'సాజ్' - షబానా అజ్మీ నటించిన చిత్రం. సాయి పరాంజపే దర్శకత్వం వహించిన చిత్రం. సున్నితమైన, కదిలే చిత్రంవంటి మానవ ప్రకృతిని 'సాజ్' మన కళ్ల ముందుంచుతుంది. జూన్ 28న స్టార్ ప్లస్ చానల్ 'సాజ్' వరల్డ్ ప్రీమియర్‌ని ప్రసారం చేసింది. పరాంజపే సినిమాల్లో తొలిసారిగా ఓ టెలివిజన్ చానల్లో ప్రీమియర్‌గా ప్రసారమైన సినిమా 'సాజ్'.
చిత్ర కథలోకి వెళ్తే - మాన్సి (అరుణా ఇరాని)కి గొప్ప నేపథ్య గాయని కావాలని ఆశ. మాన్సి చెల్లెలు బన్సి (షబానా అజ్మి). పెళ్లయిన బన్సీని ఆమె భర్త తరచూ హింసిస్తుంటాడు. ఓమారు మాన్సి ఇంటికి వెళ్తుంది బన్సి. అక్కడ గోడమీద ఓ ఫొటో ఆకర్షిస్తుంది. అందులో తనూ, మాన్సీ హార్మోనియం పెట్టె ముందేసుకుని పాడుతుంటారు. బన్సీలో భావావేశం పొంగుతుంది. అక్కడే ఉన్న హార్మోనియం అందుకుని పాడుతుంది. అప్పుడే మాన్సి సలహాదారూ, ప్రియుడూ అయిన ఇందర్ వచ్చి ఆమె గానానికి అచ్చెరువొందుతాడు. బన్సీలో అద్భుత గాయని దాగుందని అతడు గ్రహిస్తాడు. ఆమెకి గాయనిగా అవకాశం ఇవ్వాలనుకుంటాడు. అయితే బన్సీ చేత తను పాడిస్తాననీ, ఇదరమూ కలిసే పాడతామనీ బన్సీని తనతో పాటు తీసుకుపోతుంది మాన్సి. రికార్డింగ్ రోజున మాన్సి పాట మొదలుపెడుతుంది. 'రింజిం రింజిం' అంటూ కోరస్ పాడుతుంది బన్సి. తర్వాతి చరణం ఆమె పాడాలనుకునేంతలో అది కూడా, అది మాత్రమే కాదు పాట మొత్తం మాన్సినే పాడుతుంది. బన్సీకి పాడేందుకు 'రింజిం రింజిం' మాత్రమే మిగులుతుంది. అక్క చేసిన మోసానికి బన్సీకి దఃఖం తన్నుకువస్తుంది. ఏడుస్తున్న బన్సీని మాన్సి ఓదారుస్తుంది. తన మనసులో ఎట్లాంటి దురుద్దేశమూ లేదని నమ్మకంగా చెబుతుంది. బన్సి నమ్ముతుంది.
అయితే ఇందర్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. లోకానికి ఓ కొత్త, అపురూప గాయనిని పరిచయం చేయాలని అతను తలపోస్తున్నాడు. అనుకున్నట్లే బన్సీకి స్వతంత్రంగా పాడే అవకాశాన్ని కల్పిస్తాడు. మొదటి పాటతోనే బన్సి పేరు మోగిపోతుంది. సినిమా పత్రికలన్నీ బన్సీని ఆకాశానికెత్తేస్తూ కథనాలు రాస్తాయి. అవి చూసిన మాన్సి అసూయతో దహించుకుపోతుంది. అప్పటికే బన్సి గర్భవతి. పాపను కంటుంది. బన్సి ప్లేబ్యాక్ సింగర్‌గా పాపులర్ అవుతుంది. ఆమె ఖ్యాతి ఢిల్లీ వరకు పాకుతుంది. ఆగస్ట్ 15న ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య వేడుకల్లో పాడే అవకాశం వస్తుంది. సంతోషంతో ఉప్పొంగిపోతుంది బన్సి. అయితే ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆగస్ట్ 15న జరిగే కార్యక్రమానికి హాజరుకమ్మని ఆమెకు ఎలాంటి ఆహ్వానమూ అందదు. బన్సి ఊహించని విధంగా ఆగస్ట్ 15న మాన్సి పాడుతూ టీవీలో కనిపిస్తుంది. మాన్సి సంగతంతా ఆమెకు బోధపడుతుంది.
ఆ తర్వాత ఎన్నో సంఘటనలు జరిగిపోతాయి. మాన్సికి బ్లడ్ కేన్సర్ సోకి చనిపోతుంది. బన్సి అభిమానించిన ఇందర్ తానింక ఇండస్ట్రీలో ఉండలేననీ, తనని మన్నించమనీ వెళ్లిపోతాడు. బన్సి కూతురు కుహు (ఆయేషా ధర్కర్) పెద్దదై ఓ మ్యూజిక్ కంపెనీలో చేరుతుంది. తల్లికి తన మ్యూజిక్ డైరెక్టర్ (జాకిర్ హుస్సేన్)ను పరిచయం చేస్తుంది. జాకిర్ తొలి పరిచయంతోనే బన్సీని అభిమానిస్తాడు. అప్పటికి బన్సి తన గొప్ప స్వరాన్ని కోల్పోతుంది. అయినా జాకిర్ ఆమెను ఆరాధిస్తాడు. ఈ సంగతి నేరుగా ఆమెకే చెప్తాడు. బన్సి తేలిగ్గా తీసుకొని "నీకంటే పదేళ్లు పెద్దదాన్ని. నాతో పెళ్లేంటి. నాకు అంత పెద్ద కూతురుంటే" అంటుంది. అవేమీ తనకి అడ్డు కాదంటాడు జాకిర్. పెళ్లి చేసుకుందామని ఆమెపై ఒత్తిడి తెస్తాడు. ఎటూ తేల్చుకోలేక సైకియాట్రిస్టు, స్నేహితుడు అయిన పరీక్షిత్ సహానీని సలహా అడుగుతుంది. కుహుకి కూడా ఈ సంగతి చెప్పమని అతను సలహా ఇస్తాడు. అట్లాగే చెబుదామనుకుంటే ఈలోగా కుహు తను జాకిర్‌ని ప్రేమిస్తునాననీ, అతన్ని పెళ్లి చేసుకుంటాననీ చెబుతుంది. తల్లీ కూతుళ్లిద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లాడాలనుకోవడమా? బన్సీకి చేష్టలు దక్కిపోతాయి. జాకిర్ వద్దకు వెళ్లిన కుహుకి అసలు విషయం తెలిసి తల్లిని అసహ్యించుకుంటుంది. బన్సి తన పరిధులు తెలుసుకుని జాకిర్ ప్రేమని తిరస్కరిస్తుంది. నిరాశతో జాకిర్ వెళ్లిపోతాడు. కూతురికి సన్నిహితం కావడానికి యత్నిస్తుంది బన్సి. కుహుకి సీషెల్స్‌లో ప్రదర్శన ఇచ్చే అవకాశం వస్తుంది. కూతురితో వెళ్లేముందు పరీక్షిత్‌ని కలుస్తుంది బన్సి. అక్కడి అనుభవాలు తనకు ఎప్పటికప్పుడు తెలపమంటాడతను. సీషెల్స్‌లో ప్రదర్శన ఇవ్వకముందే కుహుకి జాతీయ ఉత్తమ గాయని అవార్డ్ వచ్చిన కబురందుతుంది. ఆ సంతోషంలో తనూ స్టేజి మీద పాట పాడుతుంది బన్సి. తల్లిలో వచ్చిన మార్పు చూసి కుహు ఆమెకి మళ్లీ చేరువవుతుంది. ఈ సంగతులన్నీ పరీక్షిత్‌కి ఉత్తరంలో రాస్తుంది. ఇండియాలో ప్లేన్ దిగి బయటకు వచ్చేసరికి పరీక్షిత్ ఎదురు చూస్తుంటాడు. బన్సి అతన్ని కలుస్తుంది. సినిమా పూర్తవుతుంది.
బన్సీగా షబానా తనదైన శైలిలో గొప్పగా నటించింది. బన్సి పాత్ర మానసిక పరిణామాల్ని షబానా చక్కగా ప్రదర్శించింది. ఉదాత్త సన్నివేశాల్లో తనకి తానే సాటి అని నిరూపించుకుంది. అయితే తల్లి కాకముందు యువతిగా ఆమెకు మేకప్ సరిగా నప్పలేదు. వయసు మీదపడుతున్న ఛాయలు స్పష్టంగా కనిపించాయి. నలభై యేళ్ల ప్రౌఢ స్త్రీగానే షబానా అందంగా అగుపించింది. హిందీ సినిమాల్లో వాంప్ పాత్రలు, తల్లి పాత్రలు వేస్తున్న అరుణా ఇరానీ చెల్లెలి మీద అసూయతో నిండిన పాత్రలో రాణించింది. బన్సి కూతురుగా ఆయేషా ధర్కర్ చలాకీగా చేసింది. ఆమె చిరునవ్వు ముఖం పాత్రకి సరిగ్గా అమిరింది. పరీక్షిత్ సహానీది నటనని ప్రదర్శించే అవకాశమున్న పాత్ర కాకపోవడంతో సాదాగా అగుపించాడు. ఇక షబానాతో పాటు ఎక్కువ మార్కులు కొట్టేసింది జాకిర్ హుస్సేన్. మంచి తబలా విద్వాంసుడిగా మాత్రమే పరిచయమున్న జాకిర్ యువ సంగీతకారుడి పాత్రని చాలా సునాయాసంగా చేసి ప్రశంసలందుకున్నాడు. చిత్రంలో పాటలు, సంగీతం బాగా కుదిరాయి. అనీ సందర్భోచిత పాటలే. 'కథ', 'స్పర్శ్', 'చష్మేబుద్దూర్' సినిమాల తర్వాత సాయి పరాంజపే సినిమాల్లో 'సాజ్' ఆ స్థాయిలో నిలుస్తుందని ఆశించవచ్చు.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 11 జూలై 1997
No comments:
Post a Comment