భలే భలే మగాడివోయ్
మతిమరుపు మగాడు మెప్పించాడు
తారాగణం: నాని, లావణ్య, మురళీశర్మ, అజయ్, నరేశ్, సితార, వెన్నెల కిశోర్, ప్రవీణ్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి
సంగీతం: గోపిసుందర్
రచన-దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: 4 సెప్టెంబర్ 2015
పేరుచూసి కథానాయకుడు ఏమేం సాహసాలు చేస్తాడోనని అనుకునేవాళ్లు సినిమాలో అతని మతిమరుపు పనులు చూసి ఆశ్చర్యపోతారు. అయితే ‘భలే భలే మగాడివోయ్’ ఓ ఉత్సాహభరితమైన, కాలక్షేపానికి బాగా పనికొచ్చే సినిమా. ప్రేమకోసం ఎన్ని ఆటలు, ఎన్ని అబద్ధాలు ఆడవచ్చో, ఆఖరుకి కన్న తల్లిదండ్రుల్ని సైతం అన్నాచెల్లెళ్లుగా ఎలా మార్చేయవచ్చో చూపించే సినిమా.
లక్కీ స్టోరీ:
ఈ సినిమాలో లక్కీ (నాని) అందరిలాంటి మగాడు కాదు. అసాధారణంగా లోకంలో ఎవరికీ లేనంత మతిమరుపుతో పుట్టినవాడు. అలాంటివాడికి పెళ్లి చెయ్యడం తల్లిదండ్రులకు బ్రహ్మప్రళయం కాక మరేమిటి! అయితేనేం, అతను నందన (లావణ్య త్రిపాఠి) అనే అందమైన అమ్మాయిని చూసి, మనసిచ్చేసి, ఆమె ప్రేమను పొందడం కోసం తన లోపాన్ని కప్పిపుచ్చుకోడానికి ఎన్ని ఆటలు, ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్నీ ఆడతాడు. ఈ క్రమంలో ఎంతోమందిని మోసం చేస్తాడు. నందన తండ్రి (మురళీశర్మ) ఓ వ్యవసాయ శాస్త్రవేత్త. ఏ లోటూ లేకుండా మొక్కల పెంపకాన్ని జాగ్రత్తగా చూసుకునే ఆయన కాబోయే అల్లుడి విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు! మొదటే లక్కీ(నాని) సంబంధం ఆయన వద్దకు వస్తుంది. కానీ లక్కీ మతిమరుపు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించి, జన్మలో అతడి మొహం చూడకూడదనుకుంటాడు. ఆయన ఎంత వద్దనుకున్నా కూతురి జీవితంలోకి వచ్చేస్తాడు లక్కీ. ఒక సందర్భంలో కన్నతల్లిని పక్కింటి ఆంటీగా ఆయనకు పరిచయం చేస్తాడు లక్కీ. తండ్రిని తల్లిచేత ‘అన్నయ్యా’ అనిపిస్తాడు!
నందనను తొలిచూపులోనే కామించి ఆమెను పెళ్లిచేసుకోవాలని ఇన్‌స్పెక్టర్ అజయ్ (అజయ్) అనే అతను కాచుక్కూర్చుంటాడు. అతని తండ్రి, నందన తండ్రి స్నేహితులు. కానీ అజయ్ తనకు నచ్చలేదనీ, తను లక్కీ అనే అతన్ని ప్రేమించాననీ తండ్రికి చెబుతుంది నందన. అవమానంతో రగిలిపోతాడు అజయ్. లక్కీ అనేవాడి అంతు చూడాలనుకుంటాడు. లక్కీని తండ్రికి పరిచయం చేయాలనుకుంటుంది నందన. తనెవరో ఆయనకు తెలుసుకాబట్టి ఆయన వద్దకు తన బదులు తన స్నేహితుణ్ణి (వెన్నెల కిశోర్)ను పంపిస్తాడు లక్కీ. ఇక దాగుడుమూతలాట మొదలు. లక్కీ మరో గేమ్ ఆడి, నందన రికమండేషన్‌తో లక్కీ స్నేహితుడిగా ఆమె తండ్రి వద్దే ఉద్యోగంలో చేరతాడు. చివరకు ఈ ఆటలో అసలు లక్కీ ఎవరో నందన తండ్రికి ఏ పరిస్థితుల్లో తెలిసింది, లక్కీ ఆడిన ఆటలు, అతని భయంకరమైన మతిమరుపు గురించి నిజం తెలిసిన నందన ఏం చేసిందనేది పతాక సన్నివేశం.
నాని సినిమా:
హీరో హీరోయిన్లుగా నాని, లావణ్య మధ్య కెమిస్ట్రీ ‘భలే’ కుదిరింది. మతిమరుపు కుర్రాడిగా ఆహ్లాదాన్ని పంచుతూనే, నందన వదినకు ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి పడ్డ అవస్థల్లో నాని ప్రదర్శించిన హావభావాలు, చివరలో తను ఆడిన అబద్ధాలు, ఆటల వల్ల నందన దూరమైపోయిందన్న బాధతో అతను చూపించిన అభినయాన్ని ప్రశంసించకుండా ఉండలేం. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోసిన అతనికి ఈ సినిమా మంచి బ్రేక్‌నిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నందనగా లావణ్యకూ ఈ సినిమా పెద్ద ప్లస్సవుతుంది. అందంగా ఉండటమే కాకుండా అభినయంతోనూ ఆకట్టుకుంది. పాత్ర పరిధిలో విలన్‌గా తనదైన ధోరణిలో నటించాడు అజయ్. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ తండ్రిగా నటించిన మురళీశర్మ గురించి. దాదాపు హీరోతో సమానమైన కీలక పాత్రలో గొప్పగా రాణించాడు. సెకండాఫ్‌లో వచ్చినా తనదైన ‘తత్తరబిత్తర’ కామెడీతో అలరించాడు వెన్నెల కిశోర్. లక్కీ స్థానంలో వెళ్లినప్పట్నించీ అతను పడే అవస్థలు ఆహ్లాదాన్ని పంచాయి. లక్కీ తల్లిదండ్రులుగా నరేశ్, సితార జోడీ ఆకట్టుకుంటుంది. కాకపోతే భర్తను పట్టుకొని సితార ‘అన్నయ్యా’ అని అంటుంటే ఎంత ఎబ్బెట్టుగా ఉందో! ఎంత ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుకుంటే మాత్రం భర్తను అన్నయ్యగా ఏ స్త్రీ అయినా పిలుస్తుందా? నందన వదినగా స్వప్నమాధురి కూడా ఓ సన్నివేశానికి కీలకమైన పాత్రను చక్కగా చేసింది. గతంలో ‘కొడుకు’గా హీరో వేషంలో కనిపించిన ఎమ్మెస్ నారాయణ కొడుకు విక్రమ్‌ని ఇందులో పోలీస్‌గా ఏమాత్రం ప్రాధాన్యంలేని ఓ సాదాసీదా పాత్రలో చూసి జాలిపడతాం. నందన బంధువుల బృందంలో శ్రీనివాసరెడ్డి కొద్దిసేపైనా తన మార్కు హాస్యాన్ని పండించాడు.
దర్శకత్వ ప్రతిభ:
చూడ్డానికి సినిమా కథే అయినా అతి సాధారణంగా ఉన్న క్లైమాక్స్ మినహా మిగతా సినిమానంతా ఆహ్లాదభరితంగా, ఉద్వేగభరితంగా చిత్రించాడు దర్శకుడు మారుతి. మతిమరుపును కప్పిపుచ్చుకోడానికి లక్కీ ఆడే అబద్ధాల వల్ల తర్వాత సన్నివేశంలో ఏమవుతుందో, ఒక్కో అబద్ధంతో ఒక్కో సమస్యలో చిక్కుకుని అతను ఎలా బయటపడతాడోననే కుతూహలం, ఒక పనిమీద వచ్చి, దాన్ని మర్చిపోయి ఇంకో పనిచేసే లక్కీ తర్వాత ఎలాంటి చిక్కులో పడతాడోననే ఆదుర్దాని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. టేకింగ్‌తోనూ, మాటలు, స్ర్కీన్‌ప్లేతోనూ మెప్పించాడు మారుతి. కాకపోతే క్లైమాక్స్ రెగ్యులర్ టైప్‌లో ఉండి అసంతృప్తి కలిగిస్తుంది. మతిమరుపును కప్పిపుచ్చుకోడానికి లక్కీ ఆడిన ఆటలు తనకు ముందే తెలుసునంటూ, తర్వాత అతనేం చేస్తాడో చూడాలనే ఉద్దేశంతో అతడికి తెలీకుండా గమనిస్తూ వచ్చానని ప్రీ క్లైమాక్స్‌లో మురళీశర్మ చెప్పడం ఓవర్ డ్రమటైజేషన్. అది కన్విన్సింగ్‌గా లేదు. నందన అన్నయ్య ఎవరో చివరాఖరి దాకా దర్శకుడు చూపించకపోవడం, భార్యకు ప్రసవమై బిడ్డ పుట్టాక కూడా అతను రాకపోవడం సినిమా విచిత్రం! ఐదు పాటల్లో హీరో హీరోయిన్లపై తీసిన టైటిల్‌సాంగ్, నానిపై తీసిన ‘హౌ హౌ’ సాంగ్ మాత్రమే ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటల బాణీలకంటే గోపిసుందర్ ఇచ్చిన రీరికార్డింగ్ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది.
రేటింగ్: 3.25/5
No comments:
Post a Comment