Sunday, May 27, 2012
హారర్ సినిమాలు ఇష్టం
బాలీవుడ్‌లో వరుసగా రెండు యాక్షన్ సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రభుదేవా ఇప్పుడు జనాన్ని భయపెట్టే హారర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. సల్మాన్‌ఖాన్, ఆయేషా తకియా జంటగా రూపొందించిన 'వాంటెడ్' ('పోకిరి' రీమేక్)తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతను దాని తర్వాత అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా జంటగా 'రౌడీ రాథోర్' ('విక్రమార్కుడు' రీమేక్)ను రూపొందించాడు. కొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండూ యాక్షన్ సినిమాలే. "నా కంటే ఎక్కువగా జనం నేను యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. కానీ నాకేమో హారర్ సినిమాలు చేయాలంటే ఇష్టం'' అని తెలిపాడు ప్రభుదేవా. దక్షిణాదిలో కానీ బాలీవుడ్‌లో కానీ టీమ్ బాగుండటం ముఖ్యమనీ, టీమ్ బాగుంటే చివరకు ఓ స్పానిష్ సినిమానైనా తీసేయొచ్చనీ అతనంటాడు.
ఒరిజినల్‌లో రవితేజ చేసిన పాత్రకు 'రౌడీ రాథోర్'లో అక్షయ్‌కుమార్ సరిగ్గా సరిపోయాడనేది అతని అభిప్రాయం. "అతనికి టైలర్‌మేడ్ కేరక్టర్ కావడం వల్లే అక్షయ్‌ను ఆ పాత్రకు ఎంచుకున్నా. అతనేవిధంగా చేశాడో తెరపై మీరే చూస్తారు. అతనితో పనిచేయడం గొప్పగా భావిస్తున్నా. అతను దర్శకుడి నటుడు'' అని చెప్పాడు ప్రభుదేవా.
Saturday, May 26, 2012
ఆ పాత్ర చేయడం లేదు
శ్రీదేవి హీరోయిన్‌గా కె. రాఘవేంద్రరావు బాలీవుడ్‌లో రూపొందించిన 'హిమ్మత్‌వాలా' (కృష్ణ 'ఊరికి మొనగాడు'కు రీమేక్) ఎంత సంచలనం సృష్టించిందో అప్పటివాళ్లకు బాగా తెలుసు. ఆ సినిమాలో శ్రీదేవి అందచందాలు, అభినయానికి దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆ సినిమాని రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే 'హౌస్‌ఫుల్ 2'తో హిట్ కొట్టిన సాజిద్‌ఖాన్ ఆ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. అందులో శ్రీదేవి చేసిన పాత్రను రీమేక్‌లో తమన్నా చేయబోతున్నదని వార్తలు వచ్చాయి. అయితే వాటికి తమన్నా ఖండించింది. "నిర్మాత వశు భగ్నాని నన్ను సంప్రదించిన మాట వాస్తవం. అయితే అది 'హిమ్మత్‌వాలా' రీమేక్ కోసం కాదు. రణబీర్ కపూర్ లేదా అజయ్ దేవగన్ హీరోగా నిర్మించే సినిమాలో చేసేందుకు నన్ను అడిగారు. ఇప్పటివరకు ఏ విషయమూ ఫైనల్ కాలేదు'' అని చెప్పింది. ఇటీవలే తెలుగులో 'రచ్చ' హిట్‌ని ఎంజాయ్ చేసిన ఆమె రామ్ సరసన నటించిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రంతో జూన్ ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బికినీకి రెడీ
ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన బాలీవుడ్ సినిమా 'ఇష్క్‌జాదే' హీరోయిన్ పరిణీతి చోప్రా బికినీ ధరించేందుకు తాను సిద్ధమంటోంది. టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కజిన్ అయిన పరిణీతి గత ఏడాదే 'లేడీస్ వర్సెస్ రిక్కీ బెహల్' సినిమా ద్వారా పరిచయమై ఆకట్టుకుంది. నటిగా ఎలాంటి పరిధులూ విధించుకోలేదనీ, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఇంటిమేట్ సీన్లలోనూ నటిస్తాననీ ఆమె తెలిపింది. 'ఇష్క్‌జాదే'లో హీరో అర్జున్‌కపూర్‌తో ఆమె కొన్ని ఇంటిమేట్ సీన్లు చేసింది కూడా. "నన్ను నేను నమ్ముతాను కాబట్టే ఎలాంటి పరిమితులూ పెట్టుకోలేదు. 'ఇష్క్‌జాదే' స్క్రిప్ట్ చదివినప్పుడు అందులోని శృంగార లేదా ముద్దు సీన్ల గురించి నేను ఆలోచించలేదు. అందులో ఉన్నవి సందర్భానుసారం వచ్చేవే. అందుకే ప్రేక్షకులు వాటిని ఆస్వాదిస్తున్నారు. స్క్రిప్టు ప్రకారం తప్పదనుకుంటే శృంగార, ముద్దు సీన్లలో నటించడానికి, బికినీ ధరించడానికీ నేను సిద్ధం. ఏ నటికైనా ఫలానావి మాత్రమే చెయ్యాలనే పరిమితులు ఉండకూడదని నేను నమ్ముతా'' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు, తమిళ భాషల్లో 'కహాని'
విద్యాబాలన్ నటించిన బాలీవుడ్ హిట్ సినిమా 'కహాని' తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కాబోతోంది. టెలివిజన్ నిర్మాణ సంస్థ అయిన ఎండిమోల్ ఇండియా వీటి రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలతోటే ఆ సంస్థ సినీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టబోతుండటం గమనార్హం. సూపర్ హిట్ టీవీ రియాలిటీ షోలు 'బిగ్ బాస్', 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోం కే ఖిలాడి' ఆ సంస్థ నుంచి వచ్చినవే. ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెలుగు, తమిళ వెర్షన్ల షూటింగ్ ప్రారంభించి, 2013 జనవరిలో విడుదల చేయాలని సంకల్పించినట్లు ఎండిమోల్ ఇండియా సీఈఓ దీపక్‌ధర్ తెలిపారు. ఒరిజినల్‌లో విద్యాబాలన్ చేసిన ప్రధాన పాత్ర కోసం తెలుగు, తమిళ భాషల్లో పేరుపొందిన తారల్ని సంప్రదిస్తున్నారు. పెన్ ఇండియా ప్రై. లిమిటెడ్‌తో కలిసి 'కహాని' చిత్రాన్ని నిర్మించడమే కాక, దర్శకత్వం వహించిన సుజయ్ ఘోష్ ఈ రీమేక్ సినిమాలకి సైతం సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ రీమేక్స్‌కి ఓ పేరుపొందిన తెలుగు లేదా తమిళ దర్శకుడు పనిచేయనున్నాడు.
Friday, May 25, 2012
నటుణ్ణి కావడం కంటే వేరే లక్ష్యాలు లేవు
"యాక్టర్ కావాలనేది నా యాంబిషన్. అయ్యాను. యాక్టర్ కాకపోయుంటే అవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. అంతకుమించి నేను ప్రత్యేకంగా వేరే లక్ష్యం ఏమీ పెట్టుకోలేదు'' అని చెప్పారు హీరో రామ్. తమన్నా జంటగా ఆయన నటిస్తున్న 'ఎందుకంటే ప్రేమంట!' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో శ్రీ స్రవంతీ మూవీస్ పతాకంపై రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి రామ్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...
నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ 'ఎందుకంటే ప్రేమంట!'. ఇదే సినిమాతో తమిళంలో పరిచయం కాబోతున్నా. ఏక కాలంలో రెండు భాషల్లో ఈ సినిమా చేశాం. తమిళ వెర్షన్ పేరు 'ఏన్ ఎండ్రాళ్ కాదల్ ఎన్బేన్'. ఇది తమిళంలో నేను నటించిన తొలి చిత్రం. ప్రేమ అనేది యూనివర్సల్ ప్లాట్. తెలుగు, తమిళ నేటివిటీకి సంబంధించిన చిన్న చిన్న మార్పులు తప్పితే ఈ రెండు సినిమాలు ఒకటే. తమిళంలో నేనే డబ్బింగ్ చెప్పా. చెన్నైలోనే పెరిగా కాబట్టి తెలుగుతో పాటు తమిళం కూడా నాకు బాగా వచ్చు. కథే బలం కథే ఈ సినిమాకి ప్రధాన బలం. ఓ అమ్మాయి ప్రేమలో పడిన అబ్బాయి ఆమె గురించి ఎంత స్థాయికి వెళతాడు, ఏం చేస్తాడనేది కథ. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ. ఫస్టాఫ్ స్విట్జర్లాండ్, పారిస్‌లోనూ, సెకండాఫ్ హైదరాబాద్‌లోనూ కథ నడుస్తుంది. పాటలు చాలా బాగా వచ్చాయి. 'నీ చూపులే' పాట సినిమాకి ప్రత్యేకాకర్షణ. సినిమా అంతా విజువల్ ఫీస్ట్.
సమాన పాత్రలు
కరుణాకరన్ లవ్ స్టోరీస్ బాగా తీస్తారు. లవ్ స్టోరీ అంటే హీరో హీరోయిన్లు ఇద్దరికీ సమాన పాత్రలు ఉంటాయి. అంటే తమన్నా నాతో సమానమైన పాత్ర చేసింది. ఆమె ఎలాంటి నటో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనిలేదు. ఇందులో నేను చేసింది నా వయసుకి సంబంధించిన పాత్రే. నన్ను ఇప్పటివరకూ ఎవరూ చూపించని విధంగా చూపించాడు దర్శకుడు. ఈ పాత్ర చేయడం కష్టంగానూ అనిపించింది, అదేవిధంగా ఉద్వేగంగానూ అనిపించింది. రిషి ('ఎ ఫిల్మ్ బై అరవింద్' ఫేమ్) మెయిన్ విలన్‌గా నటిస్తే, రచయిత కోన వెంకట్ మరో విలన్ కేరక్టర్ చేశారు.
బాలీవుడ్ ఆలోచన లేదు
సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఒకటి, భాస్కర్ డైరెక్షన్‌లో ఒకటి చేస్తున్నా. ప్రచారంలోకి వచ్చినట్లు శ్రీనివాస్‌తో నేను చేస్తోంది 'కందిరీగ 2' కాదు. కొత్త కథ. ఇంకా హీరోయిన్‌ని ఎంపిక చేయలేదు. భాస్కర్‌తో చేస్తున్నది ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉండే లవ్ స్టోరీ. ఇందులో కంప్లీట్ డిఫరెంట్ కేరక్టర్ చేస్తున్నా. ఈ సినిమా ద్వారా శుభా ఫుటేల్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. 'రెడీ' తర్వాత బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి. అయితే అక్కడికి వెళ్లాలనే ఆలోచన ఇప్పటివరకూ కలగలేదు.
నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ 'ఎందుకంటే ప్రేమంట!'. ఇదే సినిమాతో తమిళంలో పరిచయం కాబోతున్నా. ఏక కాలంలో రెండు భాషల్లో ఈ సినిమా చేశాం. తమిళ వెర్షన్ పేరు 'ఏన్ ఎండ్రాళ్ కాదల్ ఎన్బేన్'. ఇది తమిళంలో నేను నటించిన తొలి చిత్రం. ప్రేమ అనేది యూనివర్సల్ ప్లాట్. తెలుగు, తమిళ నేటివిటీకి సంబంధించిన చిన్న చిన్న మార్పులు తప్పితే ఈ రెండు సినిమాలు ఒకటే. తమిళంలో నేనే డబ్బింగ్ చెప్పా. చెన్నైలోనే పెరిగా కాబట్టి తెలుగుతో పాటు తమిళం కూడా నాకు బాగా వచ్చు. కథే బలం కథే ఈ సినిమాకి ప్రధాన బలం. ఓ అమ్మాయి ప్రేమలో పడిన అబ్బాయి ఆమె గురించి ఎంత స్థాయికి వెళతాడు, ఏం చేస్తాడనేది కథ. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ. ఫస్టాఫ్ స్విట్జర్లాండ్, పారిస్‌లోనూ, సెకండాఫ్ హైదరాబాద్‌లోనూ కథ నడుస్తుంది. పాటలు చాలా బాగా వచ్చాయి. 'నీ చూపులే' పాట సినిమాకి ప్రత్యేకాకర్షణ. సినిమా అంతా విజువల్ ఫీస్ట్.
సమాన పాత్రలు
కరుణాకరన్ లవ్ స్టోరీస్ బాగా తీస్తారు. లవ్ స్టోరీ అంటే హీరో హీరోయిన్లు ఇద్దరికీ సమాన పాత్రలు ఉంటాయి. అంటే తమన్నా నాతో సమానమైన పాత్ర చేసింది. ఆమె ఎలాంటి నటో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనిలేదు. ఇందులో నేను చేసింది నా వయసుకి సంబంధించిన పాత్రే. నన్ను ఇప్పటివరకూ ఎవరూ చూపించని విధంగా చూపించాడు దర్శకుడు. ఈ పాత్ర చేయడం కష్టంగానూ అనిపించింది, అదేవిధంగా ఉద్వేగంగానూ అనిపించింది. రిషి ('ఎ ఫిల్మ్ బై అరవింద్' ఫేమ్) మెయిన్ విలన్‌గా నటిస్తే, రచయిత కోన వెంకట్ మరో విలన్ కేరక్టర్ చేశారు.
బాలీవుడ్ ఆలోచన లేదు
సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఒకటి, భాస్కర్ డైరెక్షన్‌లో ఒకటి చేస్తున్నా. ప్రచారంలోకి వచ్చినట్లు శ్రీనివాస్‌తో నేను చేస్తోంది 'కందిరీగ 2' కాదు. కొత్త కథ. ఇంకా హీరోయిన్‌ని ఎంపిక చేయలేదు. భాస్కర్‌తో చేస్తున్నది ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉండే లవ్ స్టోరీ. ఇందులో కంప్లీట్ డిఫరెంట్ కేరక్టర్ చేస్తున్నా. ఈ సినిమా ద్వారా శుభా ఫుటేల్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. 'రెడీ' తర్వాత బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి. అయితే అక్కడికి వెళ్లాలనే ఆలోచన ఇప్పటివరకూ కలగలేదు.
అసిన్ హ్యాట్రిక్ హిట్?
బాలీవుడ్‌లో రెండు వరుస హిట్లు సాధించిన అసిన్ హ్యాట్రిక్ హిట్ మీద కన్నేసింది. ఆమె హీరోయిన్‌గా నటించిన 'రెడీ', 'హౌస్‌ఫుల్ 2' ఒకదాన్ని మించి ఒకటి ఘన విజయం సాధించాయి. రానున్న 'బోల్ బచ్చన్' కూడా హిట్టయితే హ్యాట్రిక్ పూర్తవుతుందనేది ఆమె ఆశ. ఇవన్నీ కామెడీలు కావడం గమనించదగ్గ అంశం. "సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్ వంటి స్టార్లు ఉండటం 'రెడీ', 'హౌస్‌ఫుల్ 2' సినిమాలకు బాగా ఉపయోగపడింది. 'బోల్ బచ్చన్'లో అజయ్ దేవగన్ ఉన్నాడు. అన్నిటికీ మించి ఇది సందర్భానుసారం నడిచే కామెడీ సినిమా. ఇలాంటి సినిమాలకి అసిన్ సరిగ్గా సరిపోతుంది'' అని తెలిపారు ఓ ట్రేడ్ విశ్లేషకుడు. అయితే ఇవి కామెడీ సినిమాలైనా ఒకదానికొకటి భిన్నమైనవి. 'హౌస్‌ఫుల్ 2'లో ఉన్నది స్లాప్‌స్టిక్ కామెడీ అయితే, 'బోల్ బచ్చన్' సిట్చువేషనల్ కామెడీ అనీ, ఈ రెండు సినిమాల్లో భిన్నమైన బాడీ లాంగ్వేజీతో నటించాననీ అసిన్ తెలిపింది. ఈ రెండు కామెడీలు ఒకదానికొకటి భిన్నమైనవైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఒకే విధమైన ఫలితాన్ని చూపిస్తాయని ఆమె నమ్ముతోంది. డైరెక్టర్ రోహిత్‌శెట్టితో అజయ్ దేవగన్ కాంబినేషన్ ఇప్పటివరకు సూపర్ సక్సెస్ అవడం కూడా ఈ సినిమాపై అసిన్ నమ్మకానికి ఓ కారణం.
షాహిద్ ప్రేయసి!
తెలుగులో రాంచరణ్ సరసన 'చిరుత'లోనూ, వరుణ్‌సందేశ్ జోడీగా 'కుర్రాడు'లోనూ కనిపించినప్పటికీ ప్రేక్షకుల్ని అలరించినలేకపోయిన నేహా శర్మ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మొదట ఇమ్రాన్ హష్మి సరసన 'క్రూక్'లో కనిపించిన ఈ అందాల తార ఇప్పుడు 'తేరీ మేరీ కహాని'లో హీరో షాహిద్ కపూర్ ప్రేయసి పాత్రలో దర్శనమివ్వబోతోంది. "కునాల్ కోహ్లి డైరెక్ట్ చేస్తున్న 'తేరీ మేరీ కహాని'లో ఓ అతిథి పాత్ర చేస్తున్నా. ఆ సినిమా మూడు తరాల కథతో తయారవుతోంది. నేను షాహిద్ సరసన 2012 తరానికి చెందిన అమ్మాయిగా నటించా. కథానుసారం ఇద్దరమూ లండన్ యూనివర్శిటీలో చదువుకుంటాం. అక్కడ ఒకరిపట్ల ఒకరం ఆకర్షనలో పడతాం. అయితే ఆ తర్వాత ఎవరికి వాళ్లం వేరేవాళ్లతో ప్రేమలో పడతాం'' అని తెలిపింది నేహ. 2011 సెప్టెంబర్‌లో ఆమె పాల్గొన్న సన్నివేశాల్ని చిత్రీకరించారు. జూన్ 22న విడుదల కానున్న ఈ చిత్రంలో షాహిద్ సరసన ప్రధాన నాయికగా ప్రియాంకా చోప్రా నటించింది.
Thursday, May 24, 2012
టర్నింగ్ పాయింట్: రమాప్రభ
నేను సినిమాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు. మాది మధ్య తరగతి కుటుంబం. నేను ఊటీ, చెన్నైలో పెరిగాను. మా పిన్ని వాళ్లతో ఉండటం వల్ల వాళ్లతో పాటు తిరిగాను. దాంతో నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. మా బాబాయి ఆకస్మిక మరణంతో మా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దాంతో బతకడం కోసం నేను సినిమాల్లోకి వచ్చా. క్లాసికల్ డాన్సర్‌గా స్టేజీ మీద నేనిచ్చిన ఓ ప్రదర్శన చూసిన డైరెక్టర్ ప్రత్యగాత్మ తన 'చిలకా కోరింక' (1966) సినిమాలో హీరో కృష్ణంరాజు చెల్లెలిగా చేసే ఛాన్స్ ఇచ్చారు.
అందులో నేను పద్మనాభం సరసన చేశా. అప్పటికే గొప్ప కమెడియన్ అయిన ఆయన నన్ను తన జోడీగా ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేను. అప్పట్లో ఆయనా, గీతాంజలి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. నిజానికి పద్మనాభం నన్ను బాగా ప్రోత్సహించారు. ఆ తర్వాత నేనెక్కువగా రాజబాబు సరసన నటించాను. చలం, రమకృష్ణ, శోభన్ బాబు, కృష్ణ వంటి ఎంతోమంది హీరోల సినిమాల్లో చేసిన నేను ఒక్క రాజబాబుతోటే 100 సినిమాల దాకా చేశా. తను నాకు మంచి స్నేహితుడు.
నా పరిమితులేమిటో నాకు తెలుసు. నా ముఖం గానీ, నా ఫ్రేంవర్క్ గానీ గ్లామర్‌ని కురిపించలేవనీ, అందువల్ల హీరోయిన్‌గా నేను పనికిరాననీ తెలుసు. అందుకే కమెడియన్ల సరసనా, కేరక్టర్ ఆర్టిస్టుగా సెటిలయ్యా. దాంతో భిన్నమైన కేరక్టర్లు చేయగలిగా. ఇన్నేళ్లపాటు ఫీల్డులో ఉండగలిగా.
Thursday, May 17, 2012
అలనాటి ఆణిముత్యం: మళ్లీ పెళ్లి (1939)
కథాంశం: బాల్య వివాహాల్ని నిరోధించే శారదా చట్టం అమల్లోకి వస్తుందేమోనని లాయర్ జగన్నాథరావు పంతులు భయపడుతుంటాడు. అతడి ఆరేళ్ల కూతురు లలితని ఓ పెద్దాయనకిచ్చి పెళ్లిచేస్తే, అతను కాస్తా హారీమన్నాడు. దాంతో లలిత బాల వితంతువుగా మారింది. తమ ప్రాంతంలో గట్టి పట్టువున్న పంతులుకి సంఘ సంస్కరణలంటే గిట్టదు.
సుందరరావనే నిరుద్యోగ గ్రాడ్యుయేట్ తన చెల్లెలు కమలతో కలిసి వాళ్ల ఎదురింట్లో ఉంటాడు. కమల, లలిత స్నేహితులవుతారు. సుందరరావు, లలిత మధ్య త్వరలోనే ప్రేమ చిగుర్లు వేస్తుంది. లలితను పెళ్లాడాలని అతను నిశ్చయిస్తాడు. జగన్నాథరావు దగ్గరి బంధువు వెంకటరావు, కమల కూడా ప్రేమించుకుంటారు. ఓసారి లలైత కోసం తన ఇంటికొచ్చిన కమలని బలాత్కరించబోతాడు జగన్నాథరావు. అతణ్ణి చావగొట్టి జైలుకి వెళ్తాడు సుందరరావు.
లలిత గర్భవతి అయ్యిందనే పుకారు వ్యాపిస్తుంది. సుందరరావును కలిసి తనకే పాపమూ తెలీదని చెబుతుంది లలిత. అతను నమ్మడు. దాంతో చనిపోవాలని భావిస్తుంది లలిత. ఆ మరుసటి రోజే సుందరరావు జైలునుంచి విడుదలవుతాడు. రోడ్డుపక్క పడిపోయి ఉన్న లలితను చూస్తాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకుపోతాడు. ఆమెని పరీక్షించిన డాక్టర్ ఆమె గర్భవతి కాదనీ, కానీ కడుపులో బల్ల ఉందనీ చెబుతాడు. సుందరరావు పశ్చాత్తాపపడతాడు. చివరకు జగన్నాథరావు కూడా తన తప్పు తెలుసుకుంటాడు. తన చేతుల మీదుగా లలిత - సుందరరావు, కమల - వెంకటరావు పెళ్లి చేస్తాడు.
తారాగణం: వై.వి. రావు (సుందరరావు), కాంచనమాల (లలిత), బలిజేపల్లి లక్ష్మీకాంత కవి (జగన్నాథరావు), బెజవాడ రాజారత్నం (కమల), కొచ్చర్లకోట సత్యనారాయణ (వెంకటరావు), రంగస్వామి, ఆదినారాయణయ్య, నటేశ అయ్యర్, మాణిక్యమ్మ, రాజలక్ష్మమ్మ, సి. కృష్ణవేణి.
మాటలు, పాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు
ఛాయాగ్రహణం: జితేన్ బెనర్జీ
నిర్మాత, దర్శకుడు: వై.వి. రావు
బేనర్: జగదీశ్ ఫిలిమ్స్
విశేషాలు: ఈ సినిమా ద్వారా ఓగిరాల రామచంద్రరావు సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలోని 'నా సుందరరూపా' అనే పాట తెలుగులో ఓ గాయకుడు పాడిన తొలి పాటగా చరిత్రకెక్కింది. ఆ పాటని కాంచనమాల, వై.వి. రావుపై డ్యూయెట్‌గా తీశారు. అప్పట్లో పాటల్ని ఎవరి మీద తీస్తే వారే పాడే సంప్రదాయం ఉంది. అయితే వై.వి. రావు పాడలేనందు వల్ల ఆ పాటని కాంచనమాలతో కలిసి ఓగిరాల పాడారు. కానీ గ్రామఫోన్ రికార్డు మీద గాయకుడిగా వై.వి. రావు పేరు వేశారు.
Wednesday, May 9, 2012
టర్నింగ్ పాయింట్: చంద్రమోహన్
తొలి సినిమాతోటే బ్రేక్ సంపాదించడం కొంతమందికే దక్కే అదృష్టం. అది నాకు దక్కింది. ఆ సినిమా 'రంగులరాట్నం'. దాని దర్శకుడు బి.ఎన్. రెడ్డి. 1967లో ఆ సినిమా రాష్ట్రంలో బంగారు నంది రావడమే గాక, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డూ గెలుచుకొంది. అదో గొప్ప అనుభూతి. కొత్తవాళ్లని పరిచయం చేయడమనే ట్రెండ్ అప్పుడే మొదలైంది. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు.
బీకాం పూర్తి చేసిన నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. నా ఆసక్తి అంతా డబ్బు లెక్కపెట్టడం, ఎకౌంటన్సీ, బ్యాలెన్స్ మెయిన్‌టైన్ చెయ్యడం వంటివాటి మీద ఉండేది. బ్యాక్‌లో పనిచేసిన నా క్లాస్‌మేట్ లాగే నేనూ బ్యాకులో పనిచేసినట్లయితే ఏజీఎం ర్యాంకులో రిటైరయి, మంచి పెన్షన్ వస్తూ ఉండేది.
చిత్రసీమలో ప్రవేశించిన మొదట్లో నేను మంచి పేరు తెచ్చుకున్నా, ఆదాయం ఆంతంత మాత్రంగానే ఉండేవి. కామన్ మ్యాన్ లాగా సాధారణ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నేను మిస్సయ్యాను.
నా జీవితమంతా ప్రయాణాలతోటీ, వచ్చిన పాత్రలు చేయడంతోటీ గడిచిపోయింది. ఆ పాత్రలు చేయకపోతే పోటీలో లేకుండా పోతానేమోననే ఆలోచనతోటే వచ్చిన పాత్రనల్లా చేసుకుంటూ వచ్చా. నా భార్యా పిల్లలతో ఆదివారం పూట సరదాగా గడిపిన రోజులేవీ నాకు జ్ఞాపకం లేవు. సినిమాకి 45 సంవత్సరాల సేవ చేసిన నేను తిరిగి చూసుకుంటే ఇప్పటికీ కొత్తలో మాదిరిగా జీవిక కోసం కష్టపడుతూనే ఉన్నా.
Friday, May 4, 2012
అలనాటి ఆణిముత్యం: వర విక్రయం (1939)
నటిగా భానుమతి పరిచయమైన చిత్రం 'వర విక్రయం'. కవితా కళానిధిగా ప్రసిద్ధులైన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నటునిగా తెరపై కనిపించిన తొలి సినిమా కూడా ఇదే. అంతే కాదు అనంతర కాలంలో గొప్ప కమెడియన్‌గా రాణించిన కస్తూరి శివరావు ఓ చిన్నపాత్ర ద్వారా ఈ సినిమాతోటే తెరంగేట్రం చేశారు.'చింతామణి', 'మధుసేవ' వంటి గొప్ప నాటకాల్ని రాసిన కాళ్లకూరి నారాయణరావు కలం నుంచి జాలువారిన మరో గొప్ప నాటకం 'వర విక్రయం'. వరకట్న పిశాచానికి వ్యతిరేకంగా రాసిన ఈ నాటకం ఆధారంగానే అదే పేరుతో ఈ సినిమా రూపొందింది.
ఇందులోని కాళింది పాత్రకు బాగా పాడగల నటికోసం దర్శకుడు సి. పుల్లయ్య అన్వేషిస్తున్నప్పుడు భానుమతి గురించి ఆయనకు తెలిపారు గోవిందరాజుల సుబ్బారావు. భానుమతి తండ్రి బొమ్మరాజు వెంకటశేషయ్య, గోవిందరాజుల మంచి స్నేహితులు. స్క్రీన్ టెస్ట్ ద్వారా భానుమతిని తీసుకున్నారు పుల్లయ్య. అయితే తన కూతుర్ని ఏ పురుష నటుడూ స్పృశించకూడదనే నిబంధనతో ఇందులో భానుమతి నటించేందుకు శేషయ్య అంగీకరించారు. అలా ఓ గొప్ప నటి ఈ సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది.
కథాంశం: రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అయిన పుణ్యమూర్తుల పురుషోత్తమరావు (దైతా గోపాలం) గాంధేయవాది. ఆయన భార్య భ్రమరాంబ (సీనియర్ శ్రీరంజని), కూతుళ్లు కాళింది (భానుమతి), కమల (పుష్పవల్లి). వరకట్నానికి పురుషోత్తమరావు వ్యతిరేకి. కానీ తన పెద్ద కూతురు కాళిందిని సింగరాజు లింగరాజు (బలిజేపల్లి లక్ష్మీకాంత కవి) దత్తపుత్రుడు బసవరాజు (కొచ్చర్లకోట సత్యనారాయణ)కు ఇచ్చి పెళ్లి చేయడానికి వరకట్నం నిమిత్తం తన పదెకరాల వరిపొలాన్ని అమ్మక తప్పని స్థితి ఎదురయింది. లింగరాజు పక్షం వహించిన పెళ్లిళ్ల పేరయ్య (పేరి రామచంద్రమూర్తి), వివాహాల వీరయ్య (జె. సత్యనారాయణ) వల్ల పెళ్లికాక ముందే కట్నం ఇచ్చేస్తాడు పురుషోత్తమరావు. తన పెళ్లి కారణంగా తల్లిదండ్రులు దరిద్రులై పోతున్నారని ఆవేదన చెందిన కాళింది నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.
పెళ్లి జరగకపోయినా కట్నం సొమ్ము ఇవ్వడానికి నిరాకరిస్తాడు లింగరాజు. దాంతో అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటుంది కమల. తన తండ్రి అభిమతానికి విరుద్ధంగా బసవరాజుతో పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లయ్యాక అత్తగారింటికి వెళ్లేందుకు నిరాకరించిన కమల తాను కట్నమిచ్చి వరుణ్ణి కొనుక్కున్నాననీ, అందువల్ల బసవరాజే తమ ఇంటికి రావాలని డిమాండ్ చేస్తుంది. కొడుకు పేరుతో కమలని కోర్టుకు లాగుతాడు లింగరాజు. జడ్జి కమలకి అనుకూలంగా తీర్పు చెబుతాడు. తండ్రి చేష్టలకి విసుగెత్తిపోయిన బసవరాజు భార్యతో కలిసి జీవిస్తానంటాడు. తన తప్పు తెలుసుకున్న లింగరాజు క్షమించాల్సిందిగా పురుషోత్తమరావును అర్థిస్తాడు.
తారాగణం: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, దైతా గోపాలం, సీనియర్ శ్రీరంజని, భానుమతి, పుష్పవల్లి, కొచ్చర్లకోట సత్యనారాయణ, తుంగల చలపతిరావు, పేరి రామచంద్రమూర్తి, జె. సత్యనారాయణ, అడ్డాల నారాయణరావు, ఎ.వి. సుబ్బారావు, ఎల్. సత్యనారాయణ, రేలంగి వెంకట్రామయ్య, కోటిరత్నం, సుభద్ర, కస్తూరి శివరావు
కథ: కాళ్లకూరి నారాయణరావు
మాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
సంగీతం: ప్రభల సత్యనారాయణ
నేపథ్య సంగీతం: దుర్గాసేన్
ఛాయాగ్రహణం: బీరేన్ డే
సౌండ్: సి.ఎస్. నిగం
కూర్పు: ధరం వీర్
కళ: బాటూసేన్
మేకప్: ఈదు
దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
బేనర్: ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ
Subscribe to:
Posts (Atom)