Thursday, August 5, 2010
Arts: Dance Field is Part of Business
కళ, వ్యాపారం - రెండూ దేనికవే భిన్న రంగాలైనప్పటికీ ఈ రోజున కళ కూడా వ్యాపారం కావడం అవాస్తవం కాదు. కళాన్వేషణలో వ్యాపార దృక్పథానికి తావేలేదనేది నిన్నటి మాటగా మిగిలిపోయింది. ఇప్పుడు భారతదేశపు శాస్త్రీయ నృత్యరంగంలో వ్యాపార శక్తుల ప్రభావం అడుగడుగునా గోచరిస్తుంది. లాభం పొందాలనే యోచన కళారంగాన్ని సైతం నిర్దేశించగలిగేంత శక్తివంతమైనదిగా దీన్నిబట్టి అర్థమైపోతోంది. గడచిపోయిన మూడు దశాబ్దాలను గమనిస్తే ఈ సత్యం బాగా అవగతమవుతుంది. 1960-65 మధ్య భరతనాట్యం దేశాన్ని ఓ ఊపు ఊపింది. కథక్ కూడా గొప్ప నాట్యకళే అయినా భరతనాట్యానికి ఉన్నంత ఆదరణ దానికి రాలేదు. హైదరాబాద్, చెన్నై, మైసూరు, ముంబాయ్ వంటి నగరాల్లో డాన్స్ స్కూళ్లు భరతనాట్యానికే ప్రాముఖ్యతనిస్తూ అందులోనే ఎక్కువగా శిక్షణ ఇస్తున్నాయి. నాట్యమంటే భరతనాట్యమే తప్ప మరొకటి కాదు అని జనం అనుకునే స్థాయిలో అది ప్రాభవం సంపాదించింది. ఈ క్రమంలో మరో నృత్య విధానం భరతనాట్య స్థానానికి చేరుకోలేకపోయింది.
అటు నాగరిక ప్రపంచంలోను, ఇటు అనాగరిక ప్రపంచంలోను నాట్యకళ మనకి కనిపిస్తుంది. పశుపక్ష్యాదులు సైతం ఇందుకు మినహాయింపు కాదు. "మానవుని ఆంతరంగిక భావోద్రేకాలు పొంగి పొరలి, అంగ ప్రత్యంగ గమన విన్యాస భంగిమా వైఖరులుగా పరిణమించు వ్యక్తి విలాసమే" నాట్యం.
నాట్యం ఓ భాష. కళ్లకీ, ముఖానికీ, చేతులకీ, కాళ్లకీ అని లేకుండా అన్ని అవయవాల కదలికలకి సంబంధించినదే నాట్యం. రాక్షస సంహారంలో 'కాళి' చేసిన నాట్యానికి ఓ ప్రత్యేకత చేకూరింది. ఈ విశిష్టమైన నాట్యం కదిలే ప్రతి జీవిలో నిక్షిప్తమై వుండే సహజశక్తి. ఆనందంలో, భయంలో, రౌద్రంలో, విషాదంలో - అంతెందుకు, నవరసాల్లోనూ నాట్యం వొలుకుతూనే వుంటుంది. నాట్య శాస్త్రాన్ని రచించిన భరతముని పేరిట భరతనాట్యం ప్రసిద్ధి చెందినా దానికి విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చింది మాత్రం స్త్రీలే.
నృత్య విధానాలు ఎన్ని వున్నప్పటికీ అందులో ఆదాయాన్ని సముపార్జించే నృత్య విధానంగా మాత్రం భరతనాట్యం బాగా ఖ్యాతి తెచ్చుకుంది. హైదరాబాద్, ముంబాయ్ వంటి మహానగరాల్లో కొన్ని సాంస్కృతిక సంస్థలు, సంఘాలు ఈ భరతనాట్య ప్రదర్శనల ద్వారా సొమ్ము చేసుకుంటున్నాయి. అయితే దానితోపాటుగా స్థానిక కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. తాము ఆదాయాన్ని పొందుతూనే నృత్య కళాకారిణులు ఆయా కళాసంస్థలకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నారు. కానీ కళారంగంలో ఈరోజున నెలకొన్న దురదృష్టకరమైన సంప్రదాయానికి కాస్త చింతించాల్సే ఉంది. తమ తరపున ప్రదర్శన ఇస్తే ఆ కళాకారిణికే పేరు వస్తుందని అటు సాంస్కృతిక సంస్థలూ, ఫలానా సంస్థ తరపున ప్రదర్శన ఇస్తేనే తమకు ఖ్యాతి వస్తుందని ఇటు కళాకారిణులూ భావిస్తున్నారు. ఫలితంగా కళారంగంలో ఎంత లేదనుకున్నా వ్యాపార దృక్పథం చోటుచేసుకుంటున్నది.
కాలక్రమంలో భరతనాట్య కళాకారిణుల సంఖ్య బాగా పెరిగిపోతూ రావడం చేత ప్రజలకు ఈ నాట్యం పట్ల ఆసక్తీ, మోజూ తగ్గిపోయాయి. దాంతో 'ఒడిస్సీ' నృత్యానికి ఆదరణ పెరిగింది.
1950 ప్రాంతంలో ఓ విధమైన ఆదరణకు నోచుకున్నప్పటికీ ఆ తర్వాత రెండు దశాబ్దాలు అనాదరణకు గురైన ఒడిస్సీ 1970 ప్రాంతంలో మళ్లీ బాగా ప్రాచుర్యాన్ని సంపాదించింది. దీని తాకిడికి మహామహులైన కొంతమంది భరతనాట్య కళాకారులు మరుగున పడిపోవాల్సి వచ్చింది. మాధవీ ముద్గల్, ప్రతిమా బేడి, గురు కేలూచరణ్ మహాపాత్ర, సంయుక్త పాణిగ్రాహి - వారిలో కొందరు. ఒడిస్సీ హిందుస్థానీ సంగీత ప్రధానమైన నృత్య విధానం. భరతనాట్యం కంటే తేలిగ్గా దీన్ని నేర్చుకోవచ్చు. భరతనాట్యానికి కావలసిన స్థాయిలో సుదీర్ఘ శిక్షణ, నిరంతర సాధన దీనికి అవసరం లేదు. అంతేకాక భరతనాట్యంలోని 'అభినయం'ని తనలో ఇముడ్చుకోవడంలో కూడా ఒడిస్సీ సఫలమైంది. మొదట్లో చాలా పరిమిత సంఖ్యలో అభినయ విన్యాసాన్ని కలిగిన ఒడిస్సీ కాలక్రమంలో అనేక రీతులుగా విస్తరిల్లింది. ముంబాయ్, ఢిల్లీ మహానగరాల్లో సంపన్న కుటుంబాల వారు తమ పిల్లలు ఒడిస్సీ నేర్చుకున్నారని చెప్పుకోవడం గొప్ప కింద మారింది. ఫలితంగా భరతనాట్యం దక్షిణ భారతదేశానికే పరిమితమైన నృత్య కళగా మిగలాల్సి వచ్చింది.
ప్రతి కళాకారిణి ఇప్పుడు ప్రజల్లో ఏ నృత్య విధానానికి ఆదరణ వున్నదో తెలుసుకుని ఆ విధానంలోకి వెళ్లడం అవసరమని భావిస్తున్నది. ఎట్లా అయితే ఓ వ్యవస్థాపకుడు లాభమున్న పరిశ్రమలోనే తన సంస్థను పెట్టేందుకు ఇష్టపడతాడో అట్లాగే ఓ కళాకారిణి కూడా ఎక్కువ ఆదరణా, తక్కువ కళాకారులూ వున్న రంగంలోకి పోవడం ఉత్తమమని తలపోస్తున్నారు.
ఆయా కళారంగాల్లో వివిధ సాంస్కృతిక సంస్థల మధ్య ఆధిక్యత కోసం ఏర్పడుతున్న పోటీ మూలంగానే ఈ కళ వ్యాపార స్థాయికి దిగిపోతున్నది. ప్రభుత్వాలు, ఇతర సంస్థలు సైతం పెద్ద మొత్తంలోనే నిధులను సమీకరిస్తూ, కేటాయిస్తూ అనేక నృత్య శైలుల ఆదరణకి తమ వంతు తోడ్పాటునందిస్తున్నాయి. అందుచేత భరతనాట్యం, కథక్, ఒడిస్సీలను మాత్రమే కాక మోహినీ ఆట్టం, కూచిపూడి వంటి నృత్య విధానాలను కూడా కళాకారిణులు నేర్చుకుంటుంటారు. కూచిపూడి నృత్య శైలిని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో శోభానాయుడు దానికి తీసుకువచ్చిన ఖ్యాతి తక్కువేమీ కాదు. కేరళలో 'మోహిని ఆట్టం'కు మంచి ఆదరణే లభిస్తున్నది. టీవీల్లో కూచిపూడి, మోహినీ ఆట్టం ప్రదర్శనలను ఎక్కువగానే చూపిస్తున్నారు. దీన్నిబట్టి నూతన నృత్య కళావిధానాలకి ఏదో ఓ సమయంలో ఆదరణ లభిస్తుందని అర్తమవుతోంది.
21వ శతాబ్దం వచ్చాక మరో నృత్య శైలి కూచిపూడికి అమాంతంగా డిమాండ్ వచ్చి అప్పటిదాకా వున్న నాట్య రీతులని వెనక్కి నెట్టేసింది. రేపటి రోజుల్లో దాని స్థానాన్ని మణిపురో, కథకళో ఆక్రమించవచ్చు. అది ఏదనేది మాత్రం సాంస్కృతిక సంస్థల ధోరణిపైనే ఆధారపడి వుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment