Saturday, January 29, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: నరసింహనాయుడు (రెండో భాగం)

'నరసింహనాయుడు' నిర్మాణ వ్యయం దాదాపు 8 కోట్ల రూపాయలు. పదేళ్ల క్రితం అంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువే. ఈ సినిమాలో భారీ సంఖ్యలో టాటా సుమోలు కనిపిస్తాయి. విలన్, హీరో గ్రూపులకు ఇలా అధిక మొత్తంలో సుమోలను ఉపయోగించడం దర్శకుడు గోపాల్ ప్రారంభించిన ధోరణే. భావోద్వేగ సన్నివేశాల సందర్భాల్లో అలా బారులు బారులుగా తెల్లటి సుమోలు కనిపిస్తుంటే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకునేవి ఆ రోజుల్లో. ఆ తర్వాత రోజుల్లో సందర్భం ఉన్నా, లేకున్నా అధిక సంఖ్యలో సుమోలు వాడటం విపరీత ధోరణిగా మారి, ప్రేక్షకులకి మొహం మొత్తడం వేరే సంగతి. 'నరసింహనాయుడు'లో టాటా సుమోల సన్నివేశాలన్నీ ఉద్వేగభరిత సన్నివేశాల్లో వచ్చేవే. అందుకే అవి కథలో అంతర్భాగంగా ఇమిడిపోయాయి. ఆయా సన్నివేశాల్ని పండించాయి. వాటితో పాటు రైలుబండి వద్ద యాక్షన్ సన్నివేశాలు, హెలికాప్టర్‌ని వినియోగించడం వంటివి ఈ సినిమా వ్యయాన్ని బాగా పెంచాయి. అంత వ్యయమంటే అప్పట్లో చాలా రిస్కే. చిన్నికృష్ణ కథనీ, గోపాల్ దర్శకత్వ సామర్థ్యాన్నీ నమ్మినందునే నిర్మాత మురళీకృష్ణ అంత మొత్తాన్ని వెచ్చించారు. "ఎందుకు, ఏమిటి అనకుండా అడిగిందల్లా సమకూర్చిపెట్టారు నిర్మాత మురళీకృష్ణ గారు. ఎప్పుడూ 'ఇదొద్దు' అనలేదు. సూట్‌కేసులతో డబ్బులు కుమ్మరించారు. ఆయనకి హేట్సాఫ్ చెప్పాలి" అని కృతజ్ఞత వ్యక్తం చేస్తారు దర్శకుడు గోపాల్. బడ్జెట్ విషయంలో తీసుకున్న రిస్కుకి తగ్గట్లుగానే అనూహ్యమైన ఫలితం దక్కింది. ఖర్చుకి రెండు రెట్లకి మించి 21 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది ఈ చిత్రం. ఆ విధంగా 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా ఇది రికార్డులకెక్కింది. ఈ ఫలితాన్ని ఊహించింది ఒకే ఒక్కడు. అతను చిన్నికృష్ణ. తను రాసిన స్క్రిప్టు చివరి పేజీలోనే ఆయన 'ఈ సినిమా 20 కోట్ల రూపాయల్ని వసూలు చేస్తుంది' అనే మాట కూడా రాశాడు. అది నూటికి నూరు శాతమూ నిజమవడం విశేషమే.
మరి ఇంతటి విజయాన్ని సాధించిన 'నరసింహనాయుడు' బలం ఎక్కడుంది? ఏయే అంశాలు ఆ సినిమాకి అంతటి విజయాన్ని చేకూర్చిపెట్టాయి? ఈ సినిమాలో లోపాలే లేవా? ఎందుకు లేవు! నరసింహనాయుడు పెద్దవాడై మనకి కనిపించడమే నాట్యాచార్యునిగా కనిపిస్తాడు. అయితే చిన్నతనంలోనే కర్రసాము, కత్తిసాము నేర్చుకుని తర్వాత ప్రత్యర్థుల పీచమణూస్తూ వచ్చిన నరసింహనాయుడు ఎప్పుడు నాట్యం నేర్చుకున్నాడు? నేర్చుకున్నా అంత తొందరగా నాట్యాచార్యుడు ఎలా అయ్యాడు? అనేవి సమాధానం లభించని ప్రశ్నలు. అలాగే 'సర్వకాల సర్వావస్థల్లోనూ నీ తోడుగా, నీడగా ఉంటాను' అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్యను అన్నావదినల్ని తూలనాడిందనే కారణంతో కనీసం ఆమె వాదన కూడా వినకుండా పుట్టింటికి పంపేయడం ధీరోదాత్త నాయకుని లక్షణం కాదు. నరసింహనాయుడు ఆ పని చేశాడు. భార్య పట్ల చాలా కఠినంగా వ్యవహరించి, ఆమెని వ్యధకు గురిచేశాడు. అంటే కథలో శ్రావణి పాత్రకు అన్యాయం జరిగింది.
అయితే మామాలు ప్రేక్షకుడికి ఇవేవీ పట్టలేదు. కారణం, వాటిని గుర్తించని రీతిలో అమరిన స్క్రీన్‌ప్లే. ఆరంభం నుంచి శుభం దాకా కుర్చీల్లో కదలనివ్వని కథాగమనం 'నరసింహనాయుడు'కి పెద్ద బలం. ఆ పాత్రని ప్రేక్షకులు అంతగా ప్రేమించడానికి దోహదం చేసింది అదే. ఇంటర్వెల్ వచ్చినప్పుడు సాధారణంగా ప్రేక్షకుడు రిలీఫ్ పొందడానికి కుర్చీలోంచి లేస్తాడు. కానీ ఎప్పుడు ఇంటర్వెల్ టైం అయిపోతుందా, ఎప్పుడు సెకండాఫ్ మొదలవుతుందా.. అనే క్యూరియాసిటీని కలిగించింది ఈ చిత్రం. అంతదాకా అజ్ఞాతంలో ఉన్న నరసింహనాయుడు ఉనికి తెలిపే ట్రైన్ ఎపిసోడ్ కచ్చితమైన ఇంటర్వెల్ బ్యాంగ్. ప్రత్యర్థులకు మొదట వీపు చూపించి, 'స్లో మోషన్'లో నరసింహనాయుడు మొహాన్ని చూపిస్తుంటే, ఆ రూపాన్ని చూసీ చూడగానే ఠారెత్తి ఆ ప్రత్యర్థులు ఆయుధాలు అక్కడే పడేసి పరుగులు తీస్తుంటే, 'మాస్' ప్రేక్షకుడికి అంతకంటే ఉద్వేగభరిత సన్నివేశం ఇంకేముంటుంది! అంతకుముందు దాకా సాఫ్ట్‌గా కనిపించి, సింహాచలం నాయుడు తమ్ముళ్లని చితగ్గొట్టినా నరసింహనాయుడులోని హీరోయిజాన్ని ఒకేసారి వెయ్యి రెట్లు పెంచేసిన సన్నివేశం అది. నరసింహనాయుడు వంటి బలమైన పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అది త్యాగం, పౌరుషం సమపాళ్లలో రంగరించిన పాత్ర. ఆ పాత్ర జనానికి అంతగా ఎందుకు నచ్చింది? "అతను (నరసింహనాయుడు) ఊరికోసం ప్రత్యర్థిని చంపుతాడు. కుటుంబం కోసం చదువుసంధ్యలు వదిలేశాడు. అన్నయ్యలను తూలనాడింది అన్ని కట్టుకున్న భార్యను వదిలేస్తాడు. సోదరుల కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. వాళ్లను రక్షించుకునే సమయంలో భార్యను పోగొట్టుకుంటాడు. కొడుకు వేరే కథానాయికలో అమ్మను వెతుక్కుంటే అంగీకరించడు. కానీ తండ్రి 'ఇంతమందికి ఇన్ని చేశావు, ఆ పసివాడికి అమ్మను తెచ్చిపెట్టలేవురా' అంటే వెళ్లి తీసుకొస్తాడు. విచిత్రం ఏమిటంటే ఏదీ తనకోసం చేయడు. తనవారికోసమే చేస్తాడు. అందుకే అందరికీ నచ్చిందా పాత్ర" అని వివరిస్తారు పరుచూరి కోపాలకృష్ణ.
అలాంటి పాత్రను తనదైన శైలితో రక్తి కట్టించారు బాలకృష్ణ. సెంటిమెంట్ సన్నివేశాల్లో ఎంతటి సాత్త్వికాభినయం చేశారో, భావోద్వేగ సన్నివేశాల్లో అంతటి గాంభీర్యాన్ని ప్రదర్శించారు. పోరాట సన్నివేశాల్లో ఎంతటి పరాక్రమాన్ని చూపించారో, సరదా సన్నివేశాల్లోనూ, పాటల్లోనూ అంతటి హుషారు కనపరిచారు. అలా 'నరసింహనాయుడు'కి ప్రాణ ప్రతిష్ఠ చేశారు బాలకృష్ణ. అందుకే ఆ పాత్రని నెత్తికెత్తుకున్నారు జనం. అందుకే ఆ పాత్రకి 'ఉత్తమ నటుడు'గా నంది అవార్డు అందుకున్నారు బాలకృష్ణ.
ఆయనకు దీటుగా శ్రావణి పాత్రలో సిమ్రాన్ ప్రదర్శించిన అభినయం కూడా ప్రేక్షకుల మనసుల్లో హత్తుకుపోయింది. భర్తను అతని అన్నావదినలు ఇష్టం వచ్చినట్లు తూలనాడుతుంటే తట్టుకోలేక వారిమీద ఆమె తిరగబడే సన్నివేశం 'నరసింహనాయుడు' పాత్రౌచిత్యాన్ని పరిపుష్ఠం చేసింది. ఇక తండ్రి పాత్రలో కాశీనాథుని విశ్వనాథ్ ప్రదర్శించిన హుందాతనం, ప్రతినాయకునిగా ముఖేష్‌రుషి చూపించిన క్రూరత్వం జనాన్ని మెప్పించాయి. మిగతా తారలంతా తమకి అప్పగించిన పాత్రల్ని సమర్థంగా చేసుకుంటూ వెళ్లారు.
బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ కనిపించే ఈ సినిమా విజయానికి దోహదం చేసిన అంశాల్లో ప్రముఖమైంది మణిశర్మ కూర్చిన సంగీతం. బాలకృష్ణ, ఆషా సైనీపై చిత్రీకరించిన 'లక్స్ పాప లక్స్ పాప లంచ్‌కొస్తావా' పాట మాస్‌ని ఓ ఊపు ఊపింది. 'కొక్కో కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో', 'చిలకపచ్చ కోక పెట్టినాది కేక', 'మొన్నా కుట్టేసినాది నిన్నా కుట్టేసినాది' పాటలు జనంలోకి బాగా వెళ్లాయి. ఇక సన్నివేశాలకు బలం చేకూర్చిన నేపథ్య సంగీతాన్నీ విస్మరించలేం. చిన్నికృష్ణ స్క్రీన్‌ప్లేకి మరింత బలాన్నిచ్చినవి పరుచూరి సోదరుల సంభాషణలు. బావోద్వేగ సంభాషణలకు పెట్టింది పేరైన వారు 'కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా' తరహా డైలాగులతో చెడుగుడు ఆడుకున్నారు. తన బావలు, తోడికోడళ్ల వద్ద ఆవేశభరితంగా శ్రావణి నోట పలికే ఇంగ్లీషు డైలాగులకు చప్పట్లు పడ్డాయంటే ఆ క్రెడిట్ వాళ్లదే. సినిమాకి మంచి 'లుక్' రావడంలో కీలకమైంది వి.ఎస్.ఆర్. స్వామి సినిమాటోగ్రఫీ. చేజింగ్ సీన్లలో ఆయన కెమెరా ఎక్కడా షేక్ కాలేదు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన కెమెరా యాంగిల్స్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. అలాగే పోరాట సన్నివేశాల్ని గొప్పగా రూపొందించి 'నరసింహనాయుడు' విజయంలో తనదీ ప్రముఖ పాత్రేనని చాటిచెప్పారు స్టంట్ మాస్టర్ విక్రం ధర్మా. ఇవన్నీ తెరమీద ఇలా పండాయంటే అందుకు ఎడిటింగ్ నిర్వహించే పాత్ర చాలా ఎక్కువ. ఆ పనిని అత్యంత సమర్థంగా నిర్వహించారు కోటగిరి వెంకటేశ్వరరావు.
ఇలా ఇందరి సమష్టి కృషి వల్లే 'నరసింహనాయుడు' చిత్రం గొప్ప విజయాన్ని సాధించింది. మునుపటి బాక్సాఫీసు వసూళ్ల చరిత్రని తిరగరాసింది. 105 కేంద్రాల్లో శతదినోత్సవం, 17 కేంద్రల్లో రజతోత్సవం జరుపుకుంది. ఏలూరులో 275 రోజులు ఆడింది. 'సమరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ - బి. గోపాల్ ద్వయానికి మరో సంచలన చిత్రంగా నిలిచింది.

'నన్ను మళ్లీ ట్రాక్‌లో నిలిపిన సినిమా' 
-బి. గోపాల్
చిన్నికృష్ణ 'సమరసింహారెడ్డి' టైంలోనే కలిసేవాడు. కథలు చెప్పేవాడు. అప్పుడు ఆ కథలు వర్కవుట్ కాలేదు. తర్వాత నేనే పిలిపించా. ఈ కథ చెప్పాడు. ఇంటర్వెల్ వరకు చెప్పాడు. బాగుంది. నిర్మాతకీ, బాలకృష్ణకీ నచ్చింది. మొదట సెకండాఫ్‌లో హీరో ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని చెప్పాడు. నాకు ఐపీఎస్ ఆఫీసర్ అనే పాయింట్ నచ్చలేదు. అప్పటికే బాలయ్యతో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' చేసివున్నా. నాలుగు రోజుల్లో బాలయ్యకు సెకండాఫ్ చెప్పాలి. పోలీసాఫీసర్ గెటప్ లేకుండా చెప్పమన్నా. చిన్ని కొంత అప్సెట్ అయ్యాడు. దాంతో పరుచూరి బ్రదర్స్‌తో చిన్నికి మీటింగ్ ఏర్పాటు చేయించా. అప్పుడు ఇంటికొక్కడు బలిదానమయ్యే పాయింట్ చెప్పాడు చిన్ని. నేను డౌట్‌పడ్డా. గోపాలకృష్ణ బాగుందన్నారు. ఆ తర్వాత సీనార్డర్ వేసుకొచ్చాడు చిన్ని. అది అందరికీ నచ్చింది. 'నరసింహనాయుడు' పాత్ర చెబుతుంటేనే బాలయ్య ఎగ్జయిట్ అయ్యారు. వెంటనే 'ఈ సబ్జెక్టుతో సినిమా చేస్తున్నాం' అన్నారు. స్క్రీన్‌ప్లే గొప్పగా చేశాడు చిన్ని. షూటింగ్ మొదలైన ఆరు నెలల్లో సినిమాని విడుదల చేశాం. వేస్టేజ్ లేకుండా రీజనబుల్ బడ్జెట్‌లో సినిమా చేశాం. నిర్మాత ధైర్యంగా కొన్ని ఏరియాలు అమ్మకుండా ఉంచుకున్నారు. పెద్ద హిట్టవడంతో బాగా డబ్బు వచ్చింది.
బాలయ్య పర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీ. మొదట సాఫ్ట్‌గా, తర్వాత ఎమోషనల్ మేన్‌గా గొప్పగా నటించాడు. లుక్స్‌తోనే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్క్రిప్టుకు తగ్గట్టు వంద శాతం కాదు వెయ్యి శాతం న్యాయం చేశాడు.
'సమరసింహారెడ్డి' తర్వాత నేను చేసిన సినిమాలు సరిగా రాలేదు. ఈ సినిమా నన్ను మళ్లీ ట్రాక్‌లో నిలబెట్టింది. టెక్నీషియన్లకి ఇక సక్సెస్ వస్తే చెప్పలేని ఆనందం. ఆయుష్షు పెంచినంత బలాన్నిస్తుంది. ఇంకా మంచి సినిమా చెయ్యాలన్న ఉత్సాహాన్నిస్తుంది.

'నా అంచనా తప్పలేదు' 
-చిన్నికృష్ణ
ఉత్తర భారతంలో దేశభక్తి ఎక్కువ. దక్షిణ భారతంలో వ్యక్తుల్ని పూజిస్తే, పంజాబ్‌లాంటి చోట్ల దేశాన్ని పూజిస్తారు. అందుకే ఆర్మీలో నార్త్‌వాళ్లు ఎక్కువ. అక్కడ కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఒక్కో కొడుకు దేశ రక్షణలో ఉన్నాడు. నేను అలాంటి గ్రామాల్ని ప్రత్యక్షంగా చూశా. దానికి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యా.
మన ఊరి సమస్యని కాపాడ్డానికి లా అండ్ ఆర్డర్ ఫెయిలయినప్పుడు ఒక్కో ఇంట్లో ఒక్కొక్కణ్ణి బలిదేవుడి (వారియర్)గా ఇస్తే వాళ్లు తమ ఊర్ని కాపాడుకుంటారనే ఐడియా అలా వచ్చింది. అట్లాంటి యోధులకి పెళ్లి సంబంధాలు రావు. ఒకవేళ పెళ్లయితే ఆ భార్యకి ఎన్నో కష్టాలుంటాయి. ఈ అంశాలు నా స్క్రిప్టులో 'బై-ప్రొడక్ట్స్'గా బాగా వర్కవుట్ అయ్యాయి.
నిజానికి నా మైండ్‌లో పోలీస్ కేరక్టర్ లేదు. మొదట సినిమా పోలీస్ అనుకుని మొదలుపెట్టినందునే అలా చెప్పా. తర్వాత గోపాల్ పోలీస్ ఆఫీసర్ కాకుండా చెప్పమన్నారు. నా మైండులో ఉన్న అసలు కథ అప్పుడు చెప్పా. 'లక్ష్మీనరసింహస్వామి' అనే థాట్ క్రియేట్‌చేసి తొలిగా చెప్పింది నేనే. నేను సృష్టించిన నరసింహనాయుడు కేరెక్టర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుండటం సంతోషకరం.
తమ ఇంట్లో ఈ స్క్రిప్టు వినగానే లోపలికి వెళ్లి స్వీట్ పాకెట్, పళ్లు తెచ్చిచ్చి, 'ఈ అబ్బాయి గొప్ప రైటర్ అవుతాడు' అని ఆశీర్వదించారు బాలకృష్ణ. ఆయన మిగతా హీరోలందరికంటే ఎంతో గొప్పవారు. సినిమా సక్సెస్ అవగానే కొన్ని లక్షల రూపాయలు విలువచేసే పురాతన పచ్చల పతకం, పట్టుబట్టలు ఇచ్చి, కారుదాకా మమ్మల్ని తీసుకువచ్చి పంపిన గొప్పవారు. నా 'నరసింహనాయుడు' పాత్రకి వంద శాతం జస్టిఫై చేశారు బాలకృష్ణ. చిన్నపిల్లాడిగా విని, పెద్ద నటునిగా చేశారు. విశ్వరూపాన్ని ప్రదర్శించారు కాబట్టే అంత పెద్ద హిట్టు.
ఈ సినిమా స్క్రిప్టు ఎ టు జడ్ నాదే. నా స్క్రిప్టు ఆఖరి పేజీలో '20 కోట్లు వస్తాయి' అని రాశా. బడ్జెట్ 8 కోట్లయితే, 21 కోట్లు వచ్చాయి. ప్రతి సినిమాకీ అలాగే రాస్తుంటా. అది అహంకారమనుకోండి, ఆత్మవిశ్వాసం అనుకోండి. ఇంతవరకు నా అంచనా తప్పలేదు. ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకుంటూ 'సాక్షాత్తూ లక్ష్మీనరసింహస్వామి చిన్నికృష్ణ రూపంలో మా ఇంటికి వచ్చి ఈ కథ చెప్పాడు' అన్నారు బాలకృష్ణ. అంతకుమించిన కాంప్లిమెంట్ నాకు ఇంకేముంటుంది! మళ్లీ ఆయనా, నేనూ కలుస్తాం. అది చరిత్ర అవుతుంది. అదే 'నందీశ్వరుడు'. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సినిమాలన్నీ అదే రోజు రిలీజైనా నేను రెడీ. 'నందీశ్వరుడు' మీద అంత గట్టి నమ్మకం.

(వచ్చే వారం 'ఖుషి' సినిమా కబుర్లు) 

No comments: