Monday, May 2, 2011
రోజారమణి తొలి సినిమా అనుభవం
ప్రఖ్యాత ఏవీయం ప్రొడక్షన్స్ సంస్థ 1967లో 'భక్త ప్రహ్లాద'ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించడం ద్వారా రోజారమణి బాల నటిగా తెరంగేట్రం చేశారు. ఆమె ఆ పాత్రకు ఎంపికవడం ఓ మిరకిల్. అప్పటికి ఆమె ఇంకా స్కూల్లో చేరలేదు. ఒకసారి మద్రాసులో ఏవీయం స్టూడియో చూపించేందుకని వాళ్ల నాన్న సత్యం ఆమెని అక్కడికి తీసుకుపోయారు. ఆయన ఆ రోజుల్లో 'సినిమా రంగం' అనే సినీ పక్ష పత్రికకి మార్కెటింగ్ హెడ్‌గా పనిచేసేవారు. అప్పుడు పరిస్థితి ఎలా వుందంటే స్టూడియో వద్ద ఎవరైనా చిన్న పిల్లలు కనిపిస్తే చాలు, ప్రహ్లాదుని పాత్రకు సరిపోతారా, లేదా అని చూస్తున్నారు. "ఆ స్టూడియో ఇంచార్జి నాగేశ్వరరావు అనే ఆయనకు నాన్న బాగా తెలుసు. ఆయన నన్ను చూసి ముచ్చటపడి రంగూన్ రామారావు అనే కో-డైరెక్టర్‌ని పిలిపించి, నన్ను ఆ పాత్రకు సరిపోతానో, లేదో చూడమన్నారు. ఆయన 'ఆడపిల్ల కదా' అని సందేహపడ్డారు. మేకప్ వేస్తే ఆ సంగతి కనిపెట్టడం కష్టమని నాగేశ్వరరావు అనడంతో నాకు చేతనైంది ఏమైనా చేయమని రామారావు అడిగారు. అప్పట్లో నాకు వచ్చింది 'మూగ మనసులు' సినిమాలోని 'గోదారి గట్టుంది గట్టుమీద చెట్టుంది' పాటే. ఆ పాటకు డాన్స్ చేసి చూపించా. సరేనని ఆయన ఒక శ్లోకం చెప్పి, దాన్ని అలాగే చెప్పమన్నారు. నేను ఏమీ ఆలోచించకుండా నోటికి వచ్చినట్లు 'శుక్రవారం చెబుతా' అని చెప్పా. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏవీయం నుంచి నాకోసం కారు వచ్చింది. అప్పటికే నాన్నగారు ఆఫీసుకు వెళ్లిపోయారు. అమ్మ, నేను కారులో నాన్న ఆఫీసుకు వెళ్లాం. అక్కణ్ణించి అందరం స్టూడియోకు వెళ్లాం. ఫ్రాకులో ఉన్న నన్ను ఫోటోలు తీశారు. వాటిని చెట్టియార్ గారి వద్దకు పంపించారు. 'ఇదేమిటి ఆడపిల్ల ఫోటోలు పంపారు?' అని అబ్బాయి డ్రస్సులో ఫోటోలు తీయమని కో-డైరెక్టర్ రామారావుకు చెప్పారు. అప్పడు నా జుట్టును బాయ్‌కట్ చేసి, నాకు బాబా సూట్ వేసి ఫోటోలు తీశారు. ఫోటోలో నేను చెట్టియార్ గారికి నచ్చాను. అయితే ప్రహ్లాదుడిగా నేను నప్పుతానో, లేదోననే సందేహం వచ్చి, ఈసారి రాజకుమారుడి డ్రస్సులో ఫోటోలు పంపమన్నారు. నాకు మళ్లీ రాజకుమారుడి డ్రస్సు, విగ్గు, మేకప్‌తో ఫోటోలు తీశారు. అప్పుడూ చెట్టియార్ గారికి నచ్చా. కానీ అంతటితో పరీక్షలు పూర్తవలేదు. ప్రహ్లాదునికి పాములు, ఏనుగులతో సన్నివేశాలున్నాయి కాబట్టి, పాముతో నేను సన్నివేశం చేయగలనా, లేదా అనే సందేహం వాళ్లకి వచ్చింది. పాము తెప్పించారు. నా మెడలో వేశారు. నేను భయపడకుండా దాన్ని పట్టుకున్నా. ఆ పాము సన్నివేశాన్ని రామారావు గారు కెమెరాతో షూట్ చేయించారు. అది చూపించాక 'ప్రహ్లాదుడు దొరికాడు' అన్నారు చెట్టియార్. ఆ పాత్ర కోసం నెల రోజులపాటు నాచేత ప్రాక్టీస్ చేయించారు. మొట్టమొదట క్లైమాక్స్ సీన్ తీశారు" అని చెప్పుకొచ్చారు రోజారమణి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment