Thursday, September 24, 2015

Short Story: Maaya

నిమీద బయటికెళ్లిన మాణిక్యరావు ఇంటికొచ్చాడు. ముందింట్లో నవనీత కనిపించకపోయేసరికి, నేరుగా వంటింట్లోకెళ్లాడు. ఆమె దొడ్లో బాట్టలు ఆరేస్తా కనిపించింది. బావి అరుగుమీదకెళ్లి నిల్చుని బక్కెట్‌లోని నీళ్లను కాళ్లమీద
కుమ్మరించుకున్నాడు.
“రేపు గుంటూరుకెళ్తున్నానే” అన్నాడు.
“అయితే కొనాలనే నిర్ణయించుకున్నావన్న మాట” అంది నవనీత, బట్టలకు క్లిప్పులు పెడతా.
“ఇప్పుడు కొనకపోతే, ఇంకెప్పుడూ అక్కడ కొనలేమే. ఇప్పుడే సెంటు లక్ష చెబుతున్నారంటే, ఇంకో ఏడు పోతే ఎంతవుద్దో. ఇప్పుడు కొంటే రెండేళ్లలో నాలుగైదింతలు రేటు పెరగడం గ్యారంటీ.”
“మనం ఉంటున్న ఈ చోటే సెంటు లక్షుంటే ఎక్కడో ఊరికి దూరంగా, ఇళ్లంటూ లేని చోట కూడా లక్షా? అంతెందుకుంటుంది?”
“మనం ఉంటున్న ఏరియాకీ, రాజధాని అమరావతి ఏరియాకీ లంకె పెడతావేందే. ఇక్కడ సెంటు స్థలం లక్ష కావడానికి ఎంత కాలం పట్టిందో నీకు తెలీదా. ఇప్పుడందరి చూపూ అమరావతి ఏరియా మీదే ఉంది. దాని చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దాకా ఎక్కడ స్థలం కొన్నా బంగారం కిందే లెక్క. ఆ చదువులయ్య చూడు. తెలివంటే ఆడిదే. రాష్ట్రం రెండుగా యిడిపోవడానికి ఏడాది ముందుగాల్నే గుంటూరు కాడ ఏకంగా అరెకరం స్థలం కొనేశాడు. ఇంకా రెండేళ్లు కాలేదు. అప్పుడే నాలుగింతలు రేటు పలుకుతోందంట. ఒక్క దెబ్బకు కోట్లు వెనకేసుకోబోతున్నాడు. మనమూ ఉన్నాం ఎందుకూ? ప్రతిదానికీ జంకే. తెగించి ఏం చేద్దామన్నా పడనియ్యవు కదా” అన్నాడు కాస్త విసురుగా.
వేటపాలెం ప్రాంతంలోని షావుకార్ల (మాస్టర్ వీవర్ల)లో మాణిక్యరావు ఒకడు. అతని చేతికింద నూటయాభై మగ్గాల దాకా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలామంది షావుకార్లు నష్టాలపాలై వేరే వ్యాపారాల్లోకి దిగారు. కొంతమందైతే తామే నేతగాళ్లుగా మారిపోయారు. మాణిక్యరావు ఒకేరకం బట్టని కాకుండా నాలుగైదు రకాల బట్టలు నేయిస్తూ కొద్దో గొప్పో సంపాదించాడు. మాణిక్యరావు మాదిరిగానే చదువులయ్యా మాస్టర్ వీవరే. కాకపోతే అతను ఒక్క మగ్గాల్నే నమ్ముకోలేదు. బట్టల వ్యాపారం మీదొచ్చిన డబ్బుతో మొదట్లో ఏడాదికి మూడు పంటలు పండే పొలాలు కొన్నాడు. తర్వాత వాటిని అమ్మేసి రెండెకరాల మామిడితోట కొన్నాడు. నాలుగేళ్లయ్యాక ఆ రెండెకరాల తోటని నాలుగెకరాలు చేశాడు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెని చూశాక రాష్ట్రం రెండుగా విడిపోతుందనే నమ్మకం బలపడి గుంటూరు కాడ స్థలం కొన్నాడు. అతడి నమ్మకం నిజమై ఇప్పుడది నాలుగింతల విలువకు చేరుకుంది. అతడి మాదిరిగా తను ఆస్తులు పెంచుకోలేకపోతున్నందుకు మాణిక్యరావులో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది. చదువులయ్యకు వాళ్లావిడ సపోర్ట్ బాగా ఉండబట్టే తెగువతో ముందుకెళ్లిపోతున్నాడని అప్పుడప్పుడూ నవనీతని ఎత్తిపొడుస్తుంటాడు.
“ఇప్పుడు మనకేం తక్కువయ్యిందయ్యా. యాపారం బాగానే సాగుతా, హాయిగా గడిచిపోతోంది కదా. తిండికి కరువా, బట్టకి కరువా? మంచి మేడ కట్టుకున్నాం కదా. ఇద్దరు పిల్లల్నీ మంచి స్కూల్లో చదివించుకుంటున్నాం. కంటిమీద సుఖంగా కునుకుపడితే చాలు. లేనిపోని ఆశలతో తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడమెందుకంటా?” అంది ముందింట్లోకొచ్చి.
“నీకు చెప్పాను చూడూ.. నాదీ బుద్ధి తక్కువ. దేనికీ పడనియ్యవు కదా. ఎప్పుడూ ఇట్టాగే ఉండిపోతామంటావేం. మనిషన్నాక ఆశుండాలే. ఆశుంటేనే ఎదుగుతాం. ఈ యేటపాలెం ఏరియాలో మాణిక్యరావు అనేవాడు డబ్బున్నోడిగా, పెద్దమనిషిగా పేరు తెచ్చుకోవడం నీకిష్టం లేదా?” అంటా, అక్కడ బల్లమీద తను పెట్టిన సంచీని తెరిచాడు. దాంట్లోని శ్రద్ధగా మడతలు పెట్టిన ఆయిల్ పేపర్‌ను తీశాడు. అది మల్లెపువ్వంత తెల్లగా, పాదరసం అంత నున్నగా మెరుస్తోంది.
“మందెట్టా మైకాన్నిస్తుందో ఆశ కూడా అంతేనయ్యా. ఆ మైకంలో పడితే ఎవరేం చెప్పినా తలకెక్కదు” అంటా నెత్తికొట్టుకుంది నవనీత.
“నువ్వు చెప్పే నీతులు పుస్తకాల్లో రాయడానికీ, బళ్లో చదువుకోడానికీ పనికొస్తాయే కానీ జీవితానికి పనికిరావే మొద్దూ” అంటా మెరుపుల కాయితం మడతలు విప్పి, బల్లమీద పరిచాడు.
దానిమీద రంగురంగుల గీతలతో డబ్బాలు కొట్టున్నాయి. ఆ గీతలు, ఆ డబ్బాలు గజిబిజిగా కనిపించాయి నవనీతకు.
“ఇది ఆ స్థలానికి చెందిన లేఔటే. రాజధాని వొస్తున్న ఏరియాకి దగ్గరలో అమరావతి రోడ్ పక్కనే ఉంది ఈ సైటు. ఇక్కడ సెంటు లక్షకి దొరకడమంటే చాలా అదృష్టమనీ, ఆ రేటుకి ఆ చుట్టుపక్కల ఎక్కడా స్థలం దొరకట్లేదనీ గణపతి చెప్పాడు. ఈ అవకాశం వొదులుకోవద్దని మరీ మరీ చెప్పాడు. అతను అబద్ధం చెప్పడు కదా. నిజానికి ఆ స్థలాన్ని చూడకుండానే కొనేయొచ్చు. కానీ చూశాకే తీసుకుంటానని చెప్పా తెలుసా” అన్నాడు, తనకు తెలివితేటలు ఎక్కువనే సంగతి ఆమె గ్రహించాలన్నట్లు.
“భూమితో యాపారం చేసే మనిషి అట్టా చెప్పకుండా ఇంకెట్టా చెబుతాడంటా. తన భూమి అమ్ముడుపోడానికి ఎన్ని కబుర్లైనా చెబుతాడు. తిమ్మిని బమ్మి చేస్తాడు. మెట్టని మాగాణని చెబుతాడు. పల్లాన్ని మెరకంటాడు. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా అతను రాజకీయాల్లో తిరిగే మనిషి. అధికారం అండదండలున్నోడు” అంది నవనీత నచ్చచెబుతున్న ధోరణితో.
దాంతో కాస్త మెత్తబడ్డాడు మాణిక్యరావు. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. లేఔట్ కాయితాన్ని మడతలు పెడతా, కాస్త చిన్నగా “అందుకేగా రేపు గుంటూరు పోతోందీ. సైటు చూశాకే, నచ్చితేనే తీసుకుందాంలేవే” అన్నాడు.
కారులో కూర్చున్నాక “ఈ సైటుకు మీరన్నట్లు వాల్యూ పెరుగుతుందంటారా?” అడిగాడు మాణిక్యరావు.
“అసలా అనుమానం ఎందుకొచ్చింది మాణిక్యం. అది కొంటే బంగారం కొన్నట్లే. లేకపోతే నేనెందుకక్కడ ఆ సైట్‌కొని ప్లాట్లేస్తాను? ఏడాది తిరిగేసరికల్లా ఒకటికి రెండు రెట్లు రేటు పెరక్కపోతే అప్పుడడుగు” అన్నాడు గట్టి నమ్మకాన్ని మాటల్లో వ్యక్తం చేస్తూ గణపతి.
ఇటీవలి కాలంలోనే ఆ ఏరియాలో భూముల రేట్లు ఎట్లా పెరిగాయో, ఇంకా ఎట్లా పెరుగుతున్నాయో వర్ణించి వర్ణించి చెప్పాడు. ఉదాహరణగా హైదరాబాద్‌లోని మాదాపూర్ ఏరియాలో ఒకప్పుడు కాణీకి కొరగావనుకున్న భూములు చంద్రబాబునాయుడు హైటెక్ సిటీని ప్రకటించగానే ఎట్లా మారిపోయాయో, అక్కడ భూములున్న పేదోళ్లంతా రాత్రికి రాత్రే ఎట్లా కోటీశ్వరులైపోయారే చెబుతుంటే ఆసక్తిగా విన్నాడు మాణిక్యరావు. నిజానికి ఆ సంగతి అతనికెప్పుడో తెలుసు. కానీ గణపతి చెప్పే విధానంతో, తనూ కోట్లకు పడగలెత్తినట్లేనని ఊహించేసుకున్నాడు. ఆ ఊహ అతన్ని ఉద్వేగభరితుణ్ణి చేసింది. ఇప్పుడు ఆంధ్రలో కూడా అమరావతి ఏరియా అలాగే కాబోతున్నదనీ, దానికి తిరుగులేదనీ గణపతి చెప్పడంతో, మాణిక్యరావులో హుషారు ఎక్కువైంది. నవనీతవన్నీ ఉత్త భయాలు, అనుమానాలుగా తోచాయి.
“ఇంకో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయా మాణిక్యం. మన సైట్లో నీళ్లకు కరువనేదే లేదు. పుష్కలంగా ఉంటాయి. మన సైట్‌కు దగ్గర్లోనే కృష్ణా నీళ్లు పారుతున్నాయి. భూమిలో చాలా తక్కువ లోతులోనే నీళ్లు పడతాయి. నిజం చెప్పాలంటే చుట్టుపక్కలున్న అన్ని సైట్ల కంటే మనదే విలువైన సైట్. కొన్న ఏడాదికే అమ్మకానికి పెట్టి చూడు. ఎంతలేదన్నా రూపాయికి ఐదు రూపాయల వొడ్డీ వొస్తుంది” అన్నాడు గణపతి.
ఇంక మాణిక్యరావు ఒక్క ప్రశ్నా వెయ్యలేదు. ఓ గంటన్నరలో సైట్ కాడికి వెళ్లిపోయారు. అమరావతి రోడ్డుకు బాగా దగ్గర్లోనే ఉందది. గణపతి చెప్పినట్లు అల్లంత దూరంలోనే కృష్ణ ప్రవహిస్తూ కనిపించింది.
గణపతి ఓసారి లేఔట్ తీసి, ఖాళీగా ఉన్న ప్లాట్లేవో చూపించాడు. ఈశాన్య మూల ప్లాట్ మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఒకటే ఉంది. దానికి మంచి డిమాండ్ ఉందనీ, ఈ రోజు సాయంత్రమే ఒకతను దానికి అడ్వాన్స్ ఇస్తానని చెప్పాడనీ, అది వొదిలేసి మిగతా వాటిలో దేన్నయినా తీసుకొమ్మనీ చెప్పాడు గణపతి. దాంతో ఆ ఈశాన్య మూల బిట్ తనకే దక్కాలని తీర్మానించేసుకున్నాడు మాణిక్యరావు.
“సాయంత్రం కాదు, నేనిప్పుడే బయానా (అడ్వాన్స్) ఇస్తున్నా. ఆ బిట్ నా పేరే రాయండి” అని జేబులోంచి డబ్బులు తీసి, పదివేలు గణపతి చేతిలో పెట్టాడు.
“మాణిక్యం.. నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావోయ్. చాలా కాలం నుంచి తెలిసిన మనిషివి కాబట్టి కాదనలేకపోతున్నా. సాయంకాలం వొచ్చే అతనికి ఏం చెప్పాలో, ఏమో. సర్లే.. నా తిప్పలేవో నేను పడతాలే. మొత్తానికి సూపర్ ప్లాట్ కొట్టేశావ్” అన్నాడు మెచ్చుకోలుగా.
అప్పుడే, ఆ నిమిషమే ఆ ఇరవై సెంట్ల స్థలం తనదై పోయినట్లు తబ్బిబ్బయిపోయాడు మాణిక్యరావు. ఆ స్థలంపై ఒక్కసారిగా ఆరాధనా భావం పెల్లుబికింది. ఆ ప్లాటుకు హద్దులుగా వేసిన రాళ్లను తనివితీరా చూసుకున్నాడు. ఓ రాయిని చేత్తో నిమిరాడు కూడా. విపరీతమైన ఉద్వేగం మనసుని ఊపేస్తుంటే కిందికి వొంగి, అక్కడి మట్టిని గుప్పిట్లోకి తీసుకున్నాడు. వొదల్లేక వొదల్లేక కొద్దికొద్దిగా మట్టిని వొదిలి, చేతులు దులుపుకున్నాడు. పిట్ట ఈక ఎంత తేలిగ్గా ఉంటుందో, మాణిక్యరావు గుండె అంత తేలికైపోయినంది. అతడి చేష్టల్ని ఆశ్చర్యపడతా చూశాడు గణపతి. అతని పెదాల మీదికి ఓ విధమైన నవ్వు విచ్చుకుంది.
ఇరవై లక్షల రూపాయలతో ఆ ఇరవై సెంట్ల ఈశాన్య మూల స్థలాన్ని సొంతం చేసుకున్నాడు మాణిక్యరావు. రిజిస్ట్రేషన్ కాయితాలు కూడా అతడి చేతికొచ్చాయి. రిజిస్ట్రేషన్ చేసేప్పుడు మాత్రం దాని విలువ సెంటుకు ఐదువేలుగానే రాశారు. గవర్నమెంటోళ్ల రేటు అట్లాగే ఉంటుందనీ, రేటు ఎక్కువ రాస్తే, రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ కట్టాల్సొస్తుందనీ గణపతి చెప్పాడు. మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ రేటు ఎప్పుడూ తక్కువే ఉంటుంది కాబట్టి తలాడించాడు మాణిక్యరావు. డబ్బు కట్టడానికి ఐదు లక్షలు తగ్గితే మూడు రూపాయల వడ్డీకి రెండు లక్షలు చదువులయ్య కాడే అప్పు తీసుకున్నాడు. నవనీత నగలు తాకట్టుపెట్టి బ్యాంకులో మూడు లక్షలు గోల్డ్ లోను తీసుకున్నాడు. మనసులో బితుకుబితుకుమంటున్నా అతని ఉత్సాహం చూసి, అతను చేసింది మంచి పనేనేమో, అనవసరంగా అనుమానిస్తున్నానేమోనని సమాధానపడింది నవనీత. ఇరవై లక్షలు పెట్టికొన్న ఆ ఈశాన్య మూల స్థలాన్ని చూసి రావాలనే ఆరాటం మొదలైంది ఆమెలో.
“రిజిస్ట్రేషన్ కూడా ఐపోయింది. ఇంకెప్పుడు చూపిస్తావ్ మన స్థలాన్ని?” అడిగేసింది ఉండబట్టలేక.
“కొనే ముందు దాకా ఎందుకు కొనడమంటూ గోలచేశావ్. కొన్నాక ఎప్పుడు చూపిస్తావని గోలపెడ్తున్నావ్. మీ ఆడాళ్లంతా ఇంతేనే” అని గర్వంగా నవ్వాడు మాణిక్యరావు.
“మేం గోలపెట్టినా మీ మగాళ్లు ఆగుతారా? చెయ్యాలనుకుంది చెయ్యక మానతారా?” అని తనూ నవ్వింది నవనీత.
3
పిల్లలకు సెలవు రోజు చూసుకుని ఆదివారం కారు మాట్లాడుకుని స్థలం చూసేందుకు బయల్దేరారు. ఆ ముందు రోజు రాత్రి పెద్ద వాన పడింది. ఆదివారం కూడా ఉంటుందేమో, వెళ్లడానికి కుదరదేమో అనుకుంది నవనీత. అయితే పొద్దున్నే వాన తెరిపియ్యడంతో స్థిమితపడింది ఆమె మనసు.
కార్లో వెళ్తుంటే రోడ్డు పక్కనే కాదు, రోడ్ల మీదే కాల్వలు  కనిపిస్తున్నాయ్. దాంతో కారు కాస్త నెమ్మదిగా వెళ్లింది. ఈసారి ప్రయాణం రెండు గంటలు పట్టింది. అయితే తను కొన్న ప్లాటు ఎక్కడుందో గుర్తుపట్టలేక పోయాడు మాణిక్యరావు. అతడికి అంతా అయోమయంగా ఉంది. తను కరెక్టుగానే వొచ్చాడే.
“ఈ ఏరియానేనా సార్? ఇక్కడంతా నీళ్లే కనిపిస్తున్నాయ్ కదండీ” అన్నాడు కారు డ్రైవర్.
“ఇదే ప్లేసయ్యా. నేనెందుకు మర్చిపోతాను?” అన్నాడు బలహీనమైన గొంతుతో, మాణిక్యరావు.
అతడు ప్లాటు కొన్న సైటులో ఒక్క అంగుళం భూమి కనిపించట్లేదు. ఆ ఏరియా అంతా పెద్ద చెరువులా తయారైంది. హద్దు రాళ్లు కూడా నీళ్లలో మునిగిపోయినట్లున్నాయి. నవనీత మొహం వొంక చూడాలంటే భయమేసింది మాణిక్యరావుకు.
“మన సైటేది నాన్నా?” ఉన్నట్లుండి అడిగాడు పదో క్లాస్ చదువుతున్న కొడుకు.
కొడుక్కి సమాధానం చెప్పకుండా అటూ ఇటూ చూశాడు మాణిక్యరావు. రోడ్డుకి రెండోవైపు పొలంలో కొంతమంది పనిచేస్తూ కనిపించారు. వాళ్లల్లో ఒకర్ని పిలుచుకు రమ్మని డ్రైవర్ని పంపాడు.
“ఏంటమ్మా. ఎక్కడ మన సైట్?” – ఈసారి తల్లిని అడిగాడు కొడుకు.
“ఆగు నాన్నా. నాన్న చూపిస్తాడుగా” అని నవనీత చెప్తుంటే, ఏడో క్లాస్ చదువుతున్న కూతురు “నాన్న కొన్న సైట్ ఈ నీళ్లల్లో ఉన్నట్టుందన్నయ్యా. అవును కదా అమ్మా” అంది, ‘చూడు నేనెట్లా కనిపెట్టేశానో’ అన్నట్లు.
మాణిక్యరావు మొహంలో నెత్తురు చుక్క లేదు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆశ ఉన్నచోట అజ్ఞానం ఉంటుందని ఎవరో పెద్దమనిషి అననే అన్నాడు. ఒకడి ఆశని ఇంకొకడు క్యాష్ చేసుకోవడం తన ఎరుకలోనే ఎన్నిసార్లు చూళ్లేదు. ఇప్పుడు తన ఆశని గణపతి క్యాష్ చేసుకున్నాడా?
ఒకతన్ని వెంటబెట్టుకు వొచ్చాడు డ్రైవర్.
“ఏమయ్యా.. ఈ చోటు గురించి నీకు బాగా తెలుసా?” అడిగాడు మాణిక్యరావు.
“ఎందుకు తెలీదు బాబూ. నేను పుట్టి పెరిగిందీ, ఉంటందీ ఇక్కడే. ఈడ ప్రెతి అంగుళం నాకు తెలుసు.”
“ఓ.. అవునా.. రెణ్ణెల కింద ఈడ స్థలం కొన్నాను. ఇప్పుడు చూస్తే మొత్తం నీళ్లే అవుపిస్తున్నాయ్?”
“చెరువులో స్థలం కొంటే నీళ్లు కాకుండా ఇంకేం అవుపిస్తాయ్ నాయనా. ఇదంతా చెరువు. ఈ మజ్జ చాలా కాలం వానల్లేక ఎండిపోయింది. నిన్నా, మొన్నా కురిసిన పెద్దవానతో నిండిపోయింది. నీకు తెలీక ఈడ స్థలం కొన్నట్లున్నావ్. ఆ మాయగాళ్లు కారుచౌకగా కొని, నీలాంటోళ్లకు ఎకువ రేట్లకు అమ్మి టోపీ పెడతన్నారు. ఇప్పుడైతే ఈడ సెంటు పది, పదిహేనేల కంటే ఎక్కువ లేదు. మీకు చాలా ఎక్కువ రేటుకి అమ్ముంటారే. అయినా కొనేప్పుడు అన్నీ ఇచారించుకోవాలి కద బాబూ.”
అతని వొంక నమ్మలేనట్లు చూశాడు మాణిక్యరావు. తన తెలివితేటల మీద అతడికి చాలా నమ్మకం. నెమ్మదిగా నిజం తెలిసొచ్చింది. ఓ కన్ను మూసి, ఆకాశం వొంక ఐమూలగా చూశాడు. తర్వాత చెరువు వొంకా, ఆ రైతు వొంకా, తన భార్యాబిడ్డల వొంకా బిత్తరబిత్తరగా చూశాడు.
అక్కడ అతను కొన్న స్థలం ఉంది. కానీ దాన్నిప్పుడు తన భార్యాబిడ్డలకు చూపించలేని చిత్రమైన స్థితిలో ఉన్నాడు. వాళ్ల సంగతి అట్లా పెట్టినా, తన స్థలమేదో ఇప్పుడు తనకే తెలీడం లేదు. తన స్థలం నీళ్ల కింద ఉంది!
ప్యాంటు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి, ఓ సిగరెట్టుని పెదాల మధ్య పెట్టుకొని, ప్యాకెట్టుని మళ్లీ జేబులో పెట్టేసుకున్నాడు. లైటర్ తీసి, సిగరెట్ వెలిగించాడు. మామూలుగా అతను పిల్లల ముందు  సిగరెట్లు కాల్చడు. కానీ ఇప్పుడు కాల్చకుండా ఉండలేకపోయాడు. అతడి స్థితి అర్థమై నవనీత పిల్లలను తీసుకుని కాస్త అవతలకు వెళ్లింది. తను ఎంత సునాయాసంగా మోసపోయాడో చాలా స్పష్టంగా అర్థమైపోయింది మాణిక్యరావుకు. తానే కాదు, అక్కడ ప్లాట్లు కొన్నోళ్లంతా మోసపోయారు. నోటెంట మాట రానంతగా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది.
మనసు రగిలిపోతుంటే గణపతికి ఫోన్ చేశాడు. బిజీగా ఉన్నట్లు సౌండ్ వొస్తోంది. మళ్లీ మళ్లీ చేశాడు. అదే సౌండ్. మౌనంగా వెళ్లి కారులో కూర్చున్నాడు. అతణ్ణలా చూసిన నవనీతకు భయమేసింది. స్థలం చూడాలని అక్కడకు ఎంత ఉత్సాహంతో వొచ్చిందో, అదంతా తుస్సుమంటూ చల్లారిపోయింది. తమ స్థలం నీళ్లకింద ఉందనే విషయం, అదంతా చెరువు ప్రాంతమనే విషయం తెలిశాక ఆమెలో కోపం కట్టలు తెంచుకున్న మాట నిజం. ఆ క్షణంలో భర్తని ఇష్టమొచ్చినట్లు దులిపేద్దామని కూడా అనుకుంది. కానీ అక్కడ కారు డ్రైవర్‌తో పాటు, ఇంకో మనిషీ ఉంటంతో నోరు నొక్కేసుకుంది. కానీ వాళ్లు తమని చూసి నవ్వుతున్నట్లు అనిపించి, అక్కడ ఇంక ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. ఇంకోవైపు భర్త మొహం చూస్తే, అతడు పిచ్చిచూపులు చూస్తున్నాడు. అలాంటప్పుడు అతణ్ణి కదిలించడం ఏం బావుంటుంది. కారులో ఉన్నంతసేపూ భార్యాభర్తలిద్దరూ మౌనంగానే ఉండిపోయారు.
ఇంటికొచ్చాక గణపతికి మరోసారి ఫోన్ చేశాడు మాణిక్యరావు. ఫోన్ రింగవుతోంది కానీ, ఎత్తట్లేదు. బైక్‌మీద అతనింటికి వెళ్లాడు. ఆఫీసులోనే ఉన్నాడని ఇంట్లోవాళ్లు చెప్పారు. అక్కడకు వెళ్లే సమయానికి చీకటి పడుతోంది. ఆవేశంతో ఊగిపోతూ ఆఫీసులో అడుగుపెట్టాడు. తన రూంలో కుర్చీలో హాయిగా వెనక్కి చేరగిలబడి ఉన్నాడు గణపతి. కాళ్లను బార్లా చాపి, కిటికీ మీద ఆన్చి ఉంచాడు. కళ్లు మూసుకుని, విలాసంగా డన్‌హిల్ సిగరెట్ పీలుస్తున్నాడు. మొహంలో తన్మయత్వం కనిపిస్తోంది. తలకు హెడ్‌సెట్ పెట్టుకొని, సెల్‌ఫోన్‌లో హుషారైన పాటలు వింటున్నాడు.
గణపతిని ఆ స్థితిలో చూసేసరికి మాణిక్యరావులోని ఆవేశం పదింతలైంది.
“గణపతిగారూ” అని అరిచాననుకున్నాడు. గణపతిలో చలనం లేదు. సిగరెట్ పొగ పీలుస్తూ, తల ఊపుతూ అదే తన్మయత్వంలో ఉన్నాడు.
“ఏవండీ గణపతిగారూ” అని ఈసారి బల్లమీద గట్టిగా చరిచాడు మాణిక్యరావు.
వైబ్రేషన్స్‌కి కళ్లు తెరిచాడు గణపతి.
“ఓ.. మాణిక్యం, నువ్వా. రారా. కూర్చో” అంటూ హెడ్‌సెట్ తీశాడు.
“నేను కూర్చోడానికి రాలేదండీ.”
“ఏంటి విషయం? ఏమైంది? మొహం అట్లా ఉందేంటి?”
“విషయం చాలానే ఉంది. ఇందాకట్నించీ ఫోన్ చేస్తున్నాను. మీరు తియ్యట్లేదు. ఇవాళ సైట్ చూసొచ్చాం.”
“సంతోషం. చూసొచ్చాం అంటున్నావ్. ఎవరెవరు వెళ్లారేం?”
“మా ఫ్యామిలీ అంతా వెళ్లాం. కానీ అక్కడ నా ప్లాటే కాదు, అసలు మీ సైటే అవుపించట్లేదు.”
“సైట్ కనిపించకపోవడమేంటి? సైట్ యేడకి పోద్ది. ఏం మాట్లాడతన్నావ్ మాణిక్యం?”
“సైటేతే ఉంది కానీ నీళ్లకింద ఉందండీ. అదంతా చెరువంట కదా. నిన్నపడిన వానకే అది మునిగిపోయింది. కనీసం హద్దు రాళ్లు కూడా అవుపించట్లేదు. అంత పల్లంలో ఉన్న స్థలాన్ని, సెంటు ఇరవై యేలు కూడా చెయ్యనిదాన్ని, మాయమాటలు చెప్పి, లక్ష రూపాయల కాడికి అమ్మారు. రాజధాని ఏరియా కదా, రేటు పెరుగుతుందనే నమ్మకంతో యెనకా ముందూ ఆలోచించకుండా, మా ఆవిడ వొద్దంటున్నా మూర్ఖంగా కొన్నా. నాకా ప్లాటొద్దు, గీటొద్దు. దయచేసి, నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి” అని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసి గణపతి చేతికియ్యబోయాడు.
“అది కుదరదు మాణిక్యం” అంటా సిగరెట్‌ని యాష్‌ట్రేలో పెట్టి నలిపాడు గణపతి.
“అట్లా అయితే, ఆ పల్లంలో మట్టినింపి, మెరక చెయ్యండి. ఆ సైట్లో నీళ్లు నిలవకుండా ఏర్పాట్లు చెయ్యండి” అన్నాడు మాణిక్యరావు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా.
“అది నా పని కాదు మాణిక్యం, నీదే.”
“అయితే నేను నా జీవితంలోనే ఘోరమైన తప్పు చేశానన్న మాట.”
“ఎందుకట్లా ఇదైపోతావ్. నేనట్లా అనుకోవట్లేదు. మట్టి తోలుకొని, రోడ్ లెవల్‌కి పైన ఉండేట్లు చూసుకున్నావంటే దాని గిరాకీ ఎక్కడికీ పోదు.”
“దానికి మట్టి తోలాలంటే ఎంతవుద్దో నీకు తెలీదా. పైగా నేనొక్కణ్ణే తోలితే సరిపోద్దా. అందరూ తోలాలి కదా. ఇంతన్యాయం చేస్తావా? నువ్వసలు మనిషి పుడక పుట్టావా?”
“అది నా తప్పు కాదు.”
“అవునయ్యా, తప్పు నాదే. నిన్ను నమ్మడం నా తప్పే. నువ్వు మోసం చేస్తుంటే తెలుసుకోలేకపోవడం నా తప్పే. నీయంత పెద్ద రాస్కెల్‌గాణ్ణి ఇంతదాకా నీ జీవితంలో చూళ్లేదు. ఇంతదాకా నేను సంపాదించుకున్నదంతా నీళ్లపాలు చేశావ్ కదరా.”
“ఇదిగో మాణిక్యం, మర్యాద.. మర్యాద. మాటలు తిన్నగా రానీయ్. నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కుదరదిక్కడ. నువ్వేం చేస్కుంటావో చేస్కో. రిజిస్ట్రేషన్ ఐపోయాక ఆ సైట్‌తో నాకేం సంబంధం లేదు. అది నీదే. దాన్నేం చేస్కుంటావో నీ ఇష్టం. ముందిక్కణ్ణించి కదులు. లేదంటే న్యూసెన్స్ చేస్తున్నావని పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాల్సొస్తుంది.”
“పోలీసులకు కంప్లయింటిస్తావా? ఎందుకియ్యవూ. ఇది మీ రాజ్యం కదా. అధికారం మీ చేతుల్లోనే ఉందయ్యే. ఏమైనా చేస్తారు. అందుకేగా ఈ ఏరియానంతా దోచుకు తింటన్నారు. అయినా ఇప్పుడు నన్నేడికి పొమ్మంటావ్ గణపతీ.”
“ఏట్లోకి పో. నువ్వెక్కడికిపోతే నాకేంటి. ఈ తెలివి సైట్ కొనేప్పుడే ఉండాల్సింది. అయినా చూసుకునే కదా కొన్నావ్” అన్నాడు వెటకారం నిండిన గొంతుతో, గణపతి.
“నేను ఏట్లోకి పోతే నీకు సంబరంగా ఉంటుందేమిట్రా.. నానా కష్టాలు పడతా మగ్గాల్ని నమ్ముకుని నేను సంపాదించుకున్నదంతా మాయతో, మోసంతో అన్యాయంగా దోచుకున్నావ్. అందుకని నేను ఏట్లోకి దూకాలా? నువ్వు చేసిన పనికి ఏదో నాటికి నువ్వే ఏట్లో పడే రోజొస్తుంది. మనిషి మాంసం అమ్ముకుని బతికేవాళ్లు ఏదో రోజు కుక్కచావు చావక తప్పదు. గుర్తుంచుకో. నేనెళ్తాను. ఏట్లోకి కాదురోయ్. నీమీద కేసెయ్యడానికి వెళ్తాను” అన్నాడు మాణిక్యరావు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటుని సంచిలో పెట్టుకుంటా.
గణపతి నవ్వాడు. “అంతకంటే నువ్వేం చెయ్యగలవ్ మాణిక్యం. శుభ్రంగా వేసుకో. మళ్లీ దాంట్లో ఓడిపోయి, లాయర్ ఖర్చులయ్యాయని నా మీదపడి ఏడిస్తే లాభం ఉండదు.”
4
ఇప్పటికీ మాణిక్యరావు స్థలం నీళ్లకింద భద్రంగా చెరువులో ఉంది. ఆ స్థలం కోసం నిండా మునిగిన మాణిక్యరావు ఇంకో రెండు లక్షల రూపాయల అప్పుకోసం తిరుగుతున్నాడు. కోర్టు కేసుల కోసం కాదు. తనవద్ద నేసే నేతగాళ్లకు కూలీ (మజూరీ) డబ్బులివ్వాలి. వాళ్లకు నూలు, పట్టు సమకూర్చాలంటే, వాటిని కొనాలి. దానికోసం డబ్బు కావాలి. చేతిలో చిల్లిగవ్వ లేదు. అందుకే అప్పుకోసం తిరుగుతున్నాడు. ఈ అనుభవంతో అతను జీవితంలో మళ్లా ఎక్కడైనా స్థలాలు కొనకుండా ఉన్నాడా, లేదా? ఏమో.. కానీ భవిష్యత్తులో నవనీత మాటలకు విలువివ్వాలని మాత్రం అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు.
——————- x ———————-

- 10 సెప్టెంబర్ 2015, సారంగ వెబ్ వీక్లీ

No comments: