సింహా కంటే ఎక్కువ ఎమోషనల్‌గా దమ్ము తీశా
'దమ్ము' ఎలా వచ్చింది? మీ అంచనాలేమిటి?
నా అంచనాలు కాదు. గ్యారంటీగా ఓ మంచి సినిమా చెయ్యాలి అని ఓ మంచి ప్రయత్నం చేశాను. ఎందుకంటే బాలయ్యతో చేసిన 'సింహా' తర్వాత చేసిన సినిమా. అదీ ఓ నందమూరి హీరో నుంచి ఇంకో నందమూరి హీరోతో చేసిన సినిమా. కాబట్టి ఎనర్జిటిక్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేప్పుడు కచ్చితంగా వంద శాతం ప్రిపేర్ అయే దిగుంటా. అందువల్ల ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే ఉంటుంది సినిమా.
చాలా కాలం తర్వాత బాలకృష్ణకు 'సింహా' రూపంలో హిట్టిచ్చిన దర్శకుడిగా మీమీద అంచనాలు మామూలుగా లేవు. పైగా ఇప్పటివరకు మీరన్నీ హిట్లే ఇచ్చారు. ఆ బరువుని ఎలా మోశారు?
నేను 'సింహా'లో ఏం చేశానో చూశారు. మొదట్నించీ నేను కొన్ని ఎమోషన్స్ పట్టుకుంటాను. వాటి మీద కథ నడుపుకుంటూ వస్తాను. అలాగే 'దమ్ము'ని కూడా కొన్ని ఎమోషన్స్ ప్రధానంగా నడిపా. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్. 'సింహా' కంటే ఏ కోశానా ఎమోషన్స్‌ని తగ్గించడానికి ప్రయత్నించలా. ఇంకా ఓ పది శాతమన్నా ఎక్కువ ఎమోషనల్‌గా 'దమ్ము' తీశా. గట్టి నమ్మకంతో చెబుతున్నా, ప్రేక్షకుడు ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో, దాన్ని మించే ఈ సినిమా ఉంటుంది. రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుంది. చూడండి. అవునో కాదో నాకు చెప్పండి. 'ఎన్టీఆర్ అంటే మాస్ హీరో. యాక్షన్ బాగా చేస్తాడు. డాన్సులు బాగా చేస్తాడు. కమర్షియల్‌గా ఉంటుంది' అనుకోవద్దు. తప్పకుండా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు. 'సింహా'లో బాలయ్యని ఎలా చూశారో, అలాగే 'దమ్ము'లో తారక్‌లోని ఓ కొత్త కోణాన్ని చూస్తారు.
ఎన్టీఆర్‌కి హైవోల్టేజ్ పర్ఫార్మర్ అనీ, రౌద్ర, వీర రసాల్ని బాగా పోషిస్తారనే పేరుంది. అయితే 'సింహాద్రి' తర్వాత అంత హై వోల్టేజ్ సినిమా ఆయన నుంచి రాలేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో 'దమ్ము' ఏ స్థాయి సినిమా అవుతుందని అనుకుంటున్నారు?
ఏ స్థాయి సినిమా అవుతుందో నేను చెప్పలేను గానీ, ఓ మంచి సినిమా తీయడం వరకే నా బాధ్యత. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. నా ముందు 'సింహా' ఉందని నాకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఓ మంచి సినిమా తీశాను. 'సింహాద్రి' నుంచి ఎన్టీఆర్ ఏ సినిమాలైతే చేశారో, ఆ సినిమాలన్నింటినీ విశ్లేషించుకునే 'దమ్ము' తీశా. ఏ కోశానా పాత సినిమాలు ఛాయలు లేకుండా ఓ భిన్నమైన పాత్రలోనే ఆయన్ని చూపిస్తున్నా. సినిమా చూశాక 'ఎన్టీఆర్‌లో ఇలాంటి హీరో ఉన్నాడా' అని ఆశ్చర్యపోతారు.
ఎన్టీఆర్ ఎలా కనిపిస్తారు?
రాయల్‌గా కనిపిస్తారు. డిఫరెంట్ వేరియేషన్స్‌లో ఆల్‌రౌండర్‌గా కనిపిస్తారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర పేరు విజయ. ఇంకా పెద్ద పేరు గానీ, అందరూ 'విజయ' అనే చిన్నపేరుతో పిలుస్తుంటారు. 'అందరూ బావుండాలి. ఆ అందరిలో నేనుండాలి' అనేటటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సమాజానికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు కానీ, చెడు చేయకూడదని నమ్మే వ్యక్తి. ఎవరైనా చెడు చేస్తే వెంటనే స్పందించే వ్యక్తి. ఇందులో నగర, గ్రామీణ నేపథ్యాలు రెండూ ఉంటాయి.
హైలైట్స్ ఏమని చెప్పుకోవచ్చు?
ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ హైలైట్. ఆయన నటన ఎలా ఉంటుందో ఓ దర్శకుడిగా నేను చూపించిన 'దమ్ము' ఇది. నన్ను నమ్మండి, చూడండి. కీరవాణి మ్యూజిక్ ఎలా ఉంటుందో ఇప్పటికే మీ ముందుకు వచ్చింది. సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందో, డైలాగ్స్ ఎలా ఉంటాయో, ఫైట్స్ ఎలా ఉంటాయో, నా డైరెక్షన్ ఎలా ఉంటుందో ఇప్పటికే ట్రైలర్స్‌లో చూపించాను. అన్ని శాఖల పనితనాన్ని చూపిస్తూ ఓ ట్రైలర్ ద్వారా మీ ముందుకు వదిలాను. అందులో ఓ పది నుంచి ఇరవై శాతం మాత్రమే చూపించా. మిగతా 80 నుంచి 90 శాతం సినిమాలో ఉంటుంది.
ఇద్దరు హీరోయిన్ల గురించి చెప్పండి.
త్రిష, కార్తీక మాత్రమే కాదు, ఇంకో ఇద్దరున్నారు. 'వాస్తు బాగుందే' పాటలో వాళ్లిద్దరు ఎంటరవుతారు. రచనా మౌర్య, మరియం జకారియా. వాళ్లకీ కథలో భాగముంది. విలన్ల విషయానికొస్తే... మెయిన్ విలన్‌గా నాజర్ కనిపిస్తే, సంపత్, కిశోర్, శ్రీధర్‌రెడ్డి వంటివాళ్లు మిగతా విలన్లుగా చేశారు.
నిర్మాణ విలువలు ఎలా ఉంటాయి?
ఈ సినిమాని కె.ఎస్. రామారావుగారి లాంటివాళ్లే చేయగలుగుతారు. వేరే వాళ్లు చేయలేరు. ఎందుకంటే హై బడ్జెట్ సినిమా. అందువల్ల దీన్ని ఎవరుపడితే వాళ్లు, ఎలా పడితే అలా చేయలేరు. కె.ఎస్. రామారావు గారి వల్లే 'దమ్ము'కి ఈ స్థాయి వచ్చింది.
-ఆంధ్రజ్యోతి డైలీ (25 ఏప్రిల్, 2012)
No comments:
Post a Comment