Saturday, June 27, 2015
Tuesday, June 23, 2015
Saturday, June 13, 2015
Sunday, May 31, 2015
Pandaga Chesko (2015) Movie Review
తెలుగు సినిమా ఎదగడం లేదని ఎంత మొత్తుకుంటే ఏం లాభం? జాతీయ సినిమా యవనికపై తెలుగు సినిమా స్థాయి ఇంతగా దిగజారిపోతోందనే ఆవేదన పట్టేదెవరకి? అవే మూస కథలు, అవే మూస పాత్రలు, అవే మూస సన్నివేశాలు తెరపై దాడిచేస్తుంటే తట్టుకోలేక తలలు పట్టుకొని, తిట్టుకుంటూ హాలు బయటకు వచ్చే సగటు ప్రేక్షకుణ్ణడిగినా చెబుతున్నాడు - ‘ఎన్ని సినిమాలని చూస్తామండీ. అవే సీన్లు, అవే డైలాగులు. కొత్తగా ఒక్క సీనన్నా లేదండీ’ అని. అందుకు అసలు సిసలు ఉదాహరణగా వచ్చింది ‘పండగ చేస్కో’. ఈ సినిమా చూసినవాళ్లలో ఎవరు పండగ చేసుకున్నారో తెలీదు కానీ, దీనికి పెట్టిన ప్రతి పైసా ‘దండగ’ అనేవాళ్లే ఎక్కువ. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారబ్బా! అనే ఆశ్చర్యం కలిగితే తప్పేమీ లేదు. ఎందుకంటే ఇది ఫక్తు ‘ఎ’ టైపు సినిమా. తెరమీద 70 శాతం సన్నివేశాలకు మించి ‘కామ’ రసం ప్రవహిస్తూనే ఉంటుంది మరి! చాలా పాత్రలు ‘కామం’తో దహించుకుపోతూ కనిపిస్తుంటాయి. హీరో సహా చాలామంది డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు డైలాగులతో ‘రచ్చ రచ్చ’ చేసేస్తుంటారు. ఒకట్రెండు డైలాగులని సెన్సార్ వాళ్లు ‘మ్యూట్’ చేసినా, ఎక్కువ శాతం బూతుల్ని అలాగే ఉంచేశారు.
ఈ దండగమారి సినిమా చూస్తున్నంత సేపూ అనేక తెలుగు సినిమాల సన్నివేశాలు, పాత్రలు మన మనసులో మెదులుతుంటాయి. ఒకట్రెండు సినిమాల పేర్లయితే ప్రస్తావించవచ్చు. తెలుగులో విడుదలయ్యే ప్రతి నాలుగు ‘కమర్షియల్ ఎంటర్టైనర్స్’లో మూడు సినిమాలు ఇదే తరహాలో ఉంటున్నవే. ఈ సినిమా ఇతివృత్తం చెబితే నిజమేనని ఎవరైనా తలాడిస్తారు. పోర్చుగల్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి యజమాని అయిన కార్తీక్ పోతినేని (రామ్)ది పూర్తిగా బిజినెస్ మైండ్. అలాంటి మైండ్‌సెట్టే ఉన్న అనుష్క (సోనాల్ చౌహాన్) అనే ఇంకో వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా నిశ్చితార్థం కూడా చేసుకుంటాడు. కానీ పాతికేళ్ల క్రితం పుట్టింటితో వేరుపడిన తల్లి (పవిత్రా లోకేశ్) ఫ్లాష్‌బ్యాక్ తెలిసి హైదరాబాద్‌కు వస్తాడు. తనెవరో చెప్పకుండా మేనమామ (సంపత్) ఇంట్లోనే ఉండి, ఆయన కూతురైన దివ్య (రకుల్‌ప్రీత్ సింగ్)తో పెళ్లికి ఆమోదం పొందుతాడు. చివరకు విడిపోయిన అన్నా చెల్లెళ్లను కలుపుతాడు. ఇది చదివాక వెంటనే గుర్తొచ్చే సినిమా ‘అత్తారింటికి దారేది’. అందులో హీరో పవన్‌కల్యాణ్ తనెవరో చెప్పకుండా మేనత్త ఇంటికి వస్తాడు. ఇందులో హీరో రామ్ మేనమామ ఇంటికి వస్తాడు. అంతే తేడా. అంటే ఈ సినిమాకు ‘పండగ చేస్కో’ అని కాకుండా ‘మామగారింటికి దారేది’ అని పెట్టినా సరిపోతుంది. ఇక ఎప్పట్లాగే హీరోకీ, హీరోయిన్ ఫ్యామిలీకీ మధ్య ‘దాగుడుమూతలాట’ షురూ. ఈ మధ్య కాలంలో ఈ తరహా దాగుడుమూతలు లేని సినిమాలేవో వేళ్లమీద లెక్కించవచ్చు. అదనంగా ఇందులో ఇంకో పాత్రని ప్రవేశపెట్టారు. అది సాయిరెడ్డి (సాయికుమార్) పాత్ర. ఈ పాత్ర క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌కు బాగా పనికొచ్చింది. చివరలో సెంటిమెంట్ రసం పావుగంట సేపు ప్రవహించేసరికి కళ్లలో నీళ్ల బదులు రక్తం కారుతుందంతే! ఈ సినిమాకి సంబంధించి ‘గట్టి’గా చెప్పుకోవాల్సింది నాలుగు డోసులెక్కువగా ఉండే ‘కామ’ రసం గురించే. అనుష్క అనే కేరక్టర్‌ని చూసినప్పుడల్లా ‘వీకెండ్ వెంకట్రావు’ (బ్రహ్మానందం) ఒళ్లు చిమచిమలాడిపోతూ ఉంటుంది. ఓసారి అతణ్ణి చూసి కార్తీక్ అననే అంటాడు - ‘ఏంటండీ కళ్లల్లో కామరసం అలా కారిపోతోంది’ అని. అంటే అనుష్క కనిపించిందంటే చాలు, వెంకట్రావు కళ్లతోటే ఆమె అందాన్ని ‘జుర్రేసుకుంటూ’ (ఈ పదం వాడినందుకు క్షమించాలి) ఉంటాడు. ప్రతిసారీ అతడి కళ్లు కామరసాన్ని కార్చేస్తుంటే కుటుంబ ప్రేక్షకులు ఆ జుగుప్సను భరించలేక ఎంత ఇబ్బందిగా కుర్చీల్లో కదులుతుంటారో ఊహించుకోవాల్సిందే. వెంకట్రావు ఒక్కడే అలా ప్రవర్తిస్తున్నాడనుకునేరు. హీరోయిన్ ముగ్గురు బాబాయిలు (రఘుబాబు, బ్రహ్మాజీ, శ్రవణ్) ఇరవై ఏళ్ల నుంచీ భార్యలకు దూరంగా ఉండాల్సి వచ్చి, ఆ తర్వాత ఒకసారి వాళ్లు తమ వచ్చేసరికి ‘తట్టుకోలేక’, కామ (‘శృంగారం’ కాదు) పీడితులైన పురుషుల్లాగా, వాళ్లమీద పడిపోతూ ఉంటారు. వాళ్ల హావభావాలు, మాటలు ఎంత ‘పచ్చి’గా ఉంటాయో చెప్పలేం, ‘ఇంగితం’ అనేది ఒకటి మనలో ఇంకా ఉంది కాబట్టి.
స్త్రీ పాత్రలపై చిన్నచూపు
దర్శకుడికి స్త్రీల పట్ల సదవగాహన లేదోమో అనిపిస్తుంటుంది, సినిమా చూస్తున్నంత సేపూ. సోనాల్ చౌహాన్ చేసిన అనుష్క పాత్రను డబ్బు యావ తప్ప మానవత్వం ఏమిటో తెలీని ఓ మృగం తరహాలో చిత్రీకరించాడు. హీరో కార్తీక్‌ను పెళ్లాడాలనుకున్న ఆమె చివరకు రూ. 3 వేల కోట్ల కోసం పక్కా రౌడీ అయిన అభిమన్యుసింగ్ను పెళ్లాడటం ఎంత ఫూలిష్‌గా ఉంటుందో! బద్ధ శత్రువుల్లాగా ఉండే తండ్రినీ, మావయ్యనీ కలపాలనే ఉద్దేశంతో వాళ్లకు కనిపించకుండా అజ్ఞాతంలో ఓ ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన స్వాతి (తేజస్విని) ఇంట్లో ఉండే హీరోయిన్ దివ్య ‘గ్రీన్ ఆర్మీ’ పేరుతో ఉద్యమాన్నే నడపడం చూసి ముక్కుమీదే కాదు, ‘ఇంకెక్కడైనా’ వేలు పెట్టేసుకోవచ్చు. ఛ.. ఈ దండగ సినిమా చూశాక మనక్కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తున్నాయ్ బాబోయ్. మొక్కల కోసం, పచ్చదనం కోసం దివ్య చేసే ఉద్యమాన్ని టీవీలు ప్రసారం చేస్తున్నా, ఆమె ఎక్కడుందో పాపం.. వాళ్ల నాన్నకూ, మావయ్యకూ తెలీదు. చిత్రమేమంటే స్వాతి ఇంట్లో ఉన్నంత సేపే ‘గ్రీన్ ఆర్మీ’ ఉద్యమాన్ని నడుపుతుంది దివ్య. తమ ఇంటికి వచ్చేస్తే ఆ ‘గ్రీన్’ సంగతి మచ్చుకి కూడా ఆమెకు జ్ఞాపకముండదు. ఇక ఆమె చేసే ఉద్యమమంటే మన హీరోకు ఎంత చులకనో! మొక్కలనూ, పిచుకలనూ ఎంత తక్కువచేసి మాట్లాడుతుంటాడో! ఇక దివ్య ఫ్రెండ్ స్వాతి పాత్రను దర్శకులు మలిచిన తీరు మరీ ఘోరం. ఎవరికి పడితే వాళ్లకు పడిపోతుందని ఆమెని ప్రేమించిన కొండయ్య (వెన్నెల కిశోర్) మాత్రమే కాదు, ఆమెను కన్న తండ్రి ఎమ్మెస్ నారాయణా తెగ బాధపడితుంటారు. ఆమెను ఒంటరిగా వదిలేస్తే కష్టమని డైరెక్టుగానే చెప్పేస్తుంటారు. సినిమా మొదట్లో హీరోకు ఓ చెల్లెల్ని చూపించారు. మధ్యలో ఆమె పాత్ర ఉన్నదనే విషయం మర్చిపోయారు.
కార్తీక్ కేరక్టర్లో రామ్ ‘ఓవరాక్షన్’ చేసేశాడు. ‘అండరాక్టింగ్’ చేయాల్సిన చోట కూడా ‘నేను వెనక్కి తగ్గేది లేదు’ అన్నట్లుగా అతి నాటకీయత ప్రదర్శించాడు. చాలా సన్నివేశాల్లో.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఐదు నిమిషాల పైగా డైలాగులు, హావభావాల విషయంలో పవన్‌కల్యాణ్‌ను మక్కీకి మక్కీ అనుకరించేశాడు (‘అత్తారింటికి దారేది’లో రైల్వే స్టేషన్లో మేనత్త నదియా వద్ద పవన్‌కల్యాణ్ చెప్పే డైలాగులు గుర్తున్నాయి కదూ). రామ్ దెబ్బకు ఓవరాక్టింగ్కు పెట్టింది పేరైన సాయికుమార్ సైతం డౌనైపోయాడు. దివ్యగా హీరోయిన్ పాత్రలో రకుల్‌ప్రీత్ క్యూట్‌గా ఉంది. సినిమాలో కాస్త చూడబుద్ధేసిన ముఖం ఆమెదే. తన పరిధిలో ఆ పాత్రను బాగానే చేసింది. హీరోయిన్ తండ్రిగా సంపత్, మేనమామగా సాయికుమార్, హీరో తల్లిదండ్రులుగా పవిత్రా లోకేశ్, రావు రమేశ్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. సోనాల్ చౌహాన్ పాత్రనూ, ఆ పాత్రలో ఆమె అభినయాన్నీ భరించలేం. ఎమ్మెస్ నారాయణ వంటి హాస్యనటుణ్ణి డబుల్‌మీనింగ్ డైలాగుల కోసం ఉపయోగించుకోవడం బాధని కలిగిస్తుంది. ‘వీకెండ్ వెంకట్రావు’ పాత్రలో కామరసాన్ని బీభత్సంగా కురిపించేసి, ఆ పాత్రను పూర్తిగా ‘పెద్దలకు మాత్రమే’గా మార్చేశాడు బ్రహ్మానందం. కొండయ్య పాత్రలో అమాయకత్వాన్ని పండించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు వెన్నెల కిశోర్.
సాంకేతిక వర్గంలో ఎక్కువ మార్కులు పడేది సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణానికే. సినిమా ఎలా ఉన్నా ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉందంటే అది కెమెరా పనితనం వల్లే. తమన్ డప్పు సంగీతంలో కొత్తగా వినిపించిన బాణీలేమీ లేవు. పాటలు ఎంత రిచ్‌గా తీసినా, వినసొంపుగా లేవు. టైటిల్ సాంగ్ వచ్చేసరికి ప్రేక్షకులు రిలీఫ్ కోసం కుర్చీల్లోంచి లేస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ రాసిన పాచిపోయిన కథకు, కోన వెంకట్ డబుల్ మీనింగ్, ‘అడల్ట్’ డైలాగులు తోడై, ఈ సినిమాను కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉండాల్సిన సినిమాగా చేశాయ్.
ట్యాగ్‌లైన్ : డబ్బు ‘దండగ’ చేస్కో..
- ఆంధ్రజ్యోతి డైలీ, 30 మే 2015
Tuesday, May 26, 2015
Friday, May 1, 2015
Short Story: Avastha
కథ: అవస్థ
ఇంట్లో ఒక్క క్షణం కుదురుగా వుండలేకపోయింది హరిత. ఏ పనీ లేకపోయినా కొద్దిసేపు అదేపనిగా దేనికోసమో తెలీకుండా తిరిగింది అన్ని గదులకీ. పరమహంసే జ్ఞాపకం వస్తున్నాడు - ఏ వైపు చూసినా, ఏ వస్తువుని చూసినా.
తన గదిలోకి పోయి పుస్తకం ముందేసుకుంది. అక్షరాలు మాయమై హంస ముఖం ప్రత్యక్షమయ్యింది పుస్తకంలో. ఆమె అవస్థ ఎక్కువయ్యింది.
పరమహంస పది రోజుల క్రితం తల్లిదండ్రుల దగ్గరకని ఊరు వెళ్లాడు సెలవుపెట్టి. బ్యాంకులో క్లర్కుగా పనిచేస్తున్నాడు. హరిత పిన్నివాళ్లింట్లో అద్దెకుంటున్నాడు. వీళ్లింటి పక్కనే ఆ ఇల్లు. కామర్స్ చెప్పించుకుంటోంది అతని వద్ద హరిత.
మొదట్లో అతడిమీద గురుభావమే వుండేదామెకు. హంస ఒక్క కామర్స్ చెప్పి ఆగేవాడు కాదు. ఇతర సంగతులూ మాట్లాడేవాడు. కామర్స్ కంటే సైకాలజీ ఎక్కువ ఇష్టమంటాడు తనకి. "నీకు తారసపడ్డ వాళ్ల ముఖాలు పరిశీలించు. అవెన్నో కథలు చెబుతాయి. వాళ్ల మనసుల్ని విప్పుతాయి. అదే నా హాబీ" అంటాడు.
హరితకు పాలిటిక్స్ అంటే ఎలర్జీ. రాజకీయాల సంగతులేవీ పట్టవు. ఇప్పుడు మనిషి తెలుసుకోవలసింది పాలిటిక్సే అంటాడు హంస. "రాజకీయాల్లో చేరాల్సిన పనిలేదు. అవి తెలుసుకోవడం వల్ల దేశ పరిస్థితులు, లోకస్వరూపం తెలుస్తాయి" అన్చెప్పి హరిత అనాసక్తిని తుంచేశాడు.
కొద్దికాలం గడిచాక చూసుకుంటే ఆశ్చర్యంగా అనిపించింది హరితకు. హంస గురించి తనిప్పుడు ఎక్కువగా ఆలోచిస్తోంది. డిగ్రీ ఫైనలియర్ మగ స్టూడెంట్లు ఎంతోమంది తనకు 'లైన్' వేస్తుండటం చూస్తుంటే నవ్వొస్తుంటుంది. వాళ్లను అంతగా కేర్చెయ్యదు. హరితను ఆకట్టుకోడానికి ఎట్లాంటి ప్రయత్నమూ చెయ్యలేదు హంస. స్నేహంగా ఉండేవాడు. సరదాగా జోకులేసేవాడు. దురుద్దేశం ఎప్పుడూ కనిపించలేదు, అతడి చనువులో.
తనకు సంబంధించినదేదో తననుంచి దూరంగా వెళ్లిపోయినట్లు ఫీలింగ్ కలుగుతోంది - ఇప్పుడతను ఊరెళ్లాక. అప్పటికప్పుడు చూడాలనిపించింది హంసని. అతడు వెంటనే వొచ్చేస్తే బాగుండనిపించింది. ఎందుకిట్లాంటి భావాలు కలుగుతున్నాయి తనలో. తన హృదయం హంసమీదికే మళ్లుతోంది ఎందుకని? తను.. తను.. హంసని ప్రేమిస్తోందా? ప్రేమ సంగతి తలచుకోవడంతోనే పెదాలు వొణికిపోయాయి. బుగ్గలు కందిపోయాయి. సిగ్గుపడింది ఒక్కసారిగా.
అనుకోకుండా ఓ ఆలోచన మెదిలి భయం వేసిందామెకి. పెళ్లి చూపులకెళ్లాడేమోనని. చూపులకే వెళ్లుంటాడు. గవర్నమెంటు ఉద్యోగం. నెలకి నాలుగువేలు జీతం. ఇంట్లోవాళ్లు ఊరుకుంటారా. ముందీయనకి కాలు నిలుస్తుందా? ఎప్పుడెప్పుడు పెళ్లిచేసుకుందామా, పెళ్లాన్ని తెచ్చుకుందామా అని అతనికి మాత్రం ఉండదూ? ఇట్లా యోచించడంతోటే హృదయంలో బాధ సుళ్లుతిరిగింది. 'ఛ.. అందుకై ఉండదు' అని మళ్లీ సమాధానపడింది.
ఇప్పటికి పదిరోజులు గడిచిపోయాయి హంస వెళ్లి. తన లెక్క ప్రకారం ఈ రోజు రావాలి. ఆదివారం వస్తానని చెప్పాడు వెళ్లేప్పుడు. వచ్చాడో, రాలేదో ఎట్లా తెలుస్తుంది? 'వెళ్లి చూస్తే సరిపోయే' అనుకొని వెళ్లింది.
గుమ్మంలోనే ఎదురయ్యింది పిన్ని.
వెంటనే అడిగితే ఏమనుకుంటుందో అని కొద్దిసేపు అవీ ఇవీ మాట్లాడి "పిన్నీ మాస్టారుగారు రాలేదా?" అనడిగింది.
ఆమె నవ్వి "సాయంత్రం రాలేకపోతే రేపు ఉదయమే వస్తానని ఫోన్చేశాడే. ఏమిటీ పాఠాలు వెనకబడిపోతున్నాయా" అంది.
"అబ్బే అదేమీలేదు పిన్నీ" అంటూ వచ్చేసింది. సాయంత్రం దాకా ఎట్లా గడపాలో తెలీలేదు. కాలేజీ కూడా లేదు. సాయంత్రం వస్తాడో, రాడో? హరితని వియోగ బాధ దహించి వేస్తోంది. గదిలోకి వెళ్లి స్నేహితురాలి దగ్గర్నుంచి తెచ్చుకున్న చలం 'శశిరేఖ'ను ఏకబిగిన చదివేసింది. శశిరేఖ పనులు హరిత హృదయాన్ని మరింత బాధపెట్టాయి.
పెరట్లోకి వెళ్లింది. విచ్చుకొని చూస్తున్నాయి గులాబీలూ, చేమంతులూ. తాపం ఎక్కువయ్యింది వాటిని చూసేసరికి.
సినిమాకి వెళ్తే ఈ బాధ కాస్త తప్పుతుందనిపించింది. టైంపాస్ అయినట్లు కూడా ఉంటుంది కదా! అమ్మ ఒప్పుకోదు ఒక్కతే వెళ్తానంటే. మార్నిగ్షో అంటే మరీ వింతగా చూస్తుంది. తనెప్పుడూ వెళ్లలేదు మార్నిగ్‌షోకి. అమ్మ దగ్గరకి వెళ్లింది. ఫ్రెండ్ రమతో కలిసి సినిమాకి వెళ్తున్నానని చెప్పి బయటపడింది.
సినిమాలంటే మోజులేదు మొదట్నించీ. ఒక్కతే ఎప్పుడూ వెళ్లలేదు ఇదివరలో. భవానీ థియేటర్‌కు వెళ్లింది. అప్పటికే సినిమా మొదలయ్యింది. 'నిన్నే పెళ్లాడతా' సినిమా పేరు. హీరో హీరోయిన్ల ప్రణయ సన్నివేశాలు చూసేసరికి నిలవలేకపోయింది. తనని ఏడ్పించడానికే ఉందా లోకమంతా? అగ్నిలా దహించివేస్తోంది విరహం. బయటకు వచ్చింది థియేటర్లోంచి. ఒళ్లంతా ఒకటే వణుకు. రక్తం జ్వాలలా మండుతోంది. నరాలన్నీ పట్టుతప్పి అదురుతున్నాయి. దిమ్ముగా ఉన్నట్లనిపించింది తలంతా. ఇంటికి వచ్చింది మరో లోకంలో ఉన్నదానికి మల్లే. భోజనం దగ్గర కూర్చుంటే సహించలేదు. టేప్‌రికార్డర్ పెట్టింది.
'ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి..' అంటూ పింగళి పలుకుతున్నాడు ఘంటసాల కంఠంలోంచి. పాట కట్టేసింది. లోకంలో తనొక్కతే ఒంటరిగా ఉన్నట్లు ఫీలయ్యింది. లోకమంతా సంతోషంగా ఉన్నట్టూ, తనొక్కతే ఏడుస్తున్నట్టూ ఊహించుకుంది. హృదయం కొట్టుకుపోయింది, 'హంసా.. హంసా' అంటూ.
ఎవరో అమ్మాయిని పెళ్లిచూపుల్లో చూసి పెళ్లికి ఒప్పుకున్నట్లూ, ముహూర్తాలు కూడా పెట్టుకున్నట్లూ ఊహించుకుంది హంసని. వాళ్లిద్దరూ కలిసి చేయీ చేయీ పట్టుకొని తిరిగే ఉంటారు సినిమాలకీ, పార్కులకీ! హంసని అనుకుని ఏం లాభం?
తనేమైనా ప్రేమిస్తున్నానని చెప్పిందా అతడికి? తన బాధ, తన వ్యధ అతడికెట్లా తెలుస్తాయి? అంత అమాయకుండా? తను అతణ్ణే ఆరాధిస్తోందని తెలుసుకోలేకపోయాడా ఇంతకాలం? తనిక్కడ ఇట్లా బాధపడుతుంటే.. అతడు మాత్రం అక్కడ హాయిగా ఏ బాధా లేకుండా హాయిగా జాలీగా సెలవులు గడిపేస్తూ వుండివుంటాడు.
ఎట్లాగో సాయంత్రం అయ్యింది. మళ్లీ వెళ్లింది పెరట్లోకి. సన్నజాజుల పరిమళం పెరడంతా వ్యాపించి ఉంది. మరీ పిచ్చెక్కించింది ఆ వాసన. భుగభుగమంది రక్తం. ఆగలేకపోయిందిక. వెళ్లింది పరుగులాంటి నడకతో. నవ్వు విరిసింది ముఖంలో.
బయటనే కూర్చుని వున్నాడు హంస. జామచెట్టుకింద, దానికానుకొని కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్నాడు. పుస్తకాల పురుగు!
నవ్వుతూ ఆహ్వానించాడు హరితని చూసి. ఎదురుగా కూర్చుంది పచ్చగడ్డి మీద.
"ఎప్పుడొచ్చారు ఊర్నించి?" అడిగింది.
"ఉదయం పదయ్యింది వచ్చేసరికి. ఏమిటీ కబుర్లు?" అన్నాడు పుస్తకం మూసి పక్కన పెడుతూ.
"ఉదయమే వచ్చారా! మరి పిన్నేమిటి అట్లా చెప్పింది. సాయంత్రం కానీ, లేకపోతే రేపుదయం కానీ వస్తానని చెప్పారని చెప్పిందే" అంది, ఆశ్చర్యపడ్తూ.
"నిన్న అట్లాగే చెప్పాను ఫోన్‌చేసి. కానీ ముందుగానే బయలుదేరి వచ్చేశా. నువ్వు అంతకుముందే వచ్చి అడిగివెళ్లిన సంగతి మీ పిన్ని చెప్పింది."
ఉదయం నుంచి తాను పడ్డ అవస్థ అంతా హరిత కళ్లముందు మెదిలింది. ఏడుపు వచ్చినంత పనయ్యింది. హంస ఉదయమే వచ్చినా సాయంత్రం వస్తాడనుకొని తానెట్లా గడిపిందీ తలచుకుంటే...
"ఏంటి హరితా.. మొహమేంటి అలా వుంది? ఒంట్లో బాలేదా?" అని చనువుగా అమె చేయిని మణికట్టుపైన పట్టుకొని, "మామూలుగానే ఉందే" అన్నాడు.
ఉక్రోషం తన్నుకొచ్చింది హరితకు.
"అట్లాంటిదేమీ లేదులెండి" అంది కొంచెం విసురుగా.
"ఓ.. సారీ. కోపమొచ్చినట్లుందే మేడంకి. ఏదో మొహంలో డల్‌నెస్ కనిపిస్తే అడిగాను. తప్పయితే సారీ అన్నానుగా."
అతడు చెప్పే విధానానికి కోపం తగ్గింది. "ఇవేళ మీరు నా సందేహాల్ని తీర్చాలి" అంది.
"ఊ.. కానీ.. తప్పుతుందా."
"కష్టపడతారేమో."
"అయితే తొందరగా చెప్పు. నేను కష్టపడి చాలా కాలమైంది. నీ మూలంగా ఇవాళ ఆ కోర్కె తీరుతుందన్న మాట."
"తమరు మానసిక శాస్త్రవేత్తలు కదా. ప్రేమ అంటే ఏమిటో చెప్పగలరేమోనని."
"అదేమిటి హఠాత్తుగా ప్రేమమీద దృష్టి మళ్లింది! ఆ.. వయసు అట్లాంటిది కదూ" అన్నాడు నవ్వుతూ.
"నవ్వులాట కాదు సీరియస్."
"ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య కలిగే అనురాగాన్నే ప్రేమ అంటారు. ఇందులో సెక్సు ప్రభావం ఎక్కువ. దీన్నే వలపు అనీ, మోహం అనీ, కామం అనీ, మనసుల కలయిక అనీ.. ఎవరికి తోచినట్లు వాళ్లు పిలుచుకుంటారు" అన్నాడు - టీచర్‌కు పాఠం అప్పజెప్పే స్టూడెంట్‌కు మల్లే.
ఒక్కసారి చురచురా చూసి "ప్లేటోనిక్ లవ్ అంటారే అదేమిటి?" అనడిగింది.
"ఫర్వాలేదు. ప్లేటోనిక్ లవ్ అనేదొకటి ఉందనే సంగతి తెలుసంటే నేననుకుంటున్న దానికంటే కొంచెం లోకజ్ఞానం ఎక్కువే ఉందీ.. సరే చెప్తాను. ప్రేమలో రెండు రకాలు. తల్లిప్రేమ, సోదరప్రేమ, స్నేహం.. ఇట్లాంటి ప్రేమలు వదిలేస్తే సెక్సుతో సంబంధం ఉన్న ప్రేమ సంగతే చెప్తున్నాను. ఒక రకం ప్రేమలో శరీరాల కలయికే ప్రధానం. దీని పేరే కామం. ఇక రెండో రకం ప్రేమ శరీరాల కలయికతో సంబంధం లేనిది. అమలిన శృంగారమనీ, నువ్వన్నావే ప్లేటోనిక్ లవ్ అనీ దీన్నంటారు."
"ఇట్లాంటి ప్రేమలు లోకంలో ఉంటాయా?"
"ప్లేటోనిక్ లవ్ కథవరకైతే వింటానికి ఎంతో ఉదాత్తంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవంలో ప్రేమకథల్లో ఏ నూటికో, వేయికో ఒక్కటి మాత్రమే ఇట్లాంటిది కనిపిస్తుంది. ప్రేమ ఉండేచోట వెన్నంటే ఉంటాయి సెక్స్ కోరికలు. అంటే దానర్థం సెక్స్ సంబంధం ఉన్నచోటల్లా ప్రేమ తప్పకుండా ఉంటుందని అర్థంకాదు. ఎట్లాంటి ప్రేమ లేకుండానే సెక్స్ సంబంధం ఏర్పడవచ్చు. ప్రాస్టిట్యూషన్ దీనికి ఉదాహరణ."
"మన కథల్లోనూ, ప్రబంధాల్లోనూ హీరో హీరోయిన్లు తొలిచూపులోనే ప్రేమించుకున్నట్లు రాస్తుంటారు కదా. ఇద్దరికీ ఒకేసారి అట్లాంటి ప్రేమ కలుగుతుందంటే నమ్మవచ్చా?"
"నువ్వన్నది కరక్టే హరితా. 'తొలిచూపు ప్రేమ'ను మన కవులూ, రచయితలూ బాగా ప్రచారంలోకి తెచ్చారు. నాయకుడి బలిష్టమైన దేహం, ఉంగరాల జుత్తూ, ఠీవి చూసి నాయకి ప్రేమిస్తే, ఆమె అందమైన మొహం, సన్నని నడుము, సొగసుతనం చూసి నాయకుడు ప్రేమిస్తాడు. అయితే ఒథెల్లో, డెస్టిమోనాలు ఈ రకం కాదు. రూపాలెట్లా ఉన్నా కూడా, కొంత పరిచయం తర్వాత ఒకరి గుణాలూ, అభిరుచులూ మరొకరు అర్థం చేసుకొని ప్రేమించుకున్నారు. ఇట్లాంటి ప్రేమలే ఎక్కువ కాలం నిలుస్తాయి."
"ప్రేమకోసం హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి? నిజంగా అట్లాంటిదాన్ని ప్రేమ అనవచ్చా?"
"ప్రేమశక్తిని ఎవరూ అంచనా వేయలేరు. కాంతి, ఉష్ణం, విద్యుచ్ఛక్తిలాగా అది బాహ్యశక్తి కాదు. ఆకలి, తలనొప్పి, ఒంటినొప్పిలాంటి శరీరబాధ కూడా కాదు. ప్రేమ ముందుగా ఇంద్రియాల మూలంగా పుడుతుంది. తర్వాత హృదయంలో స్థిరపడుతుంది. తర్వాత్తర్వాత మెదడును కూడా వశం చేసుకుంటుంది. పంచేంద్రియాలలో కన్ను ఎంత ముఖ్యమైందో ప్రేమ విషయంలో 'చూపు' అంత ప్రధానమైంది. ప్రేమని పుట్టించడంలో చూపు నిర్వహించే పాత్ర అమోఘమైంది."
"ప్రేమని పుట్టించేది చూపేనంటారు.." అంటూ అతడి వంక చూసింది. ఆమె కళ్లలో అంతులేని అనురాగం, అంతకుమించిన వేదనా.
కానీ హంస అదేమీ గమనించినట్లు కనిపించలేదు. సందేహాలు అడిగే శిష్యురాలికి సమాధానాలు చెప్పే గురువుకి మల్లే ఉన్నాడు.
"చూపు ప్రేమని పుట్టిస్తే మిగతా ఇంద్రియాలు దాన్ని పెంచి పోషిస్తాయి. కృష్ణుడి సంగతే చూడు. పిల్లనగ్రోవి ఉంది. గోపికల్ని వశం చేసుకునేవాడు. పూర్వకాలం ఐరోపా ప్రియుడైతే గిటారు వాయిస్తూ ప్రేయసి అనురాగాన్ని పొందేవాడు. భారతంలోని శంతనుడైతే యోజనగంధి ఒంటి ఘుమఘుమలకి ఫ్లాటైపోయాడు. చూపులకీ, మాటలకీ లొంగని ప్రవరుణ్ణి ఆఖరుసారిగా -
'పాంచద్భూషణ బాహుమూల రుచితో బాలిండ్లు
పొంగార బైయంచుల్ మోరగ గౌగిలించి యధరం బాసింప'
సాహసించింది వరూధిని."
హంస అట్లా చెప్తూవుంటే తను కూడా వరూధినికి మల్లే అతణ్ణి కావలించుకోవాలన్నంత ఆవేశం కలిగింది. అయితే గంభీరంగా కనిపిస్తున్నాడతడు. ఎట్లా సాహసించడం?
తను వేసిన ప్రతి ప్రశ్నకీ వివరంగా అతడు జవాబులిస్తూనే వున్నాడు. అతణ్ణి డామినేట్ చేయగలిగే ప్రశ్నవేసి అతడు నీళ్లు నమిలేట్లు చేయాలి. అప్పుడు రెచ్చిపోవచ్చు అనుకున్నది హరిత.
"సరే. దీనికి జవాబు చెప్పండి. ఒకర్ని ప్రేమించి విఫలమయి మరొకర్ని మళ్లీ ఎట్లా ప్రేమించగలుగుతున్నారు, ఎట్లా పెళ్లిచేసుకోగలుగుతున్నారు. ప్రేమ చాలా శక్తివంతమైనది అన్నారే. ఇంతేనా దీని శక్తి?" అని ఓరగా చూసింది.
ఒక్క నిమిషం ఆలోచిస్తున్నట్లు కనిపించాడు హంస. 'అయ్యింది అబ్బాయిగారి పని' అనుకుంటోంది హరిత.
"ప్రేమ ఎంత మహిమ కలిగిందో అంత చంచలత్వం కూడా దానికి ఉంది. నిజం చెప్పొద్దూ - ఈ చంచలత్వం వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంది మనిషికి. ఈ చంచలత్వం లేకపోతే భిక్షగాడు కారుల్లో తిరిగే అమ్మాయిని చూసి ప్రేమించి చచ్చిపోవలసిందే. ఇట్లాంటి చావులు తరచుగా జరగాలి. కానీ అలా జరగటం లేదు. ప్రేమించిన వారిని పొందలేనివాడి జీవితం ఎందుకూ కొరగాకుండా పోవాలి. కానీ అలా జరగటం లేదే. అంటే ప్రేమని నిలుపుకోవడం గానీ, మరల్చుకోవడం గానీ మనిషికి చేతనవుతుంది కాబట్టే. అయితే పురాణాల్లో, ప్రబంధాల్లో మాత్రం ప్రేమ.. దేవుళ్లనీ, రుషులనేవాళ్లనీ కూడా ముప్పుతిప్పలు పెట్టింది. కృష్ణుడూ, విశ్వామిత్రుడూ, పరాశరుడూ, దశరథుడూ - ఇట్లాంటివాళ్లంతా ఈ ప్రేమకి లొంగిపోయినవాళ్లే. వాళ్లు పడ్డ బాధలు నీకు చెప్పాల్సిన పనిలేదు కదా" అని ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు.
"ఆ.. తెలుసు. నా బాధే తెలీకుండా ఉంది తెలియాల్సిన వాళ్లకి" అంది, బాధ నిండిన గొంతుతో.
"అరే.. ఏమిటి నీ బాధ" అన్నాడు ముఖాన్ని ఆమెకి చేరువగా తెచ్చి, ఏమీ ఎరగనివాడికి మల్లే.
అతడి ఫోజుచూసి మండుకొచ్చింది హారితకి. అంతలోనే తన అసహాయత్వం తలచుకొని ముఖం చేతుల్లో దాచుకొని, రెండు కాళ్లూ మోకాళ్లవద్ద మడిచి, మోకాళ్లకి తల ఆన్చింది.
"అరే.. ఏమిటిది హరితా.. చిన్నపిల్లలా.. మీ పిన్ని వస్తోంది."
ఉలిక్కిపడి చూసింది. ఎవరూ రావట్లేదు. చిరుకోపంతో అతడి వంక చూస్తే.. నవ్వుతూ ఆమె చేతులు పట్టుకుని అరచేతుల్లో ముద్దు పెట్టుకున్నాడు.
"సారీరా! నిన్ను బాధపెట్టాను. ఆ మాత్రం తెలుసుకోలేని మొద్దుననుకున్నావా?" అన్నాడు. అతడి కంఠాన్ని కావలించుకుని "ఇది నిజమే కదూ" అంది.
"కాదు. ఉత్తుత్తికే" అన్నాడు సీరియస్‌గా మొహంపెట్టి.
"ఊ.." అని అతడి ఛాతీపై దబదబా కొట్టింది చేతులతో.
"పది రోజులేం చేస్తున్నారు మీ ఊళ్లో?"
"పెళ్లిచూపులకని వెళ్లా. ఓ అమ్మాయిని చేసుకుంటానని చెప్పా."
చప్పున అతడికి దూరం జరిగింది. "ఎ.. ఎవరా అమ్మాయి?" అనడిగింది కంఠం బలహీనమవుతుంటే.
"అబ్బా. నీతో ఇదే చిక్కు. సాంతం వినకుండానే అలకలు మొదలుపెడ్తావ్. ఇంత చక్కదనాల చుక్కని, ఇంత మంచి అమ్మాయిని దగ్గర పెట్టుకొని ఇంకెవర్నో చేసుకుంటానా. ఆ అమ్మాయి ఈ అమ్మాయే" అని ఆమెని దగ్గరగా తీసుకుని "ఐ లవ్యూ హరితా" అంటూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు.
"అరే.. ఈ పబ్లిక్ రొమాన్సేమిటి?" అంటూ వచ్చింది హరిత వాళ్ల పిన్ని.
చప్పున దూరం జరిగారు. "అదీ.. పిన్నీ.." అని హరిత నసుగుతుంటే.. నవ్వి, "నాకంతా తెలుసులేవే. వచ్చేవారం హంస వాళ్ల అమ్మానాన్నలు వస్తున్నారు, మీ అమ్మానాన్నలతో మాట్లాడ్డానికి" అంది.
"పిన్నీ ఏమనుకోకు" అని హంస బుగ్గమీద ముద్దుపెట్టుకొని లేడిలా అక్కణ్ణించి తుర్రుమంది హరిత.
------------ x --------------
- స్వాతి మాసపత్రిక, ఏప్రిల్ 1995
Wednesday, April 29, 2015
Tuesday, April 14, 2015
Friday, April 10, 2015
Wednesday, April 8, 2015
Short Story: Thana Vaalla Kosam
కథ: తన వాళ్ళ కోసం...
తలుపు చప్పుడయ్యింది. "ఎవరూ?" అంటూ సీతారాం మగ్గం ఆపి ఒక పక్కకు వంగి చేతితో తలుపు పూర్తిగా తెరిచాడు. ఈలోగా వంటింట్లో ఉన్న యశోద కూడా అక్కడికొచ్చి గుమ్మం వొద్దున్న అపరిచితుడి వొంక ఆశ్చర్యంగా చూసింది."ఎవరూ?" అన్నాడు సీతారాం భార్య వొంక ప్రశ్నార్థకంగా చూస్తూ.
"ఏమో" అని, "ఎవరు కావాలండీ?" అంది వొచ్చినతనితో.
అతను చిన్నగా నవ్వుతూ లోనికొచ్చాడు. మగ్గంలో ఉన్న సీతారాంని చూస్తూ, "అరే, నేనురా జనార్దన్‌ని" అన్నాడు.
"ఒరే నువ్వా.. ఏంటీ సడన్ విజిట్" అంటూ మగ్గంలోంచి లేచొచ్చాడు.
యశోదకు మిత్రుణ్ణి పరిచయం చేశాడు. ఆమె మళ్లీ వంటింట్లోకెళ్లిపోయింది.
"నేను నమ్మలేకపోతున్నారా, నువ్వేమిటి ఇట్లా బట్టలు నేసుకోవడమేంటి?"
"నేనూ నమ్మలేక పోతున్నా, నువ్విట్లా రావడం."
"నాకు తెలుసు, నువ్వు చాలా అడగాలనుకుంటున్నావ్ కదూ. ఎలా నిన్ను కనుక్కోగలిగానా, ఇప్పుడిక్కడికి ఎందుకొచ్చానా, ఏం చేస్తున్నానా అని అడగాలనుకుంటున్నావ్ కదూ."
జనార్దన్ మారలేదు. వాగుడుకాయ. అలాగే ఉన్నాడు అప్పట్నించీ.
కాలేజీలో ఇద్దరూ సహాధ్యాయులు. సీతారాం అంటే జనార్దన్‌కు మొదట్నించీ ఈర్ష్య. ఎందుకంటే సీతారం అన్ని విషయాల్లోనూ జనార్దన్ కంటే ఒకడుగు ముందుండేవాడు. ఇద్దరి మధ్యా ప్రచ్ఛన్న యుద్ధం (జనార్దన్ వైపు నుంచి) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే దాకా సాగింది. విడిపోయే ముందు "ఇది అంతం కాదు. ఏదో ఓరోజు నీకంటే నేనే ముందుంటాను" అన్నాడు జనార్దన్.
"అరే, అన్నింటినీ అట్లా సీరియస్‌గా తీసుకుంటావెందుకు, నీతో నేనసలు పోటీపడందే" అని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు సీతారాం.
యశోద ఇచ్చిన టీ తాగుతా కబుర్లలో పడ్డారు క్లాస్మేట్స్.
"కొంతకాలంగా సొంత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవడంలో బిజీ ఐపోయా. మధ్యమధ్యలో మన కాలేజీ లైఫ్ జ్ఞాపకమొచ్చి బాధపెట్టేది నన్ను. అందులోనూ ముఖ్యంగా నువ్వు జ్ఞాపకం వొచ్చేవాడివి. నేనెట్లా నీపట్ల కుత్సితంగా ప్రవర్తించేదీ గుర్తుకొచ్చి నన్ను మరీ వేధించేది. నా పద్ధతి ఎట్లా ఉన్నా నువ్వు నాపట్ల ఎంత బాగా ఉండిందీ, నాకెలా సాయం చేసిందీ గుర్తు చేసుకునేవాణ్ణి" అని ఆగి, "ఇంతకీ నేనెందుకు వొచ్చిందీ చెప్పలేదు కదూ. ఒక కాన్ఫరెన్స్ పనిమీదొచ్చాను. కొద్ది రోజులు చీరాల్లోనే ఉంటాను. రేపు, ఎల్లుండి కొంచెం బిజీ. శుక్రవారం మధ్యాహ్నం మళ్లా కలుస్తాను. ఆ రోజు నీతోటే ఉంటా. నీకేం అభ్యంతరం ఉండదుగా" అన్నాడు జనార్దన్.
"ఎందుకు అభ్యంతరం? అయినా నేనిక్కడ ఉంటున్న సంగతి ఎట్లా తెలిసింది నీకు?"
"ఇస్మాయిల్ గుర్తున్నాడా? మన పాత కాలేజీ కొలీగ్. పోయినేడు ట్రైన్లో నువ్వూ వాడూ కలుసుకుని ఒకరి అడ్రసులు ఒకరు ఇచ్చి పుచ్చుకున్నారటగా, ఉత్తరాలు రాసుకుందామని. ఐతే మామూలుగానే నువ్వు వాడికి రాయలేదనుకుంటా."
"నేను కార్డు రాశానే వాడికి."
"తెలుసులే. ఐనా పొడి పలకరింపులు వర్కవుట్ అవుతాయా. వాడు ఓ రెసిడెన్షియల్ కాలేజీలో లెక్చరర్ గిరీ సంపాదించాడు. అక్కడ ఓ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగితే నాకూ ఆహ్వానం అందింది. అక్కడే మేం కలుసుకున్నాం. కాలేజీ గురించీ, స్నేహితుల గురించీ, ముఖ్యంగా నీ గురించీ మాట్లాడుకున్నాం. నీ స్థితి చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే ఇప్పుడు నీకు ఆశ్చర్యం కల్గించాలని వొచ్చాను, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా."
"ఏంట్రా ఆ మాటలు. నాకిష్టం ఉండకపోవడమేమిటి? సరే. ఇంతకీ నీ సంగతులు చెప్పు."
"చెప్తా, చెప్తా. నేను ప్రస్తుతం రీసెర్చి అసోసియేట్‌గా పనిచేస్తున్నా. త్వరలోనే పూర్తికాలం జియాలజిస్టుని అవుతా. నమ్ముతావా, ఇప్పుడు నేను చాలా కష్టపడి పనిచేస్తున్నానని. మరో మూడు నెలల్లో మా డిపార్ట్మెంట్కి నేనే హెడ్‌ని కావచ్చు."
"నిజంగా! చాలా ఆనందంగా ఉంది జనార్దన్. నువ్వెప్పుడూ కష్టపడుతూనే ఉంటావ్. డిపార్ట్మెంట్ హెడ్వి అయ్యాక నాకు తెలియజెయ్యడం మరచిపోకు. అవునూ.. నీ ఫ్యామిలీ గురించి ఒక్క ముక్కా చెప్పలేదు."
"తన పేరు నక్షత్ర. టాటా కన్సల్టెన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక్కడే కొడుకు. ఎనిమిదేళ్లు. థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. సరే. ఇంక నీ సంగతి చెప్పు. అన్నిట్లోనూ ముందుండేవాడివి. నువ్వేమిటి ఇట్లా.."
"ఇప్పుడేమైంది. నేను బానే ఉన్నా. ఈ లైఫ్‌లో సెల్ఫ్ శాటిస్ఫ్యాక్షన్ ఉంది."
"ఇస్మాయిల్ చెబితే అసలు నమ్మలేకపోయా. నువ్వు నేత నేసుకుంటూ మీ ఊళ్లోనే ఉన్నావంటే - నాకేమీ సంతోషంగా అనిపించలేదు. నీ టాలెంట్ అంతా ఇట్లా వృథా చేసుకుంటున్నావేమిటి? బట్టలు నేయడానికా నీ టాలెంట్‌ని యూజ్ చేస్తోంది?"
జనార్దన్ మాట్లాడుతుంటే మౌనంగా విన్నాడు సీతారాం. తర్వాత మృదువుగా అన్నాడు - "ఎవరన్నారు ఫ్రెండ్ నేను నా వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ ఇక్కడ ఉంటున్నానని. నిజం చెప్పమంటావా? ఇప్పుడు నేను చేస్తున్న పనిలో ఎంత ఆత్మసంతృప్తి ఉందో తెలుసా. నా వాళ్లకోసం పోరాటంలో నేనూ నా వాళ్లకు మల్లే జీవించాలంకున్నా. నా వాళ్లంతా ఇక్కడ కష్టాలు పడుతుంటే నేను పంతులుగా ధర్మపన్నాలు వల్లిస్తూ ఉండలేకపోయా. అందుకే వచ్చేశాను ఇక్కడకి. ఇప్పుడు వీళ్లందర్నీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను?"
మధ్యలో అడ్డుకున్నాడు జనార్దన్.
"ఏమో సీతారాం. అట్లా అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో ఆలోచించు. మనం సంస్కర్తలం కాదు, అందరి గురించీ ఆలోచించడానికి. అందరి దరిద్రం గురించి ఆలోచించే ముందు మన దరిద్రం వదిలించుకునే సంగతి చూడాలి కదా. నిన్ను నమ్ముకున్న నీ భార్యా పిల్లల మాటేమిటి? ఇంతకీ పిల్లలెంతమంది?"
"ఇద్దరు. పెద్దవాడు భరత్. నీ కూతురు వయసే. చిన్నది విముక్త. ఇంకా బడికెళ్లే వయసు రాలేదు. నా భార్యాపిల్లల సంగతంటావా? నా భార్యకీ జీవితంలో అసంతృప్తి ఉందని నేననుకోవడం లేదు. తను కూడా నాకు బాగా కో-ఆపరేట్ చేస్తోంది. తను గ్రాడ్యుయేట్.. యశోదా.." అంటూ భార్యని పిలిచాడు.
ఆమె వొచ్చింది. వంట చేస్తున్నా శుచిగానే ఉంది. ఆమె ముఖంలో ఏదో కాంతి. జనార్దన్ అనుకున్నాడు మనసులో - 'ఈమె అందమంతా, ఈమె సొగసునంతా సీతారాం వేస్టు చేస్తున్నాడు'.
"యశోదా.. మా వాడేమంటున్నాడో తెలుసా? నీకు అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడుతున్నాడు. నువ్వేదో అసంతృప్తితో వున్నట్లు ఫీలవుతున్నాడు."
యశోద నవ్వింది. ఆ నవ్వు చాలా సజీవంగా ఉంది. ఆ నవ్వులో నిర్లిప్తత కానీ, అసంతృప్తి కానీ రవ్వంత కూడా కనిపించకపోవడం చూసి జనార్దన్ తికమకపడ్డాడు.
"మీరు చాలా పొరబడుతున్నారల్లే ఉంది. ఈయన ఈ జీవితాన్ని కోరుకున్నప్పుడు ముందు సందేహించాను. ఇప్పుడు ఈ జీవితం కంటే గొప్ప ఇంకేముంటుంది అనిపిస్తోంది. ఒక లెక్చరర్‌గా పనిచేస్తే ఆయన ఏం సాధించేవాడు. ఆ టెక్స్ట్బ్ బుక్స్‌లో ఉన్న చెత్తనంతా స్టూడెంట్స్ మెదళ్లకి ఎక్కించేవాడు. ఇప్పుడో.. ఆయన నాయకుడి స్థానంలో ఉన్నాడు. నేతగాళ్లలో ఎక్కువమంది ఆయనను అనుసరిస్తున్నారు. ఆయన మూలంగా నాకూ ఇక్కడ ఒక గౌరవ స్థానం దక్కింది. ఒకవేళ ఆయన ఇదికాక ఇంకో ఉద్యోగం చూసుకుంటానంటే ముందుగా వ్యతిరేకించేది నేనే."
యశోద మాటలకు జనార్దన్ నిశ్శబ్దమై పోయాడు. కొద్ది క్షణాలు ఏం చెప్పాలో అర్థంకాలేదు.
మగ్గం వంక చూశాడు. అంతా గజిబిజిగా అగుపించింది. ఏవేవో చెక్కలు, నూలుపోగులు, దారాలు, పై నుంచి కిందికి వేలాడుతూ నైలాన్ దారాలు. అదేదో గుండ్రంగా పొడవుగా ఉన్న దానికి చుట్టుకొని బట్ట, ఒక పళ్ల చక్రం.. 'దీంతోటి పనా? ఏం ఖర్మ పట్టింది వీడికి?' అనుకున్నాడు మళ్లీ.
"భోజనం చేద్దువుగానీ పదరా" అన్న సీతారాం మాటలకు మామూలయి, "లేదురా. నేనిక్కడ ఇప్పుడు భోజనం చెయ్యలేను. అవతల మాటిచ్చి వొచ్చాను. చెప్పాను కదా, శుక్రవారం వస్తానని. అప్పుడు భోజనం చేస్తాను. ఆ రోజూ, ఆ తర్వాతి రోజూ కూడా నీతోటే ఎక్కువగా గడుపుతాను" అంటో జనార్దన్ వెళ్లిపోయాడు.
పాత కాలేజీ మిత్రుడు కలిసినందుకు సీతారాం ఆనందపడ్డాడు. ఇద్దరూ స్నేహంగానే ఉండేవాళ్లు కానీ స్వభావరీత్యా వేర్వేరుగా కనిపిస్తారు. జనార్దన్ ఒట్టి కెరీర్ మైండెడ్ పర్సన్ ఐతే సీతారాం అందుకు పూర్తి విరుద్ధం. ఎమైనా చాన్నాళ్ల తర్వాత కలిసిన జనార్దన్ మాటలు సీతారాంలో ఆలోచనలు రేకెత్తించాయి.
ఆ రాత్రి చాలాసేపటి దాకా కళ్లమీదికి కునుకు రాలేదు.
తమ మధ్య జరిగిన సంభాషణలే మాటిమాటికీ మనసుని తొలుస్తున్నాయి. జనార్దన్ మారలేదు. అదే మైండ్‌సెట్‌తో ఉన్నాడు. పోనీ తను మారాడా? తనవాళ్లను చూసుకుని తను తృప్తి పడుతున్నాడు. షావుకార్లు కూలీలు బాగా తగ్గించేసినప్పుడు తను వాళ్లకి ధైర్యంచెప్పి, 'మగ్గాల సమ్మె' చేయించి, వాళ్లలో చైతన్యం తీసుకురావడానికి నాటికలు తయారుచేసి ఆడించి, పాటలు కట్టి, పాడించి.. అదెంత బాగుంది?
షావుకార్లందరికీ తను పగవాడైపోయినా తన నేతగాళ్లకి తాను ఆలంబనగా మారాడు. అమానాన్నలు తన భవిష్యత్తు గురించి బెంగపడినా తన యశోద తనకి అండగా నిలిచి ముందుకు నడిపించింది. ఐతే.. ఐతే.. తను లేకపోతే నేతగాళ్లు బతకలేరా. తను కాకపోతే ఇంకొకరు తన స్థానంలో వొచ్చి ఉండేవాళ్లు కాదా. నేతగాళ్ల బాధల్ని ఓవర్‌గా ఫీలయ్యి నెత్తిమీదికెత్తుకున్నాడా తను? నిజంగా తను ఆ కాలేజీలో పనిచేస్తూ ఉండినట్లయితే లైఫ్‌లో తనకి ఈ స్ట్రగుల్ ఉండేది కాదుకదా. తన పిల్లలు ఏ చీకూ చింతా లేకుండా, ఏ గొడవలూ లేకుండా ప్రశాంతంగా బతికేవాళ్లు కదా.
తను పొరబాటు చేశాడా?.. ఈ ఆలోచనలు అతణ్ణి నిద్రకు దూరం చేశాయి. అవి అతణ్ణి కుదిపి, కదిపి, ప్రశ్నించి, పదేపదే జ్ఞప్తిచేసి కానీ వొదిలిపెట్టలేదు.
మరుసటి రోజు ఉదయం సీతారాం ముఖం చూసి, "మీ ఫ్రెండ్ నిన్ను బాగా డిస్టర్బ్ చేసినట్లున్నాడే" అంది యశోద. సాధారణంగా రైలుకట్ట కాడికి వెళ్లొచ్చిన వెంటనే మగ్గంలోకి వెళ్తాడు సీతారాం. ఆ రోజు చెంబుకెళ్లొచ్చి చాలాసేపయినా మగ్గంలోకి వెళ్లకుండా కింద గచ్చుమీద కూర్చుని ఆలోచిస్తున్నాడు.
చూసి, తనే వెళ్లింది మగ్గంలోకి, యశోద. 'పలక' లాగి కొట్టడంతోటే ఉలిక్కిపడి ఆమె వొంక చూశాడు. ఆమె అన్న మాటలు అప్పుడే విన్నట్లు "అవును యశూ, రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు" అన్నాడు - ఆమె నేస్తుంటే అటూ ఇటూ తిరుగుతున్న నాడి వొంక చూస్తూ. నాడికి గుచ్చిన కండె నుంచి పోగు అలవోకగా వస్తూ బట్టని నేస్తోంది.
"ఏం బాగాలేదు. ఈ మాత్రానికే డిస్టర్బ్ అయితే ఇంక నువ్వు ఏం సాధించగలవు. 'గుంట మగ్గం' ఫలితం లేకుండానే మాయమైపోవడం సంగతి ఊహించుకో. ఆ ఒక్క నాటిక ఎంత మందిని కదిలించిందీ, మరెంతమందిని భయపెట్టిందీ జ్ఞప్తికి తెచ్చుకో. నీ పాత స్నేహితుడు కలిసి 'ఇదేం బతుకు' అన్నంత మాత్రానే నీరుకారిపోతావా? అసలు నువ్వు నువ్వేనా?" యశోద గొంతులో బాధ ధ్వనించినా అందులో స్థిరత్వం ఉంది. సీతారాం మాట్లాడలేకపోయాడు. తల కూడా ఎత్తలేకపోయాడు.
"మనం సాధించాలి. సాధించలేక పోయినా అందుకు మనం సాధనంగా నేతగాళ్లకు ఉపయోగపడాలి. ఇదే కదా ఇక్కడికి వొచ్చే ముందు నువ్వు నాకు చెప్పింది. నా సీత గురించి అప్పుడు ఎంత ఆనందపడ్డాను. నా భర్త ఉన్నతుడని ఎంతగా గర్వపడ్డాను. మనస్ఫూర్తిగా వొచ్చానిక్కడికి. వొచ్చాక నా నమ్మకం ఇంకా బలపడింది. నీ వల్ల నాక్కూడా గౌరవం పెరిగిందనేది నిజం. నీ వల్ల నేనూ ప్రేరణపొందాననేది నిజం. కానీ ఇప్పుడేమిటి ఇట్లా.."
"అది కాదు యశూ.. మన పిల్లల సంగతి..."
"ఏమవుతుంది మన పిల్లలకి. మన నేతగాళ్ల పిల్లల మాదిరే వాళ్లూ పెరుగుతారు. వాళ్లు పెద్దయ్యాక నేతగాళ్ల బతుకులు ఇప్పటిలాగానే ఉంటే వాళ్లూ నాలాగా, నీలాగా అవుతారు. అట్లా కావడం నీకిష్టం లేదా?"
ఆ మాటలతో సీతారాంకు తన పొరబాటు తెలిసొచ్చింది. తన ఆలోచనల్లోని తప్పు తెలిసొచ్చింది. "సారీ యశూ. నువ్వు నా అర్ధాంగివి అయినందుకు గర్వపడ్తున్నాను. సరే. లే. నేను వెళ్తాను మగ్గంలోకి" అన్నాడు.
శుక్రవారం ఉదయం పదకొండయ్యేసరికల్లా వొచ్చాడు జనార్దన్.
"ఏమో అనుకున్నా గానీ నీ పేరు చెబితే చాలు ఇక్కడ ఎంత గొప్పగా చెబుతున్నారో నీ గురించి. ఐతే ఒక్కటే బాధ నాకు. ఈ పేరువల్ల ఆర్థికంగా నీకు కలిగే లాభమేమీ లేదు కదా" అన్నాడు. పక్కనే అల్మరాలో ఏదో కాయితం కనిపించి తీశాడు.
నాడిలో కండె అయిపోవడంతో ఊచ తీసేసి ఇంకో కండె గుచ్చి పలకలోకి నెట్టాడు సీతారాం. తల మీదనుంచి చెమట బొట్టులు కారుతున్నా పట్టించుకోకుండా నేస్తున్నాడు.
"డబ్బు కోసమే ఐతే నేనిక్కడికి వొచ్చేవాణ్ణే కాదు కదా. ఈ కష్టాన్ని ఆహ్వానించే ఈ వృత్తిని స్వీకరించాను. ఇందులో ఉన్న కష్టాన్ని అనుభవిస్తేనే కదా నేతగాళ్ల బాధలు నాకు తెలిసేది."
సీతారాం చెప్పింది జనార్దన్ వినిపించుకోలేదు. చేతిలో ఉన్న కాయితంలోని అక్షరాల వొంక చూస్తున్నాడు, ఆశ్చర్యంగా.
"ఎవరు రాశారిది?" అడిగాడు. టీ తెస్తున్న యశోద అంది "అదా.. ఇంకెవరు రాస్తారు. మీ స్నేహితుడే."
పైకి చదివి నిట్టూర్చాడు జనార్దన్.
"ఏమైందిరా?" అడిగాడు సీతారాం.
"నీతో నన్ను పోల్చుకుంటున్నాను. మొన్న నీతో అన్న మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను. నీకంటే ఎన్నో రెట్లు పైన ఉన్నానని అప్పుడు గర్వించానా. ఈ రెండు రోజుల్లో నీ గురించిన సంగతులు విని, నీ జీవితం, నా జీవితం పోల్చుకుని ఆలోచిస్తే వ్యక్తిగా, మనిషిగా నాకంటే నువ్వే ఎంతో ఎత్తులో ఉన్నట్లు అర్థమయ్యింది నాకు."
"అరే.. ఎందుకురా అంతంత పెద్ద మాటలు. నా వాళ్ల కోసం నేను ఎంచుకున్న మార్గం ఇది. నీ కెరీర్ కోసం నీవెంచుకున్న మార్గం అది. దేని ప్రాధాన్యం దానిదే."
"లేదురా. నువ్వలాగే అంటావు. నేను జియాలజిస్టుని. నా ఉపయోగం చాలా కొద్దిమందికే. మా ఇంటి చుట్టుపక్కల చాలామందికి నేనెవరినో, ఏం చేస్తుంటానో కూడా తెలీదు. ఇంక నాకున్న ఒకే ఒక్క కొడుకుని పట్టించుకునే తీరిక నాకు గానీ, నా భార్యకుగానీ లేదు. వాడి ఒంటరితనం మా మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఇప్పుడు వాడు వాడి స్నేహితుల మాట తప్ప మా మాట వినడు. వచ్చే యేడు వాణ్ణి బోర్డింగ్ స్కూల్లో వెయ్యాలని కూడా నిర్ణయించుకున్నాం. కానీ నీ స్థితి చూడు. నీ గురించి నీ ఇంటి చుట్టుపక్కల వాళ్లకే కాదు, పక్క వూళ్ల వాళ్లకి కూడా బాగా తెలుసు. పదులు వందలు కాదు, వేలమందికి నీ వల్ల ఉపయోగం కలుగుతోంది. ఇంక నీ భార్యాపిల్లల సంగతే చూడు. నీకు అన్ని విధాలుగా సాయపడే భార్య. వీధిబడిలో చదువుతున్నా నీ కొడుకు మీతో హాయిగా, ఆనందంగా గడపగలుగుతున్నాడు. మీ వాడికి ఒంటరితనం సమస్యే రాదు. మీదిరా 'ఆదర్శ కుటుంబం' అంటే" అన్నాడు. అప్రయత్నంగా అతడి కళ్లు తడయ్యాయి.
స్నేహితుడు అట్లా బాధపడేసరికి సీతారాం, "అరే ఏమిట్రా చిన్నపిల్లాడిలా కదిలిపోతావ్. కాలేజీలో ఎప్పుడూ నిన్నిట్లా చూడలేదే!" అన్నాడు వాటు వెయ్యడం ఆపేసి.
కళ్లు తుడుచుకొని చిన్నగా నవ్వుతూ "ఏంటోరా.. నా యాంత్రిక జీవనాన్ని, నీ జీవితంతో పోల్చుకునేసరికి నేనేం పోగొట్టుకుంటున్నానో తెలిసి.. బరస్టయ్యాను. ఏమైనా అయ్యాం వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ యు మై ఫ్రెండ్. నీలాంటి వాడు నా స్నేహితుడైనందుకు చాలా గర్వంగా ఉంది. ఇంక నీ చరిత్ర కూడా పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. రేపటిదాకా ఉంటాను కదా. మా చెల్లెమ్మ చేత చెప్పించుకుంటాలే. ఆ తర్వాత ఆ చరిత్రని మా వాళ్లకు చెప్తాను" అన్నాడు తృప్తిగా జనార్దన్.
- ఆదివారం ఆంధ్రభూమి, 11 మార్చి 2001
Friday, April 3, 2015
Interview of Director Ravi Babu
హీరోయిన్లు నాపై ఆసక్తి చూపరు
ప్రొఫెషనల్ ఎథిక్స్, రిలేషన్స్ పాటిస్తూ వస్తున్నవాణ్ణి. అందువల్ల హీరోయిన్లు నాపై ఆసక్తి ప్రదర్శించరు. నేను టాలెంట్‌ని చూస్తానే కానీ, గ్లామర్‌ను చూడను. పూర్ణతో నేను మూడు సినిమాలు చేశానంటే, కేవలం ఆమె అభినయాన్ని దృష్టిలో పెట్టుకొనే - అన్నారు రవిబాబు. అవును చిత్రానికి రెండో భాగంగా ఆయన రూపొందించిన చిత్రం అవును 2. డి. సురేశ్‌బాబుతో కలిసి ఆయన స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్రవారం అవును 2 ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా పత్రికలవారితో సంభాషించారు రవిబాబు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
ప్రొఫెషనల్ ఎథిక్స్, రిలేషన్స్ పాటిస్తూ వస్తున్నవాణ్ణి. అందువల్ల హీరోయిన్లు నాపై ఆసక్తి ప్రదర్శించరు. నేను టాలెంట్‌ని చూస్తానే కానీ, గ్లామర్‌ను చూడను. పూర్ణతో నేను మూడు సినిమాలు చేశానంటే, కేవలం ఆమె అభినయాన్ని దృష్టిలో పెట్టుకొనే - అన్నారు రవిబాబు. అవును చిత్రానికి రెండో భాగంగా ఆయన రూపొందించిన చిత్రం అవును 2. డి. సురేశ్‌బాబుతో కలిసి ఆయన స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్రవారం అవును 2 ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా పత్రికలవారితో సంభాషించారు రవిబాబు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
రెండో భాగం అంటే చాలా సినిమాల్లో మొదటి భాగానికి భిన్నమైన కథ కనిపిస్తుంది. కేరక్టర్ మాత్రం కొనసాగుతుంది. ఏ షాట్‌తో అవునును ఆపామో, ఆ షాట్తోటే ‘అవును 2’ మొదలవుతుంది. అంటే ఇది నిజమైన కొనసాగింపు. మొదటి భాగంలోని పాత్రలతో పాటు కథ కూడా కొనసాగుతుందన్న మాట.
థ్రిల్లర్లకు సీక్వెల్ ఛాన్స్
ఏ సినిమాలోనైనా మంచి, చెడు మధ్య సంఘర్షణ కనిపిస్తుంది. ‘అవును’లో చెడు పాత్ర మీద గెలిచానని మంచి పాత్ర అనుకుంటుంది. నిజానికి చెడు చావలేదు, మంచికి కష్టాలు తొలగలేదన్నట్లు ఆ క్లైమాక్స్‌లో చూపించాం. ‘అవును 2’లో చెడు అనేది మంచితో ఎలా పోరాడిందనే విషయాన్ని చూపించాం. ‘అవును’ చేసేప్పుడే దాన్ని రెండు, మూడు భాగాలుగా తియ్యాలని అనుకున్నా. ‘అవును 2’ బాగా ఆడితే, దీనికి మూడో భాగం కూడా రావచ్చు. హారర్, థ్రిల్లర్ సినిమాలకు సీక్వెల్స్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆమెలాంటి నటిని చూడలేదు
నేను చాలా మంది ఆర్టిస్టులతో పనిచేశాను. పూర్ణలా హావభావాలతో అభినయాన్ని ప్రదర్శించే నటిని ఇంతవరకు నేను చూడలేదు. ‘ఒన్ మోర్’ అని అడగడానికి స్పాట్లో సిగ్గుపడేవాణ్ణి. అంత కాన్సన్ట్రేషన్తో, అంత పర్ఫెక్షన్తో ఆమె హావభావాలు ప్రదర్శిస్తుంది. ‘అవును’ విజయానికి పూర్ణ నటన, ఆమె ప్రెజెన్స్ 99 శాతం కారణమని నేననుకుంటాను. దానికి మించి ‘అవును 2’లో అత్యుత్తమంగా నటించింది. హర్షవర్థన్ రాణేకు ‘అవును’లో పెద్దగా పర్ఫామ్ చెయ్యడానికి స్కోప్ లేదు. ఇందులో అతని పర్ఫార్మెన్స్కు మంచి స్కోప్ లభించింది. రెండు రీళ్లు పూర్తిగా అతని నటనమీదే ఆధారపడి ఉంటాయి.
ఎల్ఈడీ బల్బులతో షూటింగ్
లైటింగ్ పాటర్న్‌లో కూడా పూర్తి భిన్నమైన పంథాలో వెళ్లాం. మేం ఒక్కసారి కూడా మేం స్టాండర్డ్ లైటింగ్ ఉపయోగించలేదు. పూర్తి సినిమాని ఎల్ఈడీ బల్బులను ఉపయోగించి తీశాం. ఔట్‌డోర్‌లో నేచురల్ లైటింగ్‌నే ఉపయోగించుకున్నాం. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే సినిమాలోని 60 సీన్లకూ లైటింగ్‌ను ఫిక్స్ చేసేశాం.
రూల్ పెట్టుకున్నా
నేను భూమికతో మూడు సినిమాలు చేశాను. ఇప్పుడు పూర్ణతో మూడు సినిమాలు చేశాను. నేనో రూల్ పెట్టుకున్నా. షూటింగ్‌కు పేకప్ చెప్పాక ఏ రోజూ నేను నా సినిమాలో చేసిన ఏ హీరోయిన్‌కూ కాల్ చెయ్యలేదు. అంతేకాదు. ఆ టైమ్‌లో హీరో హీరోయిన్ల నుంచి కానీ, నా అసిస్టెంట్ దగ్గర నుంచి కానీ ఫోన్లు వస్తే రిసీవ్ చేసుకోను. ఈ రూల్‌ను నేను మొదట్నించీ పాటిస్తూ వస్తున్నా. నా లైఫ్ ఓపెన్ బుక్ లాంటిది. నేనలాంటి వాణ్ణయితే, ఆ హీరోయిన్లు నాతో రెండో సినిమా చెయ్యరు కదా.
అలాంటి పాత్రలు రావట్లేదు
నాకెవరూ వేషాలు ఇవ్వట్లేదు. తొలి చిత్ర దర్శకులు, చిన్న సినిమాల దర్శకులు నాతో చెయ్యడానికి ఉత్సాహం చూపుతున్నారు. పెద్ద దర్శకులెందుకనో నాకు వేషాలు ఆఫర్ చెయ్యట్లేదు. వాళ్ల పాత్రలకు నేను సరిపోనో, ఇంకేంటో నాకు తెలీదు. అయితే నేను కూడా నాకు ఆఫర్ చేసిన అన్ని పాత్రలూ చెయ్యను. ఆ పాత్రలో ఆసక్తికరమైన విషయమేదైనా ఉండాలి. ఆర్టిస్టును దృష్టిలో పెట్టుకుని ఎవరూ పాత్రలు రాయట్లేదు. ఎవరు దొరికితే వాళ్లతో పాత్రలను చేయించేస్తున్నారు. అలాంటి వాటిని నేను వేసినా, వెయ్యకపోయినా ఒక్కటే.
- ఆంధ్రజ్యోతి డైలీ, 1 ఏప్రిల్ 2015
Subscribe to:
Posts (Atom)















