Tuesday, January 31, 2012

తెలుగువాళ్లు ఎలా విడిపోయారు?

ముస్లిం పాలకులైన అసఫ్‌జాహీల ఏలుబడిలోని తెలుగు ప్రాంతాల్ని తెలంగాణా అన్నారు. అంటే తెలుగువాళ్లు ఉండే ప్రాంతమని. అప్పుడు ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ అంతా తెలంగాణాయే. ఫ్రెంచి వారి రుణం తీర్చుకోవడం కోసం అసఫ్ జాహీ రాజు సలాబత్ జంగ్ 1753లో తెలంగాణాలోని 1. ముస్తఫానగర్, 2. రాజమహేంద్రవరం (రాజమండ్రి), 3. శ్రీకాకుళం జిల్లాలను ఫ్రెంచివాళ్లకు అప్పగించాడు.
అదే సలాబత్ తన రక్షణ కోసమని ఇంగ్లీష్ వాళ్లకు 1759లో తెలంగాణాలోని 1. నిజాంపట్నం, 2. మచిలీపట్నం, 3. కొండవీడు, 4. వల్కమనేరు అప్పగించాడు. ఫ్రెంచివాళ్లకు, బ్రిటీషువాళ్లకు సర్కారు (ప్రభుత్వం) నుంచి వచ్చిన జిల్లాలు కావటాన అవి సర్కారు జిల్లాలు అయ్యాయి.
బ్రిటీషువాళ్లు 1762లో సలాబత్‌ను గద్దె దించి నిజాం ఆలీని గద్దెనెక్కించారు. మహారాష్ట్రులు నిజాం అలీమీద దండెత్తి అతన్ని ఓడించినప్పుడు అతన్ని రక్షిస్తామన్నారు బ్రిటీషువాళ్లు. రక్షణ కోసం సైన్యాన్ని నియమించేందుకయ్యే ఖర్చుల కింద ఒప్పందం ప్రకారం 1800 సంవత్సరంలో 1. కంభం, 2. కర్నూలు, 3. ఆదోని, 4. రాయదుర్గ, 5. గుత్తి, 6. కడప, 7. గుర్రంకొండ, 8. బంగనపల్లి, 9. అనంతపురం, 10. బళ్లారి, 11. మదనపల్లి, 12. వాయల్పాడు జిల్లాల్ని బ్రిటీషువాళ్లకి ధారాదత్తం చేశాడు నిజాం అలీ. నిజాం వాటిని బ్రిటీషువాళ్లకి దత్తం చేసినందున వాటికి దత్త మండలాలు అనే పేరు వచ్చింది.
ఆ తర్వాత నిజాం రాజ్యంలో మిగిలిన తెలుగుప్రాంతం తెలంగాణాగా మిగిలిపోయింది. అంటే 250 ఏళ్ల క్రితం వరకు తెలుగువాళ్లంతా కలిసే ఉన్నారు.

No comments: