Thursday, January 12, 2012

'అధినాయకుడు'లో ఆసక్తికర అంశాలు!

బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్న 'అధినాయకుడు' సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది. పరుచూరి మురళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఎం.ఎల్. కుమార్‌చౌదరి నిర్మిస్తున్నారు. నాలుగు రోజుల ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో బాలకృష్ణ తాత, తండ్రి, మనవడిగా మూడు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ముగ్గురి సరసన ఎవరెవరు నటిస్తున్నారనే సంగతి వెల్లడైంది. 
తాత సరసన జయసుధ, మనవడి సరసన లక్ష్మీరాయ్ నటిస్తున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. మరి మధ్యలో తండ్రి సరసన ఎవరు చేసినట్లు? ఆ పాత్రని తమిళ నటి సుకన్య పోషించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా కథానుసారం ఈ మూడు పాత్రలు ఒకేసారి తెరపై కనిపించవు. కారణం మనవడు పుట్టిన రెండేళ్లకే తాత పాత్రధారి మరణిస్తాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఆ పాత్రపై కర్నూలులో 40 వేలమంది జనం మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్ అవుతాయని అంటున్నారు.
కాగా ఈ సినిమాలో బాలకృష్ణకు ఏక కాలంలో భార్యగా, తల్లిగా, నాయనమ్మగా తొలిసారి జయసుధ కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే మనవడి పాత్రధారి జయసుధను ఎక్కడా 'నాయనమ్మా' అని పిలవకుండా స్క్రిప్టులో జాగ్రత్తపడ్డారు. పోతే ఈ సినిమాలో సలోని కూడా నటిస్తోంది. ఆమెది ఓ సీనులో, మరో పాటలో మాత్రమే కనిపించే గెస్ట్ రోల్.

No comments: