రెండంచుల కత్తి గౌతం ఘోష్
గత ఆగస్ట్ నెలలో అతను ఫ్రెంచివాళ్ల ప్రతిష్ఠాత్మక 'విట్టారియో డిసాకా' అవార్డుని అందుకున్నాడు. ఆ పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయుడు అతనే. పేరు గౌతం ఘోష్. తొలిసారిగా అతడు దర్శకత్వం వహించింది ఒక తెలుగు చిత్రానికి. ఆ చిత్రం పేరు 'మా భూమి'. ఆ సినిమా నుంచే అతడు తన మార్గంలో ఒక్కో మెట్టే ఎక్కుతూ ముందుకు నడుస్తున్నాడు. బిస్మిల్లాఖాన్‌ని తనదైన రీతిలో సెల్యులాయిడ్‌పై అద్భుతంగా చిత్రించాడు. 'పార్', 'అంతర్జలి జాత్ర', 'పద్మ నదీర్ మఝి' వంటి అరుదైన సినిమాల్ని సృష్టించాడు. తన ఈ ప్రయాణాన్ని చిన్నతెర మీద ప్రదర్శించాడు. అట్లాగే రవీంద్రనాథ ఠాగూర్ 'ఘటేర్ కథ'ని కూడా.కత్తికి రెండువైపులా పదును ఉన్నట్లు అతడి చిత్రాలకి విమర్శకుల మెప్పు ఉంది. వాణిజ్యపరమైన ఆకర్షణా ఉంది. అదే అతడిలోని వైశిష్ట్యం. బిస్మిల్లా ఖాన్, ఉత్పల్‌దత్, కనికా బెనర్జీపై చిత్రాలు తీసిన గౌతం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుపై ఒక షార్ట్ ఫిల్మ్ తీసే పనిలో నిమగ్నమయ్యాడు. ఒక రాజకీయవేత్తపై చిత్రం తీయడానికి అతను పూనుకోవడం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 'వ్యక్తిగా ఆయన నన్ను ఆకర్షించాడు' అని సమాధానం వస్తుంది గౌతం నుంచి. "అఫ్‌కోర్స్. ఆయనొక రాజకీయ నాయకుడు. నా చిత్రం ఆయన కాలంలోని రాజకీయ వాస్తవాల్ని స్పృశిస్తుంది. ఆయన సామర్థ్యం అద్వితీయమైంది. ఆయన కలల్ని ప్రతిఫలింపజేయడానికి నేను ప్రయత్నిస్తున్నా" అంటాడు గౌతం.
అతను సత్యజిత్‌రే మీద కూడా ఒక డాక్యుమెంటరీ తీస్తున్నాడు. "దేశవ్యాప్తంగా సినీ దర్శకుల్ని ప్రభావితం చేసిన ఏకైక కళాకారుడు రే. కళమీద ఆయనకున్న అంకిత భావం మాటల్లో వ్యక్తీకరించలేనిది. రే కళ తాలూకు నేపథ్యాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నా. ఒక వ్యక్తిగా, అంతకంటే ఎక్కువగా ఆయనలోని సృజనాత్మక కళని ఈ చిత్రం ప్రదర్శిస్తుంది. సినీ విద్యార్థులకి రేని అర్థం చేసుకోవడంలో ఈ చిత్రం సహాయపడుతుందనే విశ్వాసం ఉంది" అంటాడు గౌతం. సినిమాకి సంబంధించి అతనిది రాజీపడని మనస్తత్వం. అతడి దృష్టిలో సినిమా అనేది ఒక భాష. తన అనుభవాల్ని ప్రేక్షకులతో పంచుకున్నప్పుడే దర్శకుడు ముందుకు నడవగలడనేది అతని నమ్మకం.
స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లకి, అంటే 1950లో గౌతం కుటుంబం తూర్పు బెంగాల్ నుంచి కలకత్తాకి వలస వచ్చింది. బాల్యం తియ్యగా సాగిపోయింది. వాళ్లది ఉమ్మడి కుటుంబం. గౌతంకి అనేకమంది కజిన్స్ ఉండేవాళ్లు. అందరూ కలిసి ఒకళ్ల ఆలోచనల్ని మరొకళ్లు పంచుకునేవాళ్లు. అట్లా చెయ్యడం వాళ్లకెంతో సంతోషాన్నిచ్చేది. ఇంట్లోనూ, స్కూల్లోనూ గౌతం మేజిక్కులు చేసేవాడు. ఏకపాత్రలు అభినయించేవాడు. అతడి దృష్టిలో ఆ రోజులు చాలా గొప్పవి. అప్పుడు మరింత అందంగా ఉండేది కలకత్తా నగరం. ఇక గంగాతీర సోయగం వర్ణనాతీతం. సెలవు రోజుల్లో గౌతం కుటుంబ సాయంకాలాలు ఆ తీరం వద్దనే గడిచేవి. ఈడెన్ గార్డెన్స్ కూడా అతడిని చాలా ఆకర్షించింది.
చలనచిత్రాల వైపు అతడి దృష్టి మళ్లడానికి తొలి బీజం ఐదేళ్ల పసివయసులోనే పడింది. అప్పుడతను 'భక్త ధృవ' అనే బెంగాలీ సినిమా చూశాడు. ఊహ వచ్చాక అతడు చూసిన తొలి సినిమా అదే. అయితే సినిమాలు ఎక్కువగా చూసే అవకాశం ఉండేది కాదు. అనేక సంవత్సరాల దాకా సినిమాలు చూసే అవకాశం ఎప్పుడో కానీ వచ్చేది. అప్పట్లో ఎవరైనా 'మంచి సినిమా ఏది?' అనడిగితే 'టార్జాన్' అనో, 'మేరీ పాపిన్స్' అనో చెప్పేవాడు. గౌతం దృష్టిలో ఇప్పుడవి గొప్ప అనుభవాలు. మొదట్లో అతను క్రికెట్‌ని ప్రేమించాడు. ఇంటర్‌స్కూల్ లీగ్ పోటీల్లో ఆడాడు. ఆఫీస్ క్లబ్ పోటీల్లో ప్రొఫెషనల్‌గా క్రికెట్ ఆడాడు. ఫాస్ట్ బౌలర్ కావాలని కలలు కన్నాడు. అలాంటి సమయంలో అతడి బాబాయి ఒక బ్రౌనీ కెమెరాని ఇచ్చాడు. అప్పుడు గౌతం వయసు పదేళ్లు. ఆ చిన్న వస్తువే అతడి జీవితాన్ని మార్చేసింది. బాబాయి కొంత ఫిలింని కూదా తెచ్చిచ్చాడు. ఇక దాంతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ ఫిల్మ్ మొత్తం అవగానే ఇంకో ఫిల్మ్ సిద్ధంగా ఉండేది కాదు. దాంతో షూటింగ్ అంతటితో ఆగేది. అప్పుడు ఒకటి, రెండు 'రోల్స్' కొనేవాడు, డబ్బుపెట్టి. లేదంటే కెమెరా 'వ్యూఫైండర్' నుంచి ఉత్తినే చూస్తూ కాలం గడిపేవాడు. ఫొటోగ్రఫీలో, పర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో అతడికి ఉన్న ఆసక్తి సినీరంగంలో కాలు మోపేందుకు దారితీసింది. కాలేజీలో ఉండగా అక్కడి వాతావరణం అతడిలోని కళాకారుణ్ణి తట్టిలేపింది. 'రిత్విక్' అనే యువ రంగస్థల బృందంలో చేరాడు. ఒక పక్క క్లాసులకి హాజరవుతూ మరోపక్క నేషనల్ లైబ్రరీ, బ్రిటీష్ కౌన్సిల్ లైబ్రరీల్లో సినిమాల మీద, రంగస్థలం మీద కనిపించిన ప్రతి పుస్తకమూ చదివేవాడు. ఆపైన కొద్ది కాలానికే సినీ దర్శకత్వంలో వచ్చిన ఆధునిక పద్ధతుల్ని అధ్యయనం చేశాడు. ఐతే కేవలం థీరీ చదివినంత మాత్రాన ఉపయోగం ఉండదని అతడికి తెలుసు. అందుకే ఏమైనా చేయాలని తపించేవాడు. ఎట్లయితేనేం ఒక 8 ఎం.ఎం. కెమెరాని సంపాదించి తన తొలి ప్రయోగాన్ని మొదలుపెట్టాడు. తన థియేటర్ గ్రూపులోని సభ్యులనందరినీ ఒకచోట చేర్చి సమరేష్ బసు రచించిన బెంగాలీ కథానిక 'జోర్‌వంత'ని దృశ్యీకరించాడు. ఐతే సరిపడ ఆర్థిక వనరులు, అవసరమైన సామగ్రి లేకపోవడంతో ఆ చిత్రాన్ని పూర్తి చేయలేకపోయాడు. కానీ ఒక ప్రయోగం చేశామన్న తృప్తి మిగిలింది. ఆ రోజులు మరపురానివిగా నిలిచాయి.
1971లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక చిత్రాలు తీయడం కొనసాగించాడు. 1973లో 'న్యూ ఎర్త్' అనే తన తొలి డాక్యుమెంటరీని తీశాడు. దీనికి సుప్రసిద్ధ దర్శకుడు మృణాల్‌సేన్ ప్రశంసలు లభించాయి. అంతకుముందు బెంగాల్‌లో విద్యుత్ కరవుపై కూడా ఒక డాక్యుమెంటరీని తీస్తుంటే అది మరీ విమర్శనాత్మకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టడంతో దాన్ని పూర్తి చేయకుండానే ఆపేశాడు. తను తీసే చిత్రాల కోసం డబ్బు సమకూర్చుకోవడం అతడికి గగనమై పోయింది. ఒకసారి అనుకోకుండా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ అతడి అసంపూర్ణ డాక్యుమెంటరీని చూశాడు. ఆయనకు అది బాగా నచ్చింది. వెంటనే కంశపతి రివర్ ప్రాజెక్టుపై ఒక డాక్యుమెంటరీని తీసిపెట్టమని గౌతంని కోరాడు. అలా 'న్యూ ఎర్త్' తయారయ్యింది. 1974లో బెంగాల్‌లో అకాల కరవు సంభవించింది. గౌతం ఒక చిన్న 16 ఎం.ఎం. కెమెరాని సంపాదించి, కొంత అప్పుచేసి ఆ కరువుపై డాక్యుమెంటరీ తీశాడు. కరువు విలయ తాండవం చేస్తున్న గ్రామాల్లోకి వెళ్లి వార్తా సేకరణ విభాగంలో పనిచేశాడు. ఐతే అది కేవలం వార్తా సేకరణ మాత్రమే కాదు. దేశంలో కరువు అనేది ఏ తీరులో ఉంటుందో విశ్లేషించడానికి అదో ప్రయత్నం. ఈ ఆలోచన నగర ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి తోడ్పడిందని ఆ రోజుల్ని గుర్తుకు తెచ్చుకొని చెప్తాడు గౌతం. అప్పుడే దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ఆ డాక్యుమెంటరీకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఒక సంవత్సర కాలం తీసుకుంది సెన్సార్ బోర్డు. కలకత్తా ఫిల్మ్ సొసైటీ తొలిసారిగా దాన్ని ప్రదర్శించింది. ఐతే గౌతం తన డాక్యుమెంటరీని అమ్మేందుకు ప్రయత్నించలేదు. స్పాన్సర్‌షిప్ లభించకపోవడంతో డాక్యుమెంటరీలు తీయకూడదని నిశ్చయించుకున్నాడు. జీవనాధారం కోసం కొన్ని యాడ్ ఫిలింలు తీశాడు.
అప్పుడు వచ్చింది ఒక 'బ్రేక్'. హైదరాబాద్ నుంచి ఒక నిర్మాతల బృందం అతడిని కలిసింది. వాళ్లు అప్పటికే మృణాల్‌సేన్ తీసిన 'మృగయా'ని స్పాన్సర్ చేశారు. వాళ్లు గౌతం తీసిన ఫిలింలను చూశారు. అప్పటికింకా గౌతంకు ఫీచర్ ఫిలింలు (చలన చిత్రాలు) తీయాలనే తలంపు లేదు. అయితే నిర్మాతల్లో ఒకరైన బి. నరసింగరావు గౌతంను కన్విన్స్ చేసి ఒప్పించారు. అదిగో.. అప్పుడు తయారయ్యింది 'మా భూమి'. ప్రఖ్యాత ఉర్దూ రచయిత కిషన్ చందర్ రచించిన నవలిక ఆధారంగా దాన్ని రూపొందించారు. ముందు దాని స్క్రిప్టుని కలకత్తాలో పూర్తిచేశాడు గౌతం. అయితే ఎప్పుడైతే అసలు లొకేషన్‌కు వెళ్లాడో అప్పుడు కానీ అర్థం కాలేదు, తన స్క్రిప్టు కృతకంగా, జిమ్మిక్కుగా ఉందనే సంగతి. అప్పుడు స్క్రిప్టులో మార్పులు చేశాడు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పర్యటించాడు. అప్పటి జనం స్పందన కానీ, సినిమాలో వాళ్ల భాగస్వామ్యం కానీ అపురూపమైనవిగా అతడు భావిస్తాడు. స్క్రీన్‌ప్లేని నరసింగరావు సమకూర్చారు. 'మా భూమి'ని పూర్తిచేయడానికి ఏడాది కాలం పట్టింది. అయినా కానీ గౌతం హృదయంలో ఆ కథ గొప్ప ప్రభావాన్ని కలిగించింది. సినిమా పూర్తయ్యాక సెన్సార్ ఇబ్బందులు ఎదురయ్యాయి. జాతీయతకు విరుద్ధంగా ఆ సినిమా ఉందని సెన్సార్ వాళ్లు భావించారు. అప్పుడు చరణ్‌సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మద్రాసులో ఉన్న గౌతం మిత్రులు 'మా భూమి'ని సెన్సార్ చేతుల్లోంచి బయట పడేసేందుకు సహాయం చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ సినిమాని తాష్కెంట్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించినప్పుడు కె.ఎ. అబ్బాస్ దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. 'మా భూమి'ని సెన్సార్ వాళ్లు ఎట్లా విడిచిపెట్టారో ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే నక్సలైట్ ఉద్యమం మీద అబ్బాస్ రూపొందించిన సినిమాకి అదే సెన్సార్ వాళ్లు అభ్యంతరపెట్టారు. ఏదేమైనా 'మా భూమి' బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా, పెద్ద స్టార్లు ఎవరూ లేకపోయినా వాణిజ్యపరంగా మంచి విజయమే సాధించింది. అది సాధించిన విజయంతో ఆ తర్వాత కొంతమంది తెలుగు నిర్మాతలు తమకి సినిమాలు తీసిపెట్టమని గౌతంను కోరారు. అయితే వాటిని సున్నితంగా తిరస్కరించి తిరిగి కలకత్తా వెళ్లిపోయాడు. అప్పటికే సమరేశ్ బసు రాసిన ఓ నవలను సినిమాగా తీయాలని అతడు నిశ్చయించుకుని ఉన్నాడు. దీని విషయమై ఉత్తంకుమార్‌ను సంప్రదించగా ఆయన కూడా ఆసక్తి చూపించాడు. ఐతే అనుకోని రీతిలో 1980 జూలై 24న ఉత్తంకుమార్ చనిపోయాడు. ఆ రోజు గౌతం పుట్టినరోజు కావడం కాకతాళీయం. తాననుకున్న పాత్రలో ఉత్తంకుమార్‌ను తప్ప వేరే నటుణ్ణి ఊహించలేకపోయాడు గౌతం. అందుకే ఆ సినిమా తీసే ఆలోచననే విరమించుకున్నాడు.
ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అతడికి ఓ సినిమా తీసే అవకాశం ఇచ్చింది. కేవలం రూ 3 లక్షల వ్యయంతో అతడు 'దఖల్' (19981) తీశాడు. 'మా భూమి' ఉత్తమ చిత్రంగా నంది అవార్డును అందిస్తే, 'దఖల్' ఆ యేడాది జాతీయ ఉత్తమ చిత్రంగా బంగారు కమలాన్ని సాధించిపెట్టింది. ఆ తర్వాత హిందీలో 'పార్' తీశాడు. అది చరిత్ర సృష్టించింది. చలనచిత్రంలో కథనం ఎక్కువగా ఉంటుంది. కానీ 'పార్'లో అతడు కథనంలోనే కొంత డాక్యుమెంటరీ పద్ధతిని కూడా మిళితంచేసి తీశాడు. ఇక బెంగాలీ 'అంతర్జలి జాత్ర' ఒక విభిన్న చిత్రం. 19వ శతాబ్దపు బెంగాల్ నేపథ్యంలో కమల్‌కుమార్ మజుందార్ రచించిన 'మహాయాత్ర' నవల ఆధారంగా తీసిన చిత్రం. ఆ తర్వాత మాణిక్ బెనర్జీ సుప్రసిద్ధ నవల 'పద్మ నదిర్ మాఝి'ని అదే పేరుతో సినిమాగా మలచిన గౌతం అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. బెనర్జీ నవలని మార్చి, దాని ఆత్మని విస్మరించి సినిమా తీశాడనేది అందులోని ప్రధానమైన ఆరోపణ. "సాహిత్యం, సినిమా - రెండు భిన్న రంగాలు. సినిమా అనేది కేవలం నవలకు అనువాదంగా ఉండకూడదు. అది బదలాయింపుగానే ఉండాలి. ఎక్స్‌ప్రెషన్ అనేది భిన్నమైంది. కొన్నింటిని మాటల ద్వారానే వ్యక్తం చేయగలం. వాటికి దృశ్యరూపం కల్పించలేం" అని వివరణ ఇచ్చాడు గౌతం.
సమకాలీన భారతీయ సినిమా విషయంలో అతడు సంతోషంగా లేడు. "అంతర్జాతీయ స్థాయిలో గత పదిహేనేళ్లలో మనం ఏమీ చేయలేకపోయాం" అని విచారం వ్యక్తం చేస్తాడు. సత్యజిత్ రే, మృణాల్‌సేన్, శ్యాం బెనెగల్, ఆదూర్ గోపాలకృష్ణన్ వంటి దర్శకులు దేశీయ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో తమ పాత్రను నిర్వర్తించారనీ, అయినా ఎక్కడో లోపం ఉంటోందనీ అతడు చెబుతాడు. "మొత్తం యూరప్ అంతా చైనీయుల సినిమాలను చూస్తున్నారు. భారతీయ సినిమాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మన సినిమాలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్స్‌పోజ్ కావాల్సిన అవసరముంది. మంచి మార్కెట్ లేకపోతే మన ప్రమాణాల్ని పెంచుకొనే అవకాశమే రాదు" అని అభిప్రాయపడతాడు గౌతం. హిందీలో తీసిన 'గుడియా' తర్వాత మరో సినిమా తీసే పనుల్లో ఉన్న గౌతంకు ఫ్రెంచి ప్రభుత్వపు ప్రోత్సాహకం లభించబోతోంది. అతను తీసే ఒక సినిమాకు నిధులను అందిస్తామని అది ప్రకటించింది. గౌతంలోని విశిష్ట కళాకారుడికి అంతకంటే కావాల్సిన గౌరవం ఏముంటుంది!
- ఆంధ్రభూమి 'వెన్నెల', 16 జనవరి 1998
No comments:
Post a Comment