Wednesday, May 25, 2011

న్యూస్: ఆగస్టు నుంచి వినాయక్ - రాంచరణ్ సినిమా

చిరంజీవితో 'ఠాగూర్' వంటి సూపర్ హిట్‌ని అందించిన దర్శకుడు వి.వి. వినాయక్, 'మగధీర' వంటి రికార్డుల చిత్రంలో నటించిన రాంచరణ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందబోతోంది. ఆగస్టులో సెట్స్ మీదకెళ్లే ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించనున్నారు. వినాయక్ చెప్పిన కథ సూపర్‌గా ఉందని రాంచరణ్ తెలపగా, రాంచరణ్ ఇంతవరకు చెయ్యని పాత్రని ఇందులో చెయ్యబోతున్నారనీ, ఆయన కెరీర్‌లో ఇది మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనీ వినాయక్ చెప్పారు. "ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా మా బేనర్ మీద తెరకెక్కబోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు సృష్టించనున్నది. పక్కా కమర్షియల్ సినిమాగా తయారయ్యే ఇందులో ఓ ప్రముఖ కథానాయిక నటించబోతోంది. ఆమె ఎవరనే సంగతితో పాటు, టెక్నీషియన్ల వివరాలూ త్వరలో తెలియజేస్తాం'' అని దానయ్య తెలిపారు.
జూన్‌లో 'రచ్చ' మొదలు
రాంచరణ్ హీరోగా 'ఏమైంది ఈ వేళ' ఫేమ్ సంపత్ నంది దర్శకత్వం వహించే 'రచ్చ' చిత్రం షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానున్నది. "ఈ సినిమా మెగా అభిమానుల అంచనాలను వంద శాతం అందుకుంటుంది. రాంచరణ్ ఓ విభిన్న పాత్రలో ఇందులో కనిపిస్తారు. పక్కా ప్లానింగ్‌తో అనుకున్న వర్కింగ్ డేస్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలని నిర్మాతలు సంకల్పించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తీయనున్నాం'' అని సంపత్ తెలిపారు. తమన్నా హీరోయిన్‌గా నటించే ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.

'బెజవాడ రౌడీలు' ఆగిపోలేదు: రాంగోపాల్‌వర్మ

విజయవాడలో షూటింగ్ చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా 'బెజవాడ రౌడీలు' షూటింగ్ ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ చిత్ర నిర్మాత రాంగోపాల్‌వర్మ స్పష్టం చేశారు. ముందుగా ప్లాన్ చేసినట్లే విజయవాడ షెడ్యూలుని పూర్తి చేసుకుని, ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూలు కొనసాగిస్తున్నామన్నారు. "ఆగస్టు వరకు జరిగే మరో మూడు షెడ్యూళ్లతో సినిమా పూర్తవుతుంది. విజయదశమికి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.
నాగచైతన్య హీరోగా శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై రాంగోపాల్‌వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగచైతన్య సరసన ఓ పేరున్న నాయిక నటించే ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అభిమన్యుసింగ్, ఆహుతి ప్రసాద్, శుభలేఖ సుధాకర్, ముకుల్‌దేవ్, అజయ్, అశోక్‌కుమార్, ఫణి, భరత్, శ్రావణ్ తారాగణం.
వందిత కోనేరు సమర్పిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమర్ మోహ్లే, ప్రేమ్, ధరమ్ సందీప్, విశాల్, ఫైట్స్: ఇజాజ్, జావేద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వివేక్‌కృష్ణ.

Tuesday, May 24, 2011

ఇంటర్వ్యూ: పోసాని కృష్ణమురళి

"జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ 'దుశ్శాసన'లో హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ'' అని చెప్పారు. పోసాని కృష్ణమురళి. శ్రీకాంత్, సంజన జంటగా లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మురళీకృష్ణ నిర్మించిన 'దుశ్శాసన' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ నెల 27న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించీ, అందులోని రాజకీయ అంశాల గురించీ విపులంగా మాట్లాడారు పోసాని. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

రాజకీయ నాయకుల్లో ఎవరైతే ప్రజాస్వామ్య విలువల్ని వలువల్లా లాగేస్తున్నారో వారే నా సినిమాలో 'దుశ్శాసన'. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకి ఉండే సౌకర్యాలేవీ సామాన్య జనానికి ఉండవు. ఏ మంత్రి లేదా ఎమ్మెల్యే ఇంట్లో కరెంటు సమస్య కానీ, నీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ ఉండదు. ఇవన్నీ జనానికి ఉంటాయి. దీన్ని ప్రశ్నించి, "మీకు ఉండే సౌకర్యాలన్నీ మాకూ ఇవ్వండిరా'' అని డిమాండ్ చేసే ఓ కామన్ మ్యాన్ కథ ఈ సినిమా. ఏ పనులు చేస్తామని పదవులు చేపట్టారో ఆ పనులు ఎందుకు చెయ్యడం లేదని అడిగే పాత్రలో శ్రీకాంత్ బాగా చేశాడు. అర్జెంటీనా ఉద్యమకారుడు చేగువేరా అంటే నీతికీ, నిజాయితీకీ, పోరాటానికీ, ధైర్యానికీ ప్రతీక. అందుకే శ్రీకాంత్ పాత్రకి ఆ లుక్ ఇచ్చా. అంతకుమించి చేగువేరాకీ, నా సినిమాకీ ఎలాంటి సంబంధమూ లేదు.
అందుకే పాలిటిక్స్ 
నా ఉద్దేశంలో జనజీవన స్రవంతిలో కలవాల్సింది మావోయిస్టులు కాదు. రాజకీయ నాయకులే. మావోయిస్టులు అన్ని సౌకర్యాల్నీ వదులుకుని అడవుల్లో జనం కోసం బతుకుతున్నారు. జనం మధ్య ఉంటూనే జనానికి దూరంగా బతుకుతోంది ఈ రాజకీయ నాయకులే. నక్సలైట్లు ఊరికే పుట్టడం లేదు. ఈ రాజకీయ వ్యవస్థవల్లే పుడుతున్నారు. చెప్పీ చెప్పీ ఏమీ ప్రయోజనం ఉండకపోవడంతో విసిగిపోయి నక్సలైట్లుగా మారుతున్నారు. అందుకే పాలిటిక్స్ గురించి ఎంత ఎక్కువ చెబితే అంత మంచిదనే ఉద్దేశంతో నా సినిమాల్లో రాజకీయ అంశాల్ని ప్రస్తావిస్తూ వస్తున్నా
వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లను 
ఇవాళ రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతున్నారు. తమకి అడ్డు వచ్చినవాళ్లని అడ్డు తొలగించుకోడానికి వెనుకాడటం లేదు. ఇలా అడుగుతున్నానని నన్ను ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. ఈ సంగతి మా కుటుంబానికి కూడా చెప్పా. నేను తప్పు చెయ్యనని మా వాళ్ల నమ్మకం. అందుకే వాళ్లు నాకు అడ్డురారు. నేను ఎవరి వ్యక్తిగత విషయాల జోలికీ వెళ్లను. వ్యక్తిగతంగా వాళ్లేం చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ జనంలోకి వస్తేనే అడుగుతా. 'దుశ్శాసన'లో జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ.
బిజినెస్ సమస్య లేదు 
పోసాని వల్ల ఏ నిర్మాతా నాశనం కాడు. పోసాని సినిమా అంటే కొనేవాళ్లు ఇంకా ఉన్నారు. నేను తీసేది తక్కువ బడ్జెట్‌తో కావడం వల్ల బిజినెస్ సమస్య నా సినిమాలకు లేదు. 'దుశ్శాసన' అన్ని ప్రాంతాలకూ అమ్ముడుపోయింది.
జేపీ నీతిమంతుడే కానీ... 
రాజకీయాల్లో స్థిరమైన నిర్ణయాలు ఉండవు. జనం ఎప్పుడూ ఏదో ఒక పార్టీకే ఎందుకు ఓట్లేయడం లేదు. ఒకసారి ఓ పార్టీని గెలిపించే వారు ఆ పార్టీ ప్రభుత్వం బాగా పనిచేస్తేనే మళ్లీ దానికి ఓటేస్తారు. లేదంటే వేరే పార్టీని ఎన్నుకుంటారు. నేను కూడా అంతే. ఏ నాయకుడైనా బాగా చేస్తుంటే మెచ్చుకుంటా. పొరపాట్లు చేస్తే తిడతా. మొన్న చంద్రబాబునీ, నిన్న చిరంజీవినీ అలాగే మెచ్చుకున్నా, తర్వాత తిట్టా. ఇవాళ రాజకీయ నాయకుల్లో 99 శాతం అవినీతిపరులే. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుల్ని ఓ ముగ్గుర్ని చూపించండి. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అవినీతి అనివార్యమైపోయింది. రాజకీయ నాయకులతో పాటు ప్రజలూ అవినీతి గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు. లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ నీతిమంతుడు. అయితే ఇవాళ నీతి ఒక్కటే సరిపోదు. దానితో పాటు సమర్థతా, బలమూ కావాలి. జె.పి.కి ఆ బలం లేదు. ఉన్నవాళ్లలో సమర్థుడు అనిపించబట్టే వై.ఎస్. జగన్మోహనరెడ్డికి మద్దతు పలుకుతున్నా.

క్రేజీ కాంబినేషన్: ముగ్గురు మిత్రుల 'నిప్పు'

మద్రాసులో ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు కుర్రాళ్లు అనంతర కాలంలో తెలుగు చిత్రసీమలో తమకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆ ముగ్గురు... గుణశేఖర్, వై.వి.ఎస్. చౌదరి, రవితేజ. వీరిలో మొదటి ఇద్దరూ దర్శకులుగా రాణిస్తుండగా, మూడో వ్యక్తి స్టార్ హీరో హోదాని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి ఓ సినిమాకి పనిచేయబోతున్నారు.ఆ సినిమా పేరు 'నిప్పు'. రవితేజ హీరోగా నటించే ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, బొమ్మరిల్లు పతాకంపై వైవీఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సంగతిని చౌదరి ప్రకటించారు.
"అప్పట్లో నటి అనూరాధ తల్లి సరోజ గారింట్లో గుణశేఖర్ కింది రూములో ఉంటే, రవితేజ, నేను పై రూములో ఉండేవాళ్లం. అప్పట్లో చిత్రసీమలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఒకే ఇంట్లో ఉన్న మేం ముగ్గురం ఈ రోజు ఒకే సినిమాకి కలిసి పనిచేస్తుండటం ఆనందదాయకం. ఇది నాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నా'' అని చెప్పారు. బొమ్మరిల్లు పతాకంపై తన దర్శకత్వంలో ఓ సినిమా, పేరు పొందిన దర్శకులతో ఓ సినిమా, కొత్త దర్శకులతో ఓ సినిమా.. ఇలా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నానన్నారు. "మా బేనర్‌లో భిన్న భిన్న కథలతో ఇతర దర్శకులతో సినిమాలు చేయాలనే నిర్ణయంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా. నేనభిమానించే దర్శకులతో, వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ సినిమాలు నిర్మిస్తా''అని చెప్పారు. అందులో భాగంగా గుణశేఖర్ దర్శకత్వంలో 'నిప్పు' తీస్తున్నాననన్నారు.
"గుణశేఖర్‌లో రెండు పార్శ్వాలున్నాయి. అతి తక్కువ బడ్జెట్‌తో 'సొగసు చూడతరమా' వంటి సినిమాలు, భారీ బడ్జెట్‌తో 'ఒక్కడు' వంటి సినిమాలు తీయగలరు. నాకు సినిమా చేసి పెట్టమని ఆయన్ని అడిగా. చేస్తానని వెంటనే మాటిచ్చారు. తొమ్మిది నెలలు టైమ్ తీసుకుని 'నిప్పు' స్క్రిప్టు పని పూర్తి చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా నడిచే ఈ సినిమాలో రవితేజ కొత్త డైమన్షన్‌లో కనిపిస్తాడు. ఎన్టీఆర్ జయంతి రోజు ఈ నెల 28న 'నిప్పు' షూటింగ్ ప్రారంభిస్తున్నాం'' అని తెలిపారు వైవీఎస్.
ఈ చిత్రానికి ఆయన బావమరిది కిశోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తారు. కాగా తన భార్య గీతకి ఏప్రిల్ 27న రెండో పాప పుట్టిందనీ, పాపకు ఏక్తా అని నామకరణం చేశామనీ, సహ నిర్మాతలుగా తన ఇద్దరు కుమార్తెలు యుక్త, ఏక్తా పేర్లు ఉంటాయని వైవీఎస్ చెప్పారు.

Monday, May 23, 2011

అక్కినేని నాగార్జున: రజతోత్సవ కథానాయకుడు

సినీ కథానాయకునిగా అక్కినేని నాగార్జున పాతికేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసునిగా చిత్రసీమలో కాలిడినా, సొంత ప్రతిభావ్యుత్పత్తులతో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఎదిగారు. హీరోగా ఆయన నటించిన తొలి చిత్రం 'విక్రమ్' 1986లో విడుదలైంది ఈ రోజే (మే 23). బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'హీరో'కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్టయ్యి, నాగార్జున సినీ జీవితానికి చక్కని పునాది వేసింది.
యాక్షన్, సెంటిమెంట్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానాంశాలుగా వచ్చిన ఈ చిత్రంలోని పాటలు కొన్నాళ్ల వరకు మారుమోగుతూనే ఉన్నాయి. మొదట్లో అభినయం, వాచకం విషయాల్లో విమర్శల్ని ఎదుర్కొన్న నాగార్జున పట్టుదలతో వాటిలో పరిణతి సాధించారు. సినిమా సినిమాకీ నటునిగా ఎదుగుతూ వచ్చారు. తొలి సినిమా వచ్చిన ఏడాదికే దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన నటించిన 'మజ్ను' చిత్రం ఆయన కెరీర్‌కి బ్రహ్మాండమైన ఊతాన్నిచ్చింది. ఆ సినిమా నుంచీ నటునిగా ఆయన ఏవిధంగా పరిణతి సాధిస్తూ వచ్చిందీ మనం చూశాం.
ఆ సినిమాతో తెలుగు సినిమా గతే మారిపోయిందన్నది అందరూ ఒప్పుకునే నిజం. ఆడియోగ్రఫీ, రీరికార్డింగ్ అనే వాటికి అధిక ప్రాధాన్యం వచ్చింది ఈ సినిమా నుంచే. చిత్రమేమంటే ఆ సినిమాకి ఆర్నెల్ల ముందు అదే ఏడాది వచ్చిన 'గీతాంజలి'లో పూర్తి భిన్నమైన ప్రేమికుని పాత్రలో నాగార్జున అభినయం విమర్శకుల్ని సైతం మెప్పించింది. అప్పట్నించీ కెరీర్‌లో వెనుతిరగని ఆయన అన్ని రకాల పాత్రలతో ఇటు క్లాస్, అటు 'మాస్' ప్రేక్షకుల్ని సమానంగా అలరిస్తూ వస్తున్నారు.
'లార్జర్ దేన్ లైఫ్' పాత్రలైన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు'గా అద్భుతంగా అభినయించి సమకాలీన కథానాయకుల్లో తనకంటూ ప్రత్యేకతని నిలుపుకున్నారు. ప్రస్తుతం 'శిరిడీసాయి'గా నటించేందుకు ఉద్యుక్తులవుతున్నారు. భవిష్యత్తులో ఈ అగ్ర నటుడు మరిన్ని మైలురాళ్లను అందుకోవడం ఖాయం.

Sunday, May 22, 2011

ఫ్లాష్‌బ్యాక్: 'మహాకవి కాళిదాసు'కు జాతీయ అవార్డు

'మహాకవి కాళిదాసు' చిత్రం 1961 మార్చి 31న న్యూఢిల్లీలో 1960లో విడుదలైన తెలుగు చిత్రాల్లో ఉత్తమమైందిగా రాష్ట్రపతి రజత పతకం పొందింది. నిర్మాత సూరిబాబుకు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ బహుమతి అందజేశారు. ఆయన తమ భవనానికి దర్శకుడు కమలాకర కామేశ్వరరావునూ, ఇతర బృందాన్నీ ఆహ్వానించి ఉదయం పూట తాము వినేందుకు కాళిదాసు శ్లోకాల రికార్డును వేయించారు. ఉత్తమ నటిగా జూనియర్ శ్రీరంజనికి వెండి ప్లేటు బహూకరించారు.

Saturday, May 21, 2011

ఫ్లాష్‌బ్యాక్: 'జగదేకవీరుని కథ'లో జలకాలాటల సీను

'జగదేకవీరుని కథ'లో జలక్రీడల సన్నివేశం ఎంత జగన్మోహనంగా ఉంటుందో దాన్ని చూసిన వాళ్లందరికీ తెలిసిందే. వరుసగా కొన్ని రోజులు ఆ సన్నివేశాన్ని షూట్ చేశారు. వాహినీ స్టూడియోలోనే ప్రత్యేకంగా కొలను నిర్మించి స్నాన సన్నివేశాలు తీశారు. బి. సరోజాదేవి, ఆమె చెలికత్తెలు, రామారావు వంటి తారలు రోజంతా నీళ్లల్లో ఉండి, జలుబుచేసి షూటింగుకు ఆటకం కలిగితే ఎట్లా? అందుకని చన్నీళ్ల కొలనుని వేడి సరస్సుగా మార్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ కృత్రిమ సరస్సు చుట్టూ కొంచెం దూరంలో అంటే కెమెరా ఫీల్డులోకి రాని దూరంలో బాయిలర్లు పెట్టారు. తారలు నీళ్లలో దిగేముందు ఈ బాయిలర్ల నుంచి వేన్నీళ్లు ఆ కొలనులో పోశారు. తారలకు ఇక భయం లేదనుకుంటే సన్నివేశానికి కొత్త బెడద వచ్చింది. బాయిలర్ల నుంచి వచ్చిన వేడి నీళ్ల వల్ల ఫ్లోర్‌లో ఎక్కడ చూసినా ఆవిరి. జానపద సినిమాకి ఆ పొగలు పనికిరావు. మరైతే ఆవిరి లేకుండా కొలనుని ఎలా వేడి చేయాలి? దాంతో బాయిలర్లు తీసేసి కరంటు తీగలు తగిలించి నీటిని వేడి చేశారు. తారలకి జలుబు ప్రమాదం తప్పడమే కాక, ఆ సీన్లు రసవత్తరంగా వచ్చాయి.

Friday, May 20, 2011

ఇంటర్వ్యూ: 'వీర' దర్శకుడు రమేశ్‌వర్మ


'వీర' పూర్తి స్థాయి కమర్షియల్ ఫిల్మ్. సృజనాత్మక పరంగా చెప్పుకోవాల్సింది తక్కువైనా మంచి ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, లవ్ ఉన్న సినిమా. ఇందులో నేనేమీ ప్రయోగాలు చెయ్యలేదు. అయినా పాత్ర పరంగా రవితేజ కొత్తగా కనిపిస్తారు. 'విక్రమార్కుడు'లో ఆయన చేసిన ఫుల్ మాస్, యాక్షన్ రోల్ విక్రమ్ రాథోడ్‌ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. 'వీర'కి స్ఫూర్తి ఆ పాత్రే. ఇందులో రవితేజ రెండు ఛాయలున్న పాత్ర చేశారు. ఒకటి సెక్యూరిటీ గార్డు దేవా, ఇంకొకటి ఊరికి రాబిన్‌హుడ్‌లాంటి వీర. ఇంట్లో మాత్రం వీర వెంకట సత్యనారాయణ. మామూలుగా ఎంత వినయంగా ఉంటాడో, తన వాళ్లకి ఏదైనా జరిగితే రాక్షసంగా మారిపోతాడు. అంటే ఇటు వినయం, అటు రాక్షసత్వం మేళవింపు 'వీర' పాత్ర. దీన్ని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నా.
బంగారంలాంటి మనిషి
'వీర' క్యారెక్టరైజేషన్ నచ్చి ఈ సినిమా చేశారు రవితేజ. ఫస్ట్ సిటింగ్‌లోనే ఓకే చేశాడు. 2010 జనవరిలో ఈ కథ చెప్పా. మొదటి రోజు ఏం చెప్పానో, తెరమీద అదే చూపించా. ఈ సినిమా చెయ్యడంలో రవితేజ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అలాంటి హీరో ఉంటే ఏమైనా చేయొచ్చు. బంగారం లాంటి మనిషి. టైటిల్ రోల్‌ని చాలా బాగా చేశారు. చాలా గ్లామరస్‌గా కనిపిస్తారు. ఇరవై రోజులు మండుటెండల్లో, వారం రోజులు వర్షంలో తడుస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ చేశారు.
'యాన్ యారో హెడ్ ఆఫ్ యాక్షన్' అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్లు ఇందులోని యాక్షన్ జనం గుండెల్లో గుచ్చుకుంటుంది. అదే కాదు, ప్రతి ఎమోషనూ అంతే. 'వీర' గెటప్, స్టైల్ ఆలోచన నాదే అయినా తెర మీద అంత బాగా ఆయన గెటప్ కనిపించడంలో కాస్ట్యూమ్ డిజైనర్ శ్వేత, మేకప్‌మన్ శ్రీను పాత్ర ఎంతో ఉంది.
బాధ్యతతో చేశా
92 పని దినాల్లో 'వీర' పూర్తి చేశాం. నిజానికి మొదట అనుకున్న షెడ్యూలు 140 రోజులని. బడ్జెట్ ఏమనుకున్నామో, దాని లోపలే చేశాం. అవసరమున్నా, లేకపోయినా ఇష్టమెచ్చినట్లు ఖర్చు చెయ్యడం నాకు రాదు. నిర్మాతలు ఈ ప్రాజెక్టుని నాకు అప్పజెప్పారు. అందుకే ఎంతో బాధ్యతతో ఈ సినిమా చేశా. నిర్మాతల, హీరో సహకారం వల్లే హ్యాపీగా ఈ సినిమా చేయగలిగా. సాధారణంగా తను చేసిన సినిమాల్ని ముందుగా చూడరు రవితేజ. కానీ ఎందుకో ఈ సినిమా చూశారు. 'చాలా బాగుంది' అన్నారు.
ఇద్దరూ సమానమే
తాప్సీ, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు. ఇద్దరికీ సమాన ప్రాతినిథ్యం ఉంటుంది. కాజల్ గ్రామీణ యువతిగా పూర్తి మాస్ పాత్రలో తొలిసారి కనిపించబోతుంటే, తాప్సీ నగర యువతి పాత్రని చేసింది. శ్యామ్, శ్రీదేవి మరో జంటగా కనిపిస్తారు.
ఆయన్ని ఇబ్బంది పెట్టా
ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. సొంత తమ్ముడిలా చూసుకున్నారు. నచ్చేదాకా పనిచేయించుకునే మనస్తత్వం నాది. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టా. అయినా అర్థం చేసుకుని, మంచి ఔట్‌పుట్ వచ్చేందుకు బాగా సహకరించారు. అలాగే తమన్ అద్భుతమైన సంగీతాన్నిచ్చాడు. అతను మరో చక్రవర్తి. ఆయనలాగే చాలా స్పీడుగా పనిచేస్తాడు. పది రోజుల్లో పాటల ట్యూన్లు, పది రోజుల్లో రీ రికార్డింగ్ అందించాడు.
రవితేజతోటే 'వాడే వీడు'
'ఒక ఊరిలో..' యావరేజ్‌గా ఆడితే, 'రైడ్' హిట్. ఇప్పుడు 'వీర' సూపర్ హిట్ కాబోతోంది. నా అనుభవంలో చిన్న సినిమాకే ఎక్కువ కష్టపడాలి. పెద్ద సినిమా చెయ్యడమే సులువు. హీరో ఇమేజ్‌ని దృష్టి పెట్టుకుని పనిచేస్తే చాలు. రవితేజ వల్లనే ఇలాంటి ఫీలింగ్ కలిగిందనుకుంటా. ఈ చిత్రంతో కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్స్‌ని రమేశ్‌వర్మ బాగా డీల్ చేస్తాడనే పేరు వస్తుందని వంద శాతం నమ్మకంతో ఉన్నా. ఈ సినిమా తర్వాత మళ్లీ రవితేజతోనే చెయ్యాలనుకుంటున్నా. 'వాడే వీడు' అనే కథ రెడీ చేస్తున్నా. ఇందులో రవితేజ ద్విపాత్రల్లో కనిపిస్తారు. ఒకటి క్లాస్, ఒకటి మాస్.

సినిమా రివ్యూ: వీర

'వీర'ని చూసి నేనేమీ ఆశ్చర్యపడలేదు. అది సరిగ్గా ఇలాగే ఉంటుందని అనుకోకపోయినా ఇంతకంటే బాగుంటుందని మాత్రం అనుకోలేదు. ఇదివరకే నేను పోస్ట్ చేసినట్లు డైరెక్టర్ రమేశ్‌వర్మతో మాట్లాడినప్పుడే ఈ సినిమా భవితవ్యం ఏమిటో నాకు అవగతమైంది. సినిమా చూస్తుంటే నాకు రవితేజ స్థానంలో బాలకృష్ణే కనిపిస్తూ వచ్చాడు. 'నరసింహనాయుడు' నుంచి బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ సినిమాల్లో ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా సుమోలు పైకి లేవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రవితేజ సినిమాలోనూ అదే పాత చింతకాయ పచ్చడి సీనే ఉండటం తెలుగు సినిమా ఏమీ ఎదగలేదనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది బాలకృష్ణ కోసమే తయారు చేసిన సబ్జెక్ట్ అనేది మనకు అడుగడుక్కీ తెలిసిపోతూనే ఉంది. ఆయన యాక్ట్ చేసిన 'సమరసింహారెడ్డి' నుంచి 'సింహా' దాకా అన్ని హిట్ సినిమాల్ని కలిపి ఈ కిచిడీ కథని తయారుచేశాడు రమేశ్‌వర్మ. 'నరసింహనాయుడు'లో సిమ్రాన్ చనిపోయే సీను, నిన్న కాక మొన్న వచ్చిన 'సింహా'లో నయనతార చనిపోయే సీను జ్ఞాపకం తెచ్చుకోండి. అవే సీన్లని కాపీ కొట్టి ఇందులో కాజల్ చనిపోయే సీను తయారు చేశాడు రమేశ్. తను ఇప్పటికే నాలుగైదు సార్లు చేసిన కథనే రమేశ్ వినిపించాడని కొద్ది ఆలస్యంగా గ్రహించిన బాలకృష్ణ ఈ కథ పట్ల విముఖత చూపించాడు. తనకి ఇలాంటి మాస్ కథ కొత్త కాబట్టి రవితేజ ఒప్పుకున్నాడు.
బ్రహ్మానందం, రవితేజ కాంబినేషన్లో వచ్చే తాగడు సీన్లు నవ్వు పుట్టించడానికి బదులు చీదర పుట్టించాయి. ఇప్పటికే ఆ తరహా సీన్లు ఎన్నో సినిమాల్లో చూసేశాం. డైరెక్టర్లో ఏమాత్రం క్రియేటివ్ ఎనర్జీ లేదని ఎన్నో సీన్లు చెప్పాయి. తాప్సీ పాత్ర కేవలం ఇమాజినేషన్లో పాటలు కనడానికి మాత్రమే పరిమితమైపోయింది. కాజల్ పాత్రనీ సరిగా మలచలేదు. ఊరికే పెద్ద దిక్కులాంటి 'వీర'ని తనలో ప్రేమ పుట్టించాకే శోభనమంటూ ఆమె కబడ్డీ ఆడటం 'వీర' పాత్ర గౌరవాన్ని పూచిక పుల్లలాగా తీసేయడమే. సెకండాఫ్‌లో బ్రహ్మానందం ఏమైపోయాడో ఎవరికీ తెలీదు.
ఎంతో ఎనర్జీతో తెరమీద వీరంగమాడే రవితేజ 'వీర' పాత్రలో డల్లయిపోయాడు. తమన్ మ్యూజిక్ కొత్తగా వినిపించడం మానేసింది. ప్రతి సినిమాలో ఒకేరకపు బీటుతో చంపేస్తున్నాడు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఒకటే కాస్త బెటరనిపించింది. పరుచూరి బ్రదర్స్ కానీ, అబ్బూరి రవి కానీ ఈ సినిమాని రక్షించలేకపోయారు.

విశ్లేషణ: 'ఇడియట్' ఎందుకంత హిట్టయ్యింది?-2

విశ్లేషణ: 'ఇడియట్' ఎందుకంత హిట్టయ్యింది?-1

Wednesday, May 18, 2011

న్యూస్: 'వీర' దర్శకుడి భాషా పరిజ్ఞానం!

రవితేజని రమేశ్‌వర్మ ఎలా కన్విన్స్ చేశాడోనని చాలామంది సినీ జీవులు ఆశ్చర్యపోతున్నారు. 'వీర' దర్శకుడు అతనే. అతనితో మాట్లాడిన వాళ్లకి కూడా అదే డౌట్ వస్తుంది. ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ కోసం రమేశ్‌వర్మని ఇంటర్వ్యూ (17-5-11 న వచ్చింది) చేసినప్పుడు అతని భాషా పరిజ్ఞానానికి ఆశ్చర్యపోవడం నావంతయ్యింది. 'వీర' అంటే అతనో వివరణ ఇచ్చాడు. 'వీ' అంటే వినయంగా, 'ర' అంటే రాక్షసంగా అని అర్థమంట. అంటే మామూలుగా వినయంగా ఉండే హీరో అవసరమైతే రాక్షసంగా మారతాడంట. 'వీర' పాత్ర తీరు అదంట. నేనన్నాను... "మీరు చెపుతున్నది సరిగ్గా లేదు. టైటిల్లో మొదటి అక్షరం 'వీ'. అంటే 'వి'కి పొల్లు ఉంది. అలాంటప్పుడు 'వినయం' అనే పదం ఎలా సమన్వయిస్తుంది? అంతేకాదు. టైటిల్లో రెండో అక్షరం 'ర'. దానికి దీర్ఘం లేదు. కానీ మీరు 'రాక్షసం' అంటున్నారు. అదీ సింకవడం లేదు. అందువల్ల 'వీర'కి మీరు చెబుతున్నది సరైన అర్థం కాదు". అప్పుడతనన్నాడు. "దీర్ఘాలు, పొల్లులు లేకపోతేనేం సార్". అదీ సంగతి. దాన్ని బట్టి నాకర్థమైందేమంటే అతను మంచి 'స్టోరీటెల్లర్' అనీ, అందుకే రవితేజ పడిపోయాడనీ. లేకపోతే 'వీర' రిలీజ్ కాకముందే 'వాడే వీడు' అనే కథతో సినిమా చేయడానికి రమేశ్‌వర్మకి గ్రీన్‌సిగ్నల్ ఎందుకిస్తాడు?

Tuesday, May 17, 2011

కవిత: మగ్గం ఆడుతుంటే...

రోజంతా మగ్గం ఆడుతున్న చప్పుడు వింటాను
ఆ బక్కపలుచని చెక్కల నిర్మాణం ఎంత సుందరం!
నిలువుగా రెండు.. అడ్డంగా రెండు..
ఉక్కు కండల చేతులూ కాళ్లలా.. చెక్కలు!!
ఒక చేత్తో పలక, ఇంతో చేత్తో పిడి..
మగ్గంలో కూర్చున్న నాన్నని అపురూపంగా చూస్తుంటాను
లయబద్ధంగా నాట్యం చేస్తున్న నటరాజే జ్ఞాపకమొస్తాడు
పోగు పక్కన ఇంకో పోగు - పడుగు
పోగు మీద ఇంకో పోగు - పేక
సొరుగుల్లోంచి చకచకా అట్నించి ఇటు తిరిగే నాడి
వడివడిగా దూసుకొచ్చే జలతారు పోగులు

ఒక పావుచెక్క కిందికి దిగితే
ఇంకో పావుచెక్క పైకి లేస్తుంది
అచ్చులో సగం పోగులు కిందికీ
ఇంకో సగం పోగులు పైకీ
పోగులు చిక్కుబడకుండా
కచ్చిబద్దలు కాపలా కాస్తుంటాయి సైనికుల్లాగా
బట్ట బిగువు సడలిపోకుండా
చేళ్లు చేతులు చాపి పట్టుకుంటాయి రక్షకుల్లాగా
బుటా తర్వాత ఇంకో జరీ బుటా
సెల్ఫు తర్వాత ఇంకో పూల సెల్ఫు
పడుగు పైన పట్టు పాగళ్లు
గుడ్డమీద రంగుల సీతాకోకలవుతుంటాయి

నెమ్మదిగా చీకటి చిక్కనవుతుంటే
కిరసనాయిలు బుడ్డీలు
మగ్గం రెండుపక్కలా వెలుగుతాయి
మగ్గం చప్పుడు ఆగదు
పడుగు-పేక పరిమళాలు వదలవు
పదకొండు కొట్టేదాకా మగ్గం విశ్రమించదు
ఒక దోనె ఖాళీ అవుతుంటే
ఇంకో దోనె నిండు కుండవుతుంటుంది
ఒక తాను పుట్టాక
ఇంకో తాను పురుడు పోసుకోవడం మొదలవుతుంది!
టకటకమనే పలక చప్పుడులో
చెమట చుక్కల పాట సమ్మగా వినిపిస్తుంటుంది!!

-ఆంధ్రజ్యోతి 'వివిధ', 4 అక్టోబర్ 2010

ఫోకస్: రజనీకాంత్ 'రాణా' వెలుగు చూస్తుందా?

ఇప్పుడు అందరి చూపూ రజనీకాంత్ సినిమా 'రాణా' మీదే. ఆ సినిమా అసలు షూటింగ్ జరుపుకుంటుందా? లేక ఆగిపోతుందా? అనే ప్రశ్నలు అందరి మనసుల్నీ తొలుస్తున్నాయి. ఏప్రిల్లో ఈ మెగా బడ్జెట్ సినిమా సెట్స్ మీదకెళ్లింది. హీరోయిన్లుగా దీపికా పదుకోనే, ఇలియానా ఎంపికయ్యారు. నెల రోజుల వ్యవధిలో రజనీకాంత్ మూడు సార్లు హాస్పిటల్ పాలవడంతో సినిమా షెడ్యూలంతా డిస్టర్బయ్యింది. వాంతుల కారణంగా ఏప్రిల్ 29న ఆయన చెన్నైలోని సెయింట్ ఇసాబెల్ హాస్పిటల్లో చేరి, అదే రోజు సాయంత్రం డిశ్చార్జయ్యారు.
తిరిగి మే 4న జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో అదే హాస్పిటల్లోని ఐసీయూలో చేరారు. నెల రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు ఆయనకు సూచించారు. దీంతో నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.
మరోవైపు హీరోయిన్లు దీపిక, ఇలియానా కాల్షీట్లు ఇరకాటంలో పడ్డాయి. ఈ నెలలో కొన్ని కాల్షీట్లు ఇచ్చిన దీపిక జూన్-జూలైలోనూ మరికొన్ని కాల్షీట్లు ఇచ్చింది. ఈలోగా రజనీకాంత్ కోలుకుని మళ్లీ షూటింగ్‌కి హాజరైతే ఓకే. లేదంటే ఏంచేయాలోనని అంతా తలల పట్టుకుంటున్నారు. మరోవైపు 'రాణా' షూటింగ్ యధాతథంగా జరుగుతుందని డైరెక్టర్ కేయస్ రవికుమార్ చెబుతున్నాడు. 'రాణా' టైటిల్ మార్పు కోసం ఆయన న్యూమరాలజిస్టుల్ని సంప్రదించాడు. థాయిలాండ్, లండన్‌లలో షూటింగ్ కోసం ఆయన షెడ్యూల్స్ వేయడంలో మునిగిపోయాడు.
ఈ సినిమా కోసం ఈరోజ్ సంస్థ 150 కోట్లని కేటాయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఆగితే ఏంచెయ్యాలనేది దాని ముందున్న సవాలు. మరి 'రాణా' ముందుకు కదులుతాడా? రజనీకాంత్ కోలుకుని ఎప్పడు షూటింగులో పాల్గొంటాడో...

Monday, May 16, 2011

న్యూస్: 'చరణ్-అర్జున్' గురించి రాయకండి

ఈరోజు ఆంధ్రజ్యోతిలో 'చరణ్, అర్జున్ కాంబినేషన్' అంటూ ఓ న్యూస్ వచ్చింది. రెండు రోజుల క్రితం 'ఈనాడు'లో దీనికి సంబంధించి ఓ న్యూస్ వేశారు. అందులో రాంచరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో గంటా శ్రీనివాస రావు (పీఆర్పీ ఎమ్మెల్యే) సినిమా తీయబోతున్నాడని రాశారు. దాంతో దిల్ రాజు పీఆర్వో కాల్ చేసి ఈనాడు వాళ్లు ఒక్క నిర్మాత పేరే రాశారనీ, దిల్ రాజు కూడా మరో నిర్మాతనీ చెప్పి, ఆయన చెప్పినట్లుగా కాకుండా మాకు తెలిసిందన్నట్లు రాయమన్నాడు. మేం ఓ రోజు గ్యాప్ తీసుకుని ఆ న్యూస్ కేరీ చేశాం. అదనంగా వచ్చే ఆగస్టులో అది మొదలవుతుందన్నాం. పోయినేడాదే గీతా ఆర్ట్స్ బేనర్ 'చరణ్-అర్జున్' అనే టైటిల్ రిజిస్టర్ చేసిన సంగతీ తెలిపాం. ఈ రోజు ఆ న్యూస్ వచ్చాక గీతా ఆర్ట్స్ పీఆర్వో నుంచి ఎస్సెమ్మెస్ వచ్చింది. తాము చెప్పేదాకా 'చరణ్-అర్జున్' సినిమా గురించి ఏమీ రాయవద్దనీ, దయచేసి సహకరించమనీ దాని సారాంశం.

Saturday, May 7, 2011

ఫ్లాష్‌బ్యాక్: పద్మిని వివాహం

ఒకప్పటి అందాల తార, మలయాళ నాట్యతార పద్మిని వివాహం ఎలా జరిగిందో తెలుసా?
ఆమెకీ, డాక్టర్ కె. రామచంద్రన్‌కీ 1961 మే 25న కాలికట్ సమీపాన ఉన్న గురువాయూర్ ఆలయంలో నాయర్ కులాచార ప్రకారం వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు పద్మిని పసుపుపచ్చ పట్టుచీర ధరిస్తే, వరుడు రామచంద్రన్ జరీ ధోవతి ధరించారు. తాళి కట్టిన తర్వాత వరుడు, వధువు ఒకరి మెడలో ఒకరు పుష్పమాలలు వేసుకున్నారు. పెళ్లి తతంగం కొద్ది నిమిషాల్లోనే ముగిసింది. కొద్దిమంది ఆహ్వానితులు మాత్రమే వివాహానికి వచ్చారు. అనేక గ్రామాల నుంచి వచ్చిన 20 వేల మంది ప్రజలు ఆలయం బయట చేరారు. వివాహ సమయంలో వర్షం పడింది. అయినా జనం కదల్లేదు. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎ.ఎల్. శ్రీనివాసన్, నటి టి.ఎ. మధురం, గాయని ఎం.ఎల్. వసంతకుమారి, కొందరు పెద్దలు, 200 మంది బంధువులు హాజరయ్యారు.
వధూవరులు మే 29న మద్రాసు తిరిగి వచ్చారు. మైలాపూర్‌లోని ఇలియట్స్ రోడ్డులో ఉన్న పద్మిని భవనం ముందు పెద్ద పెద్ద గుంపులుగా జనం చేరారు. 29, 30 తేదీల్లో పగలల్లా జనం అక్కడే ఉన్నారు. ఆ రెండు రోజుల్లో ఇంట్లో బంధు మిత్రులకు విందు సత్కారాలు జరిగాయి. భిక్షగాళ్లకు దానాలిచ్చారు. 30 రాత్రి మౌంట్ రోడ్డులోని అబట్స్‌బరీలో గొప్ప విందు జరిగింది. దాదాపు ఆరు వేల మంది ఈ విందుకు హాజరయ్యారు.

Friday, May 6, 2011

మన దర్శకులు: ఎన్. జగన్నాథ్

రఘుపతి వెంకయ్య కుమారుడైన ఆర్.ఎస్. ప్రకాశ్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు ఎన్. జగన్నాథ్. 1936లో రూపొందిన 'ద్రౌపదీ మానసంరక్షణ' చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఆ సినిమా ఆడక పోవడంతో ఆయనకు అవకాశాలు రాలేదు. దాంతో ఆర్థిక వనరులు సమకూర్చుకుని స్వీయ దర్శకత్వంలో 'తారుమారు', 'భలేపెళ్లి' చిత్రాల్ని నిర్మించారు. ఈ రెండు సినిమాల్లోనూ పరబ్రహ్మశ్రీ, హేమలత, డా. శివరామకృష్ణయ్య నటించారు. ఈ రెండూ ఆర్థికంగా విఫలమయ్యాయి. వీటిలో 'భలేపెళ్లి' తో సంభాషణల రచయితగా పింగళి నాగేంద్రరావు చిత్రసీమకు పరిచయమయ్యారు. తెలుగులో ఫ్లాపులు ఎదురవడంతో తమిళ, హిందీ భాషల్లో 'విశ్వామిత్ర' చిత్రాన్ని తీశారు.
ఆ తర్వాత చాలా కాలానికి ఆయనకు తెలుగులో 'శ్రీకృష్ణ రాయబారం' రూపొందించే అవకాశం వచ్చింది. వై.వి. రామానుజం, బి.వి. కృష్ణమూర్తి, డా. నరసింహాచార్లు నిర్మించిన ఈ సినిమా 1960 ఫిబ్రవరి 19న విడుదలై అపజయాన్ని పొందింది. ఈ సినిమాలో రఘురామయ్య, అద్దంకి శ్రీరామమూర్తి, కాంతారావు, గుమ్మడి, సంధ్య, రాజనాల, కె.వి.ఎస్. శర్మ, హేమలత, రుష్యేంద్రమణి, ఎ.వి. సుబ్బారావు, మిక్కిలినేని వంటి మహామహులు నటించారు. ఈ సినిమాకి జగన్నాథ్ వద్ద అప్రెంటిస్‌గా పనిచేసిన పి. చంద్రశేఖరరెడ్డి అనంతర కాలంలో దర్శకునిగా గొప్పగా రాణించారు. జగన్నాథ్ సతీమణి కల్యాణ సుందరి రాసిన కథతో రూపొందించిన 'కొత్త కాపురం'తో గురుదక్షిణ చెల్లించారు చంద్రశేఖరరెడ్డి.

Monday, May 2, 2011

రోజారమణికి రాష్ట్రపతి ప్రశంస

'భక్త ప్రహ్లాద'ను అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి చూపించేందుకు ప్రివ్యూ ఏర్పాటు చేశారు ఏవీయం చెట్టియార్. పెద్ద సినిమా కావడంతో ఒకేసారి కాకుండా రెండు విడతలుగా ఆ సినిమా చూసేందుకు రాధాకృష్ణన్ సరేనన్నారు. తొలి సగం చూశాక 'ప్రహ్లాదుడిగా చేసిన బాబు ఎవరు?' అనడిగారు. 'బాబు కాదు పాప' అని ఏవీయం వాళ్లు చెప్పాక, ఆశ్చర్యపోయిన ఆయన 'ఆ పాపను రప్పించండి' అని చెప్పారు. రోజారమణి తల్లి అప్పుడు ప్రెగ్నంట్ కావడంతో కూతుర్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లారు సత్యం. రోజారమణిని తన పక్కనే కూర్చుండ పెట్టుకుని, సినిమా సెకండాఫ్ చూశారు రాధాకృష్ణన్. రాష్ట్రపతి భవన్‌లో భోజనం పెట్టించారు. ప్రహ్లాదుడిగా నటించినందుకు ఒక ప్రశంసాపత్రం ఇచ్చారు. అదే పాత్రకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ బాలనటి అవార్డును అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా అందుకుంది బాల రోజారమణి.

రోజారమణి తొలి సినిమా అనుభవం

ప్రఖ్యాత ఏవీయం ప్రొడక్షన్స్ సంస్థ 1967లో 'భక్త ప్రహ్లాద'ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించడం ద్వారా రోజారమణి బాల నటిగా తెరంగేట్రం చేశారు. ఆమె ఆ పాత్రకు ఎంపికవడం ఓ మిరకిల్. అప్పటికి ఆమె ఇంకా స్కూల్లో చేరలేదు. ఒకసారి మద్రాసులో ఏవీయం స్టూడియో చూపించేందుకని వాళ్ల నాన్న సత్యం ఆమెని అక్కడికి తీసుకుపోయారు. ఆయన ఆ రోజుల్లో 'సినిమా రంగం' అనే సినీ పక్ష పత్రికకి మార్కెటింగ్ హెడ్‌గా పనిచేసేవారు. అప్పుడు పరిస్థితి ఎలా వుందంటే స్టూడియో వద్ద ఎవరైనా చిన్న పిల్లలు కనిపిస్తే చాలు, ప్రహ్లాదుని పాత్రకు సరిపోతారా, లేదా అని చూస్తున్నారు. "ఆ స్టూడియో ఇంచార్జి నాగేశ్వరరావు అనే ఆయనకు నాన్న బాగా తెలుసు. ఆయన నన్ను చూసి ముచ్చటపడి రంగూన్ రామారావు అనే కో-డైరెక్టర్‌ని పిలిపించి, నన్ను ఆ పాత్రకు సరిపోతానో, లేదో చూడమన్నారు. ఆయన 'ఆడపిల్ల కదా' అని సందేహపడ్డారు. మేకప్ వేస్తే ఆ సంగతి కనిపెట్టడం కష్టమని నాగేశ్వరరావు అనడంతో నాకు చేతనైంది ఏమైనా చేయమని రామారావు అడిగారు. అప్పట్లో నాకు వచ్చింది 'మూగ మనసులు' సినిమాలోని 'గోదారి గట్టుంది గట్టుమీద చెట్టుంది' పాటే. ఆ పాటకు డాన్స్ చేసి చూపించా. సరేనని ఆయన ఒక శ్లోకం చెప్పి, దాన్ని అలాగే చెప్పమన్నారు. నేను ఏమీ ఆలోచించకుండా నోటికి వచ్చినట్లు 'శుక్రవారం చెబుతా' అని చెప్పా. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏవీయం నుంచి నాకోసం కారు వచ్చింది. అప్పటికే నాన్నగారు ఆఫీసుకు వెళ్లిపోయారు. అమ్మ, నేను కారులో నాన్న ఆఫీసుకు వెళ్లాం. అక్కణ్ణించి అందరం స్టూడియోకు వెళ్లాం. ఫ్రాకులో ఉన్న నన్ను ఫోటోలు తీశారు. వాటిని చెట్టియార్ గారి వద్దకు పంపించారు. 'ఇదేమిటి ఆడపిల్ల ఫోటోలు పంపారు?' అని అబ్బాయి డ్రస్సులో ఫోటోలు తీయమని కో-డైరెక్టర్ రామారావుకు చెప్పారు. అప్పడు నా జుట్టును బాయ్‌కట్ చేసి, నాకు బాబా సూట్ వేసి ఫోటోలు తీశారు. ఫోటోలో నేను చెట్టియార్ గారికి నచ్చాను. అయితే ప్రహ్లాదుడిగా నేను నప్పుతానో, లేదోననే సందేహం వచ్చి, ఈసారి రాజకుమారుడి డ్రస్సులో ఫోటోలు పంపమన్నారు. నాకు మళ్లీ రాజకుమారుడి డ్రస్సు, విగ్గు, మేకప్‌తో ఫోటోలు తీశారు. అప్పుడూ చెట్టియార్ గారికి నచ్చా. కానీ అంతటితో పరీక్షలు పూర్తవలేదు. ప్రహ్లాదునికి పాములు, ఏనుగులతో సన్నివేశాలున్నాయి కాబట్టి, పాముతో నేను సన్నివేశం చేయగలనా, లేదా అనే సందేహం వాళ్లకి వచ్చింది. పాము తెప్పించారు. నా మెడలో వేశారు. నేను భయపడకుండా దాన్ని పట్టుకున్నా. ఆ పాము సన్నివేశాన్ని రామారావు గారు కెమెరాతో షూట్ చేయించారు. అది చూపించాక 'ప్రహ్లాదుడు దొరికాడు' అన్నారు చెట్టియార్. ఆ పాత్ర కోసం నెల రోజులపాటు నాచేత ప్రాక్టీస్ చేయించారు. మొట్టమొదట క్లైమాక్స్ సీన్ తీశారు" అని చెప్పుకొచ్చారు రోజారమణి.