వ్యవసాయ రంగాన్ని పీడిస్తున్న పెట్టుబడి కొరత
దేశంలో వ్యవసాయ రంగాన్ని పెట్టుబడి కొరత పట్టి పీడిస్తోంది. ఈ కొరత వ్యవసాయ రంగపు దీర్ఘకాలిక అభివృద్ధికి ముప్పుగా మారుతోంది. ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ అవి ప్రభుత్వ పెట్టుబడుల లోటుని పూడ్చే పరిమాణంలో ఉండటం లేదు. 1990-91 సంవత్సరంలో ప్రభుత్వం ఈ రంగం మీద రూ. 1154 కోట్ల పెట్టుబడిని పెట్టింది. అయితే మరో నాలుగేళ్లపాటు ఈ పెట్టుబడుల పరిమాణం పెరగలేదు. 1995-96లో మాత్రం ప్రభుత్వ పెట్టుబడి రూ. 1310 కోట్ల రూపాయలకి చేరుకుంది. 1994-95లో కంటే 1995-96లో ఈ రంగంలో ప్రణాళికా వ్యయం రూ. 148 కోట్లు తక్కువ. 1996-97 నాటికి ఇది మరో రూ. 134 కోట్లు తగ్గింది. 1997-98 సంవత్సరానికి మొత్తం ప్రణాళికా కేటాయింపులో వ్యవసాయ రంగం వాటా 3.2 శాతం ఉంది. అదే 1996-97 సవరించిన అంచనాల ప్రకారం వ్యవసాయ రంగం వాటా 3.4 శాతం.1997-98 బడ్జెట్‌లో వ్యవసాయం, తత్సంబంధ రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు 1996-97 సవరించిన అంచనాల కంటే 13 శాతం అధికం. వ్యవసాయ రంగం వార్షిక ప్రణాళిక కేటాయింపులకి బడ్జెట్ మద్దతు కొరవడినందువల్లనే ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగానికి ప్రణాళికా కేటాయింపులు నామినల్ రేట్లలో బాగా తగ్గాయని చెప్పాలి.
భూమి, నీటి వసతుల్ని సక్రమంగా వాడుకుంటూ వ్యవసాయ ఉత్పత్తిని పెంచడమనేది భారతదేశ విధానం. 8వ ప్రణాళికలో వర్షాధార ప్రాంతాల్లో జాతీయ ఆయకట్టు అభివృద్ధి ప్రాజెక్టుకు రూ. 1100 కోట్లు కేటాయించారు. 13 రాష్ట్రాల్లో 149 జిల్లాల్లో ఉన్న అనావృష్టి పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకాన్ని 946 సమితులకి విస్తరించారు. అయినా అధికారుల్లో, పాలకుల్లో చిత్తశుద్ధి లోపించినందు చేత ఆయకట్టు అభివృద్ధి ప్రాజెక్టు నత్తనడక నడుస్తోంది. భూగర్భ జలాల్ని ఉపయోగించుకోవడం ద్వారా నీటి పారుదల సౌకర్యాన్ని పెంపొందింప జేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తూర్పు ప్రాంతంలో ఈ పని చాలా త్వరగా జరగాలి. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో భూ ఉపరితల జల వనరుల్ని మరింతగా ఉపయోగించుకోవాల్సి ఉంది. బంజరు భూమిలో ఎడారుల్ని అభివృద్ధిపరచి పంటల సాగుకి తగిన విధంగా ఉండేట్లు తీర్చిదిద్దడానికి కృషి చేయాలి.
వాణిజ్య పంటల పోటీ
నాలుగు దశాబ్దాల నుంచి పారిశ్రామికాభివృద్ధి పెరగటం వల్ల జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా క్రమేపీ తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ వ్యవసాయ వస్తువుల ఉత్పత్తి, సేద్యం చేసే భూ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. వ్యవసాయ రంగంలో ఆర్థికాభివృద్ధి సాధించాలంటే పంటల మార్పిడి అవసరం. ఇలా చేయడం వల్ల భూసారం కూడా పెరుగుతుంది. 1965వ సంవత్సరంలో మొత్తం భూభాగంలో 44 శాతం పంటభూమి ఉండగా, 1996వ సంవత్సరం నాటికి అది 48 శాతానికి పెరిగింది. 1965కి ముందు మొత్తం పంటభూమిలో 80 శాతం ఆహార పంటలకి వినియోగిస్తుండేవారు. కానీ పంటల ఉత్పత్తి పెరగడం వల్ల, పరిశ్రమల ఉత్పాదక వస్తువుల ఉపయోగం పెరగడం వల్ల, ప్రజలు ఆదాయ మార్పు కోరుకోవడం వల్ల ఆహార పంటల సేద్యపు భూమి తగ్గిపోయి వాణిజ్య పంటల సేద్యపు భూ పరిమాణం పెరిగింది. అయినా కూడా 1990-91లో 176.4 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగగా, 1995-96లో 185 మిలియన్ టన్నుల ఆహర ధ్యాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. 1996-97లో ఖరీఫ్, రబీ పంటలతో కలిసి ఆహార ధాన్యాల ఉత్పత్తి 195 మిలియన్ టన్నులు ఉండే అవకాశం ఉంది. 8వ ప్రణాళిక తొలి అర్ధభాగంలో 1992-93 నాటికి ఆహార పంటలు సాగుచేసే భూ విస్తీర్ణంలో దాదాపు 37 శాతం మాత్రమే నీటి సదుపాయం కలిగి ఉండేది. 1993-94, 1994-95 సంవత్సరాల్లో మరో 1.7 మిలియన్ హెక్టార్లకి నీటి సదుపాయం కల్పించారు. 1995-96కి 2.1 మిలియన్ హెక్టార్లకి నీటి సదుపాయం కలిగింది. అందుచేతనే ఆహార ధాన్యాల ఉత్పత్తి కొంతమేరకైనా పెరిగింది. తొమ్మిదవ ప్రణాళికలో వ్యవసాయ, తత్సంబంధ రంగానికి ప్రస్తుతం ఉన్నవాటికంటే రెండింతల రుణాలు మంజూరయ్యేలా చూడాలని ఐక్యఫ్రంట్ కనీస ఉమ్మడి కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సంస్థల ద్వారా అందజేసిన వ్యవసాయ రుణాలు 1994-95లో రూ. 21,113 కోట్లు కాగా 1995-96లో రూ. 22,000 కోట్లు రుణాల కింద మంజూరయ్యాయి. 1996-97లో ఈ మొత్తం రూ. 28,000 కోట్లకి పెరుగుతుందని అంచనా.
కాలం చెల్లిన పద్ధతులు
దేశంలో వ్యవసాయాభివృద్ధిని నిరోధిస్తున్న అనేక అంశాల్లో సంప్రదాయ పద్ధతుల్ని అనుసరించడం కూడా ఒకటి. వ్యవసాభివృద్ధిని అధికం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం 1960 తర్వాత అనేక కొత్త వ్యూహాల్ని ప్రవేశపెడుతూ వస్తోంది. వీటిలో భాగంగా 1960-61లో సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (ఐ.ఎ.డి.పి.)ని దేశంలోని ఏడు జిల్లాల్లో ప్రవేశపెట్టారు. అందులో రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత 1965లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం (ఐ.ఎ.ఎ.పి.)ని ప్రవేశపెట్టారు. ఈ పథకాల ఫలితంగానే దేశంలో 1965లో హరిత విప్లవం సంభవించింది. ఈ నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతుల్లో భాగంగా అధిక దిగుబడి వంగడాలు, రసాయనిక ఎరువులు, ఆధినిక యంత్రాలు, నీటి సదుపాయాలు కల్పించారు.
ఆహార పంటల్లో వెనకడుగు
రాష్ట్రం విషయానికి వస్తే ఆరుగాలం కష్టించి పండించిన పంటలకి గిట్టుబాటు ధర రాక, ధర వచ్చేదాకా ధాన్యాన్ని నిల్వ చేసుకునే స్థోమత లేక రైతాంగం దిక్కుతోచని స్థితిలో సతమతమవుతోంది. రాష్ట్రంలో 2.74 కోట్ల హెక్టార్ల భూమి ఉంది. 1965-66లో ఆహార పంటలు 94.76 లక్షల హెక్టార్లలోను, ఆహారేతర పంటలు 26.14 లక్షల హెక్టార్లలోను పండించగా 1993-94లో 82.21 లక్షల హెక్టార్లలో ఆహార పంటల్నీ, 44.67 లక్షల హెక్టార్లలో ఆహారేతర పంటల్నీ సాగుచేశారు. అంటే మొత్తం ఆహార పంటలు పండించే భూమి శాతం మొత్తం సాగుభూమిలో వరసగా తగ్గింది. ఇది 79 శాతం నుంచి 64 శాతానికి తగ్గిపోయింది. సూచి సంఖ్యలో 100 నుంచి 87 శాతానికి పడిపోయింది. అలాగే ఆహారేతర పంటలు పండించే భూమి పెరిగింది. మొత్తం సాగుభూమిలో 21 శాతం నుంచి 36 శాతానికి ఆహారేతర పంటలు పెరిగాయి. రాష్ట్రంలో నీటి వసతి మొత్తం పంట భూమిలో 29 శాతం నుంచి 1993-94కు 38 శాతానికి పెరిగింది. ఇలా నీటి సదుపాయాలు పెరగడం వల్ల సేద్యపు భూమి పెరిగి వరి, వాణిజ్య పంటలు పండించే భూమి పెరిగి మెట్ట పంటలైన జొన్న, సజ్జ, గోధుమ వంటి పంటల్ని పండించే భూమి శాతం మూడు దశాబ్దాల కాలంలో సగానికి పైగా తగ్గింది. రాష్ట్రంలో కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ సరఫరా జరిగి ధరలు పడిపోయి వ్యవసాయదారులు విపరీతమైన కష్టనష్టాలకి గురవుతున్నారు. రైతుల్ని ఆదుకోవడంలో రాజకీయ నాయకులు, మార్కెట్ కమిటీలలో మెజారిటీ పదవులు అనుభవిస్తున్న తెలుగుదేశం నాయకులు విఫలమయ్యారు. విద్యుత్ కోత, ఆపైన వడగండ్ల బారినపడి ఈ ఏడాది రైతాంగం ఆటుపోట్లను ఎదుర్కొన్నది. పైగా గత ఏడాది కంటే ఈ ఏడాది విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగాయి. ఇన్ని సమస్యలు ఎదురైనా ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం, బావుల్లో నీరు తగినంతగా లభించడం వల్ల పంట దిగుబడి పెరిగింది. అయితే వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి సాగిస్తున్న దోపిడీ ముందు రైతులు నిస్సహాయులవుతున్నారు. దళారీ వ్యవస్థని రూపుమాపడానికని ఏర్పడ్డ వ్యవసాయ మార్కెట్లే దళారీ వ్యవస్థను మరింత పెంచి పోషిస్తుండటం శోచనీయం. రైతుల ప్రయోజనాల్ని కాపాడేందుకు నియోగించబడిన మార్కెట్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు సిండికేట్లతో చేతులు కలిపి రైతుల్ని నిలువునా దగా చేస్తున్నారు.
ఎగుమతులు
'గాట్' తదనంతర కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారానికి సంబంధించి రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకుంటున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల విధానంతో వాల్యుయేటెడ్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి ఉన్న అవకాశం మరింత విస్తృతమైంది. రాష్ట్రం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 1995-96 కాలంలో 90 శాతం వరకు పెరిగాయి. బియ్యం, పొగాకు, కొబ్బరి, పండ్లు, మంచినూనె, ఉల్లిపాయలు తదితర ఉత్పత్తుల్లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది.
ముఖ్యమంత్రి చెప్పింది వినేందుకు బాగానే ఉంది కానీ ఆర్థికాభివృద్ధి సాధించడంలో పంటల తీరు ప్రభావం చూపుతున్నందున ప్రభుత్వం కొన్ని చట్టాల ద్వారా, పరిపాలనా యంత్రాంగం ద్వారా, ప్రణాళికా బద్ధంగా పంటల తీరు నిర్ణయించి మార్పు తీసుకురావాలి. అవసరం మేరకు ఉత్పత్తికాని పంటలు, ఉత్పాదకాలకు సబ్సిడీలు అందజేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసి అవసరానికి మించి ఉన్న పంటలకి ప్రోత్సాహకాలు తప్పించాలి. ఉదాహరణకి పొగాకు ఉత్పత్తి, రవాణా, ఆర్థిక, మార్కెటింగ్ సౌకర్యాల అభివృద్ధిని పెంచి, వ్యవసాయ సంబంధమైన పరిశ్రమల్ని వారి వ్యవసాయ క్షేత్రాలకు దగ్గరలో స్థాపించి పంటల మార్పిడికి కృషి చేయాలి.
ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరచిన నేపథ్యంలో వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సి ఉంది. వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం కాబట్టి మౌలిక సదుపాయాల కల్పనకి అవి బాధ్యత వహించాలి. ఈ రంగంలో ఉత్పత్తి, అనంతర కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి.)లో దాదాపు మూడింట ఒక వంతు వాటా వ్యవసాయ రంగానిదే కాబట్టి 9వ ప్రణాళికలో లక్ష్య సాధనకు, హరిత విప్లవాన్ని తీసుకుపోవడానికి పెద్దమొత్తంలో పెట్టుబడులు అవసరం.
- ఆంధ్రభూమి డైలీ, 13 జూన్ 1997
No comments:
Post a Comment