'భక్త ప్రహ్లాద' విడుదలైంది 1931లోనే!
మొట్టమొదటి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' 1931లో కాకుండా, 1932లో విడుదలైందని సీనియర్ సినీ పాత్రికేయుడు రెంటాల జయదేవ తనకు లభించిన కొన్ని ఆధారాల ద్వారా తెలియజేసిన విషయం సినిమా ప్రియులకు గుర్తుండే ఉంటుంది. ఆయన దానికి సంబంధించిన వ్యాసం రాసిన తర్వాత కొంతమంది ఆయన చెప్పినదాన్నే నిజమని నమ్ముతూ వస్తున్నారు. అయితే 'ప్రహ్లాద' 1931లోనే విడుదలైందని చెప్పడానికి ఓ ఆధారం లభ్యమైంది. నవోదయ పత్రిక 1947లో వెలువరించిన ప్రత్యేక పారిశ్రామిక సంచికలో యం.యస్. శర్మ 'తెలుగు ఫిల్మ్ పరిశ్రమలో పరాయివారి పెట్టుబడి' అనే వ్యాసంలో 'ప్రహ్లాద' 1931లో విడుదలైందని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాసం 1947లో రాసింది కాబట్టి ఈ కాలంలో రాసిన దానికంటే క్రెడిబిలిటీ దానికే ఎక్కువ ఉంటుంది. ఈయనే కాదు, 1934 నుంచే సినిమారంగంతో సాన్నిహిత్యం కలిగి, అప్పట్నించే సినిమాపై వ్యాసాలు రాస్తూ వచ్చిన మహా రచయిత కొడవటిగంటి కుటుంబరావు సైతం 1953 అక్టోబర్ 1 ఆంధ్రప్రభ దినపత్రిక ఆంధ్రరాష్ట్ర అవతరణ సంచికలో రాసిన 'తెలుగు చిత్రాలు - సింహావలోకం' వ్యాసాన్ని "మొట్టమొదటి తెలుగు టాకీ 'ప్రహ్లాద' 1931లో వెలువడింది" అంటూ ప్రారంభించడం గమనార్హం. కాకపోతే 1931 సెప్టెంబర్ 15న అది విడుదలైందని చెప్పడానికి మరింత నమ్మకమైన అధారాలు లభ్యం కావలసి ఉంది. ఆ పనిలోనే నేను నిమగ్నుడనై ఉన్నందున సమీప భవిష్యత్తులో అవి కూడా లభ్యమవుతాయని ఆశిస్తున్నా.
No comments:
Post a Comment