Wednesday, September 1, 2010

Interview: Edida Nageswara Rao


తెలుగు చిత్రసీమలో శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, సీతాకోకచిలుక వంటి చిత్రాలకి గొప్ప స్థానముంది. వీటిని ఆణిముత్యాలని కొంతమందీ, కళాత్మక చిత్రాలని ఇంకొంతమందీ పేర్కొంటూ వుంటారు. వీటన్నింటినీ నిర్మించిన నిర్మాత ఒక్కరే. ఆయన ఏడిద నాగేశ్వరరావు. దాదాపు నాలుగు దశాబ్దాల కాలంలో పూర్ణోదయా క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన ఒక్కో సినిమా ఒక్కో కళాఖండంగా భాసించింది. దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఆయనది గొప్ప కాంబినేషనుగా పేరు తెచ్చుకుంది. ఇన్నేళ్ల ప్రస్థానంలో ఆనాటి, ఈనాటి తెలుగు సినిమా స్థితిగతుల్నీ, పరిణామాల్నీ ఆయన బేరీజు వేశారు. ఆ ముఖ్యాంశాలు..
సినిమావల్లే గుర్తింపు
మాకు గుర్తింపు వచ్చిందంటే తెలుగు సినిమా వల్లే. మేం తీసిన సినిమాల వల్లే. కొంతమంది మహానుభావులు వేసిన బీజం మహావృక్షంలా ఎదిగి, ఇవాళ లక్షలాదిమందికి ఉపాధినిస్తూ దేశంలోనే హిందీ తర్వాత ఎక్కువ సినిమాలు తీస్తున్న పరిశ్రమగా రాణిస్తోంది.
కథల్లో ఆత్మ ఏదీ?
తెలుగు సినిమా ఎంతో ఎదిగింది. కానే నేడు వెర్రితలలు వేస్తోంది. సున్నితత్వం స్థానంలో అసభ్యత, అశ్లీలత ప్రవేశించాయి. కథకి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు టెక్నిక్ దే రాజ్యం. కథల్లో ఆత్మ అనేది కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు ఏ సినిమాలు వస్తున్నాయో, పోతున్నాయో ఎవరికీ జ్ఞాపకం ఉండటం లేదు.
అది సృజనాత్మకత కాదు
అప్పట్లో మేం ఎంతో ప్లానింగుతో సినిమాలు నిర్మించేవాళ్లం. స్క్రిప్టుని పక్కాగా సిద్ధం చేసుకుని, సెట్స్ మీదకు వెళ్లేవాళ్లం. కాబట్టి తెరమీద కనిపించే సినిమా నిడివికి కొంచెం ఎక్కువగా మాత్రమే ఫిల్మ్ ఖర్చయ్యేది. 50 వేల ఫుటేజ్ వచ్చిందంటేనే చాలా ఎక్కువగా వచ్చిందనీ, ఫిల్మ్ చాలా వృథా అయ్యిందనీ భావించేవాళ్లం. కానీ ఇవాళ లక్ష కాదు, రెండు మూడు లక్షల అడుగుల ఫిల్ముని తింటున్న దర్శకులు వున్నారు. దీన్ని ఎదుగుదల అనాలో, పిచ్చితనమనాలో తెలీడం లేదు. ఎంత ఎక్కువ ఫిల్మ్ తింటే అంత సృజనాత్మకత అనుకుంటుంటే బాధ కలుగుతుంటుంది.
రాజీపడటం ఇష్టంలేదు
ఇప్పుడున్న పరిస్థితులతో రాజీపడలేకనే సినిమాలు తీయడం లేదు. నేను తీసిన చివరి సినిమా చిరంజీవితో చేసిన 'ఆపద్బాంధవుడు' (1992). అప్పట్లో నిర్మాతలకి దర్శకులు, హీరోలు గౌరవమిచ్చేవాళ్లు. సినిమా రూపకల్పన విషయంలోనూ నిర్మాత మాటలకి వాళ్లు విలువనిచ్చేవాళ్లు. 'సీతాకోకచిలుక'ని దర్శకుడు భారతీరాజా మొదట విషాదాంతంగా తీశాడు. అది నాకు నచ్చలేదు. మతాంతర, కులాంతర ప్రేమల్ని సుఖాంతం చేస్తేనే బాగుంటుందని నేను పట్టుబట్టిన మీదట కన్విన్స్ అయిన భారతీరాజా అప్పుడు క్లైమాక్సుని మార్చాడు. ఇప్పుడు అలాంటిదాన్ని కనీసం ఊహించలేం. అందుకే ఈ హీరోలతో, దర్శకులతో రాజీపడటం ఇష్టంలేకనే నేను సినిమాలు తీయడం లేదు. నేను కేవలం డబ్బుపెట్టి సినిమాని దర్శకుల మీదనో, మరొకరి మీదనో వదిలేసే తరహా నిర్మాతని కాను. అన్ని శాఖల్లోనూ నా ప్రమేయం ఉంటుంది.
'స్వరకల్పన' ఒక్కటే
నేను తీసిన సినిమాలన్నీ మంచి పేరు తెచ్చుకున్నవే, ఒక్క 'స్వరకల్పన' తప్ప. దాన్ని వంశీ దర్శకత్వంలో మా అబ్బాయి శ్రీరాంని హీరోగా పెట్టి తీశా. డబ్బేమీ నష్టపోలేదు కానీ, మేకింగ్ పరంగా అది నాకు అసంతృప్తిని కలిగించింది.

No comments: