మద్రాసులో ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు కుర్రాళ్లు అనంతర కాలంలో తెలుగు చిత్రసీమలో తమకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆ ముగ్గురు... గుణశేఖర్, వై.వి.ఎస్. చౌదరి, రవితేజ. వీరిలో మొదటి ఇద్దరూ దర్శకులుగా రాణిస్తుండగా, మూడో వ్యక్తి స్టార్ హీరో హోదాని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి ఓ సినిమాకి పనిచేయబోతున్నారు.ఆ సినిమా పేరు 'నిప్పు'. రవితేజ హీరోగా నటించే ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, బొమ్మరిల్లు పతాకంపై వైవీఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సంగతిని చౌదరి ప్రకటించారు.
"అప్పట్లో నటి అనూరాధ తల్లి సరోజ గారింట్లో గుణశేఖర్ కింది రూములో ఉంటే, రవితేజ, నేను పై రూములో ఉండేవాళ్లం. అప్పట్లో చిత్రసీమలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఒకే ఇంట్లో ఉన్న మేం ముగ్గురం ఈ రోజు ఒకే సినిమాకి కలిసి పనిచేస్తుండటం ఆనందదాయకం. ఇది నాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నా'' అని చెప్పారు. బొమ్మరిల్లు పతాకంపై తన దర్శకత్వంలో ఓ సినిమా, పేరు పొందిన దర్శకులతో ఓ సినిమా, కొత్త దర్శకులతో ఓ సినిమా.. ఇలా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నానన్నారు. "మా బేనర్‌లో భిన్న భిన్న కథలతో ఇతర దర్శకులతో సినిమాలు చేయాలనే నిర్ణయంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా. నేనభిమానించే దర్శకులతో, వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ సినిమాలు నిర్మిస్తా''అని చెప్పారు. అందులో భాగంగా గుణశేఖర్ దర్శకత్వంలో 'నిప్పు' తీస్తున్నాననన్నారు.
"గుణశేఖర్‌లో రెండు పార్శ్వాలున్నాయి. అతి తక్కువ బడ్జెట్‌తో 'సొగసు చూడతరమా' వంటి సినిమాలు, భారీ బడ్జెట్‌తో 'ఒక్కడు' వంటి సినిమాలు తీయగలరు. నాకు సినిమా చేసి పెట్టమని ఆయన్ని అడిగా. చేస్తానని వెంటనే మాటిచ్చారు. తొమ్మిది నెలలు టైమ్ తీసుకుని 'నిప్పు' స్క్రిప్టు పని పూర్తి చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా నడిచే ఈ సినిమాలో రవితేజ కొత్త డైమన్షన్‌లో కనిపిస్తాడు. ఎన్టీఆర్ జయంతి రోజు ఈ నెల 28న 'నిప్పు' షూటింగ్ ప్రారంభిస్తున్నాం'' అని తెలిపారు వైవీఎస్.
ఈ చిత్రానికి ఆయన బావమరిది కిశోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తారు. కాగా తన భార్య గీతకి ఏప్రిల్ 27న రెండో పాప పుట్టిందనీ, పాపకు ఏక్తా అని నామకరణం చేశామనీ, సహ నిర్మాతలుగా తన ఇద్దరు కుమార్తెలు యుక్త, ఏక్తా పేర్లు ఉంటాయని వైవీఎస్ చెప్పారు.
No comments:
Post a Comment