Thursday, September 2, 2010
Movies: Can 'Parama Veera Chakra' repeat the magic?
బోయపాటి శ్రీను డైరెక్షనులో వచ్చిన 'సింహా' సూపర్ హిట్టవడంతో ఆ సినిమా హీరో బాలకృష్ణకు దాదాపు గత వైభవం వచ్చినంత పనయ్యింది. 'నరసింహనాయుడు' తర్వాత మరో పెద్ద హిట్ లేదని బాధపడుతున్న ఆయన అభిమానులకు ఎంతో కొంత ఊరట కలిగించింది 'సింహా'. ఏమైతేనేం ఆ సినిమా విడుదల తర్వాత ఆయనతో సినిమాలు చెయ్యాలని డైరెక్టర్లు ఉబలాట పడుతున్నారు. ఫార్ములా కథలతో సినిమాలు చెయ్యాలనుకునే డైరెక్టర్లు ఆయనను దృష్టిలో పెట్టుకుని కథలు వండటానికి తమ రచయితల్ని పురమాయిస్తున్నారు. దర్శకరత్న అని అభిమానులు పిలుచుకునే దిగ్దర్శకుడు దాసరి నారాయణరావు సైతం తన 150వ సినిమాకి హీరో బాలకృష్ణ అయితేనే గౌరవమని భావించారంటే 'సింహా' పవర్ అర్థమవుతుంది. ఆ ఇద్దరి తొలి కాంబినేషనులో రూపుదిద్దుకుంటున్న 'పరమవీరచక్ర' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోననే అంచనాలు వేసుకోవడంలో మునిగిపోయారు బాలయ్య అభిమానులు. ఇదివరలో ఎన్టీ రామారావు, దాసరి కాంబినేషనులో వచ్చిన 'మనుషులంతా ఒక్కటే', 'సర్దార్ పాపారాయుడు', 'బొబ్బిలిపులి' సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి ఘనవిజయం సాధించాయి. అదే మ్యాజిక్ ఇప్పుడు బాలకృష్ణ, దాసరి కలయిక సాధిస్తుందనేది వాళ్ల నమ్మకం. అందుకు తగ్గట్లే దాసరి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 'పరమవీరచక్ర'ని తీర్చిదిద్దుతున్నారు. ఆయన మునుపటి సినిమా 'యంగ్ ఇండియా' ఫ్లాపవడంతో ఆ కసి కూడా ఆయనలో కనిపిస్తోంది. ఆయన ఓ సూపర్ హిట్ సినిమా తీసి ఎన్నో ఏళ్లయిపోయింది. ఈ నేపథ్యంలో 'పరమవీరచక్ర'ని ఆయన ఎలా తీస్తున్నారనే క్యూరియాసిటీ చాలామందిలో ఏర్పడింది. ఇది దేశభక్తి సినిమా కాలం కాకపోయినా ఆయన బాలకృష్ణతో అలాంటి సినిమా తీసి మెప్పించగలరా? వెయిట్ అండ్ సీ..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment