తెలుగునాట సంచలన రచయిత గుడిపాటి వెంకటాచలం కథను అందించిన 'మాలపిల్ల' చిత్రాన్ని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుకు అంకితమిచ్చారు. అప్పటిదాకా గ్రాంథిక భాషలో సాగిన సినిమా రచన ఈ సినిమాతో వ్యవహారిక భాషలోకి మారి, కొత్త మలుపుకు కారణమయ్యింది. ఈ సినిమాతో తెలుగులో తొలి స్టార్ హీరోయిన్‌గా అవతరించింది. నటునిగా డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావుకు ఇది తొలి చిత్రం.
కథాంశం: సవర్ణుల అనాదరణకి హరిజనుల హృదయాలు అవమాన భారంతో కుంగిపోతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా దేవాలయ ప్రవేశానికి హరిజనులు వెళ్తారు. కరడుగట్టిన సనాతనుడైన ఆ గుడి ధర్మకర్త సుందర రామశాస్త్రి వారిని అడ్డుకున్నాడు. బి.ఏ. చదువుకుంటున్న ఆయన కొడుకు నాగరాజు మాలపిల్ల అయిన శంపాలతను తొలిచూపులోనే ప్రేమించాడు. ఆమె కూడా అతణ్ణి వలచింది. శంపాలతని పెళ్లాడాలని నాగరాజు నిశ్చయించుకున్నాడు. బ్రాహ్మలూ, కమ్మవారూ చేస్తున్న దాష్టీకాన్ని తట్టుకోలేక గత్యంతరం లేక హరిజనులు పనుల్లోకి పోకుండా సమ్మె చేశారు. కమ్మవాళ్లూ, రైతులూ తమ అన్యాయాన్ని గుర్తిస్తారు. బ్రాహ్మలలో కలవరం బయలుదేరుతుంది. సుందరరామశాస్త్రి ఒప్పుకోడు. ఊళ్లోని ఒక్క చెరువూ కట్టేస్తాడు. నీళ్లులేక మాలగూడెం అల్లాడుతుంది. శంపాలత, నాగరాజు మధ్య ప్రేమ బయట పడటంతో శంపని మాలగూడెం కట్టుదిట్టం చేస్తుంది.
గ్రామదేవత కొలుపుల సందర్భంగా హరిజనులంతా తాగి తందనాలాడుతుంటే నాగరాజూ, శంపాలతా, ఆమె స్నేహితురాలు అనసూయా కలకత్తాకి పారిపోయారు. ఇది నాగరాజు పనేనని హరిజనులు సుందర రామశాస్త్రి ఇంటిమీద పడతారు. రామశాస్త్రి మనసు మారడం మొదలవుతుంది. కలకత్తాలో పరిచయమైన బోసుబాబు ఫ్యాక్టరీలో నాగరాజు జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకుంటాడు. ఇక్కడ ఇటు శంప ఇంట్లో, అటు నాగరాజు ఇంట్లో విచారానికి అంతం ఉండదు. ఏడుస్తూ శాస్త్రి భార్య సోమిదేవమ్మ కిరసనాయిలు బుడ్డి తిరగదోయడంతో ఇంటికి నిప్పంటుకుంటుంది. బ్రాహ్మలు ఎవరిల్లు వారు చూసుకుంటుంటే మాలలు తమ ప్రాణాలకు తెగించి శాస్త్రినీ, ఆయన భార్యనూ మంటల బారినుంచి రక్షిస్తారు. అప్పటికి మాలలు కూడా మనుషులేనని బోధపడుతుంది శాస్త్రికి. ఆ తర్వాత శంపాలత, నాగరాజు జీవితాలు ఏమయ్యాయనేది పతాక సన్నివేశం.
తారాగణం: గోవిందరాజుల సుబ్బారావు (సుందర రామశాస్త్రి), కాంచనమాల (శంపాలత), వెంకటేశ్వరరావు (నాగరాజు), సుందరమ్మ (అనసూయ), సూరిబాబు (చౌదరయ్య), వెంకటసుబ్బయ్య (మల్లికార్జున శర్మ), రాఘవన్ (మునెయ్య), హేమలతాదేవి (రాధాబాయమ్మ), గంగారత్నం, లక్ష్మీకాంతం
కథ: గుడిపాటి వెంకటాచలం
మాటలు: తాపీ ధర్మారావు
పాటలు: బసవరాజు అప్పారావు
సంగీతం: భీమవరపు నరసింహారావు
సినిమాటోగ్రఫీ: శైలేన్ బోస్
స్టిల్స్: సత్యం
నిర్మాతలు: చల్లపల్లి మహారాజా, గూడవల్లి రామబ్రహ్మం, యార్లగడ్డ శివరామప్రసాద్
దర్శకుడు: గూడవల్లి రామబ్రహ్మం
బేనర్: శ్రీ సారథి స్టూడియోస్
విడుదల తేది: 25 సెప్టెంబర్
No comments:
Post a Comment