్స్‌ని చొప్పించాడు అన్నది ప్రేక్షకులకి అవసరం లేదు. ఎక్కువ ఖర్చుపెట్టి సినిమా తీసి థియేటర్లో టికెట్ల రేట్లు పెంచితే లాభాలు దండిగా వస్తాయని భావించడం భ్రమ. ప్రేక్షకుడికి కావలసింది భారీతనాలూ, కథలో మిళితం కాని కృతక గ్రాఫిక్సూ కాదు. వినోదాన్ని పంచే మంచి కథాచిత్రం కావాలి. ఆ కథలో భారీతనం వున్నా, గ్రాఫిక్స్ ఉన్నా అభ్యంతరం లేదు. అయితే అవి ఆ కథలో ఒక భాగంగానే వుండాలి తప్పితే కథే వాటిమీద ఆధారపడేట్లు వుండకూడదు. కథలో గొప్ప సందేశం ఇవ్వకపోయినా పట్టింపులేదు. మానవ సంబంధాల్ని రసవంతంగా నడిపించగలిగితే చాలు. అలా చేస్తే కోటి రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టి తీసిన చిత్రాన్ని 20 కోట్లు ఆర్జించిపెట్టే బాక్సాఫీసు రికార్డు చిత్రంగా చూపించడానికి ప్రేక్షకులు సిద్ధంగానే వుంటారు.
-ఆంధ్రభూమి డైలీ, 14 సెప్టెంబర్ 2001
No comments:
Post a Comment