Friday, May 30, 2014

Gautam Ghosh: The Two Edges Of The Sword

రెండంచుల కత్తి గౌతం ఘోష్

గత ఆగస్ట్ నెలలో అతను ఫ్రెంచివాళ్ల ప్రతిష్ఠాత్మక 'విట్టారియో డిసాకా' అవార్డుని అందుకున్నాడు. ఆ పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయుడు అతనే. పేరు గౌతం ఘోష్. తొలిసారిగా అతడు దర్శకత్వం వహించింది ఒక తెలుగు చిత్రానికి. ఆ చిత్రం పేరు 'మా భూమి'. ఆ సినిమా నుంచే అతడు తన మార్గంలో ఒక్కో మెట్టే ఎక్కుతూ ముందుకు నడుస్తున్నాడు. బిస్మిల్లాఖాన్‌ని తనదైన రీతిలో సెల్యులాయిడ్‌పై అద్భుతంగా చిత్రించాడు. 'పార్', 'అంతర్జలి జాత్ర', 'పద్మ నదీర్ మఝి' వంటి అరుదైన సినిమాల్ని సృష్టించాడు. తన ఈ ప్రయాణాన్ని చిన్నతెర మీద ప్రదర్శించాడు. అట్లాగే రవీంద్రనాథ ఠాగూర్ 'ఘటేర్ కథ'ని కూడా.
కత్తికి రెండువైపులా పదును ఉన్నట్లు అతడి చిత్రాలకి విమర్శకుల మెప్పు ఉంది. వాణిజ్యపరమైన ఆకర్షణా ఉంది. అదే అతడిలోని వైశిష్ట్యం. బిస్మిల్లా ఖాన్, ఉత్పల్‌దత్, కనికా బెనర్జీపై చిత్రాలు తీసిన గౌతం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుపై ఒక షార్ట్ ఫిల్మ్ తీసే పనిలో నిమగ్నమయ్యాడు. ఒక రాజకీయవేత్తపై చిత్రం తీయడానికి అతను పూనుకోవడం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 'వ్యక్తిగా ఆయన నన్ను ఆకర్షించాడు' అని సమాధానం వస్తుంది గౌతం నుంచి. "అఫ్‌కోర్స్. ఆయనొక రాజకీయ నాయకుడు. నా చిత్రం ఆయన కాలంలోని రాజకీయ వాస్తవాల్ని స్పృశిస్తుంది. ఆయన సామర్థ్యం అద్వితీయమైంది. ఆయన కలల్ని ప్రతిఫలింపజేయడానికి నేను ప్రయత్నిస్తున్నా" అంటాడు గౌతం.
అతను సత్యజిత్‌రే మీద కూడా ఒక డాక్యుమెంటరీ తీస్తున్నాడు. "దేశవ్యాప్తంగా సినీ దర్శకుల్ని ప్రభావితం చేసిన ఏకైక కళాకారుడు రే. కళమీద ఆయనకున్న అంకిత భావం మాటల్లో వ్యక్తీకరించలేనిది. రే కళ తాలూకు నేపథ్యాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నా. ఒక వ్యక్తిగా, అంతకంటే ఎక్కువగా ఆయనలోని సృజనాత్మక కళని ఈ చిత్రం ప్రదర్శిస్తుంది. సినీ విద్యార్థులకి రేని అర్థం చేసుకోవడంలో ఈ చిత్రం సహాయపడుతుందనే విశ్వాసం ఉంది" అంటాడు గౌతం. సినిమాకి సంబంధించి అతనిది రాజీపడని మనస్తత్వం. అతడి దృష్టిలో సినిమా అనేది ఒక భాష. తన అనుభవాల్ని ప్రేక్షకులతో పంచుకున్నప్పుడే దర్శకుడు ముందుకు నడవగలడనేది అతని నమ్మకం.
స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లకి, అంటే 1950లో గౌతం కుటుంబం తూర్పు బెంగాల్ నుంచి కలకత్తాకి వలస వచ్చింది. బాల్యం తియ్యగా సాగిపోయింది. వాళ్లది ఉమ్మడి కుటుంబం. గౌతంకి అనేకమంది కజిన్స్ ఉండేవాళ్లు. అందరూ కలిసి ఒకళ్ల ఆలోచనల్ని మరొకళ్లు పంచుకునేవాళ్లు. అట్లా చెయ్యడం వాళ్లకెంతో సంతోషాన్నిచ్చేది. ఇంట్లోనూ, స్కూల్లోనూ గౌతం మేజిక్కులు చేసేవాడు. ఏకపాత్రలు అభినయించేవాడు. అతడి దృష్టిలో ఆ రోజులు చాలా గొప్పవి. అప్పుడు మరింత అందంగా ఉండేది కలకత్తా నగరం. ఇక గంగాతీర సోయగం వర్ణనాతీతం. సెలవు రోజుల్లో గౌతం కుటుంబ సాయంకాలాలు ఆ తీరం వద్దనే గడిచేవి. ఈడెన్ గార్డెన్స్ కూడా అతడిని చాలా ఆకర్షించింది.
చలనచిత్రాల వైపు అతడి దృష్టి మళ్లడానికి తొలి బీజం ఐదేళ్ల పసివయసులోనే పడింది. అప్పుడతను 'భక్త ధృవ' అనే బెంగాలీ సినిమా చూశాడు. ఊహ వచ్చాక అతడు చూసిన తొలి సినిమా అదే. అయితే సినిమాలు ఎక్కువగా చూసే అవకాశం ఉండేది కాదు. అనేక సంవత్సరాల దాకా సినిమాలు చూసే అవకాశం ఎప్పుడో కానీ వచ్చేది. అప్పట్లో ఎవరైనా 'మంచి సినిమా ఏది?' అనడిగితే 'టార్జాన్' అనో, 'మేరీ పాపిన్స్' అనో చెప్పేవాడు. గౌతం దృష్టిలో ఇప్పుడవి గొప్ప అనుభవాలు. మొదట్లో అతను క్రికెట్‌ని ప్రేమించాడు. ఇంటర్‌స్కూల్ లీగ్ పోటీల్లో ఆడాడు. ఆఫీస్ క్లబ్ పోటీల్లో ప్రొఫెషనల్‌గా క్రికెట్ ఆడాడు. ఫాస్ట్ బౌలర్ కావాలని కలలు కన్నాడు. అలాంటి సమయంలో అతడి బాబాయి ఒక బ్రౌనీ కెమెరాని ఇచ్చాడు. అప్పుడు గౌతం వయసు పదేళ్లు. ఆ చిన్న వస్తువే అతడి జీవితాన్ని మార్చేసింది. బాబాయి కొంత ఫిలింని కూదా తెచ్చిచ్చాడు. ఇక దాంతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ ఫిల్మ్ మొత్తం అవగానే ఇంకో ఫిల్మ్ సిద్ధంగా ఉండేది కాదు. దాంతో షూటింగ్ అంతటితో ఆగేది. అప్పుడు ఒకటి, రెండు 'రోల్స్' కొనేవాడు, డబ్బుపెట్టి. లేదంటే కెమెరా 'వ్యూఫైండర్' నుంచి ఉత్తినే చూస్తూ కాలం గడిపేవాడు. ఫొటోగ్రఫీలో, పర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో అతడికి ఉన్న ఆసక్తి సినీరంగంలో కాలు మోపేందుకు దారితీసింది. కాలేజీలో ఉండగా అక్కడి వాతావరణం అతడిలోని కళాకారుణ్ణి తట్టిలేపింది. 'రిత్విక్' అనే యువ రంగస్థల బృందంలో చేరాడు. ఒక పక్క క్లాసులకి హాజరవుతూ మరోపక్క నేషనల్ లైబ్రరీ, బ్రిటీష్ కౌన్సిల్ లైబ్రరీల్లో సినిమాల మీద, రంగస్థలం మీద కనిపించిన ప్రతి పుస్తకమూ చదివేవాడు. ఆపైన కొద్ది కాలానికే సినీ దర్శకత్వంలో వచ్చిన ఆధునిక పద్ధతుల్ని అధ్యయనం చేశాడు. ఐతే కేవలం థీరీ చదివినంత మాత్రాన ఉపయోగం ఉండదని అతడికి తెలుసు. అందుకే ఏమైనా చేయాలని తపించేవాడు. ఎట్లయితేనేం ఒక 8 ఎం.ఎం. కెమెరాని సంపాదించి తన తొలి ప్రయోగాన్ని మొదలుపెట్టాడు. తన థియేటర్ గ్రూపులోని సభ్యులనందరినీ ఒకచోట చేర్చి సమరేష్ బసు రచించిన బెంగాలీ కథానిక 'జోర్‌వంత'ని దృశ్యీకరించాడు. ఐతే సరిపడ ఆర్థిక వనరులు, అవసరమైన సామగ్రి లేకపోవడంతో ఆ చిత్రాన్ని పూర్తి చేయలేకపోయాడు. కానీ ఒక ప్రయోగం చేశామన్న తృప్తి మిగిలింది. ఆ రోజులు మరపురానివిగా నిలిచాయి.
1971లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక చిత్రాలు తీయడం కొనసాగించాడు. 1973లో 'న్యూ ఎర్త్' అనే తన తొలి డాక్యుమెంటరీని తీశాడు. దీనికి సుప్రసిద్ధ దర్శకుడు మృణాల్‌సేన్ ప్రశంసలు లభించాయి. అంతకుముందు బెంగాల్‌లో విద్యుత్ కరవుపై కూడా ఒక డాక్యుమెంటరీని తీస్తుంటే అది మరీ విమర్శనాత్మకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టడంతో దాన్ని పూర్తి చేయకుండానే ఆపేశాడు. తను తీసే చిత్రాల కోసం డబ్బు సమకూర్చుకోవడం అతడికి గగనమై పోయింది. ఒకసారి అనుకోకుండా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ అతడి అసంపూర్ణ డాక్యుమెంటరీని చూశాడు. ఆయనకు అది బాగా నచ్చింది. వెంటనే కంశపతి రివర్ ప్రాజెక్టుపై ఒక డాక్యుమెంటరీని తీసిపెట్టమని గౌతంని కోరాడు. అలా 'న్యూ ఎర్త్' తయారయ్యింది. 1974లో బెంగాల్‌లో అకాల కరవు సంభవించింది. గౌతం ఒక చిన్న 16 ఎం.ఎం. కెమెరాని సంపాదించి, కొంత అప్పుచేసి ఆ కరువుపై డాక్యుమెంటరీ తీశాడు. కరువు విలయ తాండవం చేస్తున్న గ్రామాల్లోకి వెళ్లి వార్తా సేకరణ విభాగంలో పనిచేశాడు. ఐతే అది కేవలం వార్తా సేకరణ మాత్రమే కాదు. దేశంలో కరువు అనేది ఏ తీరులో ఉంటుందో విశ్లేషించడానికి అదో ప్రయత్నం. ఈ ఆలోచన నగర ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి తోడ్పడిందని ఆ రోజుల్ని గుర్తుకు తెచ్చుకొని చెప్తాడు గౌతం. అప్పుడే దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ఆ డాక్యుమెంటరీకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఒక సంవత్సర కాలం తీసుకుంది సెన్సార్ బోర్డు. కలకత్తా ఫిల్మ్ సొసైటీ తొలిసారిగా దాన్ని ప్రదర్శించింది. ఐతే గౌతం తన డాక్యుమెంటరీని అమ్మేందుకు ప్రయత్నించలేదు. స్పాన్సర్‌షిప్ లభించకపోవడంతో డాక్యుమెంటరీలు తీయకూడదని నిశ్చయించుకున్నాడు. జీవనాధారం కోసం కొన్ని యాడ్ ఫిలింలు తీశాడు.
అప్పుడు వచ్చింది ఒక 'బ్రేక్'. హైదరాబాద్ నుంచి ఒక నిర్మాతల బృందం అతడిని కలిసింది. వాళ్లు అప్పటికే మృణాల్‌సేన్ తీసిన 'మృగయా'ని స్పాన్సర్ చేశారు. వాళ్లు గౌతం తీసిన ఫిలింలను చూశారు. అప్పటికింకా గౌతంకు ఫీచర్ ఫిలింలు (చలన చిత్రాలు) తీయాలనే తలంపు లేదు. అయితే నిర్మాతల్లో ఒకరైన బి. నరసింగరావు గౌతంను కన్విన్స్ చేసి ఒప్పించారు. అదిగో.. అప్పుడు తయారయ్యింది 'మా భూమి'. ప్రఖ్యాత ఉర్దూ రచయిత కిషన్ చందర్ రచించిన నవలిక ఆధారంగా దాన్ని రూపొందించారు. ముందు దాని స్క్రిప్టుని కలకత్తాలో పూర్తిచేశాడు గౌతం. అయితే ఎప్పుడైతే అసలు లొకేషన్‌కు వెళ్లాడో అప్పుడు కానీ అర్థం కాలేదు, తన స్క్రిప్టు కృతకంగా, జిమ్మిక్కుగా ఉందనే సంగతి. అప్పుడు స్క్రిప్టులో మార్పులు చేశాడు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పర్యటించాడు. అప్పటి జనం స్పందన కానీ, సినిమాలో వాళ్ల భాగస్వామ్యం కానీ అపురూపమైనవిగా అతడు భావిస్తాడు. స్క్రీన్‌ప్లేని నరసింగరావు సమకూర్చారు. 'మా భూమి'ని పూర్తిచేయడానికి ఏడాది కాలం పట్టింది. అయినా కానీ గౌతం హృదయంలో ఆ కథ గొప్ప ప్రభావాన్ని కలిగించింది. సినిమా పూర్తయ్యాక సెన్సార్ ఇబ్బందులు ఎదురయ్యాయి. జాతీయతకు విరుద్ధంగా ఆ సినిమా ఉందని సెన్సార్ వాళ్లు భావించారు. అప్పుడు చరణ్‌సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మద్రాసులో ఉన్న గౌతం మిత్రులు 'మా భూమి'ని సెన్సార్ చేతుల్లోంచి బయట పడేసేందుకు సహాయం చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ సినిమాని తాష్కెంట్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించినప్పుడు కె.ఎ. అబ్బాస్ దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. 'మా భూమి'ని సెన్సార్ వాళ్లు ఎట్లా విడిచిపెట్టారో ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే నక్సలైట్ ఉద్యమం మీద అబ్బాస్ రూపొందించిన సినిమాకి అదే సెన్సార్ వాళ్లు అభ్యంతరపెట్టారు. ఏదేమైనా 'మా భూమి' బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా, పెద్ద స్టార్లు ఎవరూ లేకపోయినా వాణిజ్యపరంగా మంచి విజయమే సాధించింది. అది సాధించిన విజయంతో ఆ తర్వాత కొంతమంది తెలుగు నిర్మాతలు తమకి సినిమాలు తీసిపెట్టమని గౌతంను కోరారు. అయితే వాటిని సున్నితంగా తిరస్కరించి తిరిగి కలకత్తా వెళ్లిపోయాడు. అప్పటికే సమరేశ్ బసు రాసిన ఓ నవలను సినిమాగా తీయాలని అతడు నిశ్చయించుకుని ఉన్నాడు. దీని విషయమై ఉత్తంకుమార్‌ను సంప్రదించగా ఆయన కూడా ఆసక్తి చూపించాడు. ఐతే అనుకోని రీతిలో 1980 జూలై 24న ఉత్తంకుమార్ చనిపోయాడు. ఆ రోజు గౌతం పుట్టినరోజు కావడం కాకతాళీయం. తాననుకున్న పాత్రలో ఉత్తంకుమార్‌ను తప్ప వేరే నటుణ్ణి ఊహించలేకపోయాడు గౌతం. అందుకే ఆ సినిమా తీసే ఆలోచననే విరమించుకున్నాడు.
ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అతడికి ఓ సినిమా తీసే అవకాశం ఇచ్చింది. కేవలం రూ 3 లక్షల వ్యయంతో అతడు 'దఖల్' (19981) తీశాడు. 'మా భూమి' ఉత్తమ చిత్రంగా నంది అవార్డును అందిస్తే, 'దఖల్' ఆ యేడాది జాతీయ ఉత్తమ చిత్రంగా బంగారు కమలాన్ని సాధించిపెట్టింది. ఆ తర్వాత హిందీలో 'పార్' తీశాడు. అది చరిత్ర సృష్టించింది. చలనచిత్రంలో కథనం ఎక్కువగా ఉంటుంది. కానీ 'పార్'లో అతడు కథనంలోనే కొంత డాక్యుమెంటరీ పద్ధతిని కూడా మిళితంచేసి తీశాడు. ఇక బెంగాలీ 'అంతర్జలి జాత్ర' ఒక విభిన్న చిత్రం. 19వ శతాబ్దపు బెంగాల్ నేపథ్యంలో కమల్‌కుమార్ మజుందార్ రచించిన 'మహాయాత్ర' నవల ఆధారంగా తీసిన చిత్రం. ఆ తర్వాత మాణిక్ బెనర్జీ సుప్రసిద్ధ నవల 'పద్మ నదిర్ మాఝి'ని అదే పేరుతో సినిమాగా మలచిన గౌతం అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. బెనర్జీ నవలని మార్చి, దాని ఆత్మని విస్మరించి సినిమా తీశాడనేది అందులోని ప్రధానమైన ఆరోపణ. "సాహిత్యం, సినిమా - రెండు భిన్న రంగాలు. సినిమా అనేది కేవలం నవలకు అనువాదంగా ఉండకూడదు. అది బదలాయింపుగానే ఉండాలి. ఎక్స్‌ప్రెషన్ అనేది భిన్నమైంది. కొన్నింటిని మాటల ద్వారానే వ్యక్తం చేయగలం. వాటికి దృశ్యరూపం కల్పించలేం" అని వివరణ ఇచ్చాడు గౌతం.
సమకాలీన భారతీయ సినిమా విషయంలో అతడు సంతోషంగా లేడు. "అంతర్జాతీయ స్థాయిలో గత పదిహేనేళ్లలో మనం ఏమీ చేయలేకపోయాం" అని విచారం వ్యక్తం చేస్తాడు. సత్యజిత్ రే, మృణాల్‌సేన్, శ్యాం బెనెగల్, ఆదూర్ గోపాలకృష్ణన్ వంటి దర్శకులు దేశీయ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో తమ పాత్రను నిర్వర్తించారనీ, అయినా ఎక్కడో లోపం ఉంటోందనీ అతడు చెబుతాడు. "మొత్తం యూరప్ అంతా చైనీయుల సినిమాలను చూస్తున్నారు. భారతీయ సినిమాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మన సినిమాలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్స్‌పోజ్ కావాల్సిన అవసరముంది. మంచి మార్కెట్ లేకపోతే మన ప్రమాణాల్ని పెంచుకొనే అవకాశమే రాదు" అని అభిప్రాయపడతాడు గౌతం. హిందీలో తీసిన 'గుడియా' తర్వాత మరో సినిమా తీసే పనుల్లో ఉన్న గౌతంకు ఫ్రెంచి ప్రభుత్వపు ప్రోత్సాహకం లభించబోతోంది. అతను తీసే ఒక సినిమాకు నిధులను అందిస్తామని అది ప్రకటించింది. గౌతంలోని విశిష్ట కళాకారుడికి అంతకంటే కావాల్సిన గౌరవం ఏముంటుంది!
- ఆంధ్రభూమి 'వెన్నెల', 16 జనవరి 1998

Thursday, May 22, 2014

Agriculture: Lack of Investment in Agricultural Sector

వ్యవసాయ రంగాన్ని పీడిస్తున్న పెట్టుబడి కొరత
దేశంలో వ్యవసాయ రంగాన్ని పెట్టుబడి కొరత పట్టి పీడిస్తోంది. ఈ కొరత వ్యవసాయ రంగపు దీర్ఘకాలిక అభివృద్ధికి ముప్పుగా మారుతోంది. ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ అవి ప్రభుత్వ పెట్టుబడుల లోటుని పూడ్చే పరిమాణంలో ఉండటం లేదు. 1990-91 సంవత్సరంలో ప్రభుత్వం ఈ రంగం మీద రూ. 1154 కోట్ల పెట్టుబడిని పెట్టింది. అయితే మరో నాలుగేళ్లపాటు ఈ పెట్టుబడుల పరిమాణం పెరగలేదు. 1995-96లో మాత్రం ప్రభుత్వ పెట్టుబడి రూ. 1310 కోట్ల రూపాయలకి చేరుకుంది. 1994-95లో కంటే 1995-96లో ఈ రంగంలో ప్రణాళికా వ్యయం రూ. 148 కోట్లు తక్కువ. 1996-97 నాటికి ఇది మరో రూ. 134 కోట్లు తగ్గింది. 1997-98 సంవత్సరానికి మొత్తం ప్రణాళికా కేటాయింపులో వ్యవసాయ రంగం వాటా 3.2 శాతం ఉంది. అదే 1996-97 సవరించిన అంచనాల ప్రకారం వ్యవసాయ రంగం వాటా 3.4 శాతం.
1997-98 బడ్జెట్‌లో వ్యవసాయం, తత్సంబంధ రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు 1996-97 సవరించిన అంచనాల కంటే 13 శాతం అధికం. వ్యవసాయ రంగం వార్షిక ప్రణాళిక కేటాయింపులకి బడ్జెట్ మద్దతు కొరవడినందువల్లనే ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగానికి ప్రణాళికా కేటాయింపులు నామినల్ రేట్లలో బాగా తగ్గాయని చెప్పాలి.
భూమి, నీటి వసతుల్ని సక్రమంగా వాడుకుంటూ వ్యవసాయ ఉత్పత్తిని పెంచడమనేది భారతదేశ విధానం. 8వ ప్రణాళికలో వర్షాధార ప్రాంతాల్లో జాతీయ ఆయకట్టు అభివృద్ధి ప్రాజెక్టుకు రూ. 1100 కోట్లు కేటాయించారు. 13 రాష్ట్రాల్లో 149 జిల్లాల్లో ఉన్న అనావృష్టి పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకాన్ని 946 సమితులకి విస్తరించారు. అయినా అధికారుల్లో, పాలకుల్లో చిత్తశుద్ధి లోపించినందు చేత ఆయకట్టు అభివృద్ధి ప్రాజెక్టు నత్తనడక నడుస్తోంది. భూగర్భ జలాల్ని ఉపయోగించుకోవడం ద్వారా నీటి పారుదల సౌకర్యాన్ని పెంపొందింప జేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తూర్పు ప్రాంతంలో ఈ పని చాలా త్వరగా జరగాలి. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో భూ ఉపరితల జల వనరుల్ని మరింతగా ఉపయోగించుకోవాల్సి ఉంది. బంజరు భూమిలో ఎడారుల్ని అభివృద్ధిపరచి పంటల సాగుకి తగిన విధంగా ఉండేట్లు తీర్చిదిద్దడానికి కృషి చేయాలి.
వాణిజ్య పంటల పోటీ
నాలుగు దశాబ్దాల నుంచి పారిశ్రామికాభివృద్ధి పెరగటం వల్ల జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా క్రమేపీ తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ వ్యవసాయ వస్తువుల ఉత్పత్తి, సేద్యం చేసే భూ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. వ్యవసాయ రంగంలో ఆర్థికాభివృద్ధి సాధించాలంటే పంటల మార్పిడి అవసరం. ఇలా చేయడం వల్ల భూసారం కూడా పెరుగుతుంది. 1965వ సంవత్సరంలో మొత్తం భూభాగంలో 44 శాతం పంటభూమి ఉండగా, 1996వ సంవత్సరం నాటికి అది 48 శాతానికి పెరిగింది. 1965కి ముందు మొత్తం పంటభూమిలో 80 శాతం ఆహార పంటలకి వినియోగిస్తుండేవారు. కానీ పంటల ఉత్పత్తి పెరగడం వల్ల, పరిశ్రమల ఉత్పాదక వస్తువుల ఉపయోగం పెరగడం వల్ల, ప్రజలు ఆదాయ మార్పు కోరుకోవడం వల్ల ఆహార పంటల సేద్యపు భూమి తగ్గిపోయి వాణిజ్య పంటల సేద్యపు భూ పరిమాణం పెరిగింది. అయినా కూడా 1990-91లో 176.4 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగగా, 1995-96లో 185 మిలియన్ టన్నుల ఆహర ధ్యాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. 1996-97లో ఖరీఫ్, రబీ పంటలతో కలిసి ఆహార ధాన్యాల ఉత్పత్తి 195 మిలియన్ టన్నులు ఉండే అవకాశం ఉంది. 8వ ప్రణాళిక తొలి అర్ధభాగంలో 1992-93 నాటికి ఆహార పంటలు సాగుచేసే భూ విస్తీర్ణంలో దాదాపు 37 శాతం మాత్రమే నీటి సదుపాయం కలిగి ఉండేది. 1993-94, 1994-95 సంవత్సరాల్లో మరో 1.7 మిలియన్ హెక్టార్లకి నీటి సదుపాయం కల్పించారు. 1995-96కి 2.1 మిలియన్ హెక్టార్లకి నీటి సదుపాయం కలిగింది. అందుచేతనే ఆహార ధాన్యాల ఉత్పత్తి కొంతమేరకైనా పెరిగింది. తొమ్మిదవ ప్రణాళికలో వ్యవసాయ, తత్సంబంధ రంగానికి ప్రస్తుతం ఉన్నవాటికంటే రెండింతల రుణాలు మంజూరయ్యేలా చూడాలని ఐక్యఫ్రంట్ కనీస ఉమ్మడి కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సంస్థల ద్వారా అందజేసిన వ్యవసాయ రుణాలు 1994-95లో రూ. 21,113 కోట్లు కాగా 1995-96లో రూ. 22,000 కోట్లు రుణాల కింద మంజూరయ్యాయి. 1996-97లో ఈ మొత్తం రూ. 28,000 కోట్లకి పెరుగుతుందని అంచనా.
కాలం చెల్లిన పద్ధతులు
దేశంలో వ్యవసాయాభివృద్ధిని నిరోధిస్తున్న అనేక అంశాల్లో సంప్రదాయ పద్ధతుల్ని అనుసరించడం కూడా ఒకటి. వ్యవసాభివృద్ధిని అధికం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం 1960 తర్వాత అనేక కొత్త వ్యూహాల్ని ప్రవేశపెడుతూ వస్తోంది. వీటిలో భాగంగా 1960-61లో సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (ఐ.ఎ.డి.పి.)ని దేశంలోని ఏడు జిల్లాల్లో ప్రవేశపెట్టారు. అందులో రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత 1965లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం (ఐ.ఎ.ఎ.పి.)ని ప్రవేశపెట్టారు. ఈ పథకాల ఫలితంగానే దేశంలో 1965లో హరిత విప్లవం సంభవించింది. ఈ నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతుల్లో భాగంగా అధిక దిగుబడి వంగడాలు, రసాయనిక ఎరువులు, ఆధినిక యంత్రాలు, నీటి సదుపాయాలు కల్పించారు.
ఆహార పంటల్లో వెనకడుగు
రాష్ట్రం విషయానికి వస్తే ఆరుగాలం కష్టించి పండించిన పంటలకి గిట్టుబాటు ధర రాక, ధర వచ్చేదాకా ధాన్యాన్ని నిల్వ చేసుకునే స్థోమత లేక రైతాంగం దిక్కుతోచని స్థితిలో సతమతమవుతోంది. రాష్ట్రంలో 2.74 కోట్ల హెక్టార్ల భూమి ఉంది. 1965-66లో ఆహార పంటలు 94.76 లక్షల హెక్టార్లలోను, ఆహారేతర పంటలు 26.14 లక్షల హెక్టార్లలోను పండించగా 1993-94లో 82.21 లక్షల హెక్టార్లలో ఆహార పంటల్నీ, 44.67 లక్షల హెక్టార్లలో ఆహారేతర పంటల్నీ సాగుచేశారు. అంటే మొత్తం ఆహార పంటలు పండించే భూమి శాతం మొత్తం సాగుభూమిలో వరసగా తగ్గింది. ఇది 79 శాతం నుంచి 64 శాతానికి తగ్గిపోయింది. సూచి సంఖ్యలో 100 నుంచి 87 శాతానికి పడిపోయింది. అలాగే ఆహారేతర పంటలు పండించే భూమి పెరిగింది. మొత్తం సాగుభూమిలో 21 శాతం నుంచి 36 శాతానికి ఆహారేతర పంటలు పెరిగాయి. రాష్ట్రంలో నీటి వసతి మొత్తం పంట భూమిలో 29 శాతం నుంచి 1993-94కు 38 శాతానికి పెరిగింది. ఇలా నీటి సదుపాయాలు పెరగడం వల్ల సేద్యపు భూమి పెరిగి వరి, వాణిజ్య పంటలు పండించే భూమి పెరిగి మెట్ట పంటలైన జొన్న, సజ్జ, గోధుమ వంటి పంటల్ని పండించే భూమి శాతం మూడు దశాబ్దాల కాలంలో సగానికి పైగా తగ్గింది. రాష్ట్రంలో కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ సరఫరా జరిగి ధరలు పడిపోయి వ్యవసాయదారులు విపరీతమైన కష్టనష్టాలకి గురవుతున్నారు. రైతుల్ని ఆదుకోవడంలో రాజకీయ నాయకులు, మార్కెట్ కమిటీలలో మెజారిటీ పదవులు అనుభవిస్తున్న తెలుగుదేశం నాయకులు విఫలమయ్యారు. విద్యుత్ కోత, ఆపైన వడగండ్ల బారినపడి ఈ ఏడాది రైతాంగం ఆటుపోట్లను ఎదుర్కొన్నది. పైగా గత ఏడాది కంటే ఈ ఏడాది విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగాయి. ఇన్ని సమస్యలు ఎదురైనా ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం, బావుల్లో నీరు తగినంతగా లభించడం వల్ల పంట దిగుబడి పెరిగింది. అయితే వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి సాగిస్తున్న దోపిడీ ముందు రైతులు నిస్సహాయులవుతున్నారు. దళారీ వ్యవస్థని రూపుమాపడానికని ఏర్పడ్డ వ్యవసాయ మార్కెట్లే దళారీ వ్యవస్థను మరింత పెంచి పోషిస్తుండటం శోచనీయం. రైతుల ప్రయోజనాల్ని కాపాడేందుకు నియోగించబడిన మార్కెట్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు సిండికేట్లతో చేతులు కలిపి రైతుల్ని నిలువునా దగా చేస్తున్నారు.
ఎగుమతులు
'గాట్' తదనంతర కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారానికి సంబంధించి రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకుంటున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల విధానంతో వాల్యుయేటెడ్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి ఉన్న అవకాశం మరింత విస్తృతమైంది. రాష్ట్రం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 1995-96 కాలంలో 90 శాతం వరకు పెరిగాయి. బియ్యం, పొగాకు, కొబ్బరి, పండ్లు, మంచినూనె, ఉల్లిపాయలు తదితర ఉత్పత్తుల్లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది.
ముఖ్యమంత్రి చెప్పింది వినేందుకు బాగానే ఉంది కానీ ఆర్థికాభివృద్ధి సాధించడంలో పంటల తీరు ప్రభావం చూపుతున్నందున ప్రభుత్వం కొన్ని చట్టాల ద్వారా, పరిపాలనా యంత్రాంగం ద్వారా, ప్రణాళికా బద్ధంగా పంటల తీరు నిర్ణయించి మార్పు తీసుకురావాలి. అవసరం మేరకు ఉత్పత్తికాని పంటలు, ఉత్పాదకాలకు సబ్సిడీలు అందజేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసి అవసరానికి మించి ఉన్న పంటలకి ప్రోత్సాహకాలు తప్పించాలి. ఉదాహరణకి పొగాకు ఉత్పత్తి, రవాణా, ఆర్థిక, మార్కెటింగ్ సౌకర్యాల అభివృద్ధిని పెంచి, వ్యవసాయ సంబంధమైన పరిశ్రమల్ని వారి వ్యవసాయ క్షేత్రాలకు దగ్గరలో స్థాపించి పంటల మార్పిడికి కృషి చేయాలి.
ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరచిన నేపథ్యంలో వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సి ఉంది. వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం కాబట్టి మౌలిక సదుపాయాల కల్పనకి అవి బాధ్యత వహించాలి. ఈ రంగంలో ఉత్పత్తి, అనంతర కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి.)లో దాదాపు మూడింట ఒక వంతు వాటా వ్యవసాయ రంగానిదే కాబట్టి 9వ ప్రణాళికలో లక్ష్య సాధనకు, హరిత విప్లవాన్ని తీసుకుపోవడానికి పెద్దమొత్తంలో పెట్టుబడులు అవసరం.
- ఆంధ్రభూమి డైలీ, 13 జూన్ 1997

Tuesday, May 13, 2014

Sindhooram (1997) Movie Review

సినిమా సమీక్ష: సిందూరం

తారాగణం: బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి, పరుచూరి వెంకటేశ్వరరావు, భానుచందర్, అన్నపూర్ణ
బేనర్: ఆంధ్రా టాకీస్
దర్శకత్వం: కృష్ణవంశీ

రొటీన్ సినిమాలకి భిన్నంగా అప్పుడప్పుడు కొన్ని దర్శకుడి సినిమాలు వస్తుంటాయి. నటీనటులెవరనే దానికంటే దర్శకుని పేరునిబట్టే ప్రేక్షకులు ఆ సినిమాల్ని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఆ కోవకి చెందిందే 'సిందూరం'. దానికి దర్శకుడు కృష్ణవంశీ కావడమే జనం ఆసక్తికి కారణం. ఒక ప్రేమ కథాచిత్రం, ఒక కుటుంబ కథాచిత్రం తర్వాత కృష్ణవంశీ తన దృష్టిని ఈ వ్యవస్థ మీదికి మళ్లించాడు. ఒక గంభీరమైన ఇత్రివృత్తాన్ని తనదైన టేకింగ్‌తో ఆద్యంతం పట్టుసడలని రీతిలో తెరకెక్కించాడు. ఐతే అడుగడుగునా సెన్సార్ తన కత్తెరకి పదునుపెట్టిన ఛాయలు కనిపించడం ఇబ్బందికరం.
గొప్ప పోలీసాఫీసర్ కావాలనే లక్ష్యంతో బుల్లిరాజు పోలీస్ ట్రైనింగ్‌కి వెళ్తాడు. ట్రైనింగ్ పూర్తయి తన గ్రామానికి వచ్చిన బుల్లిరాజుకి బంధువులు, స్నేహితులు ఘన స్వాగతం పలుకుతారు. అయితే గ్రామంలో జరుగుతున్న అరాచకాల్నీ, దౌర్జన్యాల్నీ చూసి అతను కలత చెందుతాడు. అక్కడి ఎస్ఐ దురాగతాల్ని చూసి సహించలేక ఎదురు తిరగడానికి యత్నిస్తాడు. మరోపక్క నక్సలైట్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మందుపాతర్లతో పోలీసుల్ని చంపుతుంటారు. చిన్న రైతుల్ని హింసిస్తున్న భూస్వామిని చావబాదుతుంటారు. నక్సలైట్లని అసహ్యించుకుంటాడు బుల్లిరాజు. అతడి మేనకోడలు బేబి తన మావయ్య అయిన బుల్లిరాజునే పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. చదువు సంధ్యలు లేకుండా అల్లరి చిల్లరిగా జల్సారాయుడిగా తిరిగే చంటి ఆమెని అల్లరి పెడుతుంటాడు. లక్ష్మి అనే యువతిని అల్లరి చేస్తున్న ముగ్గురు పోకిరీ రాయుళ్లని చంటి ఎదుర్కోవడం చూసి బుల్లిరాజు అతడికి సాయం వెళ్లి వాళ్లని చితగ్గొట్తాడు. చిత్రంగా ఎస్ఐ పోకిరీ రాయుళ్ల కొమ్ముకాయడం చూసి సహించలేక తిరగబట్తాడు. అతడి స్నేహితుడు బైరాగి అతణ్ని శాంతపరచి ఎస్ఐని బతిమాలుతాడు.
మారువేషంలో స్టేషన్‌లోనే ఉండి ఇదంతా గమనిస్తుంటాడు తీవ్రవాద నాయకుడు. బుల్లిరాజు వాళ్లు వెళ్లిపోయాక పోలీస్‌స్టేషన్‌ని పేల్చివేస్తారు తీవ్రవాదులు. ఐతే ఎస్ఐ తప్పించుకుంటాడు. పగబట్టిన ఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం ఉన్న బుల్లిరాజు మిత్రుడు సత్తిపండుని బలవంతంగా తీసుకుపోతుంటే బోగిపండగ సంబరాల్లో ఉన్న బుల్లిరాజు అడ్డుకోబోతాడు. అతన్ని కూడా లాక్కుపోతారు పోలీసులు. బుల్లిరాజు కళ్ళముందే సత్తిపండుని కాల్చి చంపుతాడు ఎస్ఐ. తట్టుకోలేకపోయిన బుల్లిరాజు ఎస్ఐతో కలపడతాడు. పెనుగులాటలో ఎస్ఐ చేతిలోని రివాల్వర్ పేలి అతనే చనిపోతాడు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతాడు బుల్లిరాజు. తీవ్రవాదులు అతనికి ఆశ్రయమిస్తారు. అక్కడ బైరాగిని చూసి ఆశ్చర్యపోతాడు. మరుసటిరోజు తనకి తీవ్రవాదం అంటే నచ్చదని అందుకని వెళ్లిపోతున్నానని బయలుదేరుతుంటే తీవ్రవాదుల నాయకుడు అతనికి ఒక దినపత్రికనిస్తాడు. 'ఎస్ఐ కాల్చివేత - పోలీసు ముసుగులో టెర్రరిస్టు ఘాతుకం' అనే శీర్షికతో బుల్లిరాజు ఫొటోతో పెద్ద వార్త అచ్చయి ఉంటుంది. షాకవుతాడు బుల్లిరాజు. భవిష్యత్తు అగమ్యగోచరంగా తోస్తుంది. బేబి విషయంలో అనుక్షణం బుల్లిరాజుతో గొడవపడుతూ చివరికి మారిపోయిన చంటి అతన్ని వెతుక్కుంటూ వచ్చినవాళ్లతో కలుస్తాడు. గతంలో చంటి, బుల్లిరాజు చేతుల్లో తన్నులుతిన్న ముగ్గురు పోకిరీరాయుళ్లు లక్ష్మిపై అత్యాచారం చేస్తారు. ఉద్రేకం కట్టలు తెంచుకున్న బుల్లిరాజు వాళ్ల ముగ్గిర్నీ జనం మధ్య పట్టుకొని లక్ష్మిచేత చావగొట్టిస్తాడు. ఆ పోకిరీలని తీవ్రవాదులు చంపేస్తారు. ఎస్ఐ చావుని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ అధికారులు ఆ విషయమై బుల్లిరాజుని పట్టుకునేందుకు, తీవ్రవాదుల్ని అణచివేసేందుకు స్పెషల్ ఆఫీసర్‌ని నియమిస్తారు. అతను పోలీస్ అకాడమీలో బుల్లిరాజుకి శిక్షణనిచ్చిన పోలీసాఫీసరే. స్పెషల్ ఆఫీసర్ తీవ్రవాదుల కోసం, బుల్లిరాజు కోసం వేట మొదలుపెడతాడు.

పోలీసులతో జరిగిన ఘర్షణలో తీవ్రవాద నాయకుడు మరణిస్తాడు. బైరాగి పోలీసుల చేతికి చిక్కి, చిత్రహింసలకి గురవుతాడు. మావయ్యని వెతుక్కుంటూ వస్తుంది బేబి. ఆమెని తండ్రి కుదిర్చిన సంబంధం చేసుకొమ్మని, తనని మరిచిపొమ్మని చెబుతాడు బుల్లిరాజు. విషంతాగి పెళ్లి మండపంలోనే చనిపోతుంది బేబి. బైరాగిని విడిపించుకునే క్రమంలో రాష్ట్ర మంత్రి చలపతిరావుని బుల్లిరాజు కిడ్నాప్ చేస్తాడు. తీవ్రవాదుల ఒత్తిడికి లొంగమని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. పోలీసులతో ఘర్షణల్లో ఒక్కొక్క అనుచరుడే మరణిస్తుంటే బుల్లిరాజు వ్యధ చెందుతాడు. లక్ష్మిని కూడా పోలీసులు కాల్చివేస్తారు. ఇది సహించలేని చంటి బాంబు విసిరి ఓ పోలీస్ వ్యాన్‌ని ధ్వంసం చేస్తాడు. పోలీసుల నుంచి చంటిని రక్షించాలనే ఆదుర్దాలో పోలీసు తుపాకీ గుళ్లకి బలవుతాడు బుల్లిరాజు. ఇదిచూసి మిగతా అనుచరులు రాష్ట్ర మంత్రితో అడవుల్లోకి పారిపోతారు. స్పెషలాఫీసర్ నిస్సహాయంగా చూస్తుండిపోతాడు. ఆఖరున ఈ మారణహోమానికి అంతం ఎక్కడ? ఎప్పుడు? అని దర్శకుడు ప్రశ్నిస్తాడు. అవును. దానికి అంతం లేదు. ఈ వ్యవస్థ ఇప్పుడున్న మాదిరిగానే ఉంటే మారణహోమం కొనసాగుతూనే ఉంటుంది.
ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నది స్పష్టం. వ్యవస్థ మీద కోపంతో తీవ్రవాదులుగా మారిన యువకుల జీవితాలు ఎలా పరిసమాప్తి అవుతున్నాయో, వ్యవస్థ మీద కసితో పొట్టకోసం ఉద్యోగం చేస్తున్న సాధారణ పోలీసుల్ని ఎట్లా చంపివేస్తున్నారో, పోలీసులు రాజకీయ నాయకులకి, డబ్బున్న వాళ్లకి ఎట్లా తొత్తులుగా మారుతున్నారో, రాజకీయ నాయకులు పోలీసుల్ని తమ స్వార్థం కోసం ఎట్లా వాడుకుంటున్నారో, వాళ్ల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో కళ్లకి కట్టించాడు దర్శకుడు. అడుగడుక్కీ ఈ వ్యవస్థ మీద సంధించిన బాణాల్లాంటి సంభాషణలు అగుపిస్తాయి. ఐతే అనేక సన్నివేశాల్లో కొన్ని డైలాగులకి సెన్సార్ కత్తెర వేసి, తానున్నది కత్తిరించడానికే అని రుజువు చేసుకుంది. ప్రేక్షకుడికి మాత్రం ఇది కాస్త విసుగు తెప్పిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల ఒక సన్నివేశం పూర్తికాకముందే మరో సన్నివేశం రావడం తికమక కలిగిస్తుంది.
బుల్లిరాజుగా బ్రహ్మాజీ చాలా బాగా చేశాడు. ఇంతదాకా చిన్న చిన్న పాత్రలకే పరిమితమవుతూ వచ్చిన బ్రహ్మాజీకి ఈ సినిమా మంచి బ్రేక్‌నిస్తుంది. ఉద్రేకం, ఉద్వేగం ప్రదర్శించే సన్నివేశాల్లో అతను సరిగ్గా అతికిపోయాడు. చంటిగా రవితేజ చాలా ఈజ్‌తో చేశాడు. నృత్యాలు చలాకీగా చేశాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పవచ్చు. బేబి పాత్రలో సంఘవి అమాయకంగా, చురుగ్గా, అందంగా కనిపించింది. పాటల్లో శృంగారం ఒలికించింది. ఆమె పాత్ర పరిధి మరింత పెంచితే బాగుండేదనిపించింది. బైరాగిగా పరుచూరి వెంకటేశ్వరరావు ఆ పాత్రని పండించాడు. స్పెషల్ ఆఫీసర్‌గా ప్రత్యేక పాత్రలో భానుచందర్, బ్రహ్మాజీకి తల్లిగా అన్నపూర్ణ నటించారు. చిత్రంలో చెప్పతగ్గవి సంభాషణలు, దర్శకుడి ప్రతిభా. కె.ఎన్.వై. పతంజలి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. పాటల చిత్రీకరణ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. శ్రీనివాస చక్రవర్తి సంగీతం పాటలకంటే బ్యాక్‌గ్రౌండ్‌కి వినిపించిందే బాగుంది. భూపతి సినిమాటోగ్రఫీ సినిమాకి ఎస్సెట్. కృష్ణవంశీ టేస్ట్‌కి తగిన పనితనం అతని కెమెరాలో కనిపించింది. సినిమా విజయం సాధించినా, కాకపోయినా 'సిందూరం'ని ఒక సృజనాత్మక దర్శకుడి నుంచి వచ్చిన మంచి చిత్రంగానే చెప్పుకోవాలి.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 19 సెప్టెంబర్ 1997