Friday, October 8, 2010

సినిమా: రజనీ - ద గ్లోబల్ స్టార్!

నిన్నటిదాకా దక్షిణాది సూపర్ స్టారుగా వెలుగొందిన రజనీకాంత్ ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇది ఆషామాషీగా చెబుతున్న సంగతి కాదు. సంచలనాల 'రోబో' సాక్షిగా వెల్లడైన నిఖార్సయిన నిజం. ఇది ఒక భారతీయ నటుడు - అదీ ఒక దక్షిణ భారత దేశానికి చెందిన ఓ ప్రాంతీయ నటుడు - సాధించిన అపూర్వ, అపురూప విజయం. తమిళ చిత్ర రంగానికి చెందిన ఓ నటుడి సినిమాకి 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏమిటి! ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడంటే మూడు రోజుల్లో 95 కోట్ల రూపాయల్ని వసూలు చేయడం ఏమిటి!! ఇది అద్భుతం కాక మరేమిటి!!!                        
బాక్సాఫీసు రికార్డులు పాదాక్రాంతం
భారతీయ సినిమాకి సంబంధించి 'రోబో' ఎన్నో సరికొత్త రికార్డుల్ని లిఖిస్తోంది. భవిష్యత్తులో మరెన్నింటినో లిఖించబోతోంది. ఇప్పటిదాకా దేశంలో అత్యంత వ్యయభరిత చిత్రం 'రోబో'నే. మునుపటి రికార్డు 120 కోట్ల రూపాయల వ్యయమైన హృతిక్ రోషన్ సినిమా 'కైట్స్' పేరుతో ఉంది. అలాగే మూడు భారతీయ భాషల్లో (తమిళ, తెలుగు, హిందీ) ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా ప్రింట్లతో విడుదలైన సినిమా కూడా 'రోబో'నే. అక్టోబర్ 1న విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమా ఇటీవలే సల్మాన్ ఖాన్ సినిమా 'దబాంగ్' నెలకొల్పిన తొలి మూడు రోజుల వసూళ్ల రికార్డుని ఏకంగా రెట్టింపు వసూళ్లతో బద్దలు కొట్టడం గొప్ప విశేషం. విడుదలైన తొలి మూడు రోజుల్లో 'దబాంగ్' 49 కోట్ల రూపాయల్ని ఆర్జించి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఆ రికార్డుని భారీ వ్యత్యాసంతో బద్దలు కొట్టాడు 'రోబో.
బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహతా చెప్పిన లెక్కల ప్రకారం 'రోబో' సాధించిన మూడు రోజుల వసూళ్లు 95 కోట్ల రూపాయలు. ఆయన అంచనా ప్రకారం ఆ సినిమా రానున్న రోజుల్లో మరో 125 కోట్ల రూపాయల్ని ఆర్జించనున్నది. అయితే మనదేశంలో కచ్చితమైన బాక్సాఫీసు ఫలితాలు బహిర్గతం కావడం కష్టం. ఒక విశ్లేషణకీ, మరో విశ్లేషణకీ వ్యత్యాసాలు సాధారణం. ఉదాహరణకి స్వతంత్ర పారిశ్రామిక వెబ్ సైట్ అయిన బాక్సాఫీస్ ఇండియా డాట్ కామ్ అంచనాల ప్రకారం తొలి వారాంతంలో 'రోబో' వసూలు చేసిన మొత్తం 57 కోట్ల రూపాయలే. అయినప్పటికీ ఇది కూడా కొత్త రికార్డే కావడం గమనార్హం. మనదేశం బయట అమెరికా, మలేషియా, జపాన్ లలో వీర విహారం చేస్తున్న ఈ సినిమా కొత్తగా స్వీడన్ లోనూ బ్రహ్మాండంగా ఆడుతుండటం రజనీ సినిమాల మార్కెట్ విస్తృతికి ఒక చక్కని నిదర్శనం. రజనీ చేసిన ఈ మ్యాజిక్ తో దక్షిణాది నటులే కాదు, దేశంలో తామే అగ్రగణ్యులమని విర్రవీగే బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం ముక్కు మీద వేలేసుకుని విస్తుపోతున్నారు. వృద్ధాప్యమనదగ్గ అరవై ఏళ్ల వయసులో అందం చందం కూడా లేని నటుడికి ఇదెలా సాధ్యమని వాళ్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఒక నటుడికీ, దేవుడికీ ఉన్న వ్యత్యాసాన్ని సైతం చెరిపేసిన రజనీని చూసి దిగ్భాంతి చెందుతున్నారు. అదీ రజనీ మాయ! తమిళనాడులో నిన్నటిదాకా బాక్సాఫీసు కొలబద్ద రజనీయే నటించిన 'శివాజి'. ఇప్పుడు తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టుకుంటూ 'రోబో'గా సరికొత్త 'బెంచ్ మార్క్'ని నెలకొల్పబోతున్నాడు.
సరే - తమిళనాడులో ఆయనే నెంబర్ వన్ హీరో. మరి తెలుగు సంగతేమిటి? కనీ వినీ ఎరుగని రీతిలో 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన తెలుగు 'రోబో'కి ఈ కలెక్షన్ల తుఫానేమిటి! తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని రీతిలో ఒక డబ్బింగ్ సినిమా హైదరాబాదులో 72 స్క్రీన్లలో విడుదలవడం, అన్ని థియేటర్లూ మూడు రోజుల పాటు ఫుల్స్ కావడం మామూలు విశేషం కాదు. దానికి ముందు పవన్ కల్యాణ్ 'పులి' కానీ', దాని తర్వాత 'మహేశ్ ఖలేజా' కానీ అన్నేసి థియేటర్లలో విడుదల కాకపోవడం, రెండూ చాప చుట్టేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇప్పుడు చెప్పండి. తెలుగులో సూపర్ స్టార్ ఎవరు? ఏదేమైనా రజనీకాంత్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దర్శకుడిగా తననెందుకు అగ్రశ్రేణిలో పరిగణిస్తారో 'రోబో'తో మరోసారి నిరూపించుకున్నాడు శంకర్. సాంకేతికంగా భారతీయ సినిమా ఎంత ఎత్తుకు ఎదిగిందో 'రోబో'తో అతను తెలియజేశాడు. ఇప్పుడు 'రోబో'ని ఎందుకు వదులుకున్నానా అని షారుఖ్ ఖాన్ బాధపడుతూ ఉంటాడు. శంకర్ ని తక్కువగా అంచనా వేసినందుకు తనని తాను తిట్టుకుంటూ ఉంటాడు.

Wednesday, October 6, 2010

వాల్ పేపర్: ప్రియా ఆనంద్

సినిమా: 580 థియేటర్లలో 'మహేశ్ ఖలేజా'

మహేశ్ సినిమా 'మహేశ్ ఖలేజా' 580 థియేటర్లలో గురువారం (7న) వస్తోంది. టైటిల్ విషయంలో చెలరేగిన వివాదం 'మహేశ్ ఖలేజా'కు అనుకూలంగా బుధవారం కోర్టు తీర్పునివ్వడంతో సమసింది. దీంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. మహేశ్ పవర్ ముందు ఏదీ నిలవదని ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సి. కల్యాణ్ పాత్రికేయుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఒక టాప్ హీరో మూడేళ్ల విరామంతో ప్రేక్షకుల ముందుకు రావడం ఇదే ప్రథమమని చెప్పాలి. మహేశ్ మునుపటి సినిమా 'అతిథి' 2007 అక్టోబరులోనే వచ్చిన సంగతి గమనార్హం.
ఇదివరకు పవన్ కల్యాణ్ కూడా ఇలాగే 'జానీ' సినిమా తర్వాత రెండున్నరేళ్లు పైగా గ్యాప్ తీసుకున్నాడు. కాగా ఒక తెలుగు సినిమా విడుదలకు ముందే 35 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేయడం ఇదే మొదటిసారి. అల్లు అరవింద్ కు చెందిన గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ అంత మొత్తం వెచ్చించి హక్కులు సొంతం చేసుకుంది. నైజాం, వైజాగ్ ఏరియాలను తన వద్దే వుంచుకుని మిగతా ఏరియాల హక్కుల్ని లాభానికి అమ్ముకుంది.
ఈ నేపథ్యంలో 'మహేశ్ ఖలేజా'కి ఓపెనింగ్స్ అసాధారణ రీతిలో ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కొద్ది గంటల్లో విడుదల కాబోతోన్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సాధిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.                

సినిమా: ఎన్టీఆర్ పాత్రలో షాట్ గన్

షాట్‌గన్‌గా అభిమానులు పిలుచుకునే బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా తొలిసారి మీసం లేకుండా వెండి తెరపై కనిపించబోతున్నారు. అదీ రాంగోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర' చిత్రంలో. ఈ సినిమాలో ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు పాత్రని పోషించారు.
పరిటాల రవి జీవితం ఆధారంగా వర్మ రూపొందించిన ఈ సినిమా తన కెరీర్‌లోనే ఉత్తమ చిత్రమనీ, నటునిగా ఈ సినిమా తనకు చాలా మంచి పేరు తీసుకొస్తుందని సిన్హా అంటున్నారు. 'రక్త చరిత్ర' తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ నెల ద్వితీయార్థంలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇందులో పరిటాల రవిగా వివేక్ ఓబరాయ్, మద్దెలచెరువు సూరిగా సూర్య నటించారు. సిన్హా ఈ మూడు భాషల్లోనూ దర్శనమివ్వనున్నారు. దీనికోసం ఆయన తెలుగు, తమిళ భాషల్లో సంభాషణల్ని అర్థం చేసుకుని మరీ నటించారు. "ఈ సినిమా కోసం నిజంగా కష్టపడ్డా. నేను బాగా నటించిన సినిమాల్లో ఇదొకటి.
సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఆర్.జి.వి. (వర్మ) చాలా బాగా ఈ సినిమాని రూపొందించారు'' అని చెప్పారు సిన్హా. ఎన్టీఆర్ పాత్ర కోసం మీసాలు తీయడానికి మొదట ఆయన వెనుకాడారు. అయితే స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్లా, వర్మ విజ్ఞప్తి మేరకు ఆయన మీసం తీసి నటించారు. సిన్హా బి.జె.పి.కి చెందిన పార్లమెంట్ సభ్యులనే సంగతి తెలిసిందే.

సినిమా: 'అహ నా పెళ్లంట' అంటున్న నరేశ్

నరేశ్ కథానాయకుడిగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రానికి 'అహ నా పెళ్లంట' అనే టైటిల్ ఖరారు చేశారు. 'మ్యాచ్ ఫిక్సింగ్' అనేది ఉప శీర్షిక. శ్రీహరి ఓ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రం ద్వారా నాయికగా రీతూ బర్మేచా, దర్శకునిగా వీరభద్రం పరిచయమవుతున్నారు.
హీరో నరేశ్ మాట్లాడుతూ "ఈ టైటిల్‌తో రాజేంద్రప్రసాద్‌గారు చేసినది సూపర్ డూపర్ హిట్ సినిమా కావడంతో ఆ టైటిల్ పెడుతున్నందుకు చాలా మంది భయపెట్టారు. కానీ ఈ సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది. ఇందులో నాతో పాటు శ్రీహరి, బ్రహ్మానందం కూడా హీరోలే. రఘు కుంచే సంగీతం చాలా బాగా వచ్చింది'' అని తెలిపారు. సినిమా ఇప్పటికి ఓ పాట సహా యాభై శాతం పూర్తయిందనీ, నవంబరుతో షూటింగంతా అయిపోతుందనీ దర్శకుడు వీరభద్రం చెప్పారు.
సామ్రాట్, నాగినీడు, సుబ్బరాజు, రజిత, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, హంసానందిని, అనిత, వెన్నెల కిశోర్, రంగనాథ్, గిరిధర్, పృథ్వీ, కృష్ణ భగవాన్ తారాగణమైన ఈ చిత్రానికి సంభాషణలు: శ్రీధర్, పాటలు: సినారె, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, సంగీతం: రఘు కుంచె, సినిమాటోగ్రఫీ: లోక్‌నాథ్, కూర్పు: వర్మ, కళ: నాగేంద్ర, ఫైట్స్: ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గరికపాటి కిశోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం.

నేటి పాట: ఉప్పొంగెలే గోదావరి (గోదావరి)

చిత్రం: గోదావరి (2006)
రచన: వేటూరి
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

సాకీ:
షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతిశిఖరే నిగమఝరే స్వరలహరే
సాసపాపపప పమరిససనిస
సాసపాపపప పమదపప
సాసపాపపప పమరిససనిస
సాసపాపపప పమనిదప
పల్లవి:
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
వేసెయ్ చాప దోసెయ్ నావ బార్ సెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా    ||ఉప్పొంగెలే||
చరణం 1:
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇళ్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాగా    ||ఉప్పొంగెలే||
చరణం 2:
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బేపట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా    ||ఉప్పొంగెలే||

వాల్ పేపర్: మాన్య

సినిమా: ఇక 'బెజవాడ రౌడీల' మీద రాంగోపాల్ వర్మ చూపు

ఏం చేసినా సంచలనం కోసమే చేస్తానని చెప్పే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి అదే పని చేశారు. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని 'రక్త చరిత్ర'లో బంధించిన ఆయన ఇక 'బెజవాడ రౌడీలు' ఎలాంటి వాళ్లో, వాళ్లకి ఎంత భీకరమైన ఇమేజ్ ఉందో చెప్పడానికి ఉవ్విళ్లూరుతున్నారు. 'రక్త చరిత్ర' తర్వాత 'బెజవాడ రౌడీలు' సినిమా తీస్తానని ఆయన ప్రకటించగానే సంచలనం చెలరేగింది. విజయవాడకు చెందిన అనేకమంది రాజకీయ నాయకులు వర్మ ఆలోచనని ఖండించి, ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. 'అదుర్స్' నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీమోహన్ అయితే వర్మకి పిచ్చికుక్క కరిచి వుంటుందనీ, అందుకే ఇలాంటి సినిమాలు తీస్తానంటున్నాడనీ తీవ్రంగా విమర్శించారు. అయితే సాధారణ ప్రజానీకం నుంచి దీనిపై అంతగా స్పందన రాకపోవడం గమనార్హం.                        
తను తీసే ప్రతి సినిమాతోనూ వార్తల్లోకెక్కే వర్మ 'రక్త చరిత్ర'తో ఓవైపు సంచలనాన్ని సృష్టిస్తూనే, మరోవైపు వివాదాలకీ కేంద్ర బిందువయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన దివంగత తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి జీవితం ఆధారంగా ఆయనకూ, మద్దెలచెరువు సూరికీ మధ్య జరిగిన ఆధిపత్య పోరును చిత్రిస్తూ ఆయన 'రక్త చరిత్ర' తీశారు. రవి పాత్రను బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ చేస్తే, సూరిగా తమిళ హీరో సూర్య నటించారు.
ఇటీవలే ఆడియో రిలీజైన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనంతపురం ఫ్యాక్షన్ కక్షలకు అద్దంపట్టే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాన్ని సృష్టించడంతో పాటు వివాదాలకీ తెరతీసింది. ఆ సినిమాలో ఓబుల్ రెడ్డిని దుర్మార్గుడిగా చూపించారంటూ ఆయన వర్గీయులు ఆందోళన చేయడం, ఓబుల్ రెడ్డి స్వయంగా దెయ్యమై వచ్చినా తాను భయపడేది లేదని వర్మ ప్రకటించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 'బెజవాడ రౌడీలు' తీయబోతున్నట్లు వర్మ ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. బెజవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే అక్కడి రౌడీయిజాన్నీ, దాని వెనకాల కారణాల్నీ క్షుణ్ణంగా పరిశీలించేవాణ్ణనీ చెప్పుకున్న వర్మ తన తొలి చిత్రం 'శివ'లో చూపించిన రౌడీయిజం బెజవాడ రౌడీయిజంతో పోలిస్తే సముద్రంలో ఒక నీటి చుక్క మాత్రమేనని తేల్చారు. 'వేరెక్కడా లేని ఒక మహా ప్రత్యేకమైన ప్రత్యేకత బెజవాడ రౌడీకి ఉన్నద'ని చెప్పిన ఆయన తన మైండులో 30 యేళ్లుగా ఆ సినిమా స్క్రిప్టు నలుగుతున్నదన్నారు. ఇప్పటికి ఆ స్క్రిప్టు పూర్తికావచ్చిందనీ, 'వీలైనంత తొందరలో బెజవాడకి కెమెరాని తీసుకెళ్లి అక్కడి రౌడీలని దానిలో బంధించి 70 ఎంఎం స్టీరియోఫోనిక్ సౌండులో అందరికీ చూపెట్టడానికి శరవేగంతో సన్నాహాలు జరుగుతున్నాయి' అని చెప్పారు వర్మ.
ఒకప్పటి బెజవాడ రౌడీ రాజకీయాలు, రౌడీ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు సంగతి జగమంతా తెలిసిందే కాబట్టి ఎవర్ని ఎలా 'బెజవాడ రౌడీలు'లో వర్మ చూపించబోతున్నాడనేది ఆసక్తికరమైన అంశం. అదే ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని వివాదాలకీ నెలవు కాబోతోంది.

Tuesday, October 5, 2010

వాల్ పేపర్: దీపికా పడుకోనే

సినిమా: 'రోబో', 'ఖలేజా'లకి 'బృందావనం' పోటీనిస్తుందా?

అక్టోబర్ 1న వచ్చిన రజనీకాంత్ 'రోబో'కీ, 7న వస్తున్న 'మహేశ్ ఖలేజా'కీ గట్టి పోటీ ఇచ్చేందుకు 14న రాబోతున్న మరో సినిమా 'బృందావనం'. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తే, 'మున్నా' ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నారీ నారీ నడుమ మురారి తరహా పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అతని సరసన నేటి అగ్ర నాయికల్లో ఒకరైన కాజల్ అగర్వాల్, 'ఏ మాయ చేసావె'తో యువతరంలో క్రేజ్ పొందిన సమంతా తమ అందచందాలు, అభినయంతో ఆకట్టుకోబోతున్నారు.
'అదుర్స్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా కావడమే కాక, దిల్ రాజు సంస్థ నుంచి వస్తుండటంతో 'బృందావనం' మీద అంచనాలు చాలానే ఉన్నాయి. నటనలోనే కాకుండా డాన్సులోనూ నిష్ణాతుడైన ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇప్పటివరకు చేయని ఓ కొత్తపాత్రలో అల్లరి యువకుడిగా కనిపించబోతున్నాడు. "టైటిల్ సాఫ్టుగా ఉన్నా ఎన్టీఆర్ అదరగొట్టడం ఖాయం. ఎంతో మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణగారు ఇదివరకు 'నారీ నారీ నడుమ మురారి', 'అనసూయమ్మగారి అల్లుడు' వంటి పాత్రలు చేశారు. ఆకట్టుకున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఈ సినిమాతో ఒక కుటుంబంలో ఉండే అన్ని వయసుల వాళ్లనీ ఆకట్టుకుంటారు" అని నిర్మాత రాజు చెప్పారు.
అయితే నందమూరి వంశానికి చెందిన హీరోల సినిమాల్ని తెలంగాణలో ఆడనివ్వమని ఇప్పటికే కొన్ని తెలంగాణ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో నైజాంలో 'బృందావనం' ప్రదర్శనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ మునుపటి సినిమా 'అదుర్స్'కి ఆ అనుభవం ఎదురయ్యింది కూడా. కాకపోతే 'బృందావనం' నిర్మాత రాజు స్వయంగా తెలంగాణవాసి కావడం వల్ల అడ్డంకులేమీ ఆ సినిమాకి ఎదురుకావనే నమ్మకం ఎన్టీఆర్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.                        

Monday, October 4, 2010

వాల్ పేపర్: అంకిత

నేటి పాట: చేయీ చేయీ తగిలింది (కొడుకు కోడలు)

చిత్రం: కొడుకు కోడలు (1972)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి. సుశీల

అతడు: చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది

ఆమె: పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది     ||చేయీ||

అతడు: నీ వలపే తలుపును తట్టింది - నా
మనసుకు మెలుకువ వచ్చింది - నా
వయసుకు గడియను తీసింది

ఆమె: నీ పిలుపే లోనికి రమ్మంది
నా బిడియం వాకిట ఆపింది
నా సిగ్గే ముగ్గులు వేసిందీ    ||చేయీ||

అతడు: సిగ్గుతో నీవు నిలుచుంటే -
నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే
ఊపిరాడక నా మనసు
వుక్కిరి బిక్కిరి అయ్యింది -

ఆమె: వాకిట నేను నిలుచుంటే
ఆకలిగా నువు చూస్తుంటే
ఆశలు రేగి నా మనసు
అటు ఇటు కాక నలిగిందీ -    ||చేయీ||

ఆమె: నీ చూపే మెత్తగ పాకింది
నా చుట్టూ మత్తును చల్లింది
నిను చూస్తూ వుంటే చాలంది

అతడు: నీ సొగసే నిలవేసింది
నా మగసిరికీ సరితూగిందీ -
నా సగమును నీకు ఇమ్మందీ -    ||చేయీ||