రఘుపతి వెంకయ్య కుమారుడైన ఆర్.ఎస్. ప్రకాశ్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు ఎన్. జగన్నాథ్. 1936లో రూపొందిన 'ద్రౌపదీ మానసంరక్షణ' చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఆ సినిమా ఆడక పోవడంతో ఆయనకు అవకాశాలు రాలేదు. దాంతో ఆర్థిక వనరులు సమకూర్చుకుని స్వీయ దర్శకత్వంలో 'తారుమారు', 'భలేపెళ్లి' చిత్రాల్ని నిర్మించారు. ఈ రెండు సినిమాల్లోనూ పరబ్రహ్మశ్రీ, హేమలత, డా. శివరామకృష్ణయ్య నటించారు. ఈ రెండూ ఆర్థికంగా విఫలమయ్యాయి. వీటిలో 'భలేపెళ్లి' తో సంభాషణల రచయితగా పింగళి నాగేంద్రరావు చిత్రసీమకు పరిచయమయ్యారు. తెలుగులో ఫ్లాపులు ఎదురవడంతో తమిళ, హిందీ భాషల్లో 'విశ్వామిత్ర' చిత్రాన్ని తీశారు.
ఆ తర్వాత చాలా కాలానికి ఆయనకు తెలుగులో 'శ్రీకృష్ణ రాయబారం' రూపొందించే అవకాశం వచ్చింది. వై.వి. రామానుజం, బి.వి. కృష్ణమూర్తి, డా. నరసింహాచార్లు నిర్మించిన ఈ సినిమా 1960 ఫిబ్రవరి 19న విడుదలై అపజయాన్ని పొందింది. ఈ సినిమాలో రఘురామయ్య, అద్దంకి శ్రీరామమూర్తి, కాంతారావు, గుమ్మడి, సంధ్య, రాజనాల, కె.వి.ఎస్. శర్మ, హేమలత, రుష్యేంద్రమణి, ఎ.వి. సుబ్బారావు, మిక్కిలినేని వంటి మహామహులు నటించారు. ఈ సినిమాకి జగన్నాథ్ వద్ద అప్రెంటిస్‌గా పనిచేసిన పి. చంద్రశేఖరరెడ్డి అనంతర కాలంలో దర్శకునిగా గొప్పగా రాణించారు. జగన్నాథ్ సతీమణి కల్యాణ సుందరి రాసిన కథతో రూపొందించిన 'కొత్త కాపురం'తో గురుదక్షిణ చెల్లించారు చంద్రశేఖరరెడ్డి.
No comments:
Post a Comment