Friday, September 30, 2011

సంస్కృతి: భాష, సంస్కృతి ఒకటేనా?

భాషపై మనకున్న ప్రేమ, గౌరవం కొద్దీ సంస్కృతికి అదే విధానమని చెప్పడం సరైంది కాదు. భాషా ప్రభావం సంస్కృతిపై ఎక్కువగానే పడుతుంది. కాని, అంతమాత్రం చేత భాషే సంస్కృతి కాదు. భాషకే కాక, భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు సైతం సంస్కృతి స్వరూప స్వభావాల నిర్ణయంలో తగినంత ప్రాధాన్యం ఉంటుంది. భారతీయ సంస్కృతిపై ఇక్కడి హిమాలయాల, ఇక్కడి మహానదుల ప్రభావం స్పష్టం. సింధు, గంగా, యమునలకు జన్మస్థానం హిమాలయాలే. హరప్ప, మొహంజోదారోలు, ఇంద్రప్రస్థ, పాటలీపుతలు, వారణాసి, ప్రయాగలు, ఢిల్లీ, ఆగ్రాలు - ఆ నదీ తీరాలలోనో, వాటి లోయల్లోనో విలసిల్లిన మన జాతీయ సంస్కృతీ కేంద్రాలు. బౌద్ధ శిల్పకళ మహోన్నత శిఖరాల్ని అందుకున్నది కృష్ణానదీ పరిసరాల్లో. ఆంధ్ర మహాభారత రచన శ్రీకారం చుట్టుకుంది గోదావరి గట్టున. 'ఓం తత్సత్'ని రాసింది పెన్నానది ఒడ్డున. విజయనగర సామ్రాజ్య సంస్థాపన జరిగింది తుంగభద్ర తీరాన.
భాషాప్రభావానికి సంస్కృతి కొంతవరకు లోనవుతుంది కాబట్టి భాషకు, సంస్కృతికి భేదమే లేదనడం కరక్టేనా? భాషనే సంస్కృతిగా పేర్కొనడం భాష గురించీ, సంస్కృతి గురించీ మనకేమీ తెలీదని చాటుకోవడమే! ఒకరి భాష మరొకరికి పట్టుబడినట్లు, ఒకరి సంస్కృతి మరొకరికి సంక్రమించదు. బ్రిటీష్ వాళ్లు రెండు శతాబ్దాలపాటు మనదేశాన్ని పాలించడంతో మనలో చాలామందికి ఇంగ్లీసు భాషతో పరిచయమేర్పడింది. చాలామంది అందులో పండితులయ్యారు కూడా. అయినంత మాత్రాన బ్రిటీష్ సంస్కృతి మన వారసత్వమైందా?
సంస్కృతి అంటే భాష కాదు సరికదా, కొందరు చెబుతున్నట్లు అది ఆధ్యాత్మిక సంబంధమైందీ కాదు. అదే అయితే ఆధ్యాత్మిక దృష్టిలేనివాళ్లని సంస్కృతీ విహీనులనవలసి వస్తుంది. అప్పుడు నిరీశ్వరవాదులైన మార్క్స్, ఏంగెల్స్ వారసులైన కమ్యూనిస్టులందరూ సంస్కృతిలేనివాళ్లని చెప్పాల్సి వస్తుంది. అది తప్పు కాదా? ఆధ్యాత్మిక ప్రపంచానికి సంస్కృతిని పరిమితం చేయడం భాషకు మారుగా మతానికి, లేదా, దార్శనికానికి దాన్ని ఓ పర్యాయపదం చేయడమే అవుతుంది.
భాషకు భిన్నమైనట్లే మతానికీ, దార్శనికానికీ సైతం సంస్కృతి భిన్నం. జీవితానికున్న విస్తృతి, దానికున్న వైవిధ్యం, దానిలో ప్రస్ఫుటమవుతూ ఉండే విలక్షణత్వం సంస్కృతికీ ఉంటుంది. అందువల్లనే సంస్కృతిని నిర్వచించడం కష్టం.

అలనాటి దర్శకులు: ఆదుర్తి సుబ్బారావు

తెలుగు చిత్రసీమ కనుగొన్న గొప్ప దర్శకుల్లో ఆదుర్తి సుబ్బారావు ఒకరు. ఆయన డైరెక్ట్ చేసిన వాటిలో నాలుగు సినిమాలు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డులు సాధించాయంటేనే ఆయన ప్రతిభ, సృజన శక్తి ఎలాంటివో అర్థమవుతుంది. 1912లో రాజమండ్రిలో జన్మించిన ఆయన 1954లో అమర్‌నాథ్, శ్రీరంజని, పద్మిని కాంబినేషన్‌తో తీసిన 'అమర సందేశం' చిత్రంతో దర్శకునిగా అరంగేట్రం చేశారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'బైజు బావ్రా' ప్రేరణతో ఈ చిత్రాన్ని ఆయన రూపొందించారు. ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆయనకు వెంటనే అవకాశాలు రాలేదు.
ఎప్పుడైతే అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు ఆయన ప్రతిభను గుర్తించి 'తోడికోడళ్లు' (1957) చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం కల్పించారో, అప్పట్నించీ ఆయన దశ తిరిగింది. శరత్‌చంద్ర చటోపాధ్యాయ నవల 'నిష్కృతి' ఆధారంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించి ఆదుర్తికి మంచి పేరుతో పాటు మంచి అవకాశాల్నీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'మాంగల్య బలం' (1959), 'నమ్మిన బంటు' (1960), 'వెలుగు నీడలు', 'ఇద్దరు మిత్రులు' (1961), 'చదువుకున్న అమ్మాయిలు' (1963), 'మూగ మనసులు', 'డాక్టర్ చక్రవర్తి', 'దాగుడు మూతలు' (1964)' 'సుమంగళి' (1965) వంటి విజయవంతమైన చిత్రాల్ని ఆయన రూపొందించారు. 1965లోనే అంతా కొత్తవాళ్లతో ఆయన డైరెక్ట్ చేసిన తొలి సాంఘిక రంగుల చిత్రం 'తేనె మనసులు' సూపర్‌హిట్టయి ఆయన కీర్తి ప్రతిష్ఠల్ని మరింత ఇనుమడింపజేసింది. ఈ సినిమాతోనే ఘట్టమనేని కృష్ణ హీరోగా పరిచయమై, అనంతర కాలంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. ఆ తర్వాత 'సుడిగుండాలు', 'పూలరంగడు' (1967), 'విచిత్ర బంధం' (1972), 'మాయదారి మల్లిగాడు' (1973), 'గాజుల కిష్టయ్య' (1975) వంటి హిట్లని తీశారు ఆదుర్తి. అక్కినేనితో 'మహాకవి క్షేత్రయ్య' చిత్రాన్ని తీస్తూ 1975 అక్టోబర్ 1న అర్థంతరంగా తనువు చాలించారు. ఆ సినిమాని ఆ తర్వాత సి.ఎస్. రావు పూర్తి చేశారు.
ఆయన చిత్రాల్లో 'నమ్మినబంటు', 'మూగ మనసులు', 'డాక్టర్ చక్రవర్తి', 'సుడిగుండాలు' చిత్రాలు జాతీయ అవార్డుల్ని సొంతం చేసుకున్నాయి.

Thursday, September 29, 2011

కళాఖండం: మాభూమి (1980)

ఒక అపురూపమైన చిత్రం 1980లో వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాట ఇతివృత్తంతో వచ్చిన ఆ సినిమా 'మాభూమి'. ఆ సినిమా విడుదలకు ముందు బిజినెస్ కాలేదు. విడుదలైన మొదటివారంలో థియేటర్లలో జనాలే లేరు. రోజులు గడిచిన కొద్దీ పుంజుకుని జనంతో కిటకిటలాడింది. ఇది అయాచితంగా వచ్చిన విజయం కాదు. ఈ సినిమాలోని గూడ అంజయ్య, సుద్దాల హనుమంతు, దేవీప్రియ పాటలు జనం గుండెల్లో మారుమోగాయి. సంధ్యతో కలిసి ప్రజా గాయకుడు గద్దర్ పాడిన ఆ పాటలు దడదడలాడించాయి. ఆ సినిమాకి సంగీతాన్ని అందించింది సీత.
ఈ సినిమాలో ముఖ్య పాత్రల్ని పోషించింది పెద్ద పేర్లున్న వారు కాదు. ఈ సినిమా నిర్మాత బి. నరసింగరావు స్వతహాగా చిత్రకారుడు. గేయకర్త. విమర్శకుడు, జర్నలిస్టు. చిత్ర నిర్మాణం మీద క్రేజ్ ఉన్న ఉత్తమ అభిరుచులు కలిగిన కళాభినివేశి. "తెలంగాణ సాయుధ పోరాటాన్ని, తదనంతర జీవితాన్ని తెరకెక్కించాలనేది నా చిరకాల వాంఛ. అందుకే ఎన్ని శ్రమదమాదులకోర్చయినా ఈ సినిమా తీయగలిగాను" అని చెప్పారు నరసింగరావు. సినిమాటోగ్రాఫర్‌గా అప్పటికే పేరుపొందిన గౌతం ఘోష్ దర్శకత్వంలో అద్భుతంగా రూపొందింది 'మాభూమి'. తన భార్యతో కలిసి తెలంగాణా జన జీవితంలోని లోతుల్ని తరిచి తరిచి చూసేందుకు నెలల తరబడి ఆ ప్రాంతాల్లో తిరిగాడు గౌతం. సెట్స్ మీదకు వెళ్లేముందు నరసింగరావు, రచయిత ప్రాణ్‌రావు, గౌతం అహోరాత్రాలు స్క్రిప్టుమీద పనిచేశారు. అందుకే అది లోబడ్జెట్ డాక్యుమెంటరీలాగా కాకుండా అందమైన కళాఖండంగా తయారైంది. వర్గభేదం, వయోబేధం, లింగభేదం, ప్రాంతభేదం లేకుండా అన్ని తరగతులవారు అమితంగా ఆ చిత్రాన్ని ఆదరించారని చెప్పారు ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సాయిచంద్.
ఓ విభిన్న అంశాన్ని సృజిస్తూ వచ్చిన ఈ సినిమా సినీ పండితుల అంచనాల్ని తలకిందులు చేస్తూ పండిత పామరుల్ని కూడా ఒకే రీతిగా అలరించడానికి వెనుకనున్న రహస్యమేమిటి? మూస సినిమాలతో విసిగివున్న ప్రేక్షక హృదయాలు మంచి చిత్రం కోసం తపించే తరుణంలో రావడమేనా? అయితే ఇప్పుడూ అదే పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంది. మరో 'మాభూమి' కోసం ప్రేక్ష హృదయాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

న్యూస్: 'దూకుడు'కు అమెరికన్ డైలీ ప్రశంసలు

ఓ భారతీయ చిత్రాన్ని అమెరికన్ పత్రికలు ప్రశంసించాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఓ తెలుగు సినిమాని అక్కడి పత్రికలు మెచ్చుకున్నాయంటే ఆశ్చర్యపడాల్సిందే. ఇప్పుడు మహేశ్-శ్రీను వైట్ల సినిమా 'దూకుడు' అమెరికాలో సృష్టిస్తున్న కలెక్షన్ల ప్రభంజనం చూసి అమెరికన్ పత్రికలు సైతం విస్తుపోతున్నాయి. అక్కడి పేరుపొందిన పత్రికల్లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ - 'దూకుడు', ద బిగ్గెస్ట్ హిట్ యు హావ్ నెవర్ హార్డ్ ఆఫ్ - అంటూ ఓ వ్యాసాన్నే ప్రచురించడం అమెరికాలో తెలుగు సినిమాకి దక్కిన గుర్తింపు, గౌరవంగా భావించవచ్చు. ప్రస్తుతం హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తున్న 'మనీబాల్', 'అబ్డక్షన్స్', 'డాల్ఫిన్స్ టేల్స్'కు దీటుగా టాలీవుడ్‌కి చెందిన 'దూకుడు' సినిమా కలెక్షన్లను సాధిస్తుండటం అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నదని ఆ పత్రిక పేర్కొంది. ఇదివరకు అమెరికాలో ఓ తెలుగు సినిమా ('మగధీర') మూడు నెలల్లో 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం రికార్డు కాగా, ఇప్పుడు 'దూకుడు' చిత్రం కేవలం తొలి మూడు రోజుల్లోనే 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేయడం అనూహ్యమని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

Wednesday, September 28, 2011

ఇంటర్వ్యూ: పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్

పబ్లిసిటీ ఆర్టిస్టుగా మరచిపోలేని సంఘటనలెన్నో 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'సినిమా పోస్టర్'కి ఉండే ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ రంగంలో ఆయనే అత్యంత సీనియర్ పబ్లిసిటీ ఆర్టిస్టు. ఇవాళ చేతితో పనిలేకుండా కంప్యూటర్‌తో సునాయాసంగా సినిమాల డిజైన్లు చేస్తున్నారు. కానీ తన కాలంలో కుంచెతో అద్భుతమైన పోస్టర్లకి ప్రాణం పోసి, ఆ సినిమాలపట్ల ప్రేక్షకుల్లో అనురక్తిని కలిగించిన అపురూప పబ్లిసిటీ చిత్రకారుడు ఈశ్వర్. ఇటు రాసిపరంగా కానీ, అటు వాసిపరంగా కానీ సినీ ఆర్ట్ రంగంలో ఎవరెస్టు శిఖరం, ఎన్నటికీ చెరిగిపోని సంతకం ఈశ్వర్. 45 సంవత్సరాల కాలంలో ఏకంగా 2,500 చిత్రాలకు పనిచేసిన ఆ కళాశిల్పి ఇటీవలే తన జీవితానుభవాలతో పాటు, తాను గీసిన సినీ బొమ్మలతో 'సినిమా పోస్టర్' అనే పెద్ద పుస్తకాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా  ప్రత్యేకంగా సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

నా కెరీర్‌లో నేను పనిచేసిన సుమారు రెండు వేల పైచిలుకు సినిమాల ప్రతిఫలంలో నాకు దక్కింది మూడవ వంతు కూడా లేదు. నాకే కాదు. ప్రతి సినీ జీవికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అందరి విజయం వెనుక ఈ రహస్యం దాగి ఉంటుంది. డబ్బు కంటే అందరి మన్ననలూ పొందడం ముఖ్యం. ఆయా కంపెనీలకు పర్మినెంట్ టెక్నీషియన్‌గా సాగిపోవడం ఇంకా ముఖ్యం. ఆ రకంగా ఇవాళ నేను సాధించిన దానికి ఎంతో ఆనందంగా ఉన్నా.
'సినిమా పోస్టర్'కి అదే ప్రేరణ
ఒక రోజున సేతు అనే తమిళ నటుడు ఆమ్‌స్టర్‌డామ్ (నెదర్లాండ్స్)కి చెందిన ఎడో బౌమన్ అనే వ్యక్తిని తీసుకుని నా వద్దకు వచ్చాడు. తాను బాలీవుడ్ సినీ పోస్టర్స్ మీద పరిశోధన చేస్తున్నానని బౌమన్ చెప్పాడు. హిందీ చిత్రసీమలోని అనేకమంది నిర్మాతల్నీ, పోస్టర్ డిజైనర్లనూ కలిశాడు. అనేక హిందీ సినిమాల పోస్టర్లని సేకరించాడు. వాటిలో నేను చేసిన పోస్టర్లు చాలానే ఉన్నాయి. మూడు గంటల పాటు నన్ను ఇంటర్వ్యూ చేశాడు బౌమన్. అతను సేకరించిన వివరాలతో ఆ తర్వాత లండన్‌లోనూ, లాజ్ ఏంజిల్స్‌లోనూ ఉన్న టాస్‌చెన్ పబ్లికేషన్స్ సంస్థ 'ఆర్ట్ ఆఫ్ బాలీవుడ్' అనే పుస్తకం తెచ్చింది. బౌమన్ నన్ను కలవడం నాకు స్ఫూర్తినిచ్చింది. మన పోస్టర్ల మీద విదేశీయులు సైతం పుస్తకాలు తెస్తుంటే మన పోస్టర్ల మీద మనమెందుకు ఓ పుస్తకం రాయకూడదనిపించింది. అలా మూడేళ్ల కష్టంతో 'సినిమా పోస్టర్' తెచ్చా. 

మామూలు శ్రమకాదు
దీని కోసం నిజంగా ఎంతో శ్రమించా. పుస్తకాన్ని ఎలా తీసుకు రావాలి? వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఆర్ట్ వర్క్ ఏదీ నా వద్ద లేదు. అప్పుడు వాటిని వెతకడం ప్రారంభించా. నా వద్ద పనిచేసిన 52 మంది పబ్లిసిటీ ఆర్టిస్టుల్ని సంప్రదించా. వారిలో నలుగురైదుగురు నేను వేసిన పోస్టర్లనీ, ఆర్ట్ వర్క్‌నీ తీసుకొచ్చి ఇచ్చారు. అయినా 45 ఏళ్ల కాలంలో నా పనిలో నాకు లభ్యమైంది కేవలం 5 శాతం మాత్రమే. నేను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల సినిమాలకే కాక ఒరియా, బెంగాలీ, అస్సామీ చిత్రాలకూ పనిచేశా. అన్నీ కలిపి సుమారు 2500 సినిమాలకు పనిచేశా. కానీ నాకు వాటిలో 1900 సినిమాలే దొరికాయి. నా జీవిత కథతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఆర్టిస్టులతో పాటు దక్షిణ, ఉత్తర భారతదేశంలో పేరుపొందిన ఆర్టిస్టుల జీవిత కథలు సేకరించి వారి గురించి రాశా. పద్నాలుగు మంది ప్రఖ్యాత తెలుగు చిత్రకారుల గురించి అధ్యయనం చేసి రాశా. సినీ ఇండస్ట్రీలో నేను అతి సన్నిహితంగా మెలిగిన మహోన్నత వ్యక్తులతో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకున్నా.

మరచిపోలేని సంఘటనలు
1970లలో ఓ దీపావళికి ఆరుగురు పేరుపొందిన తమిళ హీరోలు.. ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమిని గణేశన్, జయశంకర్, రవిచంద్రన్, శివకుమార్ సినిమాలు విడుదలయ్యాయి. వాటన్నింటికీ నేనే పబ్లిసిటీ ఆర్టిస్టుని. ఇలా అందరు హీరోల చిత్రాలకు ఒకే పబ్లిసిటీ ఆర్టిస్ట్ డిజైన్ చేయడం అదివరకే కాదు, ఆ తర్వాత కూడా ఎప్పుడూ జరగలేదు. అది నా అదృష్టం. తెలుగు చిత్రసీమ వజ్రోత్సవ వేడుకల్లో సినీ ప్రముఖుల నడుమ అశేష జన సందోహంలో నిష్ణాతులతో పాటు నాకూ గౌరవ పురస్కారాన్ని అందించడం నేనెన్నడూ మరువలేని సంఘటన. ఒకనాడు ఏకాకిగా బిక్కుబిక్కుమంటూ దిక్కుతోచని స్థితిలో పాండీ బజార్‌లో తిరిగిన నన్ను ఇవాళ సినీ జగత్తులో ఏకైక సీనియర్ పబ్లిసిటీ ఆర్టిస్టుగా గుర్తించి వజ్రోత్సవ వేడుకల్లో సెలబ్రిటీగా నన్ను గౌరవించడంతో నా శ్రమ చరితార్థమైందనిపించింది. అంతకుముందు 1974లో డిస్టిబ్యూటర్లందరూ కలిసి బెజవాడలో అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా చేసిన ఘన సన్మానాన్ని కూడా నేను మర్చిపోలేను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదొరై 9 అడుగుల నిలువెత్తు ఆయిల్ పెయింటింగ్ వేసే అవకాశం రావడం నాకు లభించిన భాగ్యంగా భావిస్తా. దాన్ని వేసే అవకాశం కల్పించింది అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి. అది వేయడానికి నెల రోజుల సమయమిచ్చారు. ఈ మధ్యలో నేనెంతవరకు ఆ బొమ్మ వేశానో చూడ్డానికి కరుణానిధి స్వయంగా రెండుసార్లు మా ఇంటికి రావడం మరచిపోలేని అనుభూతి. ఆ పెయింటింగుని రాజాజీ హాలులో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆవిష్కరించడం నా జీవితంలో మరో గొప్ప ఘటన.

తొలి దర్శకుణ్ణి
'అయినవాళ్లు' సినిమాకి అనుకోకుండా దర్శకత్వం వహించా. భీమలింగం అనే అతన్ని దర్శకత్వం నుంచి తప్పించడంతో దానికి కథ ఇచ్చిన నేనే బలవంతంగా డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల నాకు మరో దారి లేకపోయింది. అంతా కొత్తవాళ్లతో తీసిన ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడు దాని ప్రింటు కూడా దొరకడం లేదు. ఏదేమైనా తెలుగులో డైరెక్టర్ అయిన తొలి పబ్లిసిటీ ఆర్టిస్టుని నేనే. ఇతర భాషల్లో చూసుకుంటే నాకంటే ముందు మలయాళంలో పబ్లిసిటీ ఆర్టిస్టు పి.ఎన్. మీనన్ డైరెక్టర్ అయ్యాడు.

అక్కినేని గ్రూప్ అనే ముద్ర
నటుల్లో శోభన్‌బాబు నాతో సన్నిహితంగా మెలిగేవారు. అలాగే కృష్ణ కూడా. వాళ్ల అత్యధిక సినిమాలకి నేనే ఆర్టిస్టుని. రామారావు గారి సొంత సినిమాలకు పనిచేయకపోయినా ఆయన నటించిన 50 సినిమాలకి పనిచేశా. అయితే అక్కినేనిగారితో సినిమాలు తీసిన కంపెనీలన్నీ నాతో పనిచేయించుకోవడంతో నా మీద ఏఎన్నార్ గ్రూప్ అనే ముద్రపడింది. సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు, నేను ఒకే ఊరినుంచి ఈ రంగానికి వచ్చాం. ఆయనకంటే నేను ఏడేళ్ల ముందు వచ్చా. ఆయన తీసిన 150 సినిమాల్లో 82 సినిమాలకి పబ్లిసిటీ ఆర్టిస్టుని నేనే. నాతో పాటు గంగాధర్ కూడా ఈ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే మేమెప్పుడూ ఒకరికొకరం పోటీ అనుకోలేదు.

అదే పెద్ద అవార్డు
నేనేనాడు అవార్డుల కోసం ప్రాకులాడలేదు. ఈ 50 సంత్సరాల కాలంలో చిత్రసీమ నా పట్ల చూపిన ఆదరాభిమానాలకు మించిన అవార్డు మరొకటి లేదు. సినీ అవార్డు అనేది ఓ కథను సెల్యులాయిడ్ మీదకు తీసుకురావడానికి శ్రమించిన నటీనటులు, సాంకేతిక వర్గానికి సంబంధించినది. పబ్లిసిటీ అనేది దానికి ఎంతవరకు వర్తిస్తుంది? సినిమా పూర్తయి తొలి కాపీ వచ్చాక మా అవసరం ఏర్పడుతుంది. ఇది నిర్మాణానికి అంటీ అంటనట్లుండే శాఖ. అందుకేనేమో దీనికి అవార్డులు ప్రకటించలేదు. అయినా చిత్ర పరిశ్రమలోని 24 శాఖల్లో పబ్లిసిటీని చేర్చడం సంతోషమే.

'సాక్షి' నుంచి 'దేవుళ్లు' దాకా
1967లో బాపు దర్శకత్వం వహించిన తొలి సినిమా 'సాక్షి'తో ప్రారంభమైన నా సినీ ప్రస్థానం 2000వ సంవత్సరంలో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన 'దేవుళ్లు' సినిమాతో ముగిసింది. ఆ తర్వాత నేనే సినిమాకీ పనిచేయలేదు. నన్ను పరిశ్రమ వద్దనుకోలేదు. నేనే కావాలని దూరంగా ఉన్నా. ఒక ఉప్పెనలా కంప్యూటర్ సిస్టమ్ ఈ రంగంలోకి ప్రవేశించింది. మాన్యువల్స్‌లో ఎన్నో ప్రయోగాలు చేసిన మా తరం ఇప్పుడు ఈ కొత్తతరంలో పోటీకి దిగడం సరికాదనిపించింది. అలా అని నేను పూర్తిగా ఈ రంగానికి దూరం కాలేదు. పాత సినిమాలకి కొత్త పోస్టర్లు వేస్తూ వస్తున్నా. మా తరంలో మమ్మల్ని పబ్లిసిటీ ఆర్టిస్టులన్నారు. ఇప్పుడు పబ్లిసిటీ డిజైనర్స్ అంటున్నారు. నేడు ఈ శాఖకు 'ఆర్ట్'తో సంబంధంలేకుండా పోయింది. చెయ్యి తిరిగిన ఆర్టిస్టయితేనే కాని మా కాలంలో నెట్టుకు రాలేకపోయేవాళ్లం. ఇప్పుడు అన్ని వసతులు కంప్యూటర్‌లో ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేట్ చేసే పరిజ్ఞానం సంపాదిస్తే చాలనే పరిస్థితి ఉన్నప్పుడు నాలాంటి వాడు దూరంగా ఉండటమే మంచిదని నా గౌరవాన్ని నేను దక్కించుకున్నా. సాంకేతిక నైపుణ్యం పెరగడం, కొత్త కొత్త టెక్నాలజీ రావడం మంచిదే. కంప్యూటర్‌తో అద్భుతాలే చేయొచ్చు. హాలీవుడ్ సినిమాలకి చేస్తున్న పబ్లిసిటీ డిజైన్ల ప్రమాణాల్ని మనవాళ్లు అందుకోవాలి.


న్యూస్: సినిమా పాటల ప్రియులకు విలువైన కానుక 'మరో నూట పదహార్లు'

తెలుగు సినిమా ప్రియులు, సంగీత ప్రియులు పదిలంగా చదివి, దాచుకోదగ్గ అత్యుత్తమ పుస్తకం 'మరో నూట పదహార్లు'. 1940-85 మధ్య కాలంలో వచ్చిన వందలాది సినిమాల్లోని వేలాది పాటల్లోంచి సాహిత్యమూ, సంగీతమూ నువ్వా నేనా అని పోటీపడిన 116 పాటల విశేషాలతో భమిడిపాటి రామగోపాలం (భరాగో) తీసుకొచ్చిన పుస్తకమిది. 1981లో ఆయనే వెలువరించిన '116 గొప్ప తెలుగు సినిమా పాటలు' పుస్తకానికి ఇది కొనసాగింపు. ఈ పుస్తకంలో సినిమాలు 116 అయినప్పటికీ 'సాంగ్ ఐటంస్' (పాటలు, పద్యాలు, శ్లోకాలు, అష్టపదులు, బుర్రకథలు, యక్షగానాలు, దండకాలు, తత్త్వాలు) అన్నీ కలిపి 150 దీనిలో చేరాయి. ఈ పాటలని ఎంపిక చేయడంలో భరాగో ముదుసలి వయసులో చాలా శ్రమకోర్చారు. ఎంపిక చేసిన పాటల ట్రాకులు వాడుకోడానికి హక్కుల కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా పట్టు విడవకుండా ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఇందుకు ఆయనకి అనేకమంది హితులు, స్నేహితులు సహకరించారు. వారిలో విజయవాడకు చెందిన నేమాని సీతారాం ముఖ్యులు.
ఈ పుస్తకంలో 1940లో వచ్చిన 'సుమంగళి'లోని 'ప్రేమమయమీ జీవనము' పాట మొదలుకుని 1985లో వచ్చిన 'మయూరి'లోని 'అందెలు పిలిచిన' పాట వరకు ఉన్నాయి. ఈ పాటల పూర్తి పాఠంతో పాటు వాటికి సంబంధించిన విశేషాల్నీ సాధ్యమైనంతవరకు అందించారు భరాగో. కొన్ని సినిమాల కథాంశాలూ తెలియజేశారు. 'భాగ్యలక్ష్మి' ద్వారా మరాఠీ నటి కమలా కోట్నిస్, గాయనిగా రావు బాలసరస్వతి పరిచయమైన సంగతి మనం తెలుసుకుంటాం. ఇలాంటివే మనకి తెలీని పలు సంగతుల్ని ఈ పుస్తకం ద్వారా తెలియపర్చారు రచయిత. ప్రస్తుతం భరాగో మన మధ్య లేకపోయినా (2010 ఏప్రిల్లో మరణించారు) తన రచనలు, '116 గొప్ప తెలుగు సినిమా పాటలు', 'మరో నూట పదహార్లు' ద్వారా ఆయన చిరంజీవిగానే ఉంటారు.

Tuesday, September 27, 2011

న్యూస్: హీరోయిన్‌గా ఫెయిలైన చిన్న జేజమ్మ!

దివ్య అంటే ఎవరూ అంత త్వరగా గుర్తుపట్టక పోవచ్చు. కానీ 'చిన్న జేజమ్మ' అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అవును. 'అరుంధతి'లో చిన్నప్పటి అనుష్కగా నటించి భలేగా ప్రేక్షకుల్ని మెప్పించిన ఆ బేబీ దివ్య మూడేళ్లు తిరిగేసరికి హీరోయిన్ అవతారమెత్తేసింది. అందుకే 'నేను నాన్న అబద్ధం' సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకులు ఒకింత ఆసక్తిని ప్రదర్శించారు. అయితే ఆ ఆసక్తికి తగ్గట్లుగా సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేక పోతోంది. తొలివారం ఆంధ్ర, సీడెడ్‌లలో ఫర్వాలేదనిపించేట్లు ఉన్న కలెక్షన్లు నైజాం ఏరియాలో బాగా డల్‌గా ఉన్నాయి. హీరోయిన్ పాత్రలో దివ్య ఆకట్టుకోలేకపోవడం ఈ సినిమాకి మైనస్‌గా మారింది. ఇప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన దివ్య అందాల ప్రదర్శన కూడా ఎవర్నీ మెప్పించలేక పోతోంది. ట్రాన్స్‌పరంట్ బట్టల్తో బీచ్‌లలో ఆమె పరుగులు తీస్తుంటే ఎవరూ ఎంజాయ్ చేయలేకపోయారు. అయితే ఆమె అమాయక చూపులు, మొహంలో లేతదనం వారిని ఆకట్టుకోలేక పోలేదు. కానీ హీరోయిన్ పాత్ర పోషణలో ఆమె విఫలమైందనడంలో సందేహం లేదు. ఇళ్లల్లో పెద్దల ప్రేమ లభించకపోవడం, అభద్రతా భావం వల్ల అబ్బాయిలతో అమ్మాయిలు లేచిపోతున్నారని ఈ కథ చెబుతుంది. ఈ కథని చెప్పడంలో దర్శకుడు గోవింద్ వరహ కల్పించిన పాత్రలకి తగిన తారాగణం లేకపోవడం వల్ల అంటే మిస్ కేస్టింగ్ వల్ల కథ అనాసక్తంగా తయారైంది. హీరో పాత్ర చేసిన ఆనంద్ ('100% లవ్'లో సెకండ్ హీరో) మాత్రం తన అభినయంతో మెప్పించాడు. దివ్య ఇంకో రెండేళ్లపాటైనా విరామం తీసుకుని నటిస్తే బాగుంటుందని చెప్పొచ్చు.

Monday, September 26, 2011

న్యూస్: 'బెజవాడ'తో టాలీవుడ్‌పై అమల కన్ను

ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమా 'మైనా' (తెలుగులో ఇది 'ప్రేమఖైదీ'గా వచ్చింది)తో పరిచయమై, టైటిల్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్న కేరళ కుట్టి అమలా పాల్ టాలీవుడ్‌లో తొలి సినిమాతోటే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ సినిమా 'బెజవాడ'. రాంగోపాల్‌వర్మ నిర్మాణంలో తయారవుతున్న ఈ సినిమాలో నాగచైతన్య జోడీగా నటిస్తోంది అమల. నాగచైతన్య సవతితల్లి పేరు అమల కావడం ఇక్కడ యాదృచ్ఛికం. కాగా 'బెజవాడ' సినిమా ఒకప్పుడు బెజవాడని తమ ఆధిపత్య పోరాటంలో భాగంగా చేసిన వంగవీటి, దేవినేని కుటుంబాల కథగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో వంగవీటి రంగా, రత్నకుమారి ప్రేమ కోణం కూడా ఉంది. అంటే ఇప్పుడు నాగచైతన్య, అమల చేస్తున్న పాత్రలు రంగా, రత్నకుమారి పాత్రల్ని పోలి ఉంటాయని చెప్పుకుంటున్నారు. వారి మధ్య రెండు డ్యూయెట్లని కూడా తీస్తున్నారు. అది కూడా స్విట్జర్లాండ్, ఇటలీ, ఒమన్ వంటి విదేశీ లొకేషన్లలో. సెప్టెంబర్ 15 నుంచి తీస్తున్న ఈ పాటల్ని 25కి పూర్తిచేస్తారు. వివేక్‌కృష్ణ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్టయితే అమల తమిళంతో పాటు తెలుగులోనూ బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయి.

బిగ్ స్టోరీ: 'నాయిక' రంగుల జీవితం!


చిత్రసీమ అంటే రంగుల ప్రపంచమని అందరికీ తెలుసు. ఇక్కడి తారల జీవితాలు ఎలా ఉంటున్నాయో, తరచూ చూస్తూనే ఉన్నాం. వెండితెరపై సూపర్‌స్టార్లుగా వెలిగిన తారామణుల్లో కొంతమంది జీవితాలు అర్ధంతరంగా ఆగిపోతే, ఎంతోమంది జీవితాలు దయనీయంగా ముగిసిపోయాయి. అలాంటి తారల నిజ జీవితాలు వెండితెరపై ఆవిష్కృతమైతే... వాటికంటే రసభరిత చిత్రాలూ, హృదయాల్ని ద్రవింపజేసే కథలూ మరేముంటాయి! అయితే అలాంటి వాస్తవిక గాథా చిత్రాలు తెలుగులో రావడం అరుదు. ఇతర భాషల్లోనే అలాంటి చిత్రాలు రూపొందుతుండటమనేది వాస్తవిక దృశ్యం. ఇవాళ అలాంటి రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చలకూ, విమర్శలకూ తావిస్తున్న హిందీ చిత్రం 'ద డర్టీ పిక్చర్' కాగా, మరొకటి మలయాళంలో రూపొందుతున్న 'నాయిక'
శృంగార తారగా ఓ తరాన్ని తన ఒంపుసొంపులు, వొంటి విరుపులతో ఊపేసిన మత్తుకళ్ల సుందరి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ద డర్టీ పిక్చర్'. ఇందులో స్మిత పాత్రని విద్యాబాలన్ పోషిస్తుండటం ఓవైపు ఆసక్తినీ, మరోవైపు వివాదాన్నీ రేపుతోంది. ఐటం సాంగ్స్‌లో నర్తించడం ద్వారానే కాక, వ్యాంప్ పాత్రలతోనూ స్మిత ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ శృంగార కెరటం కేవలం 36 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకుని, అర్ధంతరంగా తనువు చాలించడం అందర్నీ కలచివేసింది. అలాంటి ఆమె జీవితాన్ని డైరెక్టర్ మిలన్ లూథ్రియా తెరకెక్కిస్తుండగా, తల్లీకూతుళ్లు శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2 స్మిత జయంతికి ఈ సినిమాని విడుదల చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్మిత జీవితంలోని ముగ్గురు పురుషుల పాత్రల్ని వాళ్లు చేస్తున్నారు. స్మిత రూపానికీ, విద్యా బాలన్ ఆకారానికీ అసలు పోలికే లేదనీ, స్మితకి ప్రధానాకర్షణ అయిన మత్తు కళ్లు కానీ, వంపుసొంపుల విన్యాసాలు కానీ విద్యాబాలన్‌లో లేవనీ, అలాంటప్పుడు ఆమె ఎలా ఆ పాత్రకి న్యాయం చేస్తుందనే వ్యాఖ్యలు విమర్శకుల నుంచి వస్తున్నాయి. అయితే వీటినేమీ పట్టించుకోకుండా ఏక్తా కపూర్, మిలన్ లూథ్రియా తమ పని తాము చేసుకుపోతున్నారు. అన్ని ప్రశ్నలకీ తమ సినిమానే సమాధానం చెబుతుందనేది వారి అభిప్రాయం. ఈ సినిమా స్క్రిప్టుని రజత్ అరోరా సమకూర్చాడు.
ఇక దక్షిణాదిన ఆసక్తిని కలిగిస్తున్న మరో చిత్రం 'నాయిక'. మలయాళంలో ఈ సినిమాని జయరాజ్ రూపొందిస్తున్నాడు. కేవలం రాష్ట్ర స్థాయి అవార్డుల్నే కాక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్న జయరాజ్ తీస్తున్నందువల్లే 'నాయిక' పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగు తార అయివుండీ, మలయాళ సినిమాల ద్వారానే మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా 'ఊర్వశి' అవార్డును పొందిన శారద జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారని ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఇది శారద జీవితంపై తీస్తున్నట్లుగానే వార్తలు చలామణీ అవుతున్నాయి. ఈ వర్తల్ని శారద స్వయంగా ఖండించారు. అయితే ఈ చిత్రంలో ఆమె స్వయంగా తన నిజ జీవిత పాత్రను చేస్తుండటం విశేషం. ప్రధాన కథలో ఆమె పాత్ర కూడా వస్తుంది. మరైతే ప్రధాన కథ ఎవరిది? ఒకప్పుడు మలయాళ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపి, అర్ధంతరంగా సినిమాల నుంచి మాయమైన ఓ తార జీవితం ఈ చిత్రం. ఆ తార ఎవరంటే... షీలా! తెలుగులోనూ ఆమె నటించింది. అదీ అల్లాటప్పా హీరోలతో కాదు. 'నేనే మొనగాణ్ణి'లో ఎన్టీఆర్‌తో, 'విచిత్ర కుటుంబం'లో శోభన్‌బాబుతో నటించింది షీలానే. అందాలరాశి అయిన ఆమె అకస్మాత్తుగా సినిమాల నుంచి విరమించుకుంది. అలాంటి ఆమె పాత్రని తెరమీద ఆవిష్కరిస్తున్న తార పద్మప్రియ. ఆమె కూడా తెలుగులో ఆర్పా పట్నాయక్ సోదరిగా 'శీను వాసంతి లక్ష్మి'లో, చంద్రసిద్ధార్థ్ రూపొందించిన 'అందరి బంధువయ'లో శర్వానంద్ జోడీగానూ నటించింది. 'నాయిక'లో జయరాం హీరోగా నటిస్తుంటే, మమతా మోహన్‌దాస్ ఓ కీలక పాత్రను చేస్తోంది. అర్ధంతరంగా మాయమైన 'నాయిక'ను అన్వేషించే పాత్రలో ఆమె కనిపించబోతోంది.
తెలుగులో ఇదివరకు తారల జీవితాలు ఎలా ఉంటాయో దాసరి నారాయణరావు రూపొందించిన 'శివరంజని', వంశీ డైరెక్ట్ చేసిన 'సితార' సినిమాలు చూపించాయి. అయితే ఇవి నిజ జీవిత కథలు కావు. 'శివరంజని'లో టైటిల్ పాత్ర చేసిన జయసుధ జీవితంలోని కొన్ని ఘట్టాలున్నాయని అంటారు కానీ ఆ సినిమా పూర్తిగా ఆమె కథైతే కాదు. ఇక 'సితార' చిత్రానికి ఆధారం వంశీ స్వయంగా రాసిన 'మహల్లో కోయిల' నవల. ఆ మధ్య వర్థమాన తార ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించిన తర్వాత ఆమె పేరుమీద సత్యారెడ్డి ఓ సినిమా తీశారు కానీ అది ఆమె జీవిత కథ కాదు. ఓ సంఘటనని ఆధారం చేసుకుని రూపొందించిన సినిమానే.
ఏదేమైనా పైకి కనిపించినట్లు సినీ తారల జీవితాలు రంగుల మయం కాదనీ, కలల వెన్నంటే కష్టాలూ, కన్నీళ్లూ, వ్యధలూ ఉంటాయనీ 'ద డర్టీ పిక్చర్', 'నాయిక' చిత్రాలు మనకి చూపించబోతున్నాయి. కాకపోతే వాటిలో హిందీ సినిమా ఎక్కువ కమర్షియల్ కోణంలో తయారవుతుంటే, మలయాళ చిత్రం వాస్తవికతే ప్రధానంగా తయారవుతోంది. ప్రేక్షకులు వాటికి ఎలా స్పందిస్తారో చూడాలి.

న్యూస్: ఆసక్తి రేపుతున్న మహేశ్, సుకుమార్ కాంబినేషన్



మహేశ్, శ్రీను వైట్ల తొలి కాంబినేషన్‌లో వచ్చిన 'దూకుడు' సినిమా రికార్డు కలెక్షన్ల వైపు దూసుకుపోతుండగా, మరో డైరెక్టర్‌తో మహేశ్ తొలి కాంబినేషన్ సినిమా విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. ఆ కాంబినేషన్ సుకుమార్‌తో. పూరి జగన్నాథ్‌తో చేస్తున్న 'బిజినెస్‌మేన్' తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో చేయడానికి మహేశ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో ఉన్న నిజాన్ని సుకుమార్ ధృవీకరించాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టుని అతను సిద్ధం చేశాడు. 'బిజినెస్‌మేన్' 2012 జనవరిలో విడుదల కాగానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని కూడా 'దూకుడు' నిర్మాతలే తీయనున్నారనేది సమాచారం. సుకుమార్‌కి అత్యంత ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి పనిచేసే అవకాశాలున్నాయి. సుకుమార్ విషయానికి వస్తే సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్న ఓ హీరోతో పనిచేయడం అతడికి ఇదే తొలిసారవుతుంది. ఇదివరకు అతను అల్లు అర్జున్, రాం, నాగచైతన్యలను డైరెక్ట్ చేశాడు. ఆ ముగ్గురిలో స్టార్ ఇమేజ్ ఉన్నది అర్జున్‌కే. 'ఆర్య'తో అతడికి ఆ ఇమేజ్ తెచ్చింది సుకుమార్ అనేది గమనార్హం. ఇప్పుడు మహేశ్‌ని అతడు డైరెక్ట్ చేసే సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అతడి స్క్రిప్టుల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మేధావితనం కూడా ఉంటుందనేది నిజం. అంటే ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే తీరులో అతడు హీరో పాత్రని మలుస్తుంటాడు. మరి మహేశ్‌ని అతడు ఎలా చూపిస్తాడు? మహేశ్‌లోని నటుణ్ణి ఎలా ఉపయోగించుకుంటాడు? అనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

Sunday, September 25, 2011

న్యూస్: వెయ్యిమంది అంధులు నటిస్తున్న 'వి'

స్లీప్‌లెస్ డ్రీమ్స్ పతాకంపై వివేక్ దర్శకత్వంలో పి. మహేశ్ నిర్మిస్తున్న చిత్రం 'వి'. ఈ సినిమాకి సంబంధించిన విశేషం - వెయ్యిమంది పైగా అంధులు ఇందులో నటించబోతున్నారు. వీరిలో 40 మంది ప్రధాన పాత్రధారులు. దర్శకుడు వివేక్ ఈ సంగతి తెలిపారు. "ప్రపంచంలో పూర్తిగా అంధులతోటే నిర్మించిన చిత్రం ఇంతవరకూ లేదు. ఆ రికార్డుని 'వి' సొంతం చేసుకోబోతోంది. అయితే సినిమాలో వాళ్లు అంధులుగా కాకుండా సాధారణ వ్యక్తులుగా నటించబోతున్నారు. అందుకే అక్టోబర్ 15న జరిగే షూటింగ్ ప్రారంభోత్సవానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులు హాజరు కాబోతున్నారు. 'ముందుగా ప్రయాణం ప్రారంభించండి. హాయిగా ప్రయాణించి, సుఖంగా ఇంటికి చేరండి' అనే పాయింట్‌తో ఈ చిత్ర కథ నడుస్తుంది. ట్రాఫిక్‌లో తలెత్తే అనేక ఇబ్బందుల్ని ప్రధానంగా చూపిస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయంతో సుమారు 400 మంది అంధులకు ఆపరేషన్ చేసి, కళ్లు తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తాం'' అని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి మార్ఫి రచన చేస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా తెలుగులో చేస్తున్న ఈ బృహత్ ప్రయత్నం సక్సెస్ కావాలని ఆశిద్దాం.

Saturday, September 24, 2011

ప్రివ్యూ: రెబల్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రెబల్'లో ప్రధాన హీరోయిన్‌గా అనుష్క ప్లేస్‌లో తమన్నా చేస్తున్న సంగతిని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెండు షెడ్యూళ్లు చేసే వరకు హీరోయిన్‌గా అనుష్క నటించింది. అయితే డైరెక్టర్ రాఘవ లారెన్స్‌తో ఆమెకు విభేదాలు రావడంతో ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. ఈ విషయంలో అనుష్క తరపున హీరో నాగార్జున సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఫిలింనగర్‌లో ప్రచారంలోకి వచ్చింది. ఇందులో నిజమెంతున్నా అనుష్క తప్పుకుని ఆమె స్థానంలో తమన్నా రావడమనేది నిజం. రెండో హీరోయిన్‌గా పొడుగుకాళ్ల సుందరి దీక్షా సేథ్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌తో పాటు వైజాగ్, బ్యాంకాక్‌లోనూ జరుగుతోంది. ఈ సినిమాలో తొలిసారిగా ప్రభాస్ తండ్రిగా కృష్ణంరాజు నటిస్తుండటం విశేషం.
"ప్రభాస్, తమన్నా తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ప్రభాస్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరచిపోలేం. ఆయన కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ ఫిల్మ్. లారెన్స్ ఏ విషయంలోనూ రాజీపడకుండా కచ్చితంగా సూపర్‌హిట్ తీయాలన్న పట్టుదలతో ఈ చిత్రం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. టైటిల్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ సబ్జెక్టుతో 'రెబల్' రూపొందుతోంది'' అని చెప్పారు శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జె. భగవాన్, జె. పుల్లారావు.
ఈ సినిమాలో తన రూపం వైవిధ్యంగా ఉంటుందని హీరో ప్రభాస్ తెలిపాడు. "టైటిల్‌కు తగ్గట్లుగా ఈ సినిమా స్టైలిష్‌గా, మాస్‌గా ఉంటుంది. షూటింగ్ చేస్తున్నప్పుడే మంచి కిక్ ఇస్తున్న ఈ చిత్రాన్ని లారెన్స్ అసాధారణంగా తీస్తున్నాడు'' అని ఆయన చెప్పాడు.
బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, కెల్లీ దోర్జీ, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, అలీ, చలపతిరావు, జయప్రకాశ్‌రెడ్డి, సుప్రీత్, జీవా తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, ఫైట్స్: రాం-లక్ష్మణ్, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, కథ, కొరియోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్.

న్యూస్: సంచలనాలకి సిద్ధం 'సెవెన్త్ సెన్స్'!

సూర్య, మురుగదాస్ కాంబినేషన్‌లో మరో సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అసాధారణంగా! ఇప్పుడు ''సెవెన్త్ సెన్స్' విషయంలో అలాంటి అంచనాలే నెలకొన్నాయి. ఇదివరకు ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'గజిని' సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. మొదట తమిళంలో, తర్వాత తెలుగులో ఘన విజయం సాధించిన ఆ సినిమా ఆ తర్వాత అమీర్‌ఖాన్ హీరోగా హిందీలో రీమెక్ అయ్యి బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సూర్య, మురుగదాస్ కలిసి 'సెవెన్త్ సెన్స్'ని సృష్టించారు. తమిళంలో ఈ సినిమా పేరు '7ఆం అరివు'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య మూడు భిన్న గెటప్పుల్లో కనిపించనున్నాడు. తెలుగు వెర్షన్‌కి 'చూడని అవతారం' అనే ట్యాగ్‌లైన్‌ని ఉపయోగిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ అధినేత బి. సుబ్రమణ్యం అందిస్తున్నాడు. సూర్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ అంటే సుమారు 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణమవుతోంది.
"
ఎనిమిది నెలలు రిసెర్చ్ చేసి ఈ చిత్రకథ తయారుచేశాను. 'గజని' కంటే నాలుగైదు రెట్లు బాగుంటుంది. సినిమాలో ప్రారంభంలో వచ్చే పది నిముషాల కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం" అని మురుగదాస్ తెలిపాడు. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి స్క్రిప్ట్‌తో ఇంతవరకు సినిమా రాలేదనీ, 'గజిని' తర్వాత అంతకంటే బెటర్ స్క్రిప్ట్ కోసం మురుగదాస్ శ్రమించి 'సెవెన్త్ సెన్స్'ని తయారుచేశాడనీ సూర్య చెప్పాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం.. 'గజిని'కి మ్యూజిక్ అందించిన హారిస్ జయరాజ్ ఈ సినిమాకీ సంగీత బాణీలు సమకూర్చాడు. అటు తమిళ్, ఇటు తెలుగులో సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలని సంకల్పించారు.
జానీ ట్రి గుయేన్, అభినయ, అవినాశ్, గిన్నిస్ పక్రు, అశ్విన్ కాకుమాను, ధన్య బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా గొప్పగా వుంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా ఓపెనింగ్స్ దక్షిణాదిలో 'రోబో' ఓపెనింగ్స్‌ని మించి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఆ సినిమా బాక్సాఫీసు రికార్డుల్ని అధిగమించే అవకాశం ఈ సినిమాకి ఉటాయని చాలామంది నమ్ముతున్నారు.

న్యూస్: నిందని చెరిపేసుకున్న శ్రీను వైట్ల

పెద్ద హీరోతో హిట్లివ్వలేక పోతున్నాడనే అపవాదుని ఎత్తకేలకు 'దూకుడు'తో అధిగమించాడు శ్రీను వైట్ల. 'దూకుడు'కి ముందు అతను చిరంజీవితో 'అందరివాడు', నాగార్జునతో 'కింగ్', వెంకటేశ్‌తో 'నమో వెంకటేశ' సినిమాల్ని డైరెక్ట్ చేశాడు. వీటిలో 'అందరివాడు' కేవలం కొందరివాడిగానే మిగలగా, 'కింగ్' పాక్షికంగానే టైటిల్‌ని జస్టిఫై చేయగలిగాడు. ఇక 'నమో వెంకటేశ' అయితే బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. పైగా ఈ సినిమాలో వెంకటేశ్‌ని మరీ జోకర్‌గా చూపించడం విమర్శలకి తావిచ్చింది కూడా. ఈ నేపథ్యంలో మహేశ్ వంటి సూపర్‌స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడంతో స్క్రిప్టు విషయంలో చాలా జాగ్రత్తపడ్డాడు శ్రీను. మహేశ్‌కి మాస్, క్లాస్ - రెండు వర్గాల్లో ఉన్న ఇమేజ్‌కి, తన స్టైల్ కామెడీ టచ్ ఇవ్వడంలో అతను తెలివిగా వ్యవహరించాడు. మహేశ్ అంటే ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాల్ని కోరుకుంటారు కాబట్టి అలాంటి సీన్లని పెడుతూనే, అతని కేరక్టర్లో వినోదాన్ని జోడించాడు. ఆఖరికి హీరోయిన్‌తో అతడి సన్నివేశాలు సైతం వినోదాన్ని అందించడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా తెలంగాణా యాసని విలన్లకే పెడుతుంటారనే తెలంగాణావాదుల విమర్శల్ని దృష్టిలో పెట్టుకున్నట్లుగా మహేశ్ చేత అనేక సందర్భాల్లో, ప్రత్యేకించి విలన్లతో ఢీకొనేప్పుడు అతడి చేత తెలంగాణా యాసలో మాట్లాడించాడు. ఆ డైలాగుల్ని చెప్పడంతో మహేశ్ 100% సక్సెసయ్యాడు. ఇలా తెలంగాణావాదుల్ని సైతం తన పాత్రతో ఇంప్రెస్ చేయగలిగాడు మహేశ్. సమకాలీన పాపులర్ అంశాల్ని కూడా తన స్క్రిప్టులో జోడించడంలో ముందుండే శ్రీను ఓ సన్నివేశంలో బ్రహ్మానందం పాత్రచేత చెప్పించే 'ఎస్ఎంఎస్' రిక్వెస్ట్ థియేటర్లలో ఎంతగా నవ్వులు పూయించిందీ చూడొచ్చు. అలాగే అతడికి 'పద్మశ్రీ' అనే పేరు పెట్టడంలోనూ ఆ అవార్డులు ఎలా వస్తున్నాయో చెప్పాడు. అయితే ఎం.ఆర్. వర్మ చేత ఎడిటింగ్‌ని మరింత సమర్థంగా అతడు చేయించి ఉండాల్సింది. అలా జరిగితే లెంగ్త్ సమస్య వచ్చి ఉండేది కాదు. ఏదేమైనా మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ని ఇవ్వడంతో పాటు, పెద్ద హీరోతో హిట్ ఇవ్వలేడనే అపవాదుని చెరిపేసుకోవడంలో సఫలమయ్యాడు శ్రీను.

మరపురాని చిత్రం: ప్రేమనగర్


రామానాయుడు సినీభవితవ్యాన్ని నిర్దేశించి, నిర్మాతగా ఆయన్ని నిలబెట్టిన 'ప్రేమనగర్' చిత్రం విడుదలై నేటికి సరిగ్గా నలభై ఏళ్లు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు..
ప్రఖ్యాత నిర్మాత డి. రామానాయుడు ఈరోజున అత్యధిక చిత్రాల నిర్మాతగా చరిత్రలో స్థానం దక్కించుకున్నారంటే అందుకు మూలస్తంభం 'ప్రేమనగర్' చిత్రం. ఈ సినిమాకి ముందు ఆయన కె. బాపయ్యను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ 'ద్రోహి' చిత్రాన్ని నిర్మించారు. జగ్గయ్య, వాణిశ్రీ, నాగభూషణం కాంబినేషన్‌లో తయారైన ఈ సినిమా అట్టర్‌ఫ్లాపయ్యింది. దీనితో ఐదు లక్షల రూపాయల నష్టం చవిచూశారు రామానాయుడు. 40 ఏళ్ల క్రితం అది చాలా పెద్ద మొత్తం. అప్పుడాయనకు రెండే దార్లు మిగిలాయి. ఒకటి నిర్మాతగానే కొనసాగి, నష్టాన్ని పూడ్చుకోవడం, లేదంటే చెన్నై దగ్గరోని కోణంబాకంలో ఉన్న పొలాలతో వ్యవసాయం చేసుకోవడం. తాడో పేడో తేల్చుకుందామని చివరి ప్రయత్నంగా 'ప్రేమనగర్' ప్రాజెక్టుని ప్రారంభించారు.
కోడూరి కౌసల్యాదేవి అదే పేరుతో రాసిన నవల అప్పటికే పాపులర్ కావడంతో దాని హక్కుల్ని నిజామాబాద్‌కు చెందిన కొత్త నిర్మాత శ్రీధర్‌రెడ్డి కొన్నారు. అందులో నటించేందుకు అక్కినేని నాగేశ్వరరావు అంగీకరించారు. అయితే శ్రీధర్‌రెడ్డి ఎంతకీ ఆ సినిమా ప్రారంభించక పోవడంతో ఆయన నుంచి ఆ హక్కులు కొనుగోలు చేశారు రామానాయుడు. అప్పటికే తమ బేనర్‌లో 'స్త్రీజన్మ'ని తీసిన కె.ఎస్. ప్రకాశరావుని దర్శకునిగా తీసుకున్నారు. రచయిత ఆత్రేయతో కలిసి నవలలో చాలా మార్పులు చేశారు ప్రకాశరావు. సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు రామానాయుడికి బౌండ్ స్క్రిప్ట్ అందించారు ఆత్రేయ.
రూ. 15 లక్షల ఖర్చు అంచనాతో ఈ సినిమా ప్రారంభించారు. అక్కినేని, వాణిశ్రీ, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ, గుమ్మడి వంటి భారీ తారాగణంతో రామానాయుడు 'ప్రేమనగర్'ని మొదలు పెట్టారని తెలిసి సినీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. అప్పటికే వాళ్లకి తెలుసు, రామానాయుడు నిండా మునిగిపోయి ఉన్నారని. కొంతమంది సన్నిహితులు రిస్క్ తీసుకోవద్దని వారించినా ఆయన లెక్కచెయ్యలేదు. 1971 జనవరి 20న చెన్నై వాహినీ స్టూడియోలో కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు అక్కినేని. పూజలకు అక్కినేని దూరమైనా రామానాయుడు అడిగేసరికి కాదనలేకపోయారు. ఆరు నెలల్లో సినిమా పూర్తయింది. 1971 సెప్టెంబర్ 24న 'ప్రేమనగర్' విడుదలైంది. అప్పుడే పెద్ద గాలివాన. రామానాయుడిని ఓవైపు ఆందోళన, మరోవైపు నమ్మకం కలిపి విచిత్రావస్థలోకి నెట్టాయి. అయితే ప్రేక్షకులు 'ప్రేమనగర్'కి బ్రహ్మరథం పట్టారు. ప్రేమ కథా చిత్రాల నాయకునిగా అక్కినేని ఇమేజ్‌ని మరింత పరిపుష్టం చేస్తూ అఖండ విజయం సాధించింది ఈ సినిమా.
హీరో కల్యాణ్‌వర్మ పాత్రకి జీవం పోశారు అక్కినేని. 'మనసు గతి ఇంతే', 'ఎవరి కోసం ఈ ప్రేమమందిరం' అంటూ ఆత్రేయ రాసిన అపూర్వ గీతాలని అంతే అపూర్వ స్థాయిలో అభినయించి వాటికి చిరస్థాయిని కల్పించడంలో తనవంతు పాత్ర పోషించారు. అలాగే నవలా నాయికగా వాణిశ్రీకి ఈ చిత్రం సరికొత్త ఇమేజ్ తెచ్చింది. ఆమె కట్టు, బొట్టు, కొప్పుని అనుకరించడానికి ఆ రోజుల్లో యువతులు పోటీపడ్డారు. అక్కినేని, వాణిశ్రీపై చిత్రీకరించిన డ్యూయెట్లు యువతని ఎంతగా రంజింపచేశాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో సత్యనారాయణ చిన్నప్పటి పాత్రలో వెంకటేశ్ నటించడం విశేషం.
తెలుగు సినిమా సాధించిన అమోఘమైన విజయంతో దీన్ని తమిళంలోనూ నిర్మించాలనుకున్నారు రామానాయుడు. శివాజీ గణేశన్, వాణిశ్రీ జంటగా 'వసంత మాళిగై' పేరుతో రీమేక్ చేశారు. అక్కడా ఆ సినిమా దిగ్విజయం సాధించి, తమిళనాడులో రామానాయుడికి 'వసంత మాళిగై రామానాయుడు'గా పేరు తెచ్చింది. ఇలా రెండు భాషల్లో ఈ సినిమా సూపర్‌హిట్టయ్యాక ఆయన కన్ను బాలీవుడ్ మీద పడింది. హిందీ 'ప్రేంనగర్'కు రూపకల్పన జరిగింది. అందులో నటించేందుకు అప్పటి హిందీ రొమాంటిక్ హీరో రాజేశ్‌ఖన్నా, డ్రీం గర్ల్ హీమమాలిని సరేనన్నారు. అక్కడా ఈ సినిమా విజయకేతనం ఎగురవేసింది. రామానాయుడి బాలీవుడ్ ప్రవేశం ఘనంగా మొదలైంది. ఈ మూడు భాషల్లోనూ దర్శకుడు ప్రకాశరావే. ఇలా ఈ సినిమా విజయ విహారం చేయడంతో రామానాయుడు ఎక్కడికీ కదలాల్సిన అవసరం లేకపోయింది.

న్యూస్: దున్నేస్తున్న 'దూకుడు'

విడుదలకు ముందే అనేక రికార్డుల్ని సొంతం చేసుకున్న మహేశ్ 'దూకుడు' టైటిల్‌కి పూర్తి న్యాయం చేకూరుస్తూ తొలిరోజు కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుని సృష్టించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ థియేటర్లలో విడుదలైన రికార్డుని సొంతం చేసుకున్న 'దూకుడుకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ప్రేక్షకుల స్పందన కూడా అనూహ్యంగానే ఉంది. తొలిరోజు 'మగధీర' రికార్డుల్ని 'దూకుడు' అధిగమించిందనేది ట్రేడ్ రిపోర్ట్. మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'పోకిరి' రికార్డుల్ని ఈ సినిమా మూడు నుంచి నాలుగు వారాల్లో అధిగమిస్తుందని అంచనాలు వేస్తున్నారు. జి. అజయ్‌కుమార్ ఐపియస్ పాత్రలో మహేశ్ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉండటంతో కనీసం 15 నుంచి 20 నిమిషాల నిడివి తగ్గించాలని విమర్శకులు సూచిస్తున్నా ట్రెండ్ చూస్తుంటే లెంగ్త్ అనేది పెద్ద సమస్యగా కనిపించడంలేదు. 'పోకిరి' తర్వాత మహేశ్ సినిమాలు 'సైనికుడు', 'అతిథి', 'ఖలేజా' ఆడకపోవడానికి ప్రధాన కారణం వాటిలో ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడమేనని భావించిన శ్రీను వైట్ల, అతని రచయితలు గోపీమోహన్, కోన వెంకట్ 'దూకుడు'ని హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మలచడంలో విజయం సాధించారు. స్వతహాగా రచయిత కూడా అయిన శ్రీను వైట్ల ఇందులో అనేక పంచ్ డైలాగుల్ని స్వయంగా రాశాడు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ పాత్రలతో పాటు మహేశ్ సైతం కామెడీని పంచడంతో వినోదానికి కొదవ లేకుండా పోయింది. సినిమా ట్యాగ్‌లైన్ 'డేరింగ్ అండ్ డేషింగ్'కు తగ్గట్లు మహేశ్ కేరక్టర్ రూపొందింది. యాక్షన్ సీన్లలో అతని ఎనర్జీ మాస్ ఆడియెన్స్‌ని విపరీతంగా అలరిస్తోంది. ఆ పాత్రలో చెలరేగిన మహేశ్ సినిమానంతా తన భుజాల మీద మోశాడు. అతని డైలాగ్ డిక్షన్, మధ్య మధ్యలో హైదరాబాద్ హిందీలో, తెలంగాణ యాసలో మాట్లాడి బాగా ఆకట్టుకున్నాడు. ప్రకాశ్‌రాజ్, మహేశ్ మధ్య తండ్రీకొడుకుల అనుబంధం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఫలితంగా 2011లో తొలి సూపర్ డూపర్ హిట్‌కు మార్గం సుగమమైంది. 'దూకుడు' ఏ స్థాయి రికార్డుల్ని సాధిస్తుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఓపికపట్టాలి.

టర్నింగ్ పాయింట్: జెనీలియా

సినిమాలకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. సినిమాల్లోకి అనుకోకుండానే వచ్చా. నేనో పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ యాడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి నన్ను చూశాడు. ఆ తర్వాత ఓ యాడ్‌లో చేయడానికి పిలుపు వచ్చింది. అదీ అమితాబ్ బచ్చన్ వంటి మహా నటుడితో. ఎవరైనా వదులుకుంటారా అలాంటి ఆఫర్‌ని! నేనూ అంతే. అది చేసిన మూడు నెల్లకే తొలి సినిమా ఆఫర్ వచ్చింది. తెలుగులో సూపర్‌హిట్టయిన 'నువ్వే కావాలి'ని హిందీలో 'తుఝే మేరీ కసం' పేరుతో తీయడానికి రామోజీరావు గారు ప్లాన్ చేశారు. మా అమ్మతో పాటు వెళ్లి రామోజీరావు గారినీ, దర్శకుడు విజయభాస్కర్ గారినీ కలిశా. ఆ మీటింగ్ మొత్తం మీద నేనొక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటి అవకాశాలు ఒకే ఒక్కసారి వస్తాయనీ, వాటిని ఉపయోగించుకోవాలనీ అమ్మ నన్ను కన్విన్స్ చేసింది. నేనప్పుడే హైస్కూల్ పూరిచేశా. నేను ఆల్‌రౌండర్ని. సవాళ్లంటే ఇష్టం. సినిమాలు నాకు తాజా సవాళ్లని విసిరాయి.
కెమెరా ముందు తొలిసారి నిల్చున్నప్పుడు నేను భయపడలేదు. ఒకసారి కెమెరా ఆన్ అవగానే అంతకుముందున్న నెర్వస్‌నెస్ మాయమైపోయింది. మధ్యలో 'బాయ్స్' (తమిళ్) కోసం డైరెక్టర్ శంకర్ నుంచి కాల్ వచ్చింది. అయితే ప్రాంతీయ భాషలో నటించాలా, వద్దా అనేది నిర్ణయించుకోలేదు. ఏదైతేనేం, హిందీ, తమిళ్, తెలుగు సినిమాలతో తొలి యేడాది క్లిష్టంగా గడిచింది. నాకు భాష సమస్యగా మారింది. తెలుగు, తమిళంలో మాట్లాడటం కష్టమైపోయింది. అయినా పట్టుదలతో డైలాగులు నేర్చుకుని ప్రాంప్టింగ్ అవసరం లేకుండానే చెప్పగలిగా. 'బాయ్స్' సెట్స్ మీద నేను ఇబ్బంది పడుతుంటే డైలాగుల విషయంలో సిద్ధార్థ్ బాగా సాయపడ్డాడు.

Thursday, September 22, 2011

ఇంటర్వ్యూ: మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. శ్రీలేఖ

మీకు ఇష్టమైన పనేమిటి?
- పాడటం, స్వరాలు సమకూర్చడం... ఇవి రెండూ నాకు రెండుకళ్ళు. స్టేజీ షోలు చేయడానికి కూడా బాగా ఇష్టపడతాను. నేను రీరికార్డింగ్ చేస్తే ప్రత్యేకంగా ఉంటుందని చాలా మంది మెచ్చుకున్న సందర్భాలున్నాయి. శ్రోతలకు నచ్చేవిధంగా బాణీ కట్టడానికి నిత్యం ప్రయత్నిస్తుంటా.
ప్రస్తుతం ఏయే సినిమాలకు పని చేస్తున్నారు?
- తెలుగులో 'బ్లాక్ మనీ', 'ఫైర్', కన్నడలో 'బెంకి బిరుగాళి', తమిళంలో 'పోట్టుతళ్ళు' చిత్రాలకు సంగీతం చేస్తున్నా.
మీ దృష్టిలో ఓ పాట హిట్టవడమంటే?
- నేను పనిచేసే సినిమాల్లో సంగీతం చక్కగా కుదరాలని శాయశక్తులా ప్రయత్నిస్తుంటాను. నేను స్వరపరచిన పాటలను శ్రోతలు తలలూపుతూ ఆలకించాలి. అప్పుడే పాట హిట్ అయినట్టు. మాస్, ఫాస్ట్ బీట్, మెలోడీ అన్న తారతమ్యాల్లేకుండా సన్నివేశాలకు అనుగుణంగా బాణీలను కూర్చడానికి తాపత్రయపడుతుంటాను.
మిగతా భాషల్లోని పాటలకీ, తెలుగు పాటలకీ ప్రధానంగా కనిపించే తేడా ఏమిటి?
- తెలుగు పాటల్లో ఎక్కువ కమర్షియల్ విధానం కనిపిస్తుంది. అదే హిందీ పాటల్లో భావప్రాధాన్యత కీలకం. తమిళ్‌లో నావెల్టీ ఉంటుంది. కథ, నటీనటులు, సినిమాను తెరకెక్కించే విధానం... అన్నింట్లోనూ కొత్తదనం కనిపిస్తుంది. సంగీతంలోనూ చిన్న చిన్న అంశాల్లోనూ నవ్యత మెరిపిస్తుంది. అలాంటి విధానం తెలుగులోనూ వస్తే హర్షించే తొలి వ్యక్తిని నేనే అవుతా. మంచి సినిమాలను మనం తీయాలేగానీ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.
పాటకి బాణీ కట్టడంలో ఎలాంటి ధోరణి అవలంబిస్తారు?
- అందరూ ముందు పల్లవికి బాణీ కడతారు. కానీ నా విషయంలో వేరే జరుగుతుంది. ముందు చరణం అనుకుంటాను. తర్వాత పల్లవి దానంతట అదే వస్తుంది. నాకు స్వతహాగా సోలో వయొలిన్ అంటే మక్కువ. అలాగని అన్ని పాటల్లో వయొలిన్ వాడుతానని కాదు. నా ఇష్టాయిష్టాలను పాటలపై రుద్దను. ఎలాంటి సినిమాలకైనా శ్రీలేఖ సులభంగా రీరికార్డింగ్‌తో ప్రాణం పోయగలదు అని పరిశ్రమలో టాక్ ఉంది. చిన్న సినిమాల దేవతగా నన్ను కీర్తించేవారూ ఉన్నారు.
మీరు తెరమీద కనిపించే అవకాశాలున్నాయా?
- మంచి అవకాశాలొస్తే నటిస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. మనసుకు నచ్చిన కథలొస్తే తప్పకుండా నటిస్తాను. అదీ అతిథి పాత్ర వరకే పరిమితం.
వ్యక్తిగతంగా ఎలాంటి సినిమాలకి సంగీతం ఇవ్వడమంటే ఇష్టం?
- కమర్షియల్ చిత్రాలతో పాటు అప్పుడప్పుడూ ఆఫ్‌బీట్ చిత్రాలకు పనిచేయడమన్నా ఇష్టమే. యూత్, ట్రెండ్ లవ్‌స్టోరీలకు పనిచేయడమంటే చాలా సరదా. రీమిక్స్‌లను నేను పెద్దగా ఇష్టపడను. అయినా 'ఫైర్' చిత్రంలో నమిత కోసం ఓ పాత పాటను రీమిక్స్ చేశాను. అదేంటో ప్రస్తుతానికి సస్పెన్స్.
పరిశ్రమలో ఎక్కువకాలం ఉండాలంటే ఏం కావాలంటారు?
- పరిశ్రమలో పదికాలాల పాటు ఉండాలంటే హిట్టు తప్పనిసరి. హిట్ సినిమాలో మన పేరు కనిపిస్తే తప్పకుండా అందరూ మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అందుకే విజయవంతమైన మంచి సినిమాలో నేనూ ఉండాలన్న కోరికతో ముందుకు సాగుతుంటాను.

బిగ్ స్టోరీ: టాలీవుడ్‌లో కథలకి కరువొచ్చింది!

తెలుగు సినిమా కథల కరువుతో అల్లాడుతోంది. మూస కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక బొక్క బోర్లా పడుతోంది. యూత్ సినిమాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు, యాక్షన్ సినిమాలు... ఏవీ జనాన్ని అలరించలేక పోతున్నాయి. నావెల్టీ, లేదా వెరైటీ సినిమాలు ఏడాదికి ఒకట్రెండు కంటే మించడం లేదు. తలా తోకాలేని, అర్థం పర్థంకాని కథల్ని తెరకెక్కించేందుకు కోట్లాది రూపాయల్ని ఖర్చుపెట్టేందుకు దర్శకులూ, నిర్మాతలూ తెగ తాపత్రయపడుతున్నారు. విమర్శని ఏమాత్రం సహించలేక 'మేం తీసేదే సినిమా. మీరు దాన్ని చూడాల్సిందే' అన్న తరహాలో వ్యవహరిస్తుండటం వల్ల విడుదలైన వారానికే రీళ్ల డబ్బాలు నిర్మాత ఇంటికి తిరుగుముఖం పడుతున్నాయి.
హీరోల కాల్షీట్లు, లొకేషన్లు, భారీ సెట్లు, ఇతర హంగామాల గురించి తప్ప నిర్మాతలు కానీ, దర్శకులు కానీ సరైన కథ గురించి పట్టించుకోవడం లేదన్నది ఏ సినిమా చూసినా తెలిసిపోతుంది. 2011లో ఎనిమిది నెలల కాలంలో విడుదలైన సినిమాల్లో 10 శాతం సినిమాలు కూడా సక్సెస్‌కి నోచుకోకపోవడానికి కారణం? కథ, కథనం విషయంలో దర్శకులు ఏ మాత్రం శ్రద్ధ వహించనందువల్లే.
పొరుగున ఉన్న తమిళ రంగంలో ప్రతిభావంతులైన రచయితలు, దర్శకులు కొత్త కథలకు, సృజనాత్మక చిత్రాలకు శ్రీకారం చుడుతుంటే మనం మాత్రం కొత్త సీసాలో పాత సారాలాగా రసం కోల్పోయిన చెరుకు పిప్పిలాంటి కథల్నే మార్చి మార్చి తీసుకుంటూ ఎంతో విలువైన కాలాన్నీ, డబ్బునీ వృథా చేసుకుంటున్నాం. లేటెస్టుగా తమిళం నుండి వచ్చిన 'రంగం', '1947 ఎ లవ్‌స్టోరీ' సినిమాల్నే తీసుకోండి. ఒకదానికొకటి పూర్తి భిన్నమైన ఈ సినిమాలు అక్కడివాళ్ల సృజనాత్మక శక్తిని చాటుతున్నాయి. '1947 ఎ లవ్‌స్టోరీ'ని దాని డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్ రూపొందించిన విధానం అత్యుత్తమం. టైటిల్లో ఉన్నట్లు అప్పటి నేపథ్యాన్ని గొప్పగా కళ్లముందుంచాడు. ఓ చాకలి కుర్రాడికీ, బ్రిటీష్ గవర్నర్ కుమార్తెకీ మధ్య కలిగే అనురాగాన్ని అతి సుందరంగా, గుండెల్ని హత్తుకునేట్లు చిత్రించాడు. మనవాళ్ల నుంచి ఎప్పటికీ అలాంటి చిత్రాన్ని ఊహించలేం. కె. రాఘవేంద్రరావు వంటి గొప్ప దర్శకుడు వెంకటేశ్‌తో 'సుభాష్ చంద్రబోస్'ని ఎలా తీశాడో చూశాం కదా. టాలీవుడ్ బాక్సాఫీస్ తమిళ డబ్బింగులతో నిండిపోతున్నదని గగ్గోలు పెడుతున్నవాళ్లంతా ఆ సమయాన్ని తెలుగు సినిమా నాణ్యత మీద పెడితే బాగుంటుంది. సరైన కథ లేకుండా భారీ హంగులు ఆర్భాటాలు, క్రేజీ కాంబినేషన్లతో సినిమా తీస్తే వాటికి ఓపెనింగ్స్ తప్ప నిలకడైన 'రన్' ఉండదు. వారం రోజులకే థియేటర్లన్నీ ఖాళీ ఐపోతాయి.
తెలుగు చిత్రసీమలో కథారచయితలే లేరా? మంచి కథల్ని సృజించే సత్తా మనవాళ్లలో లేదా? ఇదివరలో ఎన్ని మంచి కథలు మన రచయితల నుంచి రాలేదు? ఆణిముత్యాల్లంటి సినిమాలెన్నో, కళాఖండాల్లాంటి సినిమాలెన్నో తెలుగు నుంచి వచ్చాయి కదా! ఒకటిన్నర దశాబ్దం నుంచే టాలీవుడ్‌లో కథాదారిద్ర్యం రాజ్యమేలుతోంది. ఇందుకు కారణం సత్తా కలిగిన రచయితలు తమలోని శక్తి సామర్థ్యాల్ని పూర్తిగా ప్రదర్శించలేక పోవడమే. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, మిష్టర్ పెళ్లాం, పెళ్లి పుస్తకం, లేడీస్ టైలర్, ప్రతిఘటన, మయూరి, పెళ్లి సందడి, తలంబ్రాలు, అంకుశం, అరుంధతి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఒక్కడు, మగధీర, ఆర్య, కొత్త బంగారులోకం వంటి హిట్ సినిమాలకు కథల్ని అందించింది మన రచయితలే కదా. అవకాశాలు కల్పించాలే కానీ 'హ్యాపీడేస్'ని తీసుకొచ్చే కథల్ని తయారు చెయ్యడానికి వర్థమాన రచయితలెందరో సినీ ఫీల్డులో ఛాన్సుల కోసం నిర్మాతల, దర్శకుల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బిజీగా ఉండే రచయితల్ని మరింత బిజీ చెయ్యడం వల్ల మంచి కథలు పుట్టవు. కొత్తగా పెన్ను చేతబట్టిన ఔత్సాహిక రచయితలకి ప్రోత్సాహం అందజేస్తే రజతోత్సవ, శతదినోత్సవ చిత్రాలకు కథలు దొరుకుతాయి.
మన సోకాల్డ్ అగ్ర నిర్మాతలు మొదలు చిన్న నిర్మాతల దాకా, దర్శకులకు సైతం కథ గురించి తీరిగ్గా చర్చించే అవకాశమే ఉండటం లేదు. ఒకవేళ అవకాశం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. కథ తయారు చేయడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి ఎవరూ ఇష్టపడనట్లే కనిపిస్తోంది. ఎంతసేపూ లొకేషన్లు లేదా హీరో డేట్లు లేదా భారీ సెట్టింగులు - వీటి మీద ఉండే ఆసక్తి కథను ఎంపిక చేసుకునేప్పుడు ఉండటం లేదు. ఇంకా చెప్పాలంటే కొత్త కథలు ఎక్కడుంటాయి అంటూ తిరిగి ప్రశ్నిస్తుంటారు. కొత్త కథలు, కొత్త ప్రయోగాలు తెలుగు ప్రేక్షకులు మెచ్చరంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇస్తుంటారు. అయితే 2011లో జనం మెచ్చిన సినిమాల్లో ఎక్కువగా రెగ్యులర్ సినిమాలకు భిన్నమైనవే కావడం గమనార్హం. 'రంగం', 'కాంచన', 'బ్రమ్మిగాడి కథ', '100% లవ్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'అలా మొదలైంది', 'గోల్కొండ హైస్కూల్' వంటివి ప్రజాదరణ పొందడం గమనించయినా కథల విషయంలో నిర్మాతలు, దర్శకులు మరింత శ్రద్ధ వహించాలి. లేకపోతే తెలుగు సినిమా ఒక హిట్టు, పది ఫ్లాపుల సంప్రదాయం నుంచి ఎన్నటికీ బయటపడదు.

Wednesday, September 21, 2011

ఇంటర్వ్యూ: తెలంగాణా శకుంతల

తెలంగాణా శకుంతల అనే పేరు ఎలా వచ్చింది?
- నేను శకుంతల అనే పేరుతోనే తెలుగు సినిమా పరిశ్రమలో ప్రవేశించాను. నేను నటిగా బిజీగా మారాక అదే పేరుతో మరొకరు వచ్చారు. ఒకే పేరుతో ఇద్దరు ఉండటం నిర్మాతలకు కన్ఫ్యూజన్ కలిగించింది. తెలంగాణా మాండలికంతో నేను నటించిన సినిమాలు విజయవంతం కావడంతో నిర్మాతలు నా పేరును తెలంగాణా శకుంతలగా మార్చారు.
రంగస్థలం నుంచి ఇక్కడకు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
- ఎలాంటి కళాకారులకైనా స్టేజి అనేది ఓ పెద్దబాలశిక్షలాంటిది. బాల్యంలో బాలశిక్షలో నేర్చుకున్న విషయాలు జీవితమంతా గుర్తున్నట్లు స్టేజి మీద మేము పొందిన శిక్షణ విభిన్న పాత్రల పోషణలో మాకు ఉపయోగపడుతుంటుంది. స్టేజి మీద నటించేప్పుడు కదలికల విషయంలో ఓ రకమైన స్వేచ్ఛ ఉంటుంది. అదే సినిమా అంటే కెమెరా పరిధిలోనే నటించాలి. నాటకంలో జనం మన కళ్లముందే కనపడుతుంటారు. అదే సినిమా అయితే జనం ఎదురుగా ఉన్నారనుకుని కెమెరాని దృష్టిలో పెట్టుకుని నటించాలి. స్టేజి మీద విజృంభించిన నటీనటులకు కెమెరా పరిధిలో ఉండాలంటే ఏనుగును తెచ్చి సీసాలో బంధించినట్లే అనిపిస్తుంది మొదట్లో. తర్వాత్తర్వాత అలవాటైపోతుంది.
ఈ మధ్య ఏ సినిమాలో చూసినా మీరు అరుస్తున్నారెందుకు?
- పాత్ర మేనరిజంలో వైవిధ్యం చూపించాలని స్టేజి మీద స్వేచ్ఛ తీసుకుంటాం. అదే సినిమాలో అయితే దర్శకుని అభిరుచి, సూచనల మేరకు నటించాలి. ఓ కేరక్టర్ హిట్టయితే అలాంటి పాత్రల్నే దర్శకులు రూపకల్పన చేస్తుంటారు. అన్ని సినిమాల్లో అదే కొనసాగితే మీరన్నట్లు ఒకే మూసలో వచ్చిన పాత్రల్లా కనిపిస్తాయి. సీమ కథలతో వచ్చిన సినిమాల్లో అలా అరుపులతో నటించి, అవి హిట్టయ్యేసరికి దర్శకులు అలాంటి పాత్రల్నే ఇస్తున్నారు.
దర్శకత్వ ఆలోచనేమైనా ఉందా?
- ఆ కోరికైతే ఉంది. అయితే సినిమాలకు కాదు. ముందుగా ఓ మంచి నాటకానికి దర్శకత్వం వహించాలనుకుంటున్నా. స్టేజి నుంచి సినిమాలకి వచ్చినవాళ్లు స్టేజికి దూరమవుతున్నారనే అపవాదు నాపై రాకుండా ఓ మంచి నాటకాన్ని నా దర్శకత్వంలో ప్రదర్శించాలనుకుంటున్నా. ఇక సినిమా అంటారా. ఇప్పుడే కాదు. మరికొంత కాలం పోనివ్వండి.
కెరీర్ మొత్తంలో మీకు సంతృప్తినిచ్చిన పాత్రలు?
- నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ నేను నటించిన పాత్రల్లో నాకు పూర్తిగా సంతృప్తినిచ్చిన పాత్ర లభించలేదనే చెప్పాలి. ఓ పక్షి స్వేచ్ఛగా ఆకాశంలో విహరించినట్లే ఏదైనా ఓ మంచి పాత్రలో అలా విజృంభించి విశ్వరూపం ప్రదర్శించాలని ఉంది. ఇప్పటివరకూ నటించిన సినిమాల విషయానికొస్తే 'ఒసేయ్ రాములమ్మా', 'నువ్వు నేను', 'ఒక్కడు', 'వీడే' సినిమాల్లో నా పాత్రలు కొంతవరకు సంతృప్తినిచ్చాయి.
మీ కలేమిటి?
- కామెడీ, విలన్, గయ్యాళి పాత్రల్లో నటించా. 'బంగారు తల్లి' సినిమాలో జమున, 'రంగుల రాట్నం'లో అంజలీదేవి వంటి నటీమణులు చేసిన మాతృమూర్తి పాత్రల్లో నటించాలని ఉంది. అలాగే పూర్తిగా కరుణరసం గల శబరి పాత్రలోనైనా నటించాలని ఉంది.

Tuesday, September 20, 2011

వార్తల్లో వ్యక్తి: అక్కినేని నాగేశ్వరరావు

అభినయ వాల్మీకి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాంఘిక చిత్రాల కథానాయకుడిగా అత్యున్నత స్థాయిని అందుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనేది జగద్విదితం. పౌరాణిక చిత్రాల కథానాయకుడిగా ఎన్టీ రామారావు అద్భుతంగా రాణిస్తుండటంతో తనంతట తానుగా వాటినుంచి తప్పుకుని సాంఘిక చిత్రాలతోనే అజరామర కీర్తిని సొంతం చేసుకున్నారు అక్కినేని. తొలినాళ్లలో జానపద హీరోగా రాణించినా 'లైలా మజ్ను', 'దేవదాసు' వంటి విషాదాంత ప్రేమకథలతో ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకుని, ప్రేమకథాచిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ పొందారు.
మలిదశలో ఆయన చేసిన మరో రెండు విషాదాంత ప్రేమకథాచిత్రాలు 'ప్రేమాభిషేకం', 'మేఘసందేశం' ఈ సంగతినే రుజువు చేశాయి. అయితే వీటిలో ఆయన పాత్రలు ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి కావడం గమనించదగ్గ అంశం. సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరో తెలుగు హీరో పోషించలేదనడం నిస్సందేహం. అక్కినేని చేసిన పౌరాణిక చిత్రాలు పదికి మించవు. చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించినా, ఆ తరహా చిత్రాలు ఆయన ఎక్కువ చేయకపోవడం తెలుగు సినిమాకి ఓ లోటుగానే భావించాలి. ప్రస్తుతం ఆయన బాపు రూపొందిస్తున్న 'శ్రీరామరాజ్యం' చిత్రంలో రామాయణ గాథని రచించిన వాల్మీకి పాత్రని పోషిస్తున్నారు. అడవుల పాలైన సీతకు ఆశ్రయమిచ్చి, అక్కడ ఆమె జన్మనిచ్చిన కవల పిల్లలు లవకుశులకు విద్యాబుద్ధులు, విలువిద్య నేర్పిన గురువు వాల్మీకిగా ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ గమనించదగ్గ విశేషమేమంటే కథానాయకుడిగా అక్కినేని తొలి పాత్ర శ్రీరాముడు కావడం. ఆ సినిమా 1944లో వచ్చిన 'సీతారామ జననం'. ఘంటసాల బలరామయ్య రూపొందించిన ఈ చిత్రంలో శ్రీరామునిగా నాగేశ్వరరావు ఎలా నటిస్తాడోనని ఆయన్ని ఎరిగినవారంతా కొంత ఆసక్తిగా, కొంత అపనమ్మకంగా ఎదురుచూశారు. ఎందుకంటే అప్పటివరకు రంగస్థలంపై ఆడ పాత్రలే చేస్తూ వచ్చిన ఆయన ఎకాఎకి శ్రీరామ పాత్ర చేయడమంటే మాటలు కాదు కదా (అంతకుముందు 1941లో ఆయన 'ధర్మపత్ని'లో ఓ చిన్న పాత్ర చేశారు). కానీ ఆ పాత్రలో ఆయన అందరి అంచనాల్ని మించి రాణించారు.
ఆ తర్వాత కాలంలో ఆయన 'మాయాబజార్'లో అభిమన్యుడిగా, 'భూకైలాస్'లో నారదునిగా, 'చెంచులక్ష్మి'లో విష్ణుమూర్తిగా, 'శ్రీ కృష్ణార్జున యుద్ధం'లో అర్జునునిగా నటించి, మెప్పించారు. 'జయభేరి'లో 'రావోయి రాస విహారీ' పాటలో శ్రీకృష్ణుని వేషంలోనూ బాగున్నారనిపించుకున్నారు. నాగయ్య చిత్రం 'భక్త రామదాసు'లో మరోసారి విష్ణుమూర్తిగా అతిథి పాత్రలో కనిపించారు. వీటితో పాటు 'సతీ సావిత్రి'లో సత్యవంతుడిగానూ అక్కినేని మెప్పించారు. ఇలా చేసిన ప్రతి పౌరాణిక పాత్రలోనూ రాణించిన అక్కినేని మరిన్ని పౌరాణిక చిత్రాలు చేసినట్లయితే తెలుగు సినిమాకి మేలు చేకూరి ఉండేది. ఆ మేరకు ఆయన సేవల్ని పౌరాణిక సినిమా కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు 87 సంవత్సరాల వయసులో ఆయన 'శ్రీరామరాజ్యం'లో వాల్మీకిగా నటిస్తుండటం ముదావహం.
ఈ పాత్రలో ఆయన అద్భుతంగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు. బాపు రూపకల్పనలో శ్రీరామునిగా బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందువల్ల త్వరలోనే అభినవ వాల్మీకిని మనం తిలకించవచ్చు.
(సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు 88 ఏట అడుగు పెడుతున్న సందర్భంగా)

న్యూస్: మరికొన్ని తెలంగాణా సినిమాలొస్తున్నాయ్!

కొద్ది రోజుల్లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో తీసిన మరో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆర్. నారాయణమూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన 'పోరు తెలంగాణ' సెప్టెంబర్ 16న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి టీఅర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కామెంట్ చేస్తూ "శంకర్ తీసిన 'జైబోలో తెలంగాణ' కంటే నారాయణమూర్తి తీసిన 'పోరు తెలంగాణ' వంద రెట్లు బాగుంది. అందులో ప్రేమా గీమా ఉంటే ఇందులో అలాంటివి లేవు. ఉన్నదంతా ఉద్యమమే" అన్నారు. ఇక సెప్టెంబర్ 17న వస్తుందనుకున్న 'జై తెలంగాణ' అనే సినిమా విడుదల కాలేదు. తెలంగాణకు చెందిన ప్రజా కళాకారుడు రసమయి బాలకిషన్ ఈ సినిమాని రూపొందించారు. ఇందులో నిజ జీవిత పాత్రని కూడా ఆయన పోషించారు.
ఇక ఇదివరకు 'అవును నిజమే', 'నిక్కీస్ ఎంగేజ్‌మెంట్' వంటి లవ్‌స్టోరీలు తీసిన రఫి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 'ఇంకెన్నాళ్లు' సినిమా రూపొందించాడు. "నాయకుల గురించే ఎప్పుడూ మాట్లాడుతూ, రాస్తుంటాం. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుని, మరుగున పడిపోయిన కుటుంబాన్ని తీసుకుని, మూడు తరాలుగా వారు చేసిన త్యాగాల్ని తెరకెక్కించిన చిత్రం 'ఇంకెన్నాళ్లు. తెలంగాణ ప్రజల పక్షాన ఈ చిత్రాన్ని తీశా. 60 మంది దాకా తెలంగాణ కళాకారుల్ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నా'' అని చెప్పాడు రఫి. ఈ మాటలు చెప్పేప్పుడు భావోద్వేగానికి గురైన రఫి ఏడ్చేశారు కూడా. యథాప్రకారం ఈ సినిమాకి కూడా రఫీయే సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ విశేషం సినీ జర్నలిస్ట్ మసాదె లక్ష్మీనారాయణ గేయ రచయితగా పరిచయమవుతుండటం. ఇందులో అతను రెండు పాటలు రాశాడు. లక్ష్మీనారాయణ ప్రస్తుతం జీ 24గంటలు చానల్లో సినిమా రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఈ నెలాఖరు లేదంటే అక్టోబర్ ప్రథమార్థంలో విడుదల కానున్నది. అలాగే శివాజీ ప్రధాన పాత్ర చేస్తున్న 'కొలిమి' అనే సినిమా నిర్మాణంలో ఉంది. వీటిలో ఏవి తెలంగాణా ప్రజల్ని ఆకట్టుకుంటాయో వేచి చూడాల్సిందే.

Monday, September 19, 2011

బిగ్ స్టోరీ: నేను రావణబ్రహ్మను!



రావణబ్రహ్మ... రామాయణ కథకి ప్రతినాయకుడు. మాహాసాధ్వి సీతను పెళ్లాడకోరి, ఆమెని అపహరించి, అశోకవనంలో ఉంచి, రామునితో తలపడి కదనరంగంలో అశువులు బాసిన మహా శివభక్తుడు. లంకాధీశుడు. భారతీయ తెరపైనే అద్భుతమనదగ్గ రీతిలో, తమదైన ప్రత్యేక శైలితో అభినయించి ఆ పాత్రకి అమరత్వాన్ని ప్రసాదించిన నటులు ఇద్దరు. ఒకరు ఎన్టీ రామారావు, మరొకరు ఎస్వీ రంగారావు. ఇప్పుడు ఆ పాత్రని పోషించేందుకు ఉత్సాహం చూపిస్తున్న నటుడు మోహన్‌బాబు. ఆయనని రావణావతారంలో చూపించేందుకు సిద్ధమవుతున్న దర్శకుడు కె. రాఘవేంద్రరావు. ఆ సినిమా షూటింగ్ మొదలయ్యేది 2012 ప్రథమార్థంలో.మోహన్‌బాబు 'రావణ' సినిమా చేస్తానన్న ప్రకటనతో తెలుగులో భక్తిరస, పౌరాణిక చిత్రాల మీద ధ్యాసమళ్లినట్లే కనిపిస్తోంది. సాధారణంగా సోషల్ సినిమాల కంటే ఇలాంటి భక్తి, పౌరాణిక చిత్రాలకు ఖర్చు తడిసి మోపెడవుతుంది. కారణం ఆ కాలపు వాతావరణాన్ని సృష్టించడానికి భారీ సెట్లు నిర్మించాల్సి రావడం, కాస్ట్యూమ్స్, అలంకరణ సామగ్రి తయారుచేయించడం. అయితే ఆయా పాత్రల్ని పోషించాలన్న సంకల్పమే తెలుగులో ఆ తరహా చిత్రాల నిర్మాణానికి దారితోస్తోంది. అటువంటి సినిమాలతో, అటువంటి 'లార్జర్ దేన్ లైఫ్' కేరక్టర్లతో చరిత్రలో నిలిచిపోవచ్చనే కోరిక కూడా ఇందుకు కారణమే. రావణబ్రహ్మ అనగానే మనకి 'భూకైలాస్' (1958), 'సీతారామ కల్యాణం' (1961) చిత్రాల్లోని ఎన్టీ రామారావు, 'ఇంద్రజిత్' (1961), 'సంపూర్ణ రామాయణం' (1972) చిత్రాల్లోని ఎస్వీ రంగారావు జ్ఞాపకమొస్తారు. ఆ పాత్రల్ని మరికొంతమంది పోషించినా ఆ ఇద్దరే ఆ పాత్రకి వన్నె తెచ్చారు. ఆ పాత్రలో ఆమోఘంగా రాణించారు.
సాంఘిక పాత్రలకీ, పౌరాణిక పాత్రలకీ స్పష్టమైన తేడా ఒకటుంది. సోషల్ కేరక్టర్లో వేసే కుప్పిగంతులు పౌరాణిక పాత్రలకి చెల్లుబాటు కావు. పౌరాణిక పాత్ర పోషణలో నటుడికి ప్రధానంగా కావలసినవి ఆంగిక, వాచికాభినయాలు. ఈ రెండింటిలోనూ ఆరితేరినవాళ్లు కాబట్టే ఎస్వీఆర్, ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. చిత్రమేమంటే రావణ పాత్రని ఏ మాత్రమూ పోలికలేని విధంగా ఆ ఇద్దరూ వేర్వేరు తరహాల్లో పోషించడం. సామర్ల వెంకట రంగారావు పోషించిన రావణాసురుడు మనకి పరమ క్రూరునిగా, కిరాతకునిగా, స్త్రీలోలునిగా కనిపిస్తే, నందమూరి తారకరామారావు అభినయించిన రావణుడు కథానాయకుడి తరహాలో కనిపించాడు. 'ఇంద్రజిత్' (దీనికి 'సతీ సులోచన' అనే పేరు కూడా ఉంది) చిత్రంలో క్రూరత్వానికి తోడు పుత్ర వాత్సల్యం కలిగిన రావణునిగానూ ఎస్వీఆర్ దర్శనమిచ్చారు. ఆ పాత్రలో ఆయన ప్రదర్శించిన హావభావాలూ, కదలికలూ చూసి ఆ పాత్ర పోషణని అలా చెయ్యడం మరొకరికి సాధ్యం కాదన్నారు. చేసిన ప్రతి పాత్రకూ ప్రశంసలందుకోవడం మాటలు కాదు. అయినా పాత్ర పాత్రకీ ఆయన అడుగు ముందుకేయడానికి కారణం, కళారాధకునిగా ఆయనలో ఉన్న అసంతృప్తే. 'మీ ఉత్తమ పాత్ర ఏది?' అనే ప్రశ్నకు 'ఇంకా నేను ఉత్తమ పాత్ర చెయ్యలేదు' అనే సమాధానమే చివరిదాకా ఆయన నోటినుంచి వచ్చింది. ఎంత అద్భుతంగా నటించిన పాత్రయినా ఆయనకు మాత్రం అద్భుతంగా కనిపించలేదు. అన్నిటికన్నా ఆత్మవిమర్శకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే రంగారావు తాను ధరించబోయే పాత్ర మనస్తత్వాన్నీ, ప్రవర్తననీ, అనుభవాల్నీ బాగా అవగాహన చేసుకుని, ఆ పాత్రని ఎలా పోషించాలో నిర్ణయించుకునేవారు. అందుకే రావణ పాత్రలోని రౌద్ర, బీభత్స, కరుణ రసాల్ని అద్భుతంగా పోషించగలిగారు. 'రంగారావుతో సమంగా నటించే నటులుండవచ్చు. కానీ అంతకన్నా బాగా నటించగలవారు మాత్రం లేరు' అనే ప్రశంసలు పొందారు.
ఓ పాత్ర చేయడానికి ఆయన చూపించే అంకితభావం కూడా ఆశ్చర్యపరుస్తుంది. బాపు రూపొందించిన 'సంపూర్ణ రామాయణం'లో రావణ పాత్ర చేసే సమయంలో ఆయన దురలవాట్లకు దూరంగా ఉన్నారు. అద్భుతమైన నటనతో చిత్రానికి వన్నె తెచ్చారు. అప్పట్లో రూ. 17.5 లక్షల వ్యయంతో రూపొందించిన ఆ సినిమా నిర్మాతలకు సిరులు కురిపించిందంటే బాపు, రమణల కాంబినేషన్‌తో పాటు రావణ పాత్రని ఎస్వీఆర్ పోషించిన తీరు కూడా ప్రధాన కారణమని విమర్శకులు ముక్తకంఠంతో పలికారు.
తెలుగులో శ్రీరాముడి పాత్ర పోషణకంటే ముందుగానే పురాణ వాఙ్మయంలో అతి భయంకరమైన ప్రతినాయకుడిగా పేరుపొందిన రావణుడ్ని నాయక స్థాయికి చేర్చింది నిస్సందేహంగా ఎన్టీ రామారావే. 'భూకైలాస్'లో ప్రత్యక్షమైన అందమైన రావణాసురుడికి ప్రేక్షక జనం విజయాన్ని చేకూర్చిపెట్టారు. స్రీలోలుడిగా కాక వేద వేదాంగాలు ఔపోసన పట్టిన విద్యాధికుడిగా ఈ చిత్రంలో కనిపించి సమాజానికి ఎదురీదారు ఎన్టీఆర్.
"కథానాయకుడి వేషాలే వేయడం చాలామందికి గొప్ప. కాని ప్రతినాయకుడి పాత్రలను కూడా మంచివాటిగా మలిచి జనాదరణ పొందింది ఒక్క ఎన్టీఆరే'' అన్న అక్కినేని నాగేశ్వరరావు మాటలు పూర్తిగా నిజం. భారతదేశ చలనచిత్ర రంగం మొత్తాన్ని జల్లెడపట్టి వెతికినా నాయకుడై ఉండి రావణ, దుర్యోధన వంటి ప్రతి నాయక పాత్రలు ధరించి అందరి మెప్పూ పొందిన ఏకైక నటుడు రామారావు. ఎస్వీ రంగారావు ఉండగానే ఆ పాత్రల్ని మెప్పించడం అసామాన్యం.
'సీతారామ కల్యాణం' పూర్తిగా ఎన్టీఆర్ అభిరుచి మేరకు తీసిన చిత్రం. ఆయనలోని భావ విప్లవానికీ, నూతన ప్రయోగానికీ అందులోని రావణ పాత్ర ప్రతీక. కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరిలోని భావ విప్లవ ప్రభావం, రావణుడు దుష్టుడు కాడనీ, ఆత్మాభిమానం, వ్యక్తిత్వం ఉన్నవాడనీ చెప్పిన ద్రావిడోద్యమ ప్రభావం ఆ పాత్రమీద కనిపిస్తుంది. ఈ చిత్రంలో 'కానరార కైలాస నివాస' అని ప్రారంభమయ్యే సుదీర్ఘ శివస్తుతిలో ఎన్టీఆర్ అభినయ విన్యాసాన్ని చూసి తీరాల్సిందే. సీతారాముల కల్యాణాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఈ చిత్రంలో అపూర్వమనదగ్గ రీతిలో దశముఖ ప్రదర్శన చేశారు. భక్తి ఆధారంగా మౌఢ్యం పరిఢవిల్లుతుందని సోదాహరణంగా చూపించారు. ఈ రెండు సినిమాల్లోనే కాక 'శ్రీకృష్ణ సత్య' (1971), 'శ్రీరామ పట్టాభిషేకం' (1978) చిత్రాల్లోనూ రావణ పాత్రలో కనిపించారు ఎన్టీఆర్.
ఆ మహానటులతో పాటు రావణ పాత్రని తీగెల వేంకటేశ్వర్లు (సీతా కల్యాణము - 1934), మునిపల్లె సుబ్బయ్య (సతీ సులోచన - 1936), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (మైరావణ - 1939), ఎం.వి. సుబ్బయ్యనాయుడు (భూకైలాస్ - 1940), రాజనాల (మైరావణ - 1964), కైకాల సత్యనారాయణ (సీతా కల్యాణం - 1976), నాగబాబు (శ్రీరామదాసు - 2006)లో పోషించారు. అందరూ బాలలతో గుణశేఖర్ రూపొందించిన 'రామాయణం' (1997)లో ఆ పాత్రని స్వాతి అనే అమ్మాయి పోషించడం విశేషం.
అయితే ఇవాళ రావణ పాత్ర చేయడానికి మోహన్‌బాబుని పురికొల్పింది నిస్సందేహంగా ఎన్టీఆర్, ఎస్వీఆర్ అనే చెప్పవచ్చు. అందుకే "రావణుడి కథాంశంతో గతంలో చాలా సినిమాలొచ్చినా, రావణావతారానికి సంబంధించిన పూర్తి వృత్తాంతంతో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నది రావణుడి పాత్ర ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించే సినిమా. ఆయన జననం నుంచి మరణం వరకూ ఈ కథ సాగుతుంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానటులు చేసిన పాత్రను నేను చేయబోతున్నా. వారి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా నా స్టైల్‌లో ఆ పాత్ర రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తా'' అని చెప్పారు మోహన్‌బాబు. ఆయన సంకల్పం సఫలీకృతం కావాలని ఆశిద్దాం.

Sunday, September 18, 2011

ఇంటర్వ్యూ: 'శ్రీరామరాజ్యం' నిర్మాత సాయిబాబు

'శ్రీరామరాజ్యం'కు శ్రీకారం ఎలా జరిగింది?
- ఓ ఆదివారం మధ్యాహ్నం రామసాయిమందిరం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. రాముడు గురించి సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న భావన అప్పుడే వచ్చింది. వెంటనే నా స్నేహితుడిని రమ్మని కబురుపెట్టాను. ఐదు నిమిషాల్లో వచ్చాడు. విషయం చెప్పగానే వెంటనే ముళ్ళపూడి రమణగారితో మాట్లాడించారు. వెంటనే బయలుదేరి చెన్నై వెళ్ళాం. మరుసటి రోజు బాపు-రమణగార్లను కలిశాం. అక్కడి నుంచి ఇళయరాజాగారిని కలిశాం. 'శ్రీరామరాజ్యం' శ్రీకారం చుట్టుకున్న వైనమిది.
ఇప్పటి రోజుల్లో పౌరాణికమంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. అనుకున్న బడ్జెట్‌లో తీయగలిగారా?
- మెరుపులాంటి ఆలోచన రావడమే తరువాయిగా అన్నీ హుటాహుటిన కుదిరాయి. ఈ చిత్రం పరిధి విస్తృతమైంది కాబట్టి ద్విభాషా చిత్రంగా తెరకెక్కించమని చాలా మంది సలహా ఇచ్చారు. సీత పాత్రకు ముందు మేం మాధురీదీక్షిత్‌ను సంప్రదించాం. తెలుగు, హిందీల్లో చిత్రీకరిస్తేనే నటిస్తానని చెప్పింది. కానీ ద్విభాషా చిత్రమంటే తెలుగుతనం మరుగునపడే ప్రమాదముంది. పలు చోట్ల రాజీపడాలి. సంగీతం నుంచి సన్నివేశాల వరకు ఎక్కడో ఏదో అడ్డు తగులుతూనే ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే బడ్జెట్ గురించి ఆలోచించలేదు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రామాయణాన్ని తెరకెక్కించాలన్నదే నా సంకల్పం అని బాపుగారితో చెప్పాను.
'లవకుశ' అని గాక 'శ్రీరామరాజ్యం' అనే టైటిల్ పెట్టడంలో ఉద్దేశం?
- ముళ్ళపూడివారు కొన్ని హిందీ పౌరాణిక చిత్రాల పేర్లు చెబుతూ మధ్యలో 'శ్రీరామరాజ్య్' అని అన్నారు. 'శ్రీరామరాజ్యం'... పేరు చాలా బాగుంటుంది కదా. మన చిత్రానికి ఆ పేరే ఖరారుచేసుకుందాం అనుకున్నాం. నెల్లోపే పాటల రికార్డింగ్ పనులు కూడా మొదలయ్యాయి.
జొన్నవిత్తులతోనే అన్ని పాటలూ రాయించారెందుకు?
- 'అందరి బంధువయ భద్రాచల రామయ్యా...' అని జొన్నవిత్తుల అంతకుముందే ఓ పాట రాశారు. అంతకన్నా సరళంగా ఇంకెవరు రాయగలరు? అనిపించింది. అందుకే ఆయనతో అన్ని పాటలూ రాయించాం. ఇళయరాజాగారి బాణీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా పాటల్ని ఇవాళ యువతే ఎక్కువగా ఇష్టపడుతోంది. అంత తాజాదనం గుబాళిస్తోంది గీతాల్లో.
చిత్రంలో మీకు బాగా నచ్చిన సన్నివేశం?
- మొదటి రోజు బాలకృష్ణగారు షూటింగ్‌లో ఉన్నారు. నేను కారు దిగి వెళ్తున్నాను. సీతాదేవిని భూదేవి తనతో తీసుకెళ్లే సన్నివేశమది. ముఖంలో పలు భావాలను పలికిస్తూ నటించాలి. దూరం నుంచి బాలకృష్ణ నటన చూస్తే చాలా ముచ్చటేసింది. ఆ తర్వాత ఆయన ఎన్ని సన్నివేశాలు చేసినా, నేను చూసినా... నాకు నచ్చింది తొలి సన్నివేశమే.
సీతారాములుగా నయనతార, బాలకృష్ణ నటన గురించి ఏం చెబుతారు?
- పూర్తిగా పాత్రలో లీనమై నటించే నటుడు బాలయ్య. ఈ చిత్రంలో నటించినన్నాళ్ళూ ఆయనలో ఏదో తేజస్సు కనిపించేది. అది దినదినప్రవర్ధమానమైనట్టు అనిపించింది. రాముడి పాత్రలో ఆయన్ని చూసిన కొంతమంది యువకులు 'అచ్చం రామారావుగారిలా ఉన్నారు కదా' అనడం స్వయానా నేనే విన్నాను. చాలా ఆనందమనిపించింది. అంతే భక్తి శ్రద్ధలతో నయనతార నటించింది. సీత పాత్ర చేసినన్నాళ్ళూ తను శాకాహారమే తీసుకుంది. ఏరోజూ గుడికెళ్ళకుండా సెట్‌కు రాలేదు. నేను చూసిన వారందరిలోకీ నయనతార గొప్ప వ్యక్తిత్వమున్న అమ్మాయి. తన వృత్తికి పూర్తి న్యాయం చేసే తరహా మనిషి.
వాల్మీకి పాత్రని చేయడానికి అక్కినేని గారు అంత సులువుగా ఒప్పుకున్నారా?
- అసలు ఈ చిత్రాన్ని ఎందుకు తీయాలనిపించింది అని ఆయన అడిగారు. 'ప్రతి మనిషికీ ఓ తృప్తి ఉంటుంది. ఈ సినిమా తీస్తే నేను తృప్తిగా ఉంటాను. రామాయణాన్ని ఎవరూ మర్చిపోకూడదు. రామచరిత్రలో లేనిది లేదు. ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ముల సఖ్యత, సుపరిపాలన, ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా మసలడం.. అంటూ అన్ని విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. విశ్వం ఉన్నంతకాలం రాముడుంటాడని నా నమ్మకం ' అని చెప్పాను. పెద్దాయన పాత్రను చేయడానికి అంగీకరించారు. వాల్మీకి పాత్రకు వందశాతం సరిపోయారు.
మిగతా పాత్రధారుల గురించి చెబుతారా?
- తక్కువ సన్నివేశాల్లో కనిపించినా జనకుడి పాత్రలో మురళీమోహన్ అచ్చుగుద్దినట్టు సరిపోయారు. లక్ష్మణుడి పాత్రకు శ్రీకాంత్ అయితే బాగుంటుందని అనుకున్నాం. చానాళ్ళు ఆయన కాల్షీటు కుదరలేదు. కానీ ఆఖరినిమిషంలో శ్రీకాంత్ కూడా మా యూనిట్‌లో కలవడం ముదావహం. లవకుశుల నుంచి... ప్రతి పాత్రధారీ ఈ చిత్రంలో చాలా గొప్పగా చేశారు.
సాంకేతికంగా ఈ సినిమా ఎలా ఉంటుంది?
- నేననుకున్నట్టు బాపుగారు కావ్యంలాగా తీర్చిదిద్దారు. ముళ్ళపూడివారి కథాకథనాల్ని తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారు. సాంకేతికంగా ఎక్కడా వెనకడుగేయలేదు. షూటింగ్ జరిగిన 85 రోజులూ జిమ్మీజిప్ మా దగ్గరే ఉంది. నాలుగు ప్రత్యేకమైన సెట్‌లు వేశాం. ఏ ఫ్రేమ్ చూసినా చాలా గొప్పగా, కనులపండువగా ఉంటుంది. పాటలను అత్యంత సౌందర్యవంతంగా తెరకెక్కించారు బాపుగారు. ఆద్యంతం భారీతనంతో తీర్చిదిద్దాం.
సినిమాని ఎప్పుడు విడుదల చేస్తున్నారు?
ప్రస్తుతం నేపథ్యసంగీతం పనులు జరుగుతున్నాయి. హంగేరి రాజధాని బుడాఫెస్ట్‌లో ట్రాక్ మిక్సింగ్ కార్యక్రమాలు త్వరలో ఉంటాయి. హంగేరి నుంచి ఎనిమిది మంది సభ్యులు ఇప్పుడున్న రీరికార్డింగ్ బృందంతో త్వరలో కలుస్తారు. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక డీఐ, డీటీయస్ పనులున్నాయి. వాటిని కూడా ముగించి అక్టోబర్ లోపు చిత్రాన్ని ప్రేక్షకులకు కనువిందు చేయాలనుకుంటున్నాం.

ప్రివ్యూ: యథార్థ ప్రేమకథ

కొంతకాలం క్రితం 'అనితా ఓ అనితా' అనే ప్రైవేట్ సాంగ్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. నాగరాజు అనే యువకుడు తన ప్రేయసిపై రాసి, స్వరాలు కూర్చి పాడిన పాట అది. అప్పట్లో ఆ పాట వెనుక కథ మీడియాలో ప్రముఖంగా రావడంతో కన్నడ నటుడు చరణ్‌రాజ్ దృష్టి దానిపై పడింది. తెలుగులో 'ప్రతిఘటన'తో విలన్‌గా పరిచయమై పాపులర్ అయిన అతను ఇప్పుడు నాగరాజు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా 'యథార్థ ప్రేమకథ' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ సి.ఆర్. క్రియేషన్స్ బేనర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు చరణ్‌రాజ్. అంతేకాదు కథ, స్క్రీన్‌ప్లేని కూడా తనే సమకూర్చి, చిత్రంలో ఓ కీలక పాత్ర సైతం చేస్తున్నాడు.
"హృదయాన్ని స్పృశించే సంఘటనలు, సన్నివేశాలతో ఈ సినిమా తయారవుతోంది. ఇందులోని ప్రేమకథతో పాటు, వినోదం కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అక్టోబర్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనేది మా సంకల్పం'' అని చరణ్‌రాజ్ తెలిపాడు.
అమర్, చిరి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సుత్తివేలు, నళిని, సుమన్‌శెట్టి, నర్సింగ్ యాదవ్, శరత్, చిన్నా, హర్ష, కీర్తి, చంద్రశేఖర్, ఫణి, గోపాలకృష్ణ, చందు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: ఎం.వి.ఎస్. హరనాథరావు, పాటలు: సురేందర్, నాగరాజు, సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: వంశీకృష్ణ పి., కూర్పు: వి. నాగిరెడ్డి, కళ: బాబా, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: చరణ్‌రాజ్ ఎన్.వై.

Friday, September 16, 2011

న్యూస్: 'ప్రియుడు'గా 'హ్యాపీడేస్' ఆశిస్తున్న హీరో

మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'బ్రమ్మిగాడి కథ'తో ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకున్న కుర్ర హీరో వరుణ్ సందేశ్ త్వరలో 'ప్రియుడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. 'హ్యాపీడేస్' సినిమాలోని నలుగురు హీరోల్లో మెయిన్ హీరోగా నటించి అందుకు తగ్గట్లే ఇవాళ ఆ నలుగురిలో ఎక్కువ సక్సెస్ సాధించిన వరుణ్ డ్రగ్స్ వివాదంలోనూ ముందున్నాడు. అతను డ్రగ్ ఎడిక్ట్ అయినట్లు బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే తాను అలాంటి వాటికి బహు దూరమని వరుణ్ ఖండించాడు. కొంత కాలంగా టాలీవుడ్‌ని డ్రగ్ రాకెట్ పీడిస్తోంది. కొంతమంది సీనియర్ హీరోలతో పాటు ఎక్కువమంది కుర్ర హీరోలు డ్రగ్స్‌కి బాగా అలవాటు పడ్డారని ఫిలింనగర్ కోడై కూస్తోంది. వరుణ్ రూపంలో కనిపిస్తున్న మార్పులు కూడా అతడు డ్రగ్స్‌కి బానిసయ్యాడేమోననే అనుమానాలు కలిగిస్తున్నాయని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు కూడా. ఏదేమైనా సినిమా కెరీర్ బాగా సాగినంత కాలం అతడికి వచ్చే నష్టమేమీ లేదు. ప్రస్తుత చిత్రం 'ప్రియుడు'లో అతడి సరసన ప్రీతికారావు అనే కొత్తమ్మాయి నటిస్తోంది. ఆమె మరెవరో కాదు, తెలుగులో మహేశ్ జోడీగా 'అతిథి'లో నటించిన అమృతారావు చెల్లెలు! ప్రీతికతో పాటు 'కొత్త బంగారులోకం' నాయిక శ్వేతాబసు కూడా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా శ్రావణ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. యూత్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో 'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' స్థాయి విజయాన్ని ఆశిస్తున్నాడు వరుణ్.

న్యూస్: నిర్మాతల పాలిట కొంగు బంగారం

కష్టపడి పనిచేసే తత్వం, సాధారణ జీవితం... రవితేజని స్టార్‌ని చేసిన గుణాలు. తన ప్రయారిటీస్ ఏమిటో అతడికి తెలుసు. అందుకు తగ్గట్లుగా కెరీర్‌ని మలచుకోడానికి అతనెంతో కష్టపడ్డాడు. దానికి దక్కిన ఫలమే ఈనాటి అతడి స్టార్‌డం. ఈమధ్య కొంతమంది 'లేట్ లతీఫ్'లు ఇండస్ట్రీలో తయారయ్యారు. సెట్స్ మీదకి ఎప్పుడో మధ్యాహ్నం 12 గంటలైతేగానీ రారు. కానీ రవితేజ మాత్రం పొద్దునే 7 గంటలకు షూటింగంటే అంతకు 5 నిమిషాల ముందే సెట్స్ మీదుంటాడు. ఈమధ్యే అతను శాకాహారిగా మారాడు. "ఈ అలవాటు మార్పు వల్ల నా ప్రవర్తనలోనూ మార్పు రావడం నాకే తెలుస్తోంది. కోపం, చిరాకు తగ్గిపోయాయి. రకరకాల శాకాహార పదార్థాల్లోని రుచిని అనుభవిస్తున్నా" అని చెప్పాడు.
ఓ ఔత్సాహిక దర్శకుణ్ణీ లేదంటే పేరున్న దర్శకుణ్ణీ మీరే హీరోతో చేయాలనుకుంటున్నారు అనడిగితే రవితేజ పేరే చెబుతారు. 'మిరపకాయ్' రిలీజయ్యాక చాలామంది జనం ఆ సినిమా డైరెక్టర్ హరీశ్ శంకర్‌ని కలిసి రవితేజని పరిచయం చేయాల్సిందిగా పీడించారు. అదీ రవితేజ మాస్ ఇమేజ్. అతని మొత్తం కెరీర్‌ని గమనిస్తే మాస్ జనానికి వినోదాన్నిచ్చే సబ్జెక్టులే ఎంచుకుని, తద్వారా తన మార్కెట్‌ని ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ వచ్చినట్లు అర్థమవుతుంది. పైగా బడ్జెట్ విషయంలోనూ అతడు ఆర్భాటాలకు ఎన్నడూ పోలేదు. తన మార్కెట్‌కు తగ్గ బడ్జెట్‌లోనే సినిమాలు చేస్తూ నిర్మాతల పాలిట కొంగు బంగారంగా మారాడు.
మిగతా మాస్ హీరోల సినిమాలకీ, అతడి సినిమాలకీ కొట్టొచ్చినట్లు కనిపించే తేడా ఒకటుంది. వాళ్లలోలేని కమెడియన్ రవితేజలో ఉన్నాడు. అందుకే అతడు బ్రహ్మాండమైన వినోదాన్ని ప్రేక్షకులకు పంచివ్వగలుగుతున్నాడు. అంతే కాదు, మిగిలినవాళ్లు ఏడాదికో సినిమా మాత్రమే చేస్తుంటే అతను మాత్రం మూడు సినిమాలకి తగ్గకుండా చేసుకుపోతున్నాడు. అందుకే ప్రతి యేటా హిట్లిస్తున్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఏ డైరెక్టరైనా హీరో నుంచి కోరుకునే ఎనర్జీ లెవల్స్ ఉండబట్టే వాళ్లని కూడా ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగిపోతున్నాడు 'మాస్ మహారాజా'.

న్యూస్: హీరోయిన్లకు 'మా' నోటీసులు

ఇప్పటివరకు తమ సంఘంలో సభ్యత్వం తీసుకోని కొంతమంది హీరోయిన్లకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నోటీసులు జారీ చేసింది. ముంబైతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి చోట్ల నుంచి పలువురు తారలు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొంతమంది 'మా'లో సభ్యత్వం తీసుకోకుండానే నటిస్తూ వస్తున్నారు. వీరివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాతలు వారిపై 'మా'కు ఫిర్యాదు చేసినా, వారు తమ సభ్యులు కాకపోవడంతో 'మా' ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా వారు సభ్యత్వం తీసుకోకపోవడంతోనే సుమారు 14 మంది హీరోయిన్లకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వారిలో చాలాకాలం నుంచే తెలుగు సినిమాల్లో నటిస్తున్న త్రిష, జెనీలియా, తమన్నాతో పాటు ఇటీవలి కాలంలో క్రేజ్ పొందిన సమంత, నిత్యమీనన్, పార్వతీ మెల్టన్ వంటి తారలు ఉన్నారు. సెప్టెంబర్ 30లోగా వీరు సభ్యత్వం తీసుకోకపోతే అక్టోబర్ 1 నుంచి వారికి సహకరించకూడదని 'మా' నిర్ణయించింది.

Thursday, September 15, 2011

'చిల్లర దేవుళ్లు' చెబుతున్న నిజాలు-3

(సెప్టెంబర్ 10 తరువాయి)
"అయితే తమ తెలుగు కొంత కాలానికి ఉర్దూగా మారేట్లుంది. ఆంధ్రోద్యమం ఎలా ఉందండీ?"
"రాజ్యం తురుష్కులది. ఉర్దూను అభివృద్ధి పర్చడం వారి లక్ష్యం. అందుకే 3.10.1918న ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. ఇక్కడ నాల్గవ తరగతి వరకు మాత్రమే తెలుగు. ఏడవ తరగతి దాకా తెలుగు రెండవ భాషగా ఉంటుంది. ఆ తరువాత చదువంతా ఉర్దూలోనే. విద్యావంతుల సంఖ్య వేయింటికి 82. అందులోనూ తురకల్లో 59 మంది కాగా, హిందువుల్లో 23 మంది. ప్రజాహిత కార్యాల్లో అభిరుచి కలవారంతా మహారాష్ట్రులే.
"తెలుగువారిలో విద్యాధికుడు ఎక్కడైనా వెక్కిరించినట్లు కనిపించినా, హైదరాబాద్ తన నగరమనీ, తెలుగు తన మాతృభాషా అనీ సాధారణంగా భావించడు. అతని వేషభాషల్లో ఆంధ్రత్వం వెదకాల్సి ఉంటుందని చెపితే సరిపోతుంది. తెలుగువారికి తమ భాషను గుర్తుకు తేవాలనే ఉద్దేశ్యంతో 1.9.1901 నాడు రెసిడెన్సీ బజార్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించబడింది. అందుకు కారకులు నాయని వెంకటరంగారావు బహద్దుర్‌గారు, కొమర్రాజు లక్ష్మణరావుగారు, రావిచెట్టు రంగారావుగారు.
"11.11.1922న కార్వే పండితుని అధ్యక్షతన నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభ సమావేశమైంది. అధ్యక్షులు కొంత ఇంగ్లీషులోనూ, కొంత మహారాష్ట్రలోనూ మాట్లాడితే తెలుగువాళ్లమైన మాకు మనస్తాపం కలిగింది. శ్రీ అల్లంపెల్లి వెంకట్రామారావుగారు ఒక ఉపన్యాసం తెలుగులో ఇవ్వపోగా, సభాసదులు, ముఖ్యంగా మహారాష్ట్రులు - చప్పట్లు చరిచి ఉపన్యాసకుడు ప్రసంగం ఆపుచేసి కూర్చొనేట్లు చేశారు. తెలుగువాళ్లు సభ ముగియకముందే వెళ్లిపోయారు. తెల్లవారి ట్రూపు బజారులో టేకుమాల రంగారావుగారి ఇంట్లో పదకొండుగురం ఆంధ్రులం సమావేశమై నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘం స్థాపించాం. నిజాం రాష్ట్రంలోని తెలుగువారిలో పరస్పర సహానుభూతి కలిగించి, వారి అభివృద్ధికోసం ప్రయత్నించడం, సంఘాలను స్థాపించడం దాని ముఖ్య ఉద్దేశ్యాలు."
"అయితే రాజకీయ లక్ష్యాలేం లేవన్నమాట."
"నిజాం రాష్ట్రపు రాజకీయాలు విచిత్రమైనవి. ఇక్కడ పోలీసులు రాక్షసుల్ని తలతన్నినవారు. 1919లో ఒక ఫర్మానా ద్వారా నిజాం నవాబు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలును విస్తరింపజేస్తే అందుకు కృతజ్ఞత తెలియజేయడానికి జరిగిన సభలే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సభలు. భారతదేశంలో వ్యాపించిన ఖిలాఫత్ ఉద్యమం హైదరాబాదుకు కూడా వ్యాపించి 20, 25 వేల మందితో బహిరంగసభలు జరగడం ఇక్కడ మామూలైపోయింది. హిందూ ముస్లిముల ఐక్యం బలపడ్డం చూసి ప్రభుత్వానికి కన్నుకుట్టింది. హిందువులతో కలిశారనే నేరానికి కొందరు ముస్లిం యువకుల్ని అరెస్టు చేసి మన్ననూరు పంపడం జరిగింది."
(ఇంకావుంది)

Wednesday, September 14, 2011

న్యూస్: 'మొగుడు' మీద ఆశలెన్నో!

కె. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'ఝుమ్మంది నాదం' రిలీజయినప్పుడు తాప్సీ రూపంలో టాలీవుడ్‌కి మరో ఇలియానా పరిచయమయ్యిందనే టాక్ వచ్చింది. 'దేవదాసు', 'పోకిరి' సినిమాలతో ఇలియానా హాటెస్ట్ హీరోయిన్ అయిన విధంగానే తాప్సీ కూడా అమిత క్రేజ్ సంపాదించుకుంటుందని అనుకున్నారు. చిత్రంగా నాలుగు సినిమాలు రిలీజైనా ఆమెకి తెలుగులో అనుకున్నంత క్రేజ్ రాలేదు. 'పోకిరి' తరహా హిట్ ఆమెకి రాకపోవడమే దీనికి కారణమని చెప్పాలి. అందచందాల విషయంలో ఏమాత్రం వంకపెట్టలేని రీతిలో ఉండే ఈ పంజాబీ ముద్దుగుమ్మ 'ఝుమ్మంది నాదం' తర్వాత 'వస్తాడు నా రాజు', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'వీర' సినిమాల్లో చేసింది. వీటిలో 'మిస్టర్ పర్ఫెక్ట్' ఒక్కటే హిట్టు. అందులోనూ ఆమె చేసింది సెకండ్ హీరోయిన్ కేరక్టరే. ఫలితంగా అనుకున్నంతగా ఆమె కెరీర్ ఊపందుకోలేదు. టాప్ హీరోల సరసన ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే సినిమా చేస్తోంది. ఆ సినిమా 'మొగుడు'. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆమె గోపీచంద్ సరసన నటిస్తోంది. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాపై తాప్సీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ మధ్య రొమాంటిక్ సీన్లు ఆడియెన్స్ మతులు పోగొడతాయని ఆ సినిమా యూనిట్ మెంబర్స్ అంటున్నారు. రొమాంటిక్ సీన్లు తీయడంలో కృష్ణవంశీది అందె వేసిన చెయ్యి కావడంతో తాప్సీ అందాలు ఈ సినిమాలో కనువిందు చేస్తాయని ఊహించవచ్చు. బాలీవుడ్‌లో 'చష్మే బద్దూర్' అనే సినిమాని సిద్ధార్థ్‌తో చేయబోతున్న తాప్సీకి 'మొగుడు' ఎలాంటి కానుకనిస్తాడో చూడాల్సిందే.

Tuesday, September 13, 2011

న్యూస్: '1947 ఎ లవ్‌స్టోరీ'ని తెలుగులో ఊహించగలమా?

డబ్బింగ్ సినిమాలు డబ్బు దోచుకు పోతున్నాయనీ, స్ట్రెయిట్ సినిమాలకి థియేటర్లు దొరకడం లేదనీ గగ్గోలు పెడుతున్న వాళ్లంతా ఇవాళ తమిళం నుంచి దిగుమతి అవుతున్న సినిమాల్ని చూసి తెలివి తెచ్చుకోవాలి. నాలుగు రోజులు ఆలస్యంగానైనా '1947 ఎ లవ్‌స్టోరీ' అనే ఓ మంచి, అందమైన సినిమాని చూసే అవకాశం కలిగింది. మన డైరెక్టర్లు ఎప్పటికి ఇలాంటి సినిమా తీయగలుగుతారు? 'శివపుత్రుడు' వచ్చినా తమిళంలోనే రావాలి. 'జెంటిల్‌మన్', 'భారతీయుడు' వచ్చినా తమిళంలోనే రావాలి. ఇప్పుడు '1947 ఎ లవ్‌స్టోరీ' కూడా అదే భాషలో వచ్చింది. తమిళ దర్శకుల సృజనాత్మక శక్తికి ఈ సినిమా మరో మంచి ఉదాహరణ. 1947 స్వాతంత్ర్యం వచ్చే సందర్భంలో అప్పటి మద్రాసు నేపథ్యాన్ని ఎంత చక్కగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ చూపించాడు! చాకలి కుర్రాడు మల్లి (ఆర్య), బ్రిటీష్ గవర్నర్ కూతురు ఎమీ (ఎమీ జాక్సన్) మధ్య చిగురించిన అనురాగాన్ని ఎంత చక్కదనంగా చిత్రించాడు! అదీ సినిమానంతా ఎమీ పాత్ర దృష్టి నుంచి చూపించడం ఎంత బాగుంది! మల్లి, ఎమీ పాత్రలతో మనం కూడా ట్రావెల్ అయ్యామంటే వాటితో మనం ఎంతగా సహానుభూతి చెందిదే సాధ్యపడుతుంది! ఆ పాత్రల్ని ఆర్య, ఎమీ జాక్సన్ పోషించిన తీరు కూడా దానికి దోహదం చేసింది. సినిమాలో కనిపించే ప్రతి వస్తువుకీ, ప్రతి పాత్రకీ ప్రాధాన్యత ఉండటం ఈ సినిమాలో కనిపించిన మరో విశేషం. విజయ్ దర్శకత్వ ప్రతిభ వికసించింది ఈ విషయంలోనే. అందుకే 80 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా రెండో వారానికి 120 ప్రింట్లకు చేరుకుంటోంది. బ్రిటీష్ నేపథ్యంతో మనవాళ్లు సినిమా తీస్తే ఎలా ఉంటుందో వెంకటేశ్ హీరోగా వచ్చిన 'సుభాష్ చంద్రబోస్' మంచి ఉదాహరణ. కె. రాఘవేంద్రరావు వంటి దిగ్దర్శకుడు కూడా అంత ఘోరంగా ఆ సినిమాని అలా మలవడం ఆశ్చర్యమనిపిస్తుంది. అందుకే ఆ సినిమాకి ప్రింట్ ఖర్చులు కూడా రాలేదని దాని నిర్మాత సి. అశ్వనీదత్ వాపోయాడు. '1947 ఎ లవ్‌స్టోరీ' వంటి సినిమాలు చూసైనా మన దర్శకులు కథల విషయంలో, సన్నివేశాల సృష్టి విషయంలో సృజనాత్మకంగా ఆలోచిస్తే డబ్బింగ్ సినిమాల తాకిడి ఎక్కువవుతున్నదని బాధ పడాల్సిన అవసరం రాదు.

Monday, September 12, 2011

ఇంటర్వ్యూ: తనీశ్

ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు?
- 'సలామత్' షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. క్లైమాక్స్, పాటలు మిగిలున్నాయి. 'మేం వయసుకు వచ్చాం' రెగ్యులర్ షూటింగ్ 12 నుంచి జరగబోతోంది. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాతో త్రినాథ్ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేస్తున్నారు.
'మేం వయసుకు వచ్చాం'లో మీ కేరక్టర్ ఎలా ఉంటుంది?
- ఇందులో నేను చేసే పాత్రలో రెండు ఛాయలున్నాయి. ఇంటర్మీడియేట్ పూర్తయి ఇంజనీరింగ్‌లో చేరే పదహారేళ్ల కుర్రాడిగానూ, ఆ తర్వాత పరిణతి చెందిన యువకుడిగానూ కనిపిస్తా. ఇది సిటీ నేపథ్యంలో నడిచే కథ. నేటి విద్యార్థుల ఆలోచనలు, ఆశయాలు ఎలా ఉన్నాయనే దాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఎక్కువ సన్నివేశాలు నాటకీయంగా కాక సహజంగా ఉంటాయి. 'నచ్చావులే' తర్వాత నేను చేస్తున్న మంచి ప్రేమకథ. డైరెక్టర్ త్రినాథ్ చెప్పిన కథలోని పాయింట్, స్క్రీన్‌ప్లే విపరీతంగా నచ్చేశాయి. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. నా కెరీర్‌లోని మంచి సినిమాల్లో కచ్చితంగా నిలబడే సినిమా 'మేం వయసుకు వచ్చాం'.
మీ దృష్టిలో ప్రస్తుతం మీ కెరీర్ ఎలా నడుస్తోంది?
- కెరీర్‌లో ఎవరికైనా ఎత్తు పల్లాలు ఉంటాయి. ప్రతి సినిమాకీ బాగా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తా. ప్రస్తుతం నా కెరీర్ గొప్పగా లేదు, అలాగని అసంతృప్తికరంగానూ లేదు. స్మూత్‌గానే నడుస్తోంది.
ఎలాంటి పాత్రల్ని చేయడానికి ఇష్టపడతారు?
- ఏదో ఒక తరహా సినిమాలకి పరిమితమవ్వాలని అనుకోవట్లేదు. నటుడన్నాక అన్ని రకాల పాత్రలూ చెయ్యాలి. ఇప్పుడు నేను చేస్తున్నవి జనం టిక్కెట్ పెట్టి చూడదగ్గ సినిమాలు. 'సలామత్' ఇంటెన్స్ లవ్‌స్టోరీ అయితే, 'మేం వయసుకు వచ్చాం' క్యూట్ లవ్‌స్టోరీ.
తెలుగులో హీరోలు చాలామంది ఉన్నారు కదా. ఆ పోటీని ఎలా ఎదుర్కోబోతున్నారు?
- మిగతా హీరోలతో నాకు పోటీ ఉన్నట్లు అనుకోను. నేను నా కెరీర్ గురించే ఆలోచిస్తా. ఇంతమంది హీరోలు తెలుగులో ఉండటం గొప్ప విషయం. మా అమ్మానాన్నల తర్వాత నేను భయపడేది నాని (హీరో) అన్నయ్యకే. 'రైడ్' చేసినప్పట్నించీ మా మధ్య మంచి అనుబంధం ఉంది. అతని సలహాలు తీసుకుంటూ ఉంటా.
మీమీద ఏ హీరో ప్రభావం ఉంది?
- ప్రత్యేకంగా ఏ ఒక్కరో అని కాకుండా చాలామంది హీరోల ప్రభావం నాపై ఉంది. చిరంజీవి గారి డాన్సులంటే చిన్నప్పట్నించీ ఇష్టం. అలాగే నాగార్జున, మహేశ్, శ్రీకాంత్, బన్నీ వంటి వాళ్ల ప్రభావం నా మీద ఉంది.
ఈ యేడాది మీకు ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
- 'కోడి పుంజు' ఏ సెంటర్లలో ఆడకపోయినా బీ, సీ సెంటర్లలో బాగా పేరు తెచ్చుకుంది. నేను యాక్షన్ చేయగలనన్న నమ్మకాన్నిచ్చింది. ఈ ఏడాది నేను నటించిన మరో సినిమా 'మంచివాడు' మంచి సినిమా అవుతుందని గట్టిగా నమ్మాం. అయితే అది సరైన సమయంలో పడలేదు.
చైల్డ్ ఆర్టిస్టు నుంచి హీరోగా ఎదిగారు కదా. ఈ రెండు దశల్లో ఏది బాగుంది?
- బాల నటునిగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే అప్పుడు నామీద ఎలాంటి బాధ్యతా ఉండేది కాదు. ఇప్పుడు హీరోని కాబట్టి అన్నీ శ్రద్ధగా చూసుకోవాల్సి వస్తుంది. లేదంటే 'వీడు ఇలాంటి సినిమా చేశాడేంట్రా' అంటారు. ఈ బాధ్యతని నిర్వహించడం కొంచెం కష్టమే కానీ ఇష్టమైంది.
మీరు చేసిన వాటిలో మీ ఫేవరేట్ సినిమాలు?
- బాలనటునిగా 'దేవుళ్లు', హీరోగా 'నచ్చావులే' నా ఫేవరేట్ సినిమాలు.

న్యూస్: డైరెక్టర్‌గా మళ్లీ ఫెయిలైన చక్రి

జగపతిబాబుతో రెండు యాక్షన్ సినిమాలు 'సిద్ధం', 'హోమం' సినిమాలు డైరెక్ట్ చేసిన జేడీ చక్రవర్తి - ఆ రెండు సినిమాలూ ఆశించిన రీతిలో ఆడకపోవడంతో బాణీ మార్చి కామెడీ తీయాలనుకున్నాడు. తన ధోరణికి యాక్షన్ సినిమా సరిపడదనీ, కామెడీయే కరెక్టనీ ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అందుకు తగ్గట్లు 'మనీ' సీరిస్‌లో మూడో సినిమా 'మనీ మనీ మోర్ మనీ'ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామి గానూ వ్యవహరించాడు. కానీ టైటిల్‌కి పూర్తి భిన్నంగా అట్టర్ ఫ్లాపై 'లెస్ మనీ'నే తెచ్చింది.
సినిమా చూసిన వాళ్లకి బాలీవుడ్ సినిమా 'దర్వాజా బంద్ రఖో' జ్ఞాపకమొచ్చింది. అందులో లేనిదీ, 'మనీ మనీ మోర్ మనీ'లో ఉన్నదీ బ్రహ్మానందం చేసిన ఖాన్ దాదా కేరక్టరే. చక్రి దర్శకత్వంలో లొసుగులు, బోర్ కొట్టించిన నెరేషన్, నవ్వు తెప్పించని కామెడీ సీన్లు, ఏ సీనులోనూ ఎమోషన్ పండకపోవడం, మొత్తంగా వినోదం లోపించడంతో ఈ సినిమా ప్రేక్షకులకి విసుగు తెప్పించింది. ఈ సినిమాలోని ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏమంటే తారా అలీషా గ్లామర్. పొట్టి దుస్తుల్లో కుర్రకారుని కాసేపు ఆమె అలరించింది. అంతే. టైటిల్‌తో పోలిస్తే ఈ సినిమా ఆడియెన్స్ 'మనీ'కి తగ్గ వర్త్ ఉన్నది కాదని తేలిపోయింది. తనని తాను 'సో' ఇంటలిజెంట్‌గా భావించుకునే చక్రి ఇకనుంచైనా ఇతర విషయాల కంటే సినిమా మేకింగ్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తేనే అతడి సినిమాలు ప్రేక్షకులకి చేరువయ్యే అవకాశాలు ఉంటాయని విమర్శకులు సూచిస్తున్నారు.

Sunday, September 11, 2011

న్యూస్: 'సంక్రాంతి అల్లుడు'గా సెక్స్ సినిమాల స్టార్

'గుప్త శాస్త్రం', 'వయసు కోరిక', 'పిక్నిక్' వంటి బి గ్రేడ్ సినిమాల హీరోగా ఒకప్పుడు ఒక తరహా ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్న యాదా కృష్ణ ఇప్పుడు 'సంక్రాంతి అల్లుడు' అనే ఫ్యామిలీ సినిమాతో మహిళల్ని ఆకట్టుకోవాలని భావిస్తున్నాడు. అప్పట్లో యాదా కృష్ణ సినిమా అంటే సెక్స్ సినిమా అనే ముద్రే ఉండేది. దాంతో కాలేజీ కుర్రకారు ఆ సినిమాలకి ఎగబడేది. అందువల్లే 'గుప్త శాస్త్రం', 'వయసు కోరిక' వంటి సినిమాలు నిర్మాతలకి కనక వర్షం కురిపించాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న యాదా కృష్ణ కొంతకాలం సినిమాలకు దూరమయ్యాడు. మళ్లీ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవాలని ఆయన భావిస్తున్నాడు. అయితే ఈసారి ఆయన ఫ్యామిలీ ఆడియెన్స్‌ని టార్గెట్‌గా చేసుకున్నాడు. అందుకు తగ్గట్లు 'సంక్రాంతి అల్లుడు' అనే సినిమా చేశాడు. ఇందులో అతగాడికి ఇద్దరు హీరోయిన్లున్నారు. వాళ్లు సునాక్షి, రేష్మి. వి.వి.వి. సత్యనారాయణ దర్శకుడు. ఆరేళ్ల క్రితం కూడా 'ఇరుకింట్లో ఇద్దరు పెళ్లాలు' సినిమా చేసిన యాదా కృష్ణ ఇప్పుడు మరోసారి ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడం, దాన్ని ప్రేక్షకులు చూడాల్సి రావడం వాళ్లకి దక్కిన భాగ్యంగానే భావించాలి.
"చక్కటి ఫ్యామిలీ డ్రామాతో కూడుకున్న సినిమా ఇది. మామ, అల్లుడు మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ప్రేక్షకును ఆకట్టుకుంటుంది. ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను ఇప్పటి వరకు 23 చిత్రాల్లో నటించా. వాటన్నింటిలోకి ఇది భిన్నమైనది. ఎక్కువ థియేటర్లలో క్యూబ్, ఈఎఫ్ఓ, పీఎక్స్‌డీ ద్వారా, కొన్ని ప్రింట్లతోనూ విడుదల చేస్తున్నాం'' అని చెప్పాడు యాదా కృష్ణ. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదలవుతోంది. సో.. ఒకప్పటి బి గ్రేడ్ సినిమాల స్టార్ హీరో ఇప్పుడు ఫ్యామిలీ సినిమాల స్టార్‌గా మారాలని ఆశిస్తున్నాడన్న మాట. మరి మన ప్రేక్షకులేమంటారో...

న్యూస్: నరేశ్ కెరీర్‌కి మరో మలుపు 'మడత కాజా'!

కత్తి కాంతారావు, అహ నా పెళ్లంట, సీమటపాకాయ్... ఇవి అల్లరి నరేశ్ హ్యాట్రిక్ హిట్లు. ప్రస్తుతం చిన్న సినిమాల కొంగు బంగారంగా మారిన హీరో ఎవరయ్యా అంటే అందరి నోళ్లూ నరేశ్ పేరే చెబుతున్నాయి. మినిమం గ్యారంటీ కామెడీ హీరోగా టాలీవుడ్‌లో నిలదొక్కుకున్న నరేశ్ త్వరలో 'మడత కాజా'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతని సరసన బాలీవుడ్ క్యూట్ గర్ల్ స్నేహా ఉల్లాల్ నాయికగా నటించిన ఈ సినిమా ద్వారా సీతారామరాజు దంతులూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. 'అలా మొదలైంది' నిర్మాత దామోదర్ ప్రసాద్ సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా సినిమాని విడుదల చేయాలని నిర్మాత వేదంరాజు టింబర్ భావిస్తున్నారు.
"ఇది పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్. మాటల్తో గారడీ చేసే పాత్రని నరేశ్ చాలా బాగా చేశారు. 'మడత కాజా' అనే టైటిల్ ఆయన పాత్ర తీరుని తెలియజేస్తుంది. హీరో హీరోయిన్లకి సంబంధించిన లవ్‌స్టోరీ కూడా చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది" అని దర్శకుడు చెప్పాడు. టాలీవుడ్‌లోని అనేకమంది కమెడియన్లు నటించిన ఈ సినిమాకి ఇప్పటికే డైరెక్టర్‌గా మారి నరేశ్‌తోటే 'దొంగలబండి'ని తీసిన వేగేశ్న సతీశ్ సంభాషణలు రాశాడు.
తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ హఠాన్మరణంతో మంచి గైడ్‌ని కోల్పోయిన నరేశ్ ఇప్పుడు తన కెరీర్‌ని ఎలా మలచుకుంటాడనేది చాలామందికి ఆసక్తికరంగా మారింది. 'అహ నా పెళ్లంట', 'సీమటపాకాయ్' సినిమాలు ఆయన ఉండగానే ఒప్పుకుని చేసిన సినిమాలు. ఆయన మరణానంతరం నరేశ్ చేసిన తొలి సినిమా 'మడత కాజా'. అతని జడ్జిమెంట్ ఎలా ఉండబోతుందో ఓ నెల రోజుల్లోపల తేలిపోనున్నది.