కథ: తన వాళ్ళ కోసం...
తలుపు చప్పుడయ్యింది. "ఎవరూ?" అంటూ సీతారాం మగ్గం ఆపి ఒక పక్కకు వంగి చేతితో తలుపు పూర్తిగా తెరిచాడు. ఈలోగా వంటింట్లో ఉన్న యశోద కూడా అక్కడికొచ్చి గుమ్మం వొద్దున్న అపరిచితుడి వొంక ఆశ్చర్యంగా చూసింది."ఎవరూ?" అన్నాడు సీతారాం భార్య వొంక ప్రశ్నార్థకంగా చూస్తూ.
"ఏమో" అని, "ఎవరు కావాలండీ?" అంది వొచ్చినతనితో.
అతను చిన్నగా నవ్వుతూ లోనికొచ్చాడు. మగ్గంలో ఉన్న సీతారాంని చూస్తూ, "అరే, నేనురా జనార్దన్‌ని" అన్నాడు.
"ఒరే నువ్వా.. ఏంటీ సడన్ విజిట్" అంటూ మగ్గంలోంచి లేచొచ్చాడు.
యశోదకు మిత్రుణ్ణి పరిచయం చేశాడు. ఆమె మళ్లీ వంటింట్లోకెళ్లిపోయింది.
"నేను నమ్మలేకపోతున్నారా, నువ్వేమిటి ఇట్లా బట్టలు నేసుకోవడమేంటి?"
"నేనూ నమ్మలేక పోతున్నా, నువ్విట్లా రావడం."
"నాకు తెలుసు, నువ్వు చాలా అడగాలనుకుంటున్నావ్ కదూ. ఎలా నిన్ను కనుక్కోగలిగానా, ఇప్పుడిక్కడికి ఎందుకొచ్చానా, ఏం చేస్తున్నానా అని అడగాలనుకుంటున్నావ్ కదూ."
జనార్దన్ మారలేదు. వాగుడుకాయ. అలాగే ఉన్నాడు అప్పట్నించీ.
కాలేజీలో ఇద్దరూ సహాధ్యాయులు. సీతారాం అంటే జనార్దన్‌కు మొదట్నించీ ఈర్ష్య. ఎందుకంటే సీతారం అన్ని విషయాల్లోనూ జనార్దన్ కంటే ఒకడుగు ముందుండేవాడు. ఇద్దరి మధ్యా ప్రచ్ఛన్న యుద్ధం (జనార్దన్ వైపు నుంచి) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే దాకా సాగింది. విడిపోయే ముందు "ఇది అంతం కాదు. ఏదో ఓరోజు నీకంటే నేనే ముందుంటాను" అన్నాడు జనార్దన్.
"అరే, అన్నింటినీ అట్లా సీరియస్‌గా తీసుకుంటావెందుకు, నీతో నేనసలు పోటీపడందే" అని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు సీతారాం.
యశోద ఇచ్చిన టీ తాగుతా కబుర్లలో పడ్డారు క్లాస్‌మేట్స్.
"కొంతకాలంగా సొంత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవడంలో బిజీ ఐపోయా. మధ్యమధ్యలో మన కాలేజీ లైఫ్ జ్ఞాపకమొచ్చి బాధపెట్టేది నన్ను. అందులోనూ ముఖ్యంగా నువ్వు జ్ఞాపకం వొచ్చేవాడివి. నేనెట్లా నీపట్ల కుత్సితంగా ప్రవర్తించేదీ గుర్తుకొచ్చి నన్ను మరీ వేధించేది. నా పద్ధతి ఎట్లా ఉన్నా నువ్వు నాపట్ల ఎంత బాగా ఉండిందీ, నాకెలా సాయం చేసిందీ గుర్తు చేసుకునేవాణ్ణి" అని ఆగి, "ఇంతకీ నేనెందుకు వొచ్చిందీ చెప్పలేదు కదూ. ఒక కాన్ఫరెన్స్ పనిమీదొచ్చాను. కొద్ది రోజులు చీరాల్లోనే ఉంటాను. రేపు, ఎల్లుండి కొంచెం బిజీ. శుక్రవారం మధ్యాహ్నం మళ్లా కలుస్తాను. ఆ రోజు నీతోటే ఉంటా. నీకేం అభ్యంతరం ఉండదుగా" అన్నాడు జనార్దన్.
"ఎందుకు అభ్యంతరం? అయినా నేనిక్కడ ఉంటున్న సంగతి ఎట్లా తెలిసింది నీకు?"
"ఇస్మాయిల్ గుర్తున్నాడా? మన పాత కాలేజీ కొలీగ్. పోయినేడు ట్రైన్‌లో నువ్వూ వాడూ కలుసుకుని ఒకరి అడ్రసులు ఒకరు ఇచ్చి పుచ్చుకున్నారటగా, ఉత్తరాలు రాసుకుందామని. ఐతే మామూలుగానే నువ్వు వాడికి రాయలేదనుకుంటా."
"నేను కార్డు రాశానే వాడికి."
"తెలుసులే. ఐనా పొడి పలకరింపులు వర్కవుట్ అవుతాయా. వాడు ఓ రెసిడెన్షియల్ కాలేజీలో లెక్చరర్ గిరీ సంపాదించాడు. అక్కడ ఓ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగితే నాకూ ఆహ్వానం అందింది. అక్కడే మేం కలుసుకున్నాం. కాలేజీ గురించీ, స్నేహితుల గురించీ, ముఖ్యంగా నీ గురించీ మాట్లాడుకున్నాం. నీ స్థితి చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే ఇప్పుడు నీకు ఆశ్చర్యం కల్గించాలని వొచ్చాను, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా."
"ఏంట్రా ఆ మాటలు. నాకిష్టం ఉండకపోవడమేమిటి? సరే. ఇంతకీ నీ సంగతులు చెప్పు."
"చెప్తా, చెప్తా. నేను ప్రస్తుతం రీసెర్చి అసోసియేట్‌గా పనిచేస్తున్నా. త్వరలోనే పూర్తికాలం జియాలజిస్టుని అవుతా. నమ్ముతావా, ఇప్పుడు నేను చాలా కష్టపడి పనిచేస్తున్నానని. మరో మూడు నెలల్లో మా డిపార్ట్‌మెంట్‌కి నేనే హెడ్‌ని కావచ్చు."
"నిజంగా! చాలా ఆనందంగా ఉంది జనార్దన్. నువ్వెప్పుడూ కష్టపడుతూనే ఉంటావ్. డిపార్ట్‌మెంట్ హెడ్‌వి అయ్యాక నాకు తెలియజెయ్యడం మరచిపోకు. అవునూ.. నీ ఫ్యామిలీ గురించి ఒక్క ముక్కా చెప్పలేదు."
"తన పేరు నక్షత్ర. టాటా కన్సల్టెన్సీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఒక్కడే కొడుకు. ఎనిమిదేళ్లు. థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. సరే. ఇంక నీ సంగతి చెప్పు. అన్నిట్లోనూ ముందుండేవాడివి. నువ్వేమిటి ఇట్లా.."
"ఇప్పుడేమైంది. నేను బానే ఉన్నా. ఈ లైఫ్‌లో సెల్ఫ్ శాటిస్‌ఫ్యాక్షన్ ఉంది."
"ఇస్మాయిల్ చెబితే అసలు నమ్మలేకపోయా. నువ్వు నేత నేసుకుంటూ మీ ఊళ్లోనే ఉన్నావంటే - నాకేమీ సంతోషంగా అనిపించలేదు. నీ టాలెంట్ అంతా ఇట్లా వృథా చేసుకుంటున్నావేమిటి? బట్టలు నేయడానికా నీ టాలెంట్‌ని యూజ్ చేస్తోంది?"
జనార్దన్ మాట్లాడుతుంటే మౌనంగా విన్నాడు సీతారాం. తర్వాత మృదువుగా అన్నాడు - "ఎవరన్నారు ఫ్రెండ్ నేను నా వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ ఇక్కడ ఉంటున్నానని. నిజం చెప్పమంటావా? ఇప్పుడు నేను చేస్తున్న పనిలో ఎంత ఆత్మసంతృప్తి ఉందో తెలుసా. నా వాళ్లకోసం పోరాటంలో నేనూ నా వాళ్లకు మల్లే జీవించాలంకున్నా. నా వాళ్లంతా ఇక్కడ కష్టాలు పడుతుంటే నేను పంతులుగా ధర్మపన్నాలు వల్లిస్తూ ఉండలేకపోయా. అందుకే వచ్చేశాను ఇక్కడకి. ఇప్పుడు వీళ్లందర్నీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను?"
మధ్యలో అడ్డుకున్నాడు జనార్దన్.
"ఏమో సీతారాం. అట్లా అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో ఆలోచించు. మనం సంస్కర్తలం కాదు, అందరి గురించీ ఆలోచించడానికి. అందరి దరిద్రం గురించి ఆలోచించే ముందు మన దరిద్రం వదిలించుకునే సంగతి చూడాలి కదా. నిన్ను నమ్ముకున్న నీ భార్యా పిల్లల మాటేమిటి? ఇంతకీ పిల్లలెంతమంది?"
"ఇద్దరు. పెద్దవాడు భరత్. నీ కూతురు వయసే. చిన్నది విముక్త. ఇంకా బడికెళ్లే వయసు రాలేదు. నా భార్యాపిల్లల సంగతంటావా? నా భార్యకీ జీవితంలో అసంతృప్తి ఉందని నేననుకోవడం లేదు. తను కూడా నాకు బాగా కో-ఆపరేట్ చేస్తోంది. తను గ్రాడ్యుయేట్.. యశోదా.." అంటూ భార్యని పిలిచాడు.
ఆమె వొచ్చింది. వంట చేస్తున్నా శుచిగానే ఉంది. ఆమె ముఖంలో ఏదో కాంతి. జనార్దన్ అనుకున్నాడు మనసులో - 'ఈమె అందమంతా, ఈమె సొగసునంతా సీతారాం వేస్టు చేస్తున్నాడు'.
"యశోదా.. మా వాడేమంటున్నాడో తెలుసా? నీకు అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడుతున్నాడు. నువ్వేదో అసంతృప్తితో వున్నట్లు ఫీలవుతున్నాడు."
యశోద నవ్వింది. ఆ నవ్వు చాలా సజీవంగా ఉంది. ఆ నవ్వులో నిర్లిప్తత కానీ, అసంతృప్తి కానీ రవ్వంత కూడా కనిపించకపోవడం చూసి జనార్దన్ తికమకపడ్డాడు.
"మీరు చాలా పొరబడుతున్నారల్లే ఉంది. ఈయన ఈ జీవితాన్ని కోరుకున్నప్పుడు ముందు సందేహించాను. ఇప్పుడు ఈ జీవితం కంటే గొప్ప ఇంకేముంటుంది అనిపిస్తోంది. ఒక లెక్చరర్‌గా పనిచేస్తే ఆయన ఏం సాధించేవాడు. ఆ టెక్స్ట్బ్ బుక్స్‌లో ఉన్న చెత్తనంతా స్టూడెంట్స్ మెదళ్లకి ఎక్కించేవాడు. ఇప్పుడో.. ఆయన నాయకుడి స్థానంలో ఉన్నాడు. నేతగాళ్లలో ఎక్కువమంది ఆయనను అనుసరిస్తున్నారు. ఆయన మూలంగా నాకూ ఇక్కడ ఒక గౌరవ స్థానం దక్కింది. ఒకవేళ ఆయన ఇదికాక ఇంకో ఉద్యోగం చూసుకుంటానంటే ముందుగా వ్యతిరేకించేది నేనే."
యశోద మాటలకు జనార్దన్ నిశ్శబ్దమై పోయాడు. కొద్ది క్షణాలు ఏం చెప్పాలో అర్థంకాలేదు.
మగ్గం వంక చూశాడు. అంతా గజిబిజిగా అగుపించింది. ఏవేవో చెక్కలు, నూలుపోగులు, దారాలు, పై నుంచి కిందికి వేలాడుతూ నైలాన్ దారాలు. అదేదో గుండ్రంగా పొడవుగా ఉన్న దానికి చుట్టుకొని బట్ట, ఒక పళ్ల చక్రం.. 'దీంతోటి పనా? ఏం ఖర్మ పట్టింది వీడికి?' అనుకున్నాడు మళ్లీ.
"భోజనం చేద్దువుగానీ పదరా" అన్న సీతారాం మాటలకు మామూలయి, "లేదురా. నేనిక్కడ ఇప్పుడు భోజనం చెయ్యలేను. అవతల మాటిచ్చి వొచ్చాను. చెప్పాను కదా, శుక్రవారం వస్తానని. అప్పుడు భోజనం చేస్తాను. ఆ రోజూ, ఆ తర్వాతి రోజూ కూడా నీతోటే ఎక్కువగా గడుపుతాను" అంటో జనార్దన్ వెళ్లిపోయాడు.
పాత కాలేజీ మిత్రుడు కలిసినందుకు సీతారాం ఆనందపడ్డాడు. ఇద్దరూ స్నేహంగానే ఉండేవాళ్లు కానీ స్వభావరీత్యా వేర్వేరుగా కనిపిస్తారు. జనార్దన్ ఒట్టి కెరీర్ మైండెడ్ పర్సన్ ఐతే సీతారాం అందుకు పూర్తి విరుద్ధం. ఎమైనా చాన్నాళ్ల తర్వాత కలిసిన జనార్దన్ మాటలు సీతారాంలో ఆలోచనలు రేకెత్తించాయి.
ఆ రాత్రి చాలాసేపటి దాకా కళ్లమీదికి కునుకు రాలేదు.
తమ మధ్య జరిగిన సంభాషణలే మాటిమాటికీ మనసుని తొలుస్తున్నాయి. జనార్దన్ మారలేదు. అదే మైండ్‌సెట్‌తో ఉన్నాడు. పోనీ తను మారాడా? తనవాళ్లను చూసుకుని తను తృప్తి పడుతున్నాడు. షావుకార్లు కూలీలు బాగా తగ్గించేసినప్పుడు తను వాళ్లకి ధైర్యంచెప్పి, 'మగ్గాల సమ్మె' చేయించి, వాళ్లలో చైతన్యం తీసుకురావడానికి నాటికలు తయారుచేసి ఆడించి, పాటలు కట్టి, పాడించి.. అదెంత బాగుంది?
షావుకార్లందరికీ తను పగవాడైపోయినా తన నేతగాళ్లకి తాను ఆలంబనగా మారాడు. అమానాన్నలు తన భవిష్యత్తు గురించి బెంగపడినా తన యశోద తనకి అండగా నిలిచి ముందుకు నడిపించింది. ఐతే.. ఐతే.. తను లేకపోతే నేతగాళ్లు బతకలేరా. తను కాకపోతే ఇంకొకరు తన స్థానంలో వొచ్చి ఉండేవాళ్లు కాదా. నేతగాళ్ల బాధల్ని ఓవర్‌గా ఫీలయ్యి నెత్తిమీదికెత్తుకున్నాడా తను? నిజంగా తను ఆ కాలేజీలో పనిచేస్తూ ఉండినట్లయితే లైఫ్‌లో తనకి ఈ స్ట్రగుల్ ఉండేది కాదుకదా. తన పిల్లలు ఏ చీకూ చింతా లేకుండా, ఏ గొడవలూ లేకుండా ప్రశాంతంగా బతికేవాళ్లు కదా.
తను పొరబాటు చేశాడా?.. ఈ ఆలోచనలు అతణ్ణి నిద్రకు దూరం చేశాయి. అవి అతణ్ణి కుదిపి, కదిపి, ప్రశ్నించి, పదేపదే జ్ఞప్తిచేసి కానీ వొదిలిపెట్టలేదు.
మరుసటి రోజు ఉదయం సీతారాం ముఖం చూసి, "మీ ఫ్రెండ్ నిన్ను బాగా డిస్టర్బ్ చేసినట్లున్నాడే" అంది యశోద. సాధారణంగా రైలుకట్ట కాడికి వెళ్లొచ్చిన వెంటనే మగ్గంలోకి వెళ్తాడు సీతారాం. ఆ రోజు చెంబుకెళ్లొచ్చి చాలాసేపయినా మగ్గంలోకి వెళ్లకుండా కింద గచ్చుమీద కూర్చుని ఆలోచిస్తున్నాడు.
చూసి, తనే వెళ్లింది మగ్గంలోకి, యశోద. 'పలక' లాగి కొట్టడంతోటే ఉలిక్కిపడి ఆమె వొంక చూశాడు. ఆమె అన్న మాటలు అప్పుడే విన్నట్లు "అవును యశూ, రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు" అన్నాడు - ఆమె నేస్తుంటే అటూ ఇటూ తిరుగుతున్న నాడి వొంక చూస్తూ. నాడికి గుచ్చిన కండె నుంచి పోగు అలవోకగా వస్తూ బట్టని నేస్తోంది.
"ఏం బాగాలేదు. ఈ మాత్రానికే డిస్టర్బ్ అయితే ఇంక నువ్వు ఏం సాధించగలవు. 'గుంట మగ్గం' ఫలితం లేకుండానే మాయమైపోవడం సంగతి ఊహించుకో. ఆ ఒక్క నాటిక ఎంత మందిని కదిలించిందీ, మరెంతమందిని భయపెట్టిందీ జ్ఞప్తికి తెచ్చుకో. నీ పాత స్నేహితుడు కలిసి 'ఇదేం బతుకు' అన్నంత మాత్రానే నీరుకారిపోతావా? అసలు నువ్వు నువ్వేనా?" యశోద గొంతులో బాధ ధ్వనించినా అందులో స్థిరత్వం ఉంది. సీతారాం మాట్లాడలేకపోయాడు. తల కూడా ఎత్తలేకపోయాడు.
"మనం సాధించాలి. సాధించలేక పోయినా అందుకు మనం సాధనంగా నేతగాళ్లకు ఉపయోగపడాలి. ఇదే కదా ఇక్కడికి వొచ్చే ముందు నువ్వు నాకు చెప్పింది. నా సీత గురించి అప్పుడు ఎంత ఆనందపడ్డాను. నా భర్త ఉన్నతుడని ఎంతగా గర్వపడ్డాను. మనస్ఫూర్తిగా వొచ్చానిక్కడికి. వొచ్చాక నా నమ్మకం ఇంకా బలపడింది. నీ వల్ల నాక్కూడా గౌరవం పెరిగిందనేది నిజం. నీ వల్ల నేనూ ప్రేరణపొందాననేది నిజం. కానీ ఇప్పుడేమిటి ఇట్లా.."
"అది కాదు యశూ.. మన పిల్లల సంగతి..."
"ఏమవుతుంది మన పిల్లలకి. మన నేతగాళ్ల పిల్లల మాదిరే వాళ్లూ పెరుగుతారు. వాళ్లు పెద్దయ్యాక నేతగాళ్ల బతుకులు ఇప్పటిలాగానే ఉంటే వాళ్లూ నాలాగా, నీలాగా అవుతారు. అట్లా కావడం నీకిష్టం లేదా?"
ఆ మాటలతో సీతారాంకు తన పొరబాటు తెలిసొచ్చింది. తన ఆలోచనల్లోని తప్పు తెలిసొచ్చింది. "సారీ యశూ. నువ్వు నా అర్ధాంగివి అయినందుకు గర్వపడ్తున్నాను. సరే. లే. నేను వెళ్తాను మగ్గంలోకి" అన్నాడు.
శుక్రవారం ఉదయం పదకొండయ్యేసరికల్లా వొచ్చాడు జనార్దన్.
"ఏమో అనుకున్నా గానీ నీ పేరు చెబితే చాలు ఇక్కడ ఎంత గొప్పగా చెబుతున్నారో నీ గురించి. ఐతే ఒక్కటే బాధ నాకు. ఈ పేరువల్ల ఆర్థికంగా నీకు కలిగే లాభమేమీ లేదు కదా" అన్నాడు. పక్కనే అల్మరాలో ఏదో కాయితం కనిపించి తీశాడు.
నాడిలో కండె అయిపోవడంతో ఊచ తీసేసి ఇంకో కండె గుచ్చి పలకలోకి నెట్టాడు సీతారాం. తల మీదనుంచి చెమట బొట్టులు కారుతున్నా పట్టించుకోకుండా నేస్తున్నాడు.
"డబ్బు కోసమే ఐతే నేనిక్కడికి వొచ్చేవాణ్ణే కాదు కదా. ఈ కష్టాన్ని ఆహ్వానించే ఈ వృత్తిని స్వీకరించాను. ఇందులో ఉన్న కష్టాన్ని అనుభవిస్తేనే కదా నేతగాళ్ల బాధలు నాకు తెలిసేది."
సీతారాం చెప్పింది జనార్దన్ వినిపించుకోలేదు. చేతిలో ఉన్న కాయితంలోని అక్షరాల వొంక చూస్తున్నాడు, ఆశ్చర్యంగా.
"ఎవరు రాశారిది?" అడిగాడు. టీ తెస్తున్న యశోద అంది "అదా.. ఇంకెవరు రాస్తారు. మీ స్నేహితుడే."
పైకి చదివి నిట్టూర్చాడు జనార్దన్.
"ఏమైందిరా?" అడిగాడు సీతారాం.
"నీతో నన్ను పోల్చుకుంటున్నాను. మొన్న నీతో అన్న మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను. నీకంటే ఎన్నో రెట్లు పైన ఉన్నానని అప్పుడు గర్వించానా. ఈ రెండు రోజుల్లో నీ గురించిన సంగతులు విని, నీ జీవితం, నా జీవితం పోల్చుకుని ఆలోచిస్తే వ్యక్తిగా, మనిషిగా నాకంటే నువ్వే ఎంతో ఎత్తులో ఉన్నట్లు అర్థమయ్యింది నాకు."
"అరే.. ఎందుకురా అంతంత పెద్ద మాటలు. నా వాళ్ల కోసం నేను ఎంచుకున్న మార్గం ఇది. నీ కెరీర్ కోసం నీవెంచుకున్న మార్గం అది. దేని ప్రాధాన్యం దానిదే."
"లేదురా. నువ్వలాగే అంటావు. నేను జియాలజిస్టుని. నా ఉపయోగం చాలా కొద్దిమందికే. మా ఇంటి చుట్టుపక్కల చాలామందికి నేనెవరినో, ఏం చేస్తుంటానో కూడా తెలీదు. ఇంక నాకున్న ఒకే ఒక్క కొడుకుని పట్టించుకునే తీరిక నాకు గానీ, నా భార్యకుగానీ లేదు. వాడి ఒంటరితనం మా మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఇప్పుడు వాడు వాడి స్నేహితుల మాట తప్ప మా మాట వినడు. వచ్చే యేడు వాణ్ణి బోర్డింగ్ స్కూల్లో వెయ్యాలని కూడా నిర్ణయించుకున్నాం. కానీ నీ స్థితి చూడు. నీ గురించి నీ ఇంటి చుట్టుపక్కల వాళ్లకే కాదు, పక్క వూళ్ల వాళ్లకి కూడా బాగా తెలుసు. పదులు వందలు కాదు, వేలమందికి నీ వల్ల ఉపయోగం కలుగుతోంది. ఇంక నీ భార్యాపిల్లల సంగతే చూడు. నీకు అన్ని విధాలుగా సాయపడే భార్య. వీధిబడిలో చదువుతున్నా నీ కొడుకు మీతో హాయిగా, ఆనందంగా గడపగలుగుతున్నాడు. మీ వాడికి ఒంటరితనం సమస్యే రాదు. మీదిరా 'ఆదర్శ కుటుంబం' అంటే" అన్నాడు. అప్రయత్నంగా అతడి కళ్లు తడయ్యాయి.
స్నేహితుడు అట్లా బాధపడేసరికి సీతారాం, "అరే ఏమిట్రా చిన్నపిల్లాడిలా కదిలిపోతావ్. కాలేజీలో ఎప్పుడూ నిన్నిట్లా చూడలేదే!" అన్నాడు వాటు వెయ్యడం ఆపేసి.
కళ్లు తుడుచుకొని చిన్నగా నవ్వుతూ "ఏంటోరా.. నా యాంత్రిక జీవనాన్ని, నీ జీవితంతో పోల్చుకునేసరికి నేనేం పోగొట్టుకుంటున్నానో తెలిసి.. బరస్టయ్యాను. ఏమైనా అయ్యాం వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ యు మై ఫ్రెండ్. నీలాంటి వాడు నా స్నేహితుడైనందుకు చాలా గర్వంగా ఉంది. ఇంక నీ చరిత్ర కూడా పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. రేపటిదాకా ఉంటాను కదా. మా చెల్లెమ్మ చేత చెప్పించుకుంటాలే. ఆ తర్వాత ఆ చరిత్రని మా వాళ్లకు చెప్తాను" అన్నాడు తృప్తిగా జనార్దన్.
No comments:
Post a Comment