తారాగణం: వడ్డే నవీన్, ప్రేమ, రుచిత, హీరా, ఉత్తర, నాగబాబు, చలపతిరావు, చంద్రమోహన్, గిరిబాబు
సంగీతం: ఎస్.ఎ. రాజ్‌కుమార్
నిర్మాత: చిన్నచౌదరి అంజిరెడ్డి
దర్శకుడు: శరత్
ఓ మామూలు ప్రేమకథకి చిన్న సెంటిమెంట్ ట్విస్ట్ ఇచ్చి తీసిన చిత్రం 'చెలికాడు'. కాకపోతే ఇందులో ముగ్గురు+ఒకరు మొత్తం నలుగురు అమ్మాయిలు హీరో ప్రేమ కోసం వెంపర్లాడుతూ కనిపిస్తారు. సదరు హీరో ధీర గంభీరుడు కావడంతో ఆఖరి రీలు వచ్చేదాకా అటు నాయికలనీ, ఇటు ప్రేక్షకుల్నీ సస్పెన్స్‌లో పెట్టి వినోదిస్తాడు.
గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూళ్లో ముగ్గురు ప్రాణ స్నేహితులు - చలపతి (చలపతిరావు), చంద్రం (చంద్రమోహన్), గిరి (గిరిబాబు) ఉంటారు. ముగ్గురిలో ఓ ఒక్కరికోసమైనా మిగతా ఇద్దరు అవసరమైతే ప్రాణమైనా సరే ఏమాత్రం కష్టమనుకోకుండా ఇచ్చేస్తారు. వాళ్ల ముగ్గురు కూతుళ్లు (ఒక్కొక్కరికి సరిగ్గా ఒక్కో కూతురే ఉంటారు) లిఖిత (హీరా), శారద (రుచిత), నిర్మల (ప్రేమ) పట్నంలో చదువుతుంటారు. తండ్రులకి మల్లే వాళ్లు కూడా ప్రాణ స్నేహితులే. అయితే ముగ్గురివీ మూడు భిన్న మనస్తత్వాలు. లిఖిత దేనినైనా సరే డబ్బుతో కొనేయగలనని నమ్ముతుంటుంది. స్త్రీకి ధైర్య సాహసాలు అవసరమని చెప్పి కసరత్తులు చేస్తుంటుంది నిర్మల. ఇక శారదకి పుస్తకాలు తప్ప (క్లాసు పుస్తకాలు మాత్రమే) మరో లోకం ఉండదు.
ఉన్నట్లుండి ఒకానొక రోజు రాము (నవీన్) అనే పల్లెటూరి కుర్రోడు జీవనోపాధి కోసం తన పల్లెని విడిచి పట్నం వచ్చి బాబుమోహన్ సాయంతో ముగ్గురమ్మాయిల ఇంటి ముందు టీకొట్టు పెడతాడు. ముందు చీదరగా భావించి టీకొట్టు తీసేయమని హుంకరించిన ముగ్గురమ్మాయిలు ఒకానొక రాత్రివేళలో తోటి మగ విద్యార్థుల చేత తమ ఇంటిముందే దౌర్జన్యానికి గురవుతుండగా రాము వాళ్లని చితకబాది తమని రక్షించడంతో ముగ్గురూ అతని మీద మనసు పారేసుకుంటారు. జరిగిన గొడవ కారణంగా టీకొట్టు ఎత్తేసి తిరిగి పల్లెకి పోవాలనుకుంటున్న రాముని నిలువరిస్తారు. లిఖిత డబ్బు తెచ్చి (బాబుదే కదా) రాముచేత ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టిస్తుంది. నిర్మల కసరత్తులతో ధైర్య సాహసాలు నేర్పిస్తుంది. శారద చదువు చెబుతుంది. దాంతో మిగతా మగవాళ్లు దశాబ్దాలు కృషిచేసినా సాధించలేని పరిపూర్ణతని రాము నెలల్లోనే సాధించేస్తాడు. ఈలోగా ముగ్గురు హీరోయిన్లూ రాముతో కలల్లో డ్యూయెట్లు పాడేసుకుంటారు. అతని ప్రేమని ఎలాగైనా పొందాలనే పట్టుదలతో చలపతిని ఒప్పించి తమ ఆస్తినంతా స్యూరిటీగా పెట్టి రాముకి లోను ఇప్పించి అతనిచేత స్టార్ హోటల్‌ని కట్టిపిస్తుంది లిఖిత.
రాజేంద్ర (నాగబాబు) అనే మిలియనీర్ ఇంటికి రాము వెళ్లినప్పుడు అతని చెల్లెలు ప్రమీల (ఉత్తర) తొలిచూపులోనే రాముని ప్రేమిస్తుంది. ఆ తర్వాత తాను రాముని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అన్నతో చెప్తుంది. రాజేంద్రది చెల్లెలి కోసం ఖూనీలు చేయడానికి కూడా వెనుకాడని మనస్తత్వం. ఈలోగా వేలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) వస్తుంది. అంతదాకా తాము ప్రేమిస్తోంది ఒక్కరినే అనే సంగతి తెలీదు కాబట్టి ముగ్గురు స్నేహితురాళ్లు ఆరోజు గ్రీటింగ్స్‌తో తమ ప్రేమని చెబుతామని ఒకేసారి ఠంచన్‌గా వస్తారు. రాము అభిప్రాయం తెలుసుకోకుండానే మరోపక్క మందీ మార్బలంతో అదే సమయానికి నిశ్చితార్థం కోసం వస్తాడు రాజేంద్ర. అప్పుడు ముగ్గురు స్నేహితురాళ్లకీ తాము ఒక్కరినే ప్రేమిస్తున్నామనే సంగతి తెలుస్తుంది. 'నాకు తెలీకుండా నువ్వెందుకు ప్రేమించావు' అని ఒకర్నొకరు తిట్టుకుంటారు. ముగ్గురు ఈసారి విడివిడిగా వెళ్లి తమని ప్రేమిస్తున్నామని చెప్పకపోతే చచ్చిపోతామని బెదిరిస్తారు. ఏ సంగతీ ఆదివారం చెప్తానంటాడు రాము. మరోపక్క తన చెల్లెల్ని చేసుకోవడానికి రాము తిరస్కరించడంతో ఆగ్రహోదగ్రుడై శాలిని హోటల్‌ని బ్లాస్ట్ చేయడానికి మనుషుల్ని పంపిస్తాడు రాజేంద్ర. అయితే అతని చెల్లెలు ప్రమీల ద్వారా విషయం తెలుసుకున్న రాము తన హోటల్‌ని కాపాడుకుంటాడు కానీ గాయాల పాలవుతాడు. హాస్పిటల్లో అతనికి రక్తం అవసరమవుతుంది. ముగ్గురు మిత్రురాళ్లు పోటీల మీద తమ రక్తం ఇవ్వడానికి సిద్ధపడతారు. ఎవరి రక్తమూ రాము రక్తంతో సరిపోదు. మొత్తానికి రాము త్వరగానే కోలుకుంటాడు. అప్పుడే రాముకి డాక్టర్ ఓ భయంకర వాస్తవాన్ని చెప్తాడు. రాము నిర్ఘాంతపోతాడు. ఆవేదనతో కదిలిపోతాడు. శారదకి బ్లడ్ క్యాన్సర్! ఆమె ఎన్నో రోజులు బతికే అవకాశం లేదు కాబట్టి ఆఖరి రోజుల్లో ఆమెకి సంతోషం కలిగించే ఉద్దేశంతో ఆమెని పెళ్లి చేసుకుంటానంటాడు. ముందు రాముని చీత్కరించిన మిగతా ఇద్దరు అసలు విషయం తెలిశాక రియలైజ్ అవుతారు. రాము, శారద పెళ్లి జరిగే సమయానికి శారదని రాజేంద్ర కిడ్నాప్ చేయించి ఆమె బతకాలంటే తన చెల్లెల్ని పెళ్లి చేసుకోమని రాముని బెదిరిస్తాడు. జరిగిన సంగతి తెలుసుకున్న ప్రమీల అన్నయ్య చర్యని అసహ్యించుకుంటుంది. జ్ఞానోదయమైన రాజేంద్ర తానే స్వయంగా బావిలో పడిపోతున్న శారదని కాపాడతాడు. పెళ్లయ్యాక వైద్య చికిత్స కోసం బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో అమెరికాకి శారదని తీసుకుపోతాడు రాము.
నవీన్ నటించగా విడుదలైన చిత్రాల్లో రెండోది 'చెలికాడు'. ముఖంలో హావభావాల్ని పలికించకపోయినా పాటలు, ఫైట్లలో ఫర్వాలేదనిపించాడు. మున్ముందు నటనలో రాణిస్తాడని ఆశించవచ్చు. ముగ్గురు స్నేహితురాళ్లుగా రుచిత, హీరా, ప్రేమలలో ప్రేమ ఒక మార్కు ఎక్కువ కొట్టేసింది. రుచితకి మేకప్ మరీ ఎక్కువైనట్లు తోచింది. నాగబాబు చాలా రోజుల తర్వాత నటనకి అవకాశంలేని పాత్రని అంగీకరించడం సరదాకోసమై ఉండొచ్చు. ఇక చంద్రమోహన్, గిరిబాబు, చలపతిరావు ప్రాణ స్నేహితులుగా బాగా నప్పారు. ఈటీవీలో లేడీ డిటెక్టివ్‌గా నటిస్తున్న ఉత్తర ఉన్నది కొద్ది సన్నివేశాల్లో అయినా రాజేంద్ర చెల్లెలి పాత్రలో అందంగా కనిపించింది. బాబూమోహన్, కాస్ట్యూమ్స్ కృష్ణ, మల్లికార్జునరావు, శ్రీలక్ష్మిపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు కొంచెం రిలీఫ్‌నిస్తాయి. చిత్రంలో విచిత్రమనిపించే సంగతులున్నాయి. ముగ్గురు స్నేహితుల భార్యలు చిత్రంలో కనిపించరు. వాళ్లు ఉన్నారో లేదో సినిమా పూర్తయ్యాక కూడా మనకు తెలీదు. చిత్రంగా ముగ్గురికీ కూతుళ్లే పుడతారు. అదీ ఒక్కరు చొప్పున. కూతురి మాటమీద అనామకుడెవరో హోటల్ కట్టుకోడానికి అవసరమైన లోన్‌కి సంబంధించి ఆస్తినంతా స్యూరిటీ కింద పెట్టే తండ్రులు మనకి నిజ జీవితంలో కోటికి ఒకరు కూడా ఉండరు. ఈ సినిమాలో మాత్రం అది అతి సునాయాసంగా జరిగిపోతుంది. హీరో టీకొట్టు స్థాయి నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్థాయికి, అక్కణ్ణించి స్టార్ హోటల్ రేంజికి ఎదిగే ప్రస్థానంలో తీసుకున్న కాలం ఎంతటి వాడికైనా అసాధ్యం. కానీ మన హీరోకి అది కూడా నల్లేరు మీద బండి నడక. హీరోయిన్ల చదువు పూర్తి కాకముందే అతడు కోటీశ్వరుడైపోవడం ప్రపంచ వింత. ఎస్.ఎ. రాజ్‌కుమార్ సంగీతం బాగుంది. డైలాగులు కుదిరాయి. చిత్రీకరణ ఫర్వాలేదు. మొత్తానికి కథనంలో కొత్తదనం లేకపోయినా ఒకసారి మాత్రం చూడదగ్గ యావరేజ్ సినిమా 'చెలికాడు'.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 11 జూలై 1997
No comments:
Post a Comment