Tuesday, July 5, 2011

న్యూస్: 'దడ'తో నాగచైతన్య మాస్ హీరో అవుతాడా?

తొలి సినిమా 'జోష్' ఫ్లాపయ్యాక నాగచైతన్య చేసిన రెండు సినిమాలు హిట్టయ్యాయి. ఆ రెండు సినిమాలు.. 'ఏ మాయ చేసావె', '100% లవ్'. వీటితో అతను లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు యాక్షన్ సినిమా చేయడం మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలనే యత్నంలో 'దడ' సినిమా చేస్తున్నాడు. నాగార్జునతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన అభిమాని డి. శివప్రసాద్‌రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
దీని ద్వారా అజయ్ భుయాన్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అజయ్ సాదాసీదా మనిషి కాడు. సినిమా మీద బాగా అధ్యయనం చేసిన యువకుడు. హై క్వాలిఫైడ్ పర్సన్. ఐఐటిలో డిగ్రీ, ఐఐఎం నుంచి ఎంబీఏ చేసిన అతను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి డిఎఫ్‌టి పట్టా తీసుకున్నాడు. నిజానికి 'దడ' అతని తొలి సినిమా కాదు. ఇదివరకే 'హౌస్‌ఫుల్' అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. దీన్ని నిర్మించింది మరో డైరెక్టర్ అయిన చంద్రసిద్ధార్థ్. అయితే ఆర్థిక పరమైన కారణాలతో మూడేళ్ల క్రితమే తయారైన ఆ సినిమా ఇంతవరకు వెలుగు చూడలేదు.
ఏడాది క్రితం అతను చెప్పిన కథ నచ్చడంతో మాస్ హీరోగా జనం ముందుకు రావడానికి ఆ కథే సరైనదని నాగచైతన్యకు అనిపించింది. అలా 'దడ' మొదలైంది. ఇందులో అమెరికాలో నివసించే తెలుగు యువకుడిగా నాగచైతన్య కనిపించబోతున్నాడు. అంటే అమెరికా నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. అతనికి జోడీగా అందాల తార కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇంకో ఆసక్తికరమైన సంగతేమంటే నాగచైతన్య అన్నగా హీరో శ్రీరాం నటించడం. ఈ సినిమాలో ఆరు పాటలు, ఆరు ఫైట్లు ఉన్నాయి. పాటలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తుంటే, ఫైట్లని బ్యాంకాక్‌కు చెందిన ప్రడిట్ సీలుయెం కంపోజ్ చేశాడు. ఈ నెల 20 లేదా 21న ఆడియో రిలీజ్ అవుతుండగా ఆగస్ట్ 11న ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా విడుదలవనున్నది. మరి 'దడ'తో నాగచైతన్య మాస్ హీరో అనిపించుకుంటాడో, లేదో చూడాలి.

Monday, July 4, 2011

న్యూస్: శ్రీకాంత్‌కి మళ్లీ నిరాశే

శ్రీకాంత్ ఆశలు మరోసారి వమ్మయ్యాయి. తప్పకుండా విజయం సాధించడంతో పాటు నటుడిగా తనకి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుందని భావించిన 'విరోధి' సినిమాకి ప్రేక్షకులు కరువవడం అతణ్ణే కాదు సినీ వర్గాల్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఎందుకటే ఆ సినిమాకి డైరెక్టర్ ప్రతిభావంతుడిగా పేరుపొందిన నీలకంఠ. కమర్షియల్‌గా పెద్ద హిట్టు కాకపోయినా క్లాస్ ఆడియెన్స్‌నీ, విమర్శకుల్నీ మెప్పిస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే మేకా మీడియా బేనర్‌పై శ్రీకాంత్ తమ్ముడు అనిల్ నిర్మించిన ఈ సినిమా రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యిందని చెప్పాలి. సగటు ప్రేక్షకుడినే కాక మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌నీ ఈ సినిమా మెప్పించలేకపోతోంది. దాంతో దీనికి పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసినట్లే. అంతే కాదు జర్నలిస్టుగా నటించిన శ్రీకాంత్ కంటే నక్సలైటుగా నటించిన అజయ్‌కే ఎక్కువ పేరొచ్చింది. కరెక్టుగా చెప్పాలంటే ఇది శ్రీకాంత్ సినిమా అని కాకుండా అజయ్ సినిమా అనే అంటున్నారు. ప్రధాన స్రవంతి సినిమా విధానంలో గాక కొత్త ధోరణిలో నీలకంఠ చేసిన ప్రయోగం ఎక్కువమందిని ఆకట్టుకోలేక పోతోంది. నక్సలిజం దారి తప్పిపోయిందని 'విరోధి'తో చెప్పాలని ఆయన యత్నించాడు. దానికి ఆయన ఎంచుకున్న స్క్రీన్‌ప్లే బోర్ కొట్టించింది. అందుకే ఈ సినిమా పట్ల ఎక్కువమంది ఆసక్తి కనపర్చడం లేదు.
2007లో 'ఆపరేషన్ దుర్యోధన', 'యమగోల.. మళ్లీ మొదలైంది' తర్వాత శ్రీకాంత్‌కి ఇంతవరకు మరో హిట్టు దక్కలేదు. 'మైఖేల్ మదన కామరాజు' నుంచి మొదలుకుని 'విరోధి' దాకా వరుసగా ఎనిమిది సినిమాలు అటకెక్కాయి. వీటిలో కృష్ణవంశీ డైరెక్షన్‌లో నటించిన 100వ సినిమా 'మహాత్మా' కూడా ఉంది. 'విరోధి' ఫ్లాపవడంతో శ్రీకాంత్ తన పాత్రల విషయంలో పునరాలోచించుకుంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. శ్రీహరి తరహాలో ఓ వైపు హీరో పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు అవకాశమున్న ఇతర పాత్రల్ని చేసుకుంటే బెటర్ అనేది వారి అభిప్రాయం.

న్యూస్: 'కాంచన'గా ఆడ పాత్రలో లారెన్స్?

రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన 'కాంచన' తెలుగు, తమిళ భాషల్లో రాబోతోంది. దర్శకుడిగా ఇది లారెన్స్ ఐదో సినిమా. ఇదివరకు అతను మాస్, స్టైల్, డాన్, ముని సినిమాల్ని రూపొందించాడు. వీటిలో 'మాస్' ఒక్కటే పెద్ద హిట్. 'స్టైల్'తో 100 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తానని ఆ సినిమా నిర్మాత లగడపాటి శ్రీధర్ చెప్పినవి కాకి కబుర్లేనని తేలిపోయింది. 'డాన్', 'ముని' సినిమాలు బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించాయి.
హారర్, కామెడీ, సెంటిమెంట్ మేళవింపుతో అతను తీసిన 'ముని' ప్రేక్షకులకి కొత్త అనుభూతినిచ్చిందనేది నిజం. అందువల్లే దానికి సీక్వెల్ తీయాలని అతను భావించాడు. అలా ఇప్పుడు 'కాంచన'ని రూపొందించాడు. మొదట ఈ సినిమాలో 'కాంచన' పాత్రని అనుష్కతో చేయించాలని అతను తలచాడు. కానీ ఆమె స్థానంలో తనే స్వయంగా నటించాడు! అవును. అతను ఈ సినిమాలో లేడీ గెటప్పుతో విభిన్నంగా కనిపించి, ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయబోతున్నాడు. అలాగే ఇప్పటివరకు గ్లామరస్ గర్ల్‌గానే ముద్రపడ్డ లక్ష్మీరాయ్ ఈ సినిమాలో భిన్నమైన కేరక్టర్లో కనిపించనున్నది. తెలుగులో ఈ సినిమాని బెల్లంకొండ సురేశ్ విడుదల చేస్తుండటం గమనార్హం. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. కాగా తెలుగులో 'డాన్' తర్వాత 'రెబల్' సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు లారెన్స్. ఇందులో ప్రభాస్ హీరో కాగా; అనుష్క, దీక్షాసేథ్ హీరోయిన్లు.

Sunday, July 3, 2011

న్యూస్: ఆచితూచి అడుగేస్తున్న 'మొగుడు'

హీరోగా గోపీచంద్ రెండో ఇన్నింగ్స్ 'యజ్ఞం'తో సజావుగానే మొదలైంది. ఆంధ్రుడు, రణం, లక్ష్యం, శౌర్యం వంటి హిట్ సినిమాల్ని అతను అందించగలిగాడు. 'శౌర్యం' తర్వాత త్రిష జంటగా అతను చేసిన 'శంఖం' ఫ్లాపవగా, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన 'గోలీమార్' ఫర్వాలేదనిపించుకుంది. దాని తర్వాత ఎంతో నమ్మకంతో బీవీఎస్ రవి అనే రచయితని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ అతను నటించిన 'వాంటెడ్' అట్టర్‌ఫ్లాపయ్యింది. ఇలా ఓ సినిమా హిట్టయి, రెండు సినిమాలు ఫ్లాపవుతూ రావడం గోపీచంద్‌కి ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకే ఇక నుంచీ సినిమాల ఎంపికలో మరింత శ్రద్ధ పెట్టాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లే తొలిసారి కృష్ణవంశీ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్లో తయారవుతున్న ఆ సినిమా 'మొగుడు'. ఇందులో అందాలరాశి తాప్సీ నాయిక. ఇప్పటివరకు చేయని పాత్రని ఈ సినిమాలో గోపీచంద్ చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతదాకా హీరోగా అతను చేసినవన్నీ పెళ్లికాని బ్రహ్మచారి పాత్రలే. తొలిసారి పెళ్లయిన యువకుడి పాత్రను 'మొగుడు'లో చేస్తున్నాడు. ఈ సినిమా తనకి సరికొత్త ఇమేజ్‌ని ఇవ్వడమే కాక, నటుడిగా తనని మరో మెట్టు పైకెక్కిస్తునంది నమ్ముతున్నాడు గోపీచంద్. అతడి ఆశ నెరవేరుతుందో, లేదో చూడాలి.

న్యూస్: ఆదిత్యకు అగ్ని పరీక్ష 'ముగ్గురు'

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఆశలన్నీ 'ముగ్గురు' మీదే ఉన్నాయి. 'ముగ్గురు' అనేది ఆయన డైరెక్ట్ చేస్తున్న కొత్త సినిమా. డి. రామానాయుడు ఈ సినిమా నిర్మాత. టైటిల్ రోల్స్‌ని నవదీప్, 'హ్యాపీడేస్' ఫేం రాహుల్, అవసరాల శ్రీనివాస్ పోషిస్తున్నారు. రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య హీరోయిన్లు. మొదట ఈ సినిమాకి '3 ఇడియట్స్' అనే టైటిల్ పెట్టి తర్వాత ఎందుకనో 'ముగ్గురు'గా మార్చారు. జంధ్యాల దర్శకత్వంలో ఒకప్పుడు రామానాయుడు నిర్మించిన సూపర్ హిట్ మూవీ 'అహ నా పెళ్లంట'కు ఇది సీక్వెల్ అని వినికిడి. దానికీ, దీనికీ తేడా... ఆ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ ఒక్కరే అయితే ఇందులో ముగ్గురు హీరోలు. దర్శకుడిగా ఆదిత్యకు ఈ సినిమా అగ్ని పరీక్ష. 'మనసంతా నువ్వే', 'నేనున్నాను' సినిమాల తర్వాత ఆయనకు మళ్లీ హిట్టు లేదు. నాగార్జునతో చేసిన రెండో సినిమా 'బాస్' నుంచి ఇటీవల సుమంత్‌తో చేసిన 'రాజ్' దాకా అన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టినవే. అందుకే ఈసారి మినిమం గ్యారంటీ ఉండే కామెడీ సబ్జెక్టుని ఎంచుకున్నాడు ఆదిత్య. కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌తో నడిచే 'ముగ్గురు' కచ్చితంగా హిట్టయి, తన కెరీర్‌కి ఊపిరి పోస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు.

విశ్లేషణ: హీరో వెంకటేశ్ కెరీర్


సరికొత్త ఇమేజ్ కోసం తపన
ఇవాళ పెద్ద హీరోలకు ఒక్కో సినిమా ఒక్కో అగ్ని పరీక్ష. యువతరం హీరోలు పోటీగా విజయపథంలో దూసుకుపోతుంటే మరోవైపు హీరో స్థాయిని పట్టించుకోకుండా పెద్ద హీరోల సినిమాల్ని (బాగో లేకపోతే) తిప్పికొడుతున్నారు ప్రేక్షకులు. అందువల్ల చేసే ప్రతి సినిమాకూ ఆ హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. మిగతా సీనియర్ టాప్ హీరోలతో పోలిస్తే వెంకటేశ్‌ది కాస్త విభిన్న శైలి. ఇటీవలి కాలంలో ఏ పెద్ద హీరో చేయనన్ని వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ వస్తున్నారాయన. 'ఈనాడు', 'నమో వెంకటేశ', 'నాగవల్లి' సినిమాల్లో ఒకదానికొకటి పొంతనలేని పాత్రలు చేసిన ఆయన ఇప్పుడు ఆ మూడింటికీ భిన్నమైన 'బాడీగార్డ్' పాత్రని చేస్తున్నారు. సబ్జెక్టు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ రావడం వల్ల పాతికేళ్ల సినీ జీవితంలో ఫెయిల్యూర్ల కంటే సక్సెస్సలనే పొందుతూ వచ్చారు.
విలక్షణ నటుడు
తొలి చిత్రం 'కలియుగ పాండవులు' (1986)తో పర్వాలేదనిపించిన వెంకటేశ్.. తమ పక్కింటి కుర్రాడిలా అనిపించేసరికి జనం ఆదరించారు. తండ్రి దగ్గుబాటి రామానాయుడు అప్పటికే పేరుపొందిన నిర్మాతే అయినా ఆయన ప్రభావం నుంచి అతి త్వరగా బయటపడి, హీరోగా తనకంటూ ఓ స్థాయిని ఏర్పరచుకోగలిగారు. హీరోగా జనానికీ, నటుడిగా విమర్శకులకూ ఎప్పుడూ ఫేవరేట్‌గానే ఉంటూ వస్తోన్న ఆయనకు స్వర్ణకమలం (1988), శత్రువు ('91), చంటి ('92), ధర్మచక్రం ('96), గణేశ్ ('98), నువ్వు నాకు నచ్చావ్ ('01), మల్లీశ్వరి ('04), ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ('07) తదితర సినిమాలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. టాప్ హీరోగా ఎదిగిన ఓ నటుడు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఆయన తరానికి సంబంధించినంత వరకు ఓ ప్రయోగం, ఓ సాహసం. 'పవిత్రబంధం' (1996)తో ఆ సాహసం చేసి నటుడిగా మరో మెట్టు పైకెక్కారు. తనది గ్లామరస్ ఫేస్ కాకపోయినా ఎప్పుడూ చిలిపిగా నవ్వుతున్నట్లుండే ముఖంతో బొబ్బొలి రాజా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాల్లో లవర్ బాయ్‌గా మెప్పించారు. నిర్మాతగా తండ్రి సపోర్ట్ ఎంతగా ఉన్నా నటుడిగా అంచెలంచెలుగా ఎదిగి నిర్మాతలకు, బయ్యర్లకు హాట్ ఫేవరేట్ అయ్యారు. తను చేసిన ప్రయోగాల్లో అత్యధిక భాగం సొంత సంస్థలో చేసినవే. ఈ రకంగా తనలోని నటుణ్ణి తృప్తిపరచుకోవడంతో పాటు కమర్షియర్ ఎంటర్‌టైనర్స్ చేసి, బయ్యర్లను తృప్తిపరచడం అలవాటుగా చేసుకున్నారు. అందుకే తొలినాళ్లలో ప్రతి యేటా కనీసం ఓ సూపర్‌హిట్ సినిమాని ఆయన అందించారు. 1990లో వచ్చిన 'బొబ్బిలి రాజా' సినిమా ఆయనకు అమితమైన స్టార్‌డం తీసుకొచ్చింది. ఆ తర్వాత కూలీ నెం.1 ('91), చంటి ('92), సుందరకాండ ('92), అబ్బాయిగారు ('93) వంటి హిట్ సినిమాలు చేశారు. తిరిగి 1996 నుంచి వరుస హిట్లతో మిగతా టాప్ స్టార్లకు నిద్రలేకుండా చేశారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం, రాజా చిత్రాలు మహిళా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోగా ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలతో యువతనూ ఆయన బాగా ఆకర్షించగలిగారు.
ఫ్యామిలీ సినిమాలకే ప్రాధాన్యం
మిగతా టాప్ హీరోలతో పోలిస్తే ఆయన కొన్నేళ్లుగా చేసిన సినిమాల్లో ఫ్యామిలీని టార్గెట్ చేసుకున్నవే ఎక్కువ. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' నుంచి దీనిని మనం గమనించవచ్చు. గణేశ్, జయం మనదేరా, జెమిని, ఘర్షణ, లక్ష్మీ, తులసి వంటి కొద్ది సినిమాల్లోనే యాక్షన్ ఛాయలు కనిపిస్తాయి. మిగతావన్నీ ఫ్యామిలీ కోసం ఉద్దేశించిన ఫార్ములా సినిమాలే. అదే తొలి రోజుల్లో అయితే రక్త తిలకం, ధృవనక్షత్రం, బ్రహ్మపుత్రుడు, బొబ్బిలి రాజా, శత్రువు, చినరాయుడు, కొండపల్లి రాజా, ధర్మచక్రం వంటి యాక్షన్ ప్రధాన సినిమాలు చాలానే చేశారాయన. కొన్ని యాక్షన్ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫెయిలైతే అయివుండవచ్చు గాక.. యాక్షన్ సినిమాల వల్లనే ఆయన టాప్ హీరోగా ఎదిగారన్నది నిర్వివాదం. యాక్షన్ సినిమాల్లో చేయడం శరీరానికి ఎక్కువ శ్రమ. అందువల్లనో, ఏమో ఆయన లైటర్ వీన్ సినిమాల్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఇటీవలి సినిమాలు 'చింతకాయల రవి', 'నమో వెంకటేశ' ఇదే కోవలో ఉండటం గమనార్హం. అలాగే రీమేక్ సినిమాలకూ ఆయన పెద్దపీట వేస్తున్నారు.
టూటౌన్ రౌడీ, చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, రాజా, శీను, వాసు, జెమిని, వసంతం, ఘర్షణ, సంక్రాంతి, ఈనాడు, నాగవల్లితో పాటు ఇప్పుడు చేస్తున్న బాడీగార్డ్ కూడా రీమేక్ సినిమానే. దీనికి తోడు పరభాషా దర్శకులకు ఆయన చాలా అవకాశాలు ఇస్తున్నారు. విక్రమన్, ఉదయశంకర్, కరుణాకరన్, చరణ్, గౌతం మీనన్, సెల్వరాఘవన్, పి. వాసు తదితర తమిళ దర్శకులతో ఆయన చేశారు. అయితే యాక్షన్ సినిమాల సంఖ్య తగ్గించి, ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ చేస్తూ రావడం వల్ల మాస్ ప్రేక్షకుల్లో ఆయన ఇమేజ్ తగ్గిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. కన్నడంలో 'ఆప్త రక్షక' హిట్టవడానికీ, తెలుగులో 'నాగవల్లి' ఫ్లాపవడానికీ నేటివిటీ సమస్య ప్రధాన కారణం. రానున్న మలయాళ 'బాడీగార్డ్' రీమేక్ ఆయన ఇమేజ్‌ని ఏ మేరకు నిలుపుతుందో వేచి చూడాల్సిందే.

Saturday, July 2, 2011

న్యూస్: తెలుగు తెరపై మరో యమధర్మరాజు

తెలుగు తెరమీద మరో యమధర్మరాజు కనిపించబోతున్నాడు. ప్రేక్షకుల మనసుల్లో యమధర్మరాజు అనగానే మొదట మెదిలే వ్యక్తి కైకాల సత్యనారాయణ. 'యమగోల' సినిమా నుంచి ఆ పాత్రని సత్యనారాయాణే చేయాలనే అభిప్రాయం బలపడింది. అదివరకు 'సతీ సావిత్రి'లో యమునిగా ఎన్‌టీ రామారావు విశ్వరూపాన్ని మనం చూశాం. అయినా ఆయన ఎక్కువ సినిమాల్లో ఆ పాత్రపోషణ చేయలేదు. అందువల్ల సత్యనారాయణకు తెలుగుతెర యమునిగా కీర్తి దక్కింది. అయితే ఆయనకు వయసు మళ్లినందున ఇతరులకు ఆ పాత్ర చేసే అవకాశాలు కలుగుతున్నాయనుకోవాలి. 'యమదొంగ'లో మోహన్‌బాబుకు ఆ పాత్ర చేసే అవకాశం కల్పించాడు డైరెక్టర్ రాజమౌళి. అందుకు తగ్గట్లుగానే తన విలక్షణ నటనతో, డైలాగ్ డెలివరీతో యముని పాత్రను బాగా అభినయంచి చూపారు మోహన్‌బాబు.
ఆ తర్వాత 'యమగోల.. మళ్లీ మొదలైంది' సినిమాలో సీనియర్ యమునిగా సత్యనారాయణ నటిస్తే, కుర్ర యమునిగా శ్రీకాంత్ పర్వాలేదనిపించుకున్నాడు. ఈ మధ్యే 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' సినిమాలో యముని పాత్రని వెటరన్ యాక్టర్ జయప్రకాశ్‌రెడ్డి తనదైన శైలిలో రక్తి కట్టించాడు.
ఇక ఇప్పుడు ఆ పాత్రని పోషించే అవకాశం శ్రీహరికి వచ్చింది. ఓవైపు హీరోగా, మరోవైపు కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ఆయన సాయిరాం శంకర్ హీరోగా నటించే ఓ సినిమాలో యమధర్మరాజు పాత్రని చేయబోతున్నాడు. ఇదివరకు 'వేడుక' అనే సినిమాని డైరెక్ట్ చేసిన జితేందర్ ఈ సినిమాకి దర్శకుడు. ముమైత్‌ఖాన్‌తో 'పున్నమినాగు'ని నిర్మించిన జి. విజయకుమార్ గౌడ్ ఈ సినిమాకి నిర్మాత. అమెరికా నేపథ్యంలో కథ నడవడం ఈ సోషియో ఫాంటసీ ప్రత్యేకత. అంటే ఇప్పటివరకు మన తెలుగు నగరాల్లో, గ్రామాల్లో మాత్రమే హల్‌చల్ సృష్టించిన యమధర్మరాజు ఈ సినిమాలో అమెరికాలో ఆ పని చేయబోతున్నాడు. ఇంకో సంగతేమంటే చాలా గ్యాప్ తర్వాత ఎన్నారై బ్యూటీ పార్వతీ మెల్టన్ ఇందులో నాయికగా సాయిరాం సరసన నటించబోతోంది. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలు కాబోతోంది. ఇందులో యమునిగా శ్రీహరి ఏవిధంగా రాణిస్తాడో చూడాల్సిందే.

న్యూస్: చిరంజీవి ఊగిసలాట

మెగాస్టార్ చిరంజీవి ఊగిసలాట ధోరణి మరోమారు స్పష్టమైంది. 149వ సినిమా 'శంకర్‌దాదా జినాదాబాద్' తర్వాత 150వ సినిమా చేస్తానని ఓసారి, చేయనని ఓసారి పలుమార్లు చెబుతూ వచ్చిన చిరంజీవి నాలుగు రోజుల తర్వాత ఇక సినిమాలకి పూర్తిగా గుడ్‌బై చెప్పి, రాజకీయాల్లోనే కొనసాగుతాననీ, సినిమాల సంగతి తన కుమారుడు రాంచరణ్ చూసుకుంటాడనీ తేల్చి చెప్పారు. కానీ జూన్ 30 రాత్రి ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటైన 'బుడ్డా హోగా తేరా బాప్' ప్రీమియర్ షోలో పరిస్థితి మరోసారి మారింది. అందులో చిరంజీవి 149 సినిమాలతో ఆగిపోవడం ఏమీ బాగాలేదనీ, 150వ సినిమా చేస్తే బాగుంటుందనీ అమితాబ్ బచ్చన్ అనడం, రాంగోపాల్ వర్మ కూడా దానికి వంత పాడటం, ఆ సినిమాని తనే డైరెక్ట్ చేస్తానని పూరి జగన్నాథ్ చెప్పడంతో వెంటనే మనసు మార్చేసుకున్నారు. వర్మ పర్యవేక్షణలో, పూరి డైరెక్షన్లో, అమితాబ్ ఓ గెస్ట్ రోల్ చేస్తే తాను నటిస్తానని కమిటైపోయారు. చిరంజీవి 150వ సినిమా చేస్తే గనుక తాను గెస్ట్ రోల్ చేస్తానని అమితాబ్ అప్పటికప్పుడే చెప్పేశారు.
ఈ ప్రహసనమంతా చూసినవారు చిరంజీవి రెండు రోజుల్లోనే ఇలా తన మనసు మార్చుకోవడం చూసి ముక్కుమీద వేలేసుకున్నారు. మాటిమాటికీ ఇలా మాటలు మార్చేవాడు, కమిట్‌మెంట్ లేనివాడు ఎలా నాయకుడిగా రాణిస్తాడని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఈ ఊగిసలాడే ధోరణి వల్లే రాజకీయాల్లో ఆయన సక్సెస్ కాలేకపోతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. తిరుపతిలో అత్యంత ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఎన్నికల్లో నిల్చుని, 18 సీట్లలో మాత్రమే తన పార్టీని గెలిపించుకో గల్గిన చిరంజీవి పాలకొల్లులో స్వయంగా ఓడిపోవడం ఆయనతో సహా అందర్నీ దిగ్భ్రమగొల్పగా, పార్టీ పెట్టిన రెండేళ్లలోనే ఏ పార్టీమీద కోపంతో కొత్త పార్టీ పెట్టారో, అదే కాంగ్రెస్‌లోనే దాన్ని కలిపేయడం ఆయన చపల మనస్థత్వానికి గట్టి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు సినిమా చేయాలా, వద్దా అనే విషయంలోనూ ఆయనలో స్పష్టత కొరవడిందనీ, ఒక్క మాట మీద నిల్చునే దృఢ సంకల్పం ఆయనలో లేదనీ దీనివల్ల స్పష్టమవుతున్నదనీ వాళ్లు తేల్చి చెబుతున్నారు. ఇక ''అన్నయ్య 150వ సినిమా చేస్తారు, దాన్ని చరణ్ నిర్మిస్తాడు'' అని నాగబాబు ప్రకటించడం కొసమెరుపు.

Thursday, June 30, 2011

ఫ్లాష్‌బ్యాక్: ప్రిన్సిపాల్‌ని చంపిన విద్యార్థి

ఈ రోజుల్లో టీచర్లు, లెక్చరర్ల పట్ల విద్యార్థులు అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని వాపోతుంటాం. కానీ 20 వ శతాబ్ది తొలి రోజుల్లోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఓ విద్యార్థి ఎలా ప్రవర్తించాడో చూడండి...

"1917 ప్రాంతంలో మద్రాసులో న్యూయింగ్‌టన్ కాలేజీ ఉండేది. మద్రాసు రాష్ట్రంలోని మైనర్ జమీందారుల కోసం ఇది పెట్టారు. తండ్రులు చనిపోతే జమీలను నిర్వహించే స్థోమత పిల్లలకొచ్చేవరకూ వాళ్లను ఈ కాలేజీలో ఉంచి చదివించేవారు. అప్పట్లో ఆ కాలేజీకి 'డీలాహే' అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాల్‌గా ఉండేవాడు. చాలా నిక్కచ్చి మనిషి. అదే కాలేజీలో రాంనాడ్ రాజా కొడుకు చదువుకుంటున్నాడు. ఆ ప్రిన్సిపాల్ భార్యతో ఈ పిల్ల జమీందారు అసభ్యంగా ప్రవర్తించాడు. అది ప్రిన్సిపాల్ చెవికెళ్లింది. మర్నాడు డీలాహే ఈ రాంనాడ్ పిల్ల జమీందారును మందలించాడు. ఆ రోజు రాత్రి ప్రిన్సిపాల్ తన ఇంట్లో మంచానికి దోమతెర వేసుకుని నిద్రపోతున్నాడు. ఆ సమయంలో పిల్ల జమీందారు తుపాకీతో కాల్చి ప్రిన్సిపాల్‌ను చంపాడు. 1917లో ఈ కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వం కలవరపడింది. ముద్దాయికి తేలిక శిక్ష పడింది. ఈ అలజడితో ఆ కాలేజీని ప్రభుత్వం మూసేసింది."
-ఏటుకూరి ప్రసాద్ రచన 'తాపీ ధర్మారావు జీవితం-రచనలు' నుంచి

Wednesday, June 29, 2011

హాట్ న్యూస్: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం

సినీ మాక్స్‌లో మంగళవారం జరిగిన '180' సక్సెస్‌మీట్‌లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిథుల నుంచి హీరో సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ట్విట్టర్‌లో "టీవీలో ఓ గంట కార్యక్రమం కోసం థర్డ్ గ్రేడ్ న్యూస్ చానల్స్ తమ కుటుంబాల్ని కూడా అమ్ముకుంటాయి'' (థర్డ్ గ్రేడ్ న్యూస్ చానల్స్ విల్ సెల్ దెయిర్ ఫ్యామిలీస్ టు మేక్ అప్ యాన్ అవర్ ఆఫ్ టీవీ) అంటూ సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై తెలుగు న్యూస్ చానల్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జరిగిన '180' సక్సెస్ మీట్‌లో యథాలాపంగా పాల్గొన్న సిద్ధార్థ్‌ని చానల్స్ అన్నీ మూకుమ్మడిగా బాయ్‌కాట్ చేయడం ద్వారా తమ నిరసన తెలిపాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్ మాట్లాడిన తర్వాత మాట్లాడేందుకు మైకుల ముందుకు సిద్ధార్థ్ రావడంతోటే తమ కెమెరాలన్నింటినీ చానల్స్ తీసేశాయి. దీంతో పత్రికల వారివైపు తిరిగి రెండు ముక్కలు మాట్లాడిన సిద్ధార్థ్, పత్రికా ఫొటోగ్రాఫర్లు గ్రూప్ ఫొటో కోసం రావడంతో అక్కడ నిలవకుండా ఆవేశంతో విసవిసా నడచుకుంటూ అక్కణ్ణించి వెళ్లిపోయారు.

దీంతో ఆ సినిమా యూనిట్ సభ్యులంతా అతడి ప్రవర్తన పట్ల విస్మయాన్ని వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని, మీడియాకి క్షమాపణలు చెప్పేంతవరకు సిద్ధార్థ్ విషయంలో తమ నిరసనని ఇలాగే కొనసాగిస్తామని ఫిల్మ్ న్యూస్‌కేస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిథులు తెలిపారు. సిద్ధార్థ్ ప్రవర్తన పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేస్తున్నట్లు వారు చెప్పారు.

ఇంటర్వ్యూ: వరుణ్ సందేశ్

నా కెరీర్‌లో నిలిచిపోయే 'బ్రమ్మిగాడి కథ'

"ఇందులో కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకునే యువకుడిగా కనిపిస్తా. ఇది నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అని చెప్పగలను'' అని చెప్పారు వరుణ్ సందేశ్. వి. ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రజత్ పార్థసారథి నిర్మించిన చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా వరుణ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...

నా కెరీర్‌లో తొమ్మిదో చిత్రం 'బ్రమ్మిగాడి కథ'. ఇది 36 గంటల్లో జరిగే కథ. పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్. కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. స్క్రీన్‌ప్లే మీద ఆధారపడిన కథ. అది చాలా వైవిధ్యంగా ఉంటుంది.

కమర్షియల్ ఎంటర్‌టైనర్
'మీ శ్రేయోభిలాషి', 'మనోరమ' వంటి సినిమాలు తీసిన ఈశ్వర్‌రెడ్డి తొలిసారి చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. అయినా ఇది మీనింగ్‌ఫుల్ సినిమా. ఓ సందేశం కూడా ఉంటుంది. షూటింగంతా హైదరాబాద్‌లోనే జరిగింది. మమ్మల్ని హైదరాబాదంతా పరుగులు పెట్టించారు డైరెక్టర్.

'యాల యాల' ఐటమ్
కోట చాలా మంచి సంగీతాన్నిచ్చారు. 'యాల యాల' అనే ఐటమ్ సాంగ్ చాలా పెప్పీగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (నేపథ్య సంగీతం)కి 25 రోజులు వెచ్చించి, చాలా బాగా ఇచ్చారు కోటి. ఇందులో నేను ఫైట్స్ చేశా. అన్నీ ఎమోషనల్ ఫైట్సే. ఒకే ఒక్క ఫైట్‌కి రోప్స్ వాడారు. మిగతావాటిని నేచురల్‌గానే చేశాం.

కష్టాల్లో ఆదుకుంటా
ఇందులో నాది పరిణతి చెందిన పాత్ర. కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకునే యువకుడిగా కనిపిస్తా. ఇదివరకు నేను చేసిన జోవియల్ రోల్స్‌కు భిన్నంగా సెటిల్డ్‌గా ఉండే పాత్ర. నా పాత్రని కానీ, మిగతా పాత్రల్ని కానీ చాలా బాగా తీర్చిదిద్దిన డైరెక్టర్ ఈశ్వర్‌రెడ్డికే క్రెడిట్ అంతా దక్కుతుంది. ఇది నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అని చెప్పగలను.

కొత్త సినిమా
దీని తర్వాత యు.కె. అవెన్యూస్ నిర్మిస్తున్న సినిమాలో చేస్తున్నా. ఎం.ఎస్. రాజు బేనర్‌లోనూ, డైరెక్టర్ సుకుమార్ వద్దా పనిచేసిన శ్రవణ్ దీనికి డైరెక్టర్. అమృతారావ్ చెల్లెలు ప్రీతికా రావు హీరోయిన్.