తారాగణం: బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి, పరుచూరి వెంకటేశ్వరరావు, భానుచందర్, అన్నపూర్ణ
బేనర్: ఆంధ్రా టాకీస్
దర్శకత్వం: కృష్ణవంశీ
రొటీన్ సినిమాలకి భిన్నంగా అప్పుడప్పుడు కొన్ని దర్శకుడి సినిమాలు వస్తుంటాయి. నటీనటులెవరనే దానికంటే దర్శకుని పేరునిబట్టే ప్రేక్షకులు ఆ సినిమాల్ని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఆ కోవకి చెందిందే 'సిందూరం'. దానికి దర్శకుడు కృష్ణవంశీ కావడమే జనం ఆసక్తికి కారణం. ఒక ప్రేమ కథాచిత్రం, ఒక కుటుంబ కథాచిత్రం తర్వాత కృష్ణవంశీ తన దృష్టిని ఈ వ్యవస్థ మీదికి మళ్లించాడు. ఒక గంభీరమైన ఇత్రివృత్తాన్ని తనదైన టేకింగ్‌తో ఆద్యంతం పట్టుసడలని రీతిలో తెరకెక్కించాడు. ఐతే అడుగడుగునా సెన్సార్ తన కత్తెరకి పదునుపెట్టిన ఛాయలు కనిపించడం ఇబ్బందికరం.
గొప్ప పోలీసాఫీసర్ కావాలనే లక్ష్యంతో బుల్లిరాజు పోలీస్ ట్రైనింగ్‌కి వెళ్తాడు. ట్రైనింగ్ పూర్తయి తన గ్రామానికి వచ్చిన బుల్లిరాజుకి బంధువులు, స్నేహితులు ఘన స్వాగతం పలుకుతారు. అయితే గ్రామంలో జరుగుతున్న అరాచకాల్నీ, దౌర్జన్యాల్నీ చూసి అతను కలత చెందుతాడు. అక్కడి ఎస్ఐ దురాగతాల్ని చూసి సహించలేక ఎదురు తిరగడానికి యత్నిస్తాడు. మరోపక్క నక్సలైట్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మందుపాతర్లతో పోలీసుల్ని చంపుతుంటారు. చిన్న రైతుల్ని హింసిస్తున్న భూస్వామిని చావబాదుతుంటారు. నక్సలైట్లని అసహ్యించుకుంటాడు బుల్లిరాజు. అతడి మేనకోడలు బేబి తన మావయ్య అయిన బుల్లిరాజునే పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. చదువు సంధ్యలు లేకుండా అల్లరి చిల్లరిగా జల్సారాయుడిగా తిరిగే చంటి ఆమెని అల్లరి పెడుతుంటాడు. లక్ష్మి అనే యువతిని అల్లరి చేస్తున్న ముగ్గురు పోకిరీ రాయుళ్లని చంటి ఎదుర్కోవడం చూసి బుల్లిరాజు అతడికి సాయం వెళ్లి వాళ్లని చితగ్గొట్తాడు. చిత్రంగా ఎస్ఐ పోకిరీ రాయుళ్ల కొమ్ముకాయడం చూసి సహించలేక తిరగబట్తాడు. అతడి స్నేహితుడు బైరాగి అతణ్ని శాంతపరచి ఎస్ఐని బతిమాలుతాడు.
మారువేషంలో స్టేషన్‌లోనే ఉండి ఇదంతా గమనిస్తుంటాడు తీవ్రవాద నాయకుడు. బుల్లిరాజు వాళ్లు వెళ్లిపోయాక పోలీస్‌స్టేషన్‌ని పేల్చివేస్తారు తీవ్రవాదులు. ఐతే ఎస్ఐ తప్పించుకుంటాడు. పగబట్టిన ఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం ఉన్న బుల్లిరాజు మిత్రుడు సత్తిపండుని బలవంతంగా తీసుకుపోతుంటే బోగిపండగ సంబరాల్లో ఉన్న బుల్లిరాజు అడ్డుకోబోతాడు. అతన్ని కూడా లాక్కుపోతారు పోలీసులు. బుల్లిరాజు కళ్ళముందే సత్తిపండుని కాల్చి చంపుతాడు ఎస్ఐ. తట్టుకోలేకపోయిన బుల్లిరాజు ఎస్ఐతో కలపడతాడు. పెనుగులాటలో ఎస్ఐ చేతిలోని రివాల్వర్ పేలి అతనే చనిపోతాడు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతాడు బుల్లిరాజు. తీవ్రవాదులు అతనికి ఆశ్రయమిస్తారు. అక్కడ బైరాగిని చూసి ఆశ్చర్యపోతాడు. మరుసటిరోజు తనకి తీవ్రవాదం అంటే నచ్చదని అందుకని వెళ్లిపోతున్నానని బయలుదేరుతుంటే తీవ్రవాదుల నాయకుడు అతనికి ఒక దినపత్రికనిస్తాడు. 'ఎస్ఐ కాల్చివేత - పోలీసు ముసుగులో టెర్రరిస్టు ఘాతుకం' అనే శీర్షికతో బుల్లిరాజు ఫొటోతో పెద్ద వార్త అచ్చయి ఉంటుంది. షాకవుతాడు బుల్లిరాజు. భవిష్యత్తు అగమ్యగోచరంగా తోస్తుంది. బేబి విషయంలో అనుక్షణం బుల్లిరాజుతో గొడవపడుతూ చివరికి మారిపోయిన చంటి అతన్ని వెతుక్కుంటూ వచ్చినవాళ్లతో కలుస్తాడు. గతంలో చంటి, బుల్లిరాజు చేతుల్లో తన్నులుతిన్న ముగ్గురు పోకిరీరాయుళ్లు లక్ష్మిపై అత్యాచారం చేస్తారు. ఉద్రేకం కట్టలు తెంచుకున్న బుల్లిరాజు వాళ్ల ముగ్గిర్నీ జనం మధ్య పట్టుకొని లక్ష్మిచేత చావగొట్టిస్తాడు. ఆ పోకిరీలని తీవ్రవాదులు చంపేస్తారు. ఎస్ఐ చావుని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ అధికారులు ఆ విషయమై బుల్లిరాజుని పట్టుకునేందుకు, తీవ్రవాదుల్ని అణచివేసేందుకు స్పెషల్ ఆఫీసర్‌ని నియమిస్తారు. అతను పోలీస్ అకాడమీలో బుల్లిరాజుకి శిక్షణనిచ్చిన పోలీసాఫీసరే. స్పెషల్ ఆఫీసర్ తీవ్రవాదుల కోసం, బుల్లిరాజు కోసం వేట మొదలుపెడతాడు.
పోలీసులతో జరిగిన ఘర్షణలో తీవ్రవాద నాయకుడు మరణిస్తాడు. బైరాగి పోలీసుల చేతికి చిక్కి, చిత్రహింసలకి గురవుతాడు. మావయ్యని వెతుక్కుంటూ వస్తుంది బేబి. ఆమెని తండ్రి కుదిర్చిన సంబంధం చేసుకొమ్మని, తనని మరిచిపొమ్మని చెబుతాడు బుల్లిరాజు. విషంతాగి పెళ్లి మండపంలోనే చనిపోతుంది బేబి. బైరాగిని విడిపించుకునే క్రమంలో రాష్ట్ర మంత్రి చలపతిరావుని బుల్లిరాజు కిడ్నాప్ చేస్తాడు. తీవ్రవాదుల ఒత్తిడికి లొంగమని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. పోలీసులతో ఘర్షణల్లో ఒక్కొక్క అనుచరుడే మరణిస్తుంటే బుల్లిరాజు వ్యధ చెందుతాడు. లక్ష్మిని కూడా పోలీసులు కాల్చివేస్తారు. ఇది సహించలేని చంటి బాంబు విసిరి ఓ పోలీస్ వ్యాన్‌ని ధ్వంసం చేస్తాడు. పోలీసుల నుంచి చంటిని రక్షించాలనే ఆదుర్దాలో పోలీసు తుపాకీ గుళ్లకి బలవుతాడు బుల్లిరాజు. ఇదిచూసి మిగతా అనుచరులు రాష్ట్ర మంత్రితో అడవుల్లోకి పారిపోతారు. స్పెషలాఫీసర్ నిస్సహాయంగా చూస్తుండిపోతాడు. ఆఖరున ఈ మారణహోమానికి అంతం ఎక్కడ? ఎప్పుడు? అని దర్శకుడు ప్రశ్నిస్తాడు. అవును. దానికి అంతం లేదు. ఈ వ్యవస్థ ఇప్పుడున్న మాదిరిగానే ఉంటే మారణహోమం కొనసాగుతూనే ఉంటుంది.
ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నది స్పష్టం. వ్యవస్థ మీద కోపంతో తీవ్రవాదులుగా మారిన యువకుల జీవితాలు ఎలా పరిసమాప్తి అవుతున్నాయో, వ్యవస్థ మీద కసితో పొట్టకోసం ఉద్యోగం చేస్తున్న సాధారణ పోలీసుల్ని ఎట్లా చంపివేస్తున్నారో, పోలీసులు రాజకీయ నాయకులకి, డబ్బున్న వాళ్లకి ఎట్లా తొత్తులుగా మారుతున్నారో, రాజకీయ నాయకులు పోలీసుల్ని తమ స్వార్థం కోసం ఎట్లా వాడుకుంటున్నారో, వాళ్ల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో కళ్లకి కట్టించాడు దర్శకుడు. అడుగడుక్కీ ఈ వ్యవస్థ మీద సంధించిన బాణాల్లాంటి సంభాషణలు అగుపిస్తాయి. ఐతే అనేక సన్నివేశాల్లో కొన్ని డైలాగులకి సెన్సార్ కత్తెర వేసి, తానున్నది కత్తిరించడానికే అని రుజువు చేసుకుంది. ప్రేక్షకుడికి మాత్రం ఇది కాస్త విసుగు తెప్పిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల ఒక సన్నివేశం పూర్తికాకముందే మరో సన్నివేశం రావడం తికమక కలిగిస్తుంది.
బుల్లిరాజుగా బ్రహ్మాజీ చాలా బాగా చేశాడు. ఇంతదాకా చిన్న చిన్న పాత్రలకే పరిమితమవుతూ వచ్చిన బ్రహ్మాజీకి ఈ సినిమా మంచి బ్రేక్‌నిస్తుంది. ఉద్రేకం, ఉద్వేగం ప్రదర్శించే సన్నివేశాల్లో అతను సరిగ్గా అతికిపోయాడు. చంటిగా రవితేజ చాలా ఈజ్‌తో చేశాడు. నృత్యాలు చలాకీగా చేశాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పవచ్చు. బేబి పాత్రలో సంఘవి అమాయకంగా, చురుగ్గా, అందంగా కనిపించింది. పాటల్లో శృంగారం ఒలికించింది. ఆమె పాత్ర పరిధి మరింత పెంచితే బాగుండేదనిపించింది. బైరాగిగా పరుచూరి వెంకటేశ్వరరావు ఆ పాత్రని పండించాడు. స్పెషల్ ఆఫీసర్‌గా ప్రత్యేక పాత్రలో భానుచందర్, బ్రహ్మాజీకి తల్లిగా అన్నపూర్ణ నటించారు. చిత్రంలో చెప్పతగ్గవి సంభాషణలు, దర్శకుడి ప్రతిభా. కె.ఎన్.వై. పతంజలి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. పాటల చిత్రీకరణ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. శ్రీనివాస చక్రవర్తి సంగీతం పాటలకంటే బ్యాక్‌గ్రౌండ్‌కి వినిపించిందే బాగుంది. భూపతి సినిమాటోగ్రఫీ సినిమాకి ఎస్సెట్. కృష్ణవంశీ టేస్ట్‌కి తగిన పనితనం అతని కెమెరాలో కనిపించింది. సినిమా విజయం సాధించినా, కాకపోయినా 'సిందూరం'ని ఒక సృజనాత్మక దర్శకుడి నుంచి వచ్చిన మంచి చిత్రంగానే చెప్పుకోవాలి.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 19 సెప్టెంబర్ 1997
No comments:
Post a Comment